Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలోని సిలికాన్ వ్యేలీ బ్యాంక్, సిగేచర్ బ్యాంక్‌లు కుప్ప కూలడం వెనక ఉన్న కారణాలు అంత నిగూఢమైనవీ కావు, అర్థం చేసుకోలేనివేమీ కాదు. అంతే కాదు, పెట్టుబడిదారీ ప్రపంచంలోని యావత్తు బ్యాంకింగ్ వ్యవస్థ పైన కారుమబ్బులు కమ్ముకోవడం కూడా అటువంటి విషయమే. ఒకసారి ఆ వ్యవస్థలో కొన్ని భాగాలు పతనం అవుతాయి, ఇంకోవైపు తక్కిన భాగంలోని సంస్థలు మోయలేనంత ''విషపూరిత'' ఆస్తులతో (పారు బకాయిలు, దివాళాకు సిద్ధంగా ఉన్న కంపెనీల షేర్లు వగైరాలతో) సతమతమవు తుంటాయి. నిజానికి ఈ విషపూరిత ఆస్తులు పతనం చెందిన సంస్థల నష్టాలే. ఆ విధంగా మునిగిపోతున్న పార్శ్వం తక్కిన భాగంలోని సంస్థలను దిగలాగుతూ ఉంటుంది. తన బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయే పరిస్థితిలోకి అమెరికన్ పెట్టుబడిదారీ విధానం ఎలా నెట్టబడింది? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. బ్యాంకులు పతనం కావడం, అందునా సిలికాన్ వ్యేలీ బ్యాంక్ వంటిది పతనం కావడం కేవలం ఆ బ్యాంక్‌కి మాత్రమే సంబంధించిన అంతర్గత విషయం కాదు. అది అక్కడ వ్యవస్థలో తలెత్తిన వైరుధ్యాన్ని ప్రతిఫలిస్తోంది. ఇంతకూ ఏమిటా వైరుధ్యం?
ఈ రెండు బ్యాంకులూ పతనం చెందడం వెనుక మనకు కనిపించే తక్షణ కారణం వడ్డీ రేట్లు పెరగడం. ఇక్కడ మనం ప్రస్తుతానికి సిలికాన్ వ్యేలీ బ్యాంక్ వ్యవహారానికి మాత్రం పరిమితం అవుదాం. ఎందుకంటే అక్కడి వ్యవస్థలోని వైరుధ్యాన్ని ఆ బ్యాంకు ఉదంతం స్పష్టంగా వెల్లడి చేస్తోంది. అదే సిగేచర్ బ్యాంక్ వ్యవహారం చూస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ బ్యాంక్ ఎక్కువగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నడిపింది. ఆ క్రిప్టో కరెన్సీలు దారుణమైన విధంగా అస్థిరతకు లోనవుతాయన్న సంగతి తెలిసినదే.
వడ్డీరేట్లు పెరిగితే బాండ్ల ధరలు వాటంతట అవే తగ్గుతాయి. ఒక బాండు ఎంత కాలానికి ఇవ్వబడిందో ఆ మొత్తం కాలం అంతటికీ (దానినే బాండు జీవితకాలం అంటారు) దానిపై వచ్చే నిజ ఆదాయం బట్టి బాండు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారపడి ఉంటుంది. (ఉదా హరణకు: ఒక బాండు మీద పదేండ్ల తర్వాత 10శాతం అదనంగా ఇస్తాం అని చెప్పి బాండు అమ్మారనుకుందాం. బాండును కొన్ననాటికి రూపాయి విలువ కన్నా పదేండ్ల తర్వాత ఆ రూపాయి విలువ పడిపోతే, అప్పుడు ఆ బాండు ద్వారా వచ్చే నిజ ఆదాయం తగ్గుతుంది) అందుచేత బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగితే కరెన్సీ నిజవిలువ తగ్గుతుంది గనుక బాండ్ల మార్కెట్ విలువ తగ్గిపోతుంది. అప్పుడు బ్యాంకు వద్ద తనఖా కింద ఉన్న బాండ్లకు విలువ తగ్గిపోతుంది. అంటే బ్యాంకు దగ్గర ఉన్న ఆస్తుల విలువ తగ్గుతుంది. ఆ మేరకు సాపేక్షంగా అప్పుల భారం పెరుగుతుంది. దాని వలన బ్యాంకులు ఒత్తిడికి లోనవుతాయి.
