Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడుగా ప్రకటిస్తూ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ జారీ చేయడం ప్రధాని మోడీ హయాంలో ప్రజాస్వామ్యం దుర్ధశకు తాజా తార్కాణం. కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజిజు నిత్యం సుప్రీంకోర్టుపైనే దాడి చేస్తూ ఒత్తిడి పెంచుతుంటే లేదుగానీ, గుజరాత్‌లోని సూరత్‌లో ఒక జిల్లా మెజిస్ట్రీట్ ఇచ్చిన తీర్పును ఆగమేఘాల మీద అమలు చేయాలని హడావుడి పడటం విపరీతమే. అదేమంటే రాజ్యాంగం 102వ అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టం 8వ సెక్షన్ ప్రకారం ఇది తప్పనిసరి చర్యలని సమర్థనకు దిగుతున్నారు. ప్రజా ప్రతినిధులకు రెండేండ్లు ఆపైన జైలుశిక్ష విధించబడితే, ఆ తీర్పును పై కోర్టులు నిలుపుచేయకపోతే(స్టే) వెంటనే వారి సభ్యత్వం రద్దవుతుందని వాదిస్తున్నారు. లోక్‌సభ ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించడం, ఎన్నికల సంఘం ఎన్నికలు మొదలెట్టడం తర్వాతి దశలు. ఈ లోగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు గనక మేజిస్ట్రీట్ తీర్పుపై స్టే విధిస్తే అప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా నిలచిపోతుంది. పై కోర్టు నేర నిర్థారణ,శిక్ష అని రెండు భాగాలుంటాయి. ఈ రెండు భాగాలనూ నిలిపేస్తేనే రాహుల్‌కు ఉపశమనం లభిస్తుంది. అలాగాక కేవలం శిక్షను మాత్రమే నిలుపుచేస్తే ప్రయోజనం ఉండదని ఒక వాదన. శిక్షాకాలమే అనర్హతకు కొలబద్ద గనక రెండోభాగంతో సంబంధంలేదని మరో వాదన. సూరత్ కోర్టు పై కోర్టుకు వెళ్లడానికి నెలరోజుల వ్యవధినిస్తూ కేవలం శిక్ష అమలును మాత్రమే నిలిపేసింది. నేర నిర్థారణ(కన్విక్షన్)ను అలాగే ఉంచింది. అయినా పైకోర్టు రెంటిపై స్టే ఇవ్వచ్చు. ఈ అవకాశం ఉన్నా ఆగమేఘాల మీద అనర్హుడుగా ప్రకటించడంలో రాజకీయ కుత్సితం స్పష్టమే. అదానీ మోడీ బంధాలపైన సాగుతున్న చర్చను దారి మళ్లించాలి. వీటినే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఈ విషయమై తొలిసారి వివరంగా స్పందించిన రాహుల్ గాంధీ కూడా అనర్హత వేటు గురించి కన్నా కూడా అదానీని కప్పిపుచ్చి కాపాడే పన్నాగాలపైనే మాట్లాడారు.
అదే కారణమా?
మోడీ ప్రభుత్వ ఆశీస్సులు అనుబంధంతో హఠాత్తుగా ఆకాశానికి పడగలెత్తిన అదానీ వ్యాపార సామ్రాజ్యం హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఒక్కసారిగా కుదైలైంది. ఒక దశలో కొందరు భారతీయ బడా వ్యాపారులు పెట్టుబడులు పెట్టి ఆదుకున్నా అది చాలలేదు. మరింత దిగజారుతున్న సమయంలో అమెరికాలోని సిజిక్యుటి అనే అనే ఫైనాన్స్ సలహా కంపెనీ అధినేత రాజీవ్‌జైన్ రూ.15వేల కోట్లకు పైగా పెట్టుబడిపెట్టి ఆదుకున్నారు. ఈయన కంపెనీ పెట్టింది 2016లోనే కావడం గమనార్హం. తన లావాదేవీలతో మూడు రోజుల్లో వేల కోట్లు ఆర్జించిన వ్యాపార మాయాజాలం ఈయన స్వంతం. మరి ఈయన పతనమవుతున్న అదానీ కంపెనీలో ఎందుకు ఇంత భారీగా నిధులు సమకూర్చారు? డొల్ల కంపెనీల నుంచి ఇంత భారీ సహాయం అందడం వెనక ఎవరున్నారు? అనేది రాహుల్‌గాంధీ ప్రశ్న. ఈ ప్రశ్న తాను లోక్‌సభలో వేయడానికి ప్రయత్నిస్తే అవకాశం రాలేదని రాహుల్ చెబుతున్నారు. తర్వాత స్వయంగా స్పీకర్ ఓం బిర్లాను కలిసి అభ్యర్థించినా తానే ఆ అనుమతించలేనని ఆయన జవాబావిచ్చారట. అదానీమోడీ బంధం గురించి మాట్లాడుతున్నాను కనుకనే, తన దగ్గర ఆ ఇరవై వేల కోట్ల వెనక ఎవరున్నారో చెబుతాను గనకనే వరుసగా అనేక అస్త్రాలు