Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో మందుల ధరలు పెరుగుతున్నాయి.ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి పేద,మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూనే ఉన్నది. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు ఏకంగా 12.12శాతం పెరుగుతుండటం, నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం బాధాకరం. ఇక పేదోడికి రోగమొస్తే చౌకైన ధరకు మందుగోలి దొరకవా? వారికి చావే గతా! అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరిగే వాటిలో జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, అనీ మియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫెక్టివ్స్ కూడా ఉన్నాయి. తాజా పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800కుపైగా మందులపై పడనుంది. 27 చికిత్సలకు సంబంధించిన సుమారు 900 మిశ్రమాలలో వినియోగించే 384 పదార్థాల ధరలు 12శాతం పెరిగినట్టు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వెల్లడించింది. కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు ప్రధానంగా ఈ ధరల పెంపునకు కారణమని తెలుస్తోంది. ఔషధాల్లో విని యోగించే ముడిపదార్థాలు, ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్స్) ధరలు బాగా పెరిగాయని, దీంతోపాటు సరకు రవాణా, ప్యాకింగ్ ధరలు కూడా పెరిగాయని సమాచారం. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం.. హౌల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయినా ధరల పెరుగుదలను నియంత్రించడం లేదా ప్రభుత్వమే భరించడం చేయాలి గానీ ప్రజలకు అత్యవసరమైన మందుల మీద దీని ప్రభావం పడుతుంటే పట్టించుకోకపోవడం సరికాదని ప్రజల అభిప్రాయం.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మందుల ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయి. హౌల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇతరత్రా కారణాల పేరిట కేంద్రం మందుల ధరలను ఏటేటా పెంచుకుంటూ వస్తుంది. కరోనా సమయంలో మందులకు డిమాండ్ పెరిగిందని,ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది. జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి చరిత్రలో ఔషధ ధరలపై ఈ స్థాయిలో పెంపుదల ఇదే మొదటిసారి. జ్వరం మందులు (పారాసిటమాల్ వంటివి), యాంటి బయోటిక్స్ (అజిత్రోమైసిన్ వంటివి), అంటువ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు (బీపీ), డయాబెటిస్ (షుగర్), చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, రక్తహీనత (ఫోలిక్ యాసిడ్ వంటి ఔషధాలు),రక్తప్రసరణ సంబంధిత జబ్బులు, క్షయ (టీబీ), వివిధ రకాల క్యాన్సర్లు, మినరల్, విటమిన్ తదితర గోళీలు మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్‌లు దేశ జనాభాలో 90శాతం మంది ఏదోవిధంగా వీటిని వాడుతున్నారు. కుటుంబానికి ఐదుగురుచొప్పున లెక్కే సుకున్నా కుటుంబాలు 25కోట్లవరకు ఉంటాయి. అంటే ఒక్కో కుటుంబం సగటున నెలకు మందుల కోసం వెచ్చి స్తున్న మొత్తం రూ.4వేల వరకు వెచ్చిస్తోంది. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల రుణాలను ఎడాపెడా రద్దు చేస్తోంది.. ప్రజల సొమ్మును దోచుకొనే వారికి అండగా ఉంటోంది. సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే దైనందిన అవసరాలైన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాలు, మందుల ధరలను పెంచుతోంది. అసలు సామాన్యుల బతుకు దేశంలో దుర్భరంగా తయారైంది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో దేశ ప్రజలు ఉండటం బాధాకరం.
- ముచ్చుకోట సురేష్‌బాబు