ఈ ఒత్తిడిని అధిగమించడానికి బ్యాంకు ఏవైనా చర్యలు చేపడితే అప్పుడు ఆ బ్యాంకు తాను ఒత్తిడిలో ఉన్నట్టు ఈ ప్రపంచం ముందు అంగీకరించినట్టు అవుతుంది. అటువంటి చర్యలు చేపట్టగానే ప్రజలకు దానిపై నమ్మకం సన్నగిల్లుతుంది. దానివలన ఆ బ్యాంకు వాటాల విలువ పడిపోతుంది. వాటాల విలువ పడిపోయిందని తెలియగానే డిపాజిటర్లు గాబరా పడి తమ డిపాజిట్లను వాపసు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఒకసారి డిపాజిట్లు వెనక్కి తీసుకోవడం మొదలవగానే ఆ బ్యాంకు ఒక్కసారిగా కుప్పకూలుతుంది. అంటే ఒకసారి బ్యాంకు ఒత్తిడికి లోనవుతే, ఆ పైన దానినుండి బయటపడడానికి అది ఏమి చేసినా అది పతనానికే దారి తీస్తుంది. ఒత్తిడిని అధిగమించడానికి చర్యలు చేపడితే ఏమవుతుందో చెప్పాం. ఒకవేళ ఏ చర్యలూ చేపట్టకుండా ఉంటే అప్పుడు కూడా పతనం ఖాయం. అందుచేత ఆ బ్యాంకు పతనానికి బాధ్యత అంతా ఆ బ్యాంకుదే అని నెట్టెయ్యలేం. ఆ దేశంలోని స్థూల ఆర్థిక విధానాల ప్రభావం ఏమిటన్నదానిని పరిశీలించాలి.
వడ్డీ రేట్లు పెంచగానే బ్యాంకులు పతనం చెందుతాయన్న అభిప్రాయానికి ముందు చెప్పిన వాదనను బట్టి వచ్చేయ కూడదు. రిజర్వు బ్యాంకు ఆదేశాలమేరకు వడ్డీ రేట్లలో మార్పులు చిన్న చిన్న మోతాదుల్లో జరుగుతూవుంటాయి. ఒక చిన్న మోతాదులో వడ్డీ రేటు పెరిగితే దాని ఫలితంగా బ్యాంకు మీద వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం సాధ్యమే. మార్కెట్లో ఎటువంటి అలజడికీ తావివ్వకుండా బ్యాంకులు తట్టుకో గలుగుతాయి. కాని హఠాత్తుగా కేంద్ర రిజర్వు బ్యాంకు వడ్డీ రేటును గణనీయంగా పెంచివేసిందనుకోండి. అప్పుడు తమ ఆస్తులు-అప్పుల నడుమ సమతూకం కొనసాగే విధంగా ఎటువంటి గందరగోళానికీ తావులేకుండా చర్యలు తీసుకోవడం బ్యాంకులకు అసాధ్యం అయిపోతుంది.
ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లను అక్కడి ఫెడరల్ రిజర్వు గణనీయంగా పెంచింది. 2022 ఫిబ్రవరిలో 0.25శాతం ఉన్న వడ్డీ రేటు ఫిబ్రవరి 2023 వచ్చేసరికి అమాంతం 4.75కి పెరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ స్థాయిలో వడ్డీ రేటును పెంచినందువలన బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను సర్దుబాటు చేసుకోవడం వాటికి అసాధ్యమే అయింది. ఇక్కడ ప్రశ్న ఏమంటే, అమెరికన్ ఫెడరల్ రిజర్వుబ్యాంకు ఎందుకు ఇంత హఠాత్తుగా ఇంత ఎక్కువ మోతాదులో పెంచింది?