ప్రయోగించారని రాహుల్ విమర్శ. లండన్‌లో ఏదో మాట్లాడాననీ, మోడీ పేరిట బీసీలను అవమానించానని, సభను అగౌరవపరిచానని రకరకాల ఆరోపణలు అందుకే చేస్తున్నారని స్పష్టం చేశారు. లండన్‌లో భారత ప్రజాస్వామ్య సవాళ్లలో విదేశీ జోక్యాన్ని తాను కోరలేదని తొలిసారి సూటిగా స్పష్టం చేశారు. ఆ ప్రసంగం చూసిన వారెవరికైనా ఇది తెలుస్తుంది. ఇది మా అంతర్గత సమస్య మేము చూసుకోవాలసింది అని మాత్రమే ఆయనన్నారు. బీజేపీ మోడీని వెనకేసుకురావచ్చు గాని భ్రుష్టుడైన వ్యాపారవేత్త అదానీ కొమ్ముకాయడమెందుకని ఆయన ప్రశ్న. దేశంలో ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదం ఎదర్కొంటున్నదో చెప్పడానికి ఈ అనర్హత ప్రహసనం చాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో తనకు అండగా నిలిచి మోడీ ప్రభుత్వ కక్ష పూరిత వైఖురిని ఖండించిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎనిమిదేళ్లు కాదు జీవితమంతా అనర్హుడిగా ప్రకటించినా ఎంతకాలం జైలులో పెట్టినా లొంగిపోకుండా పోరాడుతుంటానని దృఢంగా సవాల్ చేశారు. ఒక విలేకరి వేసిన ప్రశ్నకు స్పందిస్తూ మీరు కావాలంటే బీజేపీ బ్యాడ్జి తగిలించుకుని మాట్లాడండి గాని మీడియా ముసుగులో వారి తరపున మాట్లాడొద్దని ఆగ్రహించారు. గతంలోవలె మీడియా ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో తోడుగావుండేవనీ, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు గనక నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లటమే మిగిలిన మార్గమని అన్నారు
అర్జంటు ప్రకటన అనివార్యమా?
ఈ మొత్తం మీడియా గోష్టిలో రాహుల్ కోర్టు తీర్పు తదుపరి చర్యల గురించి మాత్రం సూటిగా ప్రస్తావించకపోవడం యాదృచ్ఛికం కాదు. అందులో మళ్లీ ఏదైనా నెరుసు పట్టుకోవడానికి అవకాశమివ్వకుండా జాగ్రత్త పడివుండొచ్చు. అనర్హత అంశానికి వస్తే ఈ రోజున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. రెండేండ్లు ఆపైన శిక్ష పడితే ప్రజాప్రతినిధులకు అనర్హత ప్రాప్తిస్తుందనే గత తీర్పును సవరించుకోవాలని ఇందులో కోరారు. ఎందుకంటే వాస్తవంగా రాజ్యాంగం 102వ అధికరణం గానీ, ప్రజాప్రాతినిధ్యచట్టం 8 గాని తీర్పురాగానే అనర్హత సంక్రమిస్తుందని సూటిగా చెప్పడం లేదు. షల్ బి డిస్‌క్వాలిఫైడ్ అంటే అనర్హులను చేయాలి అని మాత్రమే ఉంది. ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్8(4) కింద అనర్హత పాలైన ఎంఎల్ఎలు, ఎంపీలు పై కోర్టులో అప్పీలు చేసేందుకు మూడు మాసాల వ్యవధి ఉండేది. ఈ లొసుగును అడ్డుపెట్టుకుని గతంలో ప్రభుత్వాలు ఆ చర్యను చాలా కాలం సాగదీస్తూ వచ్చేవి. ఈ పరిస్థితి లాలూప్రసాద్ వర్సెస్ లిల్లీథామస్ కేసులో సుప్రీం కోర్టు విచారించింది. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారికే వెంటనే అనర్హత రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ తీర్పునిచ్చి 8(4) కొట్టివేసింది. ఇందులో చిక్కులు ఉన్నాయనే భావనతో నాటి మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ఒక సవరణ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. ఉన్నఫళాన అనర్హత అనే అంశాన్ని అందులో మార్చే ప్రయత్నం చేసింది. ఆ తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలితతో సహా పలువురు ప్రముఖులు అనర్హత పాలైన పరిస్థితి. వారిని కాపాడటానికే ఈ ఆర్డినెన్సు తెచ్చారని వ్యాఖ్యలు విమర్శలు వచ్చాయి. యూపీఏ సర్కారులో