నయా ఉదారవాద వ్యవస్థలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోగలిగిన ఒకే ఒక్క దారి అది అనుసరించే ద్రవ్య విధానమే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కాలం పాటు ప్రభుత్వం జోక్యం చేసుకో గలిగింది. అలా జోక్యం చేసుకోగలిగిన శక్తి నయా ఉదారవాద కాలంలో బాగా తగ్గిపోయింది. జీడీపీతో పోల్చినప్పుడు ద్రవ్యలోటు ఒకానొక స్థాయికి మించకుండా ఉండాలనే షరతును అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అన్ని ప్రభుత్వాల మీద విధించింది. అదే సమయంలో పెట్టుబడిదారుల పైన, సంపన్నులపైన పన్నులు పెంచడాన్ని కూడా నియంత్రించింది. అటువంటి పరిస్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోడానికి వడ్డీ రేట్లు తగ్గించడం ఒక్కటే ప్రభుత్వానికి మిగిలిన దారి.
బడ్జెట్లో ద్రవ్యలోటును నియంత్రించే చట్టం (మన దేశంలో ఉన్నట్టు) ఏదీ అమెరికాలో లేదు. అమెరికా నుండి ద్రవ్య పెట్టుబడి ఇంకెక్కడికో బయటకు పోతుందన్న భయమూ ఆ దేశానికి లేదు. అటువంటప్పుడు ద్రవ్యలోటును పరిమితం చేసుకోవలసిన ఆవశ్యకత ఆ దేశానికి లేదు. కాని అమెరికాలో ద్రవ్యలోటును పెంచి ఆర్థిక వ్యవస్థవేగాన్ని పెంచాలనుకుంటే దాని వలన ఇతర దేశాల్లో ఉద్యోగాలు కొత్తగా కల్పించబడతాయి తప్ప అమెరికాలో కాదు. (అమెరికాలో ప్రజల కొనుగోలుశక్తి పెరిగితే వారికి కావలసిన సేవలు, సరుకులు విదేశాలనుండి తెచ్చుకోవలసిందే) పైగా విదేశీ రుణం పెరుగుతుంది. నిజానికి కరోనా మహమ్మారి కాలంలో అమెరికా తన ద్రవ్య లోటును భారీగా పెంచింది. కొందరు దాని వల్లనే ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. హౌసింగ్ బుడగ పేలిపోయిన తరువాత (సబ్‌ప్రైమ్ సంక్షోభం) చాలా కాలం పాటు వడ్డీ రేట్లను కనిష్ట స్థాయి వరకూ తగ్గించివేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఊపు తీసుకురావడానికి అమెరికా ప్రయత్నించింది. దాదాపు సున్నా వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
2008లోహౌసింగ్ బుడగ పేలిపోయింది. 2009 నుంచీ 2022 వరకూ అమెరికాలో వడ్డీ రేట్లు 0.25శాతం దగ్గర కొనసాగాయి. మధ్యలో 2016 నుండి 2020 కాలంలో దానిని క్రమంగా పెంచుతూ 2శాతం దాకా తెచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2022 దాకా తగ్గింది. ఇంత అసాధారణంగా దీర్ఘ కాలం పాటు ఇంత అసాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు కొనసాగించడం వలన అమెరికన్ గుత్తాధిపతులు ఎటువంటి ఇబ్బందీ లేకుండానే తమ సరుకుల రేట్లను, దానితోబాటు లాభాలను పెంచుకుంటూ పోయారు. అది అంతిమంగా ప్రస్తుత ద్రవ్యోల్బణానికి దారి తీసింది. కాని అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఉపాధికల్పన చాలినంత ఎక్కువ స్థాయికి ఏమీ పెరగలేదు. అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం 4శాతానికి తగ్గింది. కాని అదే సమయంలో ఉత్పత్తి క్రమంలో కార్మికులు పాల్గొనే రేటు (లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్రేట్) మాత్రం తగ్గింది. ఈ రేటు 2008 నాటి స్థాయిలోనే కొనసాగుతున్నట్టు అనుకున్నా నిరుద్యోగం మాత్రం అప్పటినుంచీ ఎక్కువ స్థాయిలోనే కొనసాగింది. ద్రవ్యోల్బణం పెరగ్గానే వడ్డీ రేట్లు అమాంతం పెంచివేశారు. ఈ విధంగా హేతువిరుద్ధంగా ద్రవ్య విధానంలో మార్పులు చేయడం, వడ్డీ రేట్లలో ఉన్నట్టుండి మార్పులు తేవడం చూస్తే అంతర్జాతీయంగా వేగంగా సంచరించే ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం కొనసాగుతున్నంతకాలం పెట్టుబడిదారీ విధానం పరిధిలో ప్రత్యామ్నాయాలు వేరే లేవు అన్నది కనిపిస్తోంది. ఈ విధంగా తలా తోకా లేని విధంగా వ్యవహరించడం అనేది ప్రభుత్వం వైపు నుండి తలెత్తిన లోపంగా అనుకోలేం. ఇది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం వలన తలెత్తిన ధోరణి.