చేరకపోయినా బయటనుంచే ఆధిపత్యం చలాయిస్తున్న రాహుల్‌గాంధీ మీడియా ముందే ఆ ఆర్డినెన్సును చించిముక్కలు చేయడం ఒక సంచలనమైంది. ఆ ఆర్డినెన్సుపై అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా అసంతృప్తిగా ఉన్నారని కథనాలున్నాయి. అందుకే ప్రధాని మన్మోహన్ కూడా రాహుల్ చర్యకు హతాశుడైనా మళ్లీ తీసుకురాలేదు. ఆ చర్య వల్లనే ఇప్పుడు రాహుల్‌గాంధీ చిక్కుల్లో పడ్డారనిపించినా వాస్తవంలో కీలక సమస్య మోడీ సర్కారు కక్షసాధింపు. ప్రజాస్వామ్య విలువలను ప్రతిపక్షాల స్థానాన్ని దెబ్బతీస్తున్నతీరు. లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ వేల కోట్ల కుంభకోణాలను ప్రస్తావిస్తూ దొంగలందరికీ ఇదే ఇంటిపేరు ఉందేమిటని రాహుల్‌గాంధీ అనడం రాజకీయ విమర్శ ప్రధాని మోడీపై ఎక్కుపెట్టింది. దాన్ని వెనక్కు తీసుకోవడానికి గానీ, క్షమాపణలు చెప్పడానికి గాని సిద్ధపడలేదు. 2019లో కర్నాటకలోని కోలార్‌లో ఎన్నికల సభలో చేసిన ఆ ప్రసంగాన్ని గుజరాత్‌లోని సూరత్ కోర్టులో సవాలు చేయడం, బీజేపీ మాజీమంత్రి పూర్ణేంద్రు మోడీ పరువు నష్టం దావా వేయడంలోని రాజకీయం సుస్పష్టం. మోడీలు బీసీలనేది దానికి జోడించి బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ కేసు విచారణ సాగుతుండగా సూరత్ జిల్లామెజిస్ట్రేట్ కోర్టులో పలువురు మారిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపిస్తున్నారు. ప్రస్తుత జిల్లామెజిస్ట్రేట్ వర్మ ఈ తీర్పు వెలువరించారు.
న్యాయ, రాజకీయ పోరాటం
రెండేండ్లు అంతకుమించి శిక్ష పడితే అన్నారు గనక సమస్య శిక్షాకాలమని కొందరు వాదిస్తున్నారు. పై కోర్టు ఆ శిక్షను తగ్గిస్తే అప్పుడు అనర్హత ఉండదు. అదే కారణం చూపుతూ మేజిస్ట్రేట్ వర్మ తగినంత కాలం ఉంటే గాని శిక్షకు విలువ లేదని వ్యాఖ్యానించి రెండేండ్లు శిక్ష వేశారు. సుప్రీం కోర్టు దీన్ని తగ్గిస్తే అప్పుడు అనర్హత ప్రసక్తే ఉండదు. అంతేగాక రాజ్యాంగం 103వ అధికరణం ఇలాంటి ప్రజాప్రతినిధులు రాష్ట్రపతిని మినహాయింపు కోరే అవకాశం ఉంది. అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా క్షణాల మీద అనర్హత ప్రకటిస్తే ఎలాగని కొందరు ప్రశ్నిస్తున్నారు. 102వ అధికరణం లాగే 103ను కూడా కలిపిచూడాలని వారి వాదనగా ఉంది గనక తీర్పు వచ్చీ రాగానే అనర్హత ప్రకటించడం చట్టరీత్యా అవసరమనే బీజేపీ వాదన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదేమైనా ఇక్కడ సమస్య రాజకీయ నిరంకుశత్వం తప్ప నిబంధనలు కాదు. గతంలో కొంతమంది నాయకులు అవినీతి కేసుల్లో హత్య లైంగికదాడి వంటివాటిలో అనర్హత పాలై ఉండొచ్చు. కాని ఇక్కడ రాజకీయ విమర్శపై పరువు నష్టం తీసుకొచ్చి శిక్షపడ్డాక పై కోర్టుకు వెళ్లేందుకు కూడా వ్యవధి లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం నిస్సందేహంగా రాజకీయ కక్ష సాధింపే. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయంటే కారణం అదే. ఇక్కడ సమస్య రాహుల్గాంధీదో అనర్హత వేటుదో మాత్రమే కాదు, ఈ సమయంలోనే ఈడీ దుర్వినియోగంపై కూడా 14 పార్టీలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కేసు వేశాయి. తాము 11 రాష్ట్రాలలో పాలనచేస్తున్నామనీ, 42శాతం ఓట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఈ పార్టీల నేతలు పేర్కొన్నారు. మరోవైపున దేశమంతటా ప్రజాస్వామ్య రక్షణ పోరాటానిక సిద్ధం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.