ఈ విధంగా పెద్ద స్థాయిలో అటూ, ఇటూ మారిపోయే విధానం వెనుక మరో అంశం కూడా ప్రభావితం చేస్తున్నది. వడ్డీరేట్లు తగ్గిపోయి, దానివలన బాండ్ల విలువలు పెరిగిపోతే, దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవడం జరిగినా, జరగకున్నా, బ్యాంకింగ్ వ్యవస్థకు మాత్రం దానివలన ఎటువంటి ముప్పూు ఉండదు. బ్యాంకుల ఆస్తుల విలువలు పెరగడం ఆ బ్యాంకులను ఏ విధంగానూ దెబ్బ తీయదు. కాని, వడ్డీ రేట్లు పెరిగి, బాండ్ల విలువలు పడిపోతే, బ్యాంకుల ఆస్తుల విలువలు వాటి అప్పుల విలువలతో పోల్చినప్పుడు పడిపోతాయి. దీని వలన మార్కెట్లో ప్రతిస్పందనలు కలుగుతాయి. అప్పుడు బ్యాంకులు తమ వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు వస్తాయి. ఈ విధంగా వడ్డీ రేట్ల పెంపు ఒక విధంగా, తగ్గింపు మరో విధంగా బ్యాంకులమీద ప్రభావం చూపడం వలన బ్యాంకింగ్ వ్యవస్థ మరింత దెబ్బ తింటుంది.
ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగినందువలన కేవలం అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాదు, యావత్తు పెట్టుబడిదారీ వ్యవస్థలోని బ్యాంకింగ్ రంగం ముప్పునెదుర్కొంటోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించ డానికి వడ్డీ రేట్లు పెంచడం ఒక్కటే అధికారికంగా మార్గంగా పరిగణిస్తున్న కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. చివరికి చాలా ప్రతిష్ట కల క్రెడిట్ అండ్ సూయిస్సె బ్యాంక్ కూడా తన వాటాల ధరలు పతనం అవుతున్న పరిస్థితిని చవిచూస్తోంది. దానికి ప్రధాన పోటీదారు అయిన యుబిఎస్ (స్విస్ బ్యాంక్) ఇప్పుడు స్వాధీనం చేసుకోడానికి సిద్ధపడుతోంది.
పెట్టుబడిదారీ ప్రపంచంలోని బ్యాంకింగ్ రంగానికి ఏర్పడిన ప్రమాదం ఇంకా పూర్తిగా తారాస్థాయికి చేరుకోలేదు. రానున్న కాలంలో వడ్డీ రేట్లను ఇంకా పెంచాలని ముందు అనుకున్న ఫెడరల్ రిజర్వు బోర్డు ఇప్పుడు రెండు పెద్ద బ్యాంకులు దెబ్బ తిన్న తర్వాత కాస్త నెమ్మదిగా ముందుకు కదలాలని అనుకుంటోంది. కాని ద్రవ్యోల్బణం కొనసాగినప్పుడు దానికి వడ్డీ రేట్లు మరింత పెంచడం మినహా వేరే మార్గం లేదు. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి నిరుద్యోగాన్ని పెంచడం ఒక్కటే దానిదగ్గరున్న మార్గం. నిరుద్యోగం పెరగాలంటే వడ్డీ రేట్లు పెంచాలి. ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంతో తలకిందులవుతున్న సమయంలో కార్మిక వర్గం యూరప్ యావత్తూ నిరసన ప్రదర్శనలతో హౌరెత్తిస్తోంది. ఈ నయా ఉదారవాద దశలో పెట్టుబడిదారీ విధానం ముందున్న దారి మూసుకుపోయిందని ఇప్పటి పరిస్థితి సూచిస్తోంది.
- (స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్