Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెన్షన్' కేసులో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోనిధర్మాసనం 17 డిసెంబర్1982న ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం... ''పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు. అంతేకానీ అది ప్రభుత్వం దయతలచి ఇచ్చే బహుమతి కాదు (PENSION IS EMPLOYEES RIGHT BUT NOT BOUNTY GIVEN BY THE GOVT అనేపదం వాడి) తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు పెన్షన్‌ని దయతో ఇచ్చే బహుమతి గానే చూడటం బాధాకరం. జనవరి 1, 2004 తర్వాత కేంద్ర సర్వీసుల్లో చేరిన ఉద్యోగులకు అదే ఏడాది సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు పిఎఫ్ఆర్డిఏ చట్టం అనుసరించి నూతన పింఛను పథకం అమలు చేస్తున్నారు. డిఫైన్డ్ ఫైన్షన్ సౌకర్యానికి నూతన పెన్షన్ విధానం పేరుతో మంగళం పాడారు. ఈ విధానం వల్ల ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు అభద్రతలో ఉన్నాయి. డిసెంబర్ 2003లో నాటి ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక ఉత్తర్వుల రూపంలో ఉరిమిన ఉరుము, సెప్టెంబర్ 4, 2013న ప్రతిపక్ష బీజేపీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన పిఎఫ్ఆర్డిఎ చట్టంతో ఉద్యోగులపై పిడుగులా పడింది. కార్మికవర్గానికి ఎప్పుడూ వెన్నుదన్నుగానిలిచే అభ్యుదయ, వామపక్షవాదులు బిల్లును వ్యతిరేకించడం తో దశాబ్ద కాలం బిల్లు ఆగింది. తర్వాత 2013లో పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఒక్కటై ఈ చట్టాన్ని చేశాయి. నూతన పెన్షన్ విధానం కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు శాపంగా పరిణమించింది. జీవితకాలం పని చేసిన ఉద్యోగికి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, సర్వీస్ పెన్షన్ లాంటివి ఏమీరావు. ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి అతని అకౌంట్లో ఉన్న మొత్తంలో 60శాతం ఉద్యోగికి ఇచ్చి, మిగిలిన 40శాతం షేర్ మార్కెట్లో పెడతారు. షేర్ మార్కెట్లో లాభం వస్తే ఉద్యోగికి ఉపయోగం. నష్టం వస్తే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు షేర్ మార్కెట్ ఎప్పుడు లాభాల్లో ఉంటుందో, ఎప్పుడు నష్టాల్లో ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కనీస పింఛను ప్రస్తావనే లేదు.
నూతన పింఛన్ పథకం(ఎన్పీఎస్) ఏప్రిల్ 1, 2010 నుండీ ఎల్ఐసిలో అమలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్పీఎస్ పథకాన్ని ఎల్ఐసి ఉద్యోగుల మీద ఏకపక్షంగా రుద్దిన వెంటనే, అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం తన నిరసనను సమ్మె రూపంలో తక్షణమే వెలిబుచ్చింది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 1, 2010 తరువాత ఎల్ఐసీలో చేరిన కొంతమంది ఉద్యోగులు మరణించారు. నూతన పింఛన్ పథకంలోని నిబంధనల ప్రకారం ఏడాదికి దివంగత ఉద్యోగి కుటుంబానికి లభించే కుటుంబ పెన్షన్ మొత్తం-సుమారు రూ.15,700. అనగా నెలకు సుమారు రూ.1300 మాత్రమే. ఒకవేళ దివంగత ఉద్యోగులు 1995 గ్యారెంటీ పింఛన్ పథకంలో (ఓపీఎస్) ఉండి ఉంటే వారి కుటుంబాలకు లభించే కుటుంబ పింఛను (కనీసం)రూ.15,000. అంటే, గ్యారంటీ పింఛను పథకానికి ఎన్పీఎస్ ద్వారా లభించే కుటుంబ పింఛన్‌కు తేడా కనీసం 10 రెట్లుఉంది. ఎన్పీఎస్ ద్వారా చెల్లించే కుటుంబ పింఛను మన రాష్ట్రంలో చెల్లించే సామాజిక పెన్షన్ కంటే తక్కువ. పైపెచ్చు, ఈ పింఛను మొత్తం స్థిరంగా ఉంటుంది, జీవితాంతం మారదు(డీఎలు కలవడం ఇతరా ఉండదు). ఇంత దుర్మార్గమైన పింఛను పథకం కాబట్టే, ఏఐఐఈఏ 2010 నుంచీ ఈ పథకాన్ని రద్దు చేయాలని పోరాడుతోంది. నూతన పింఛను పథకం రద్దు చేయాలని, ఈలోగా ఎన్పీఎస్ పథకంలో ఉన్న (ఏప్రిల్ 1, 2010 తరువాత ఉద్యోగంలో చేరిన ) ఉద్యోగులకు యాజమాన్య వాటాను 10శాతం నుండి 14శాతం పెంచాలని ఏఐఐఈఏ ఏనాటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇతర రంగాల్లో ఇది అమలు చేస్తున్నారు. ఇంతవరకు, ఆ దిశగా ఎటువంటి అడుగులు పడలేదు. బోర్డు ఆమోదించినట్లు ఫ్యామిలీ పెన్షన్‌లో మార్పులు చేయకపోవడంతో మూడేండ్లుగా కుటుంబ పింఛనర్లు (దాదాపు 23,000 మంది పైబడి) నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ పింఛను పథకంలో మార్పులు చేయాలని, నూతన పింఛను పథకాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్లతో అఖిల భారత బీమా పింఛనర్ల సంఘం ఆధ్వర్యంలో మార్చి 29న ఢిల్లీలో జంతర్ మంతర్‌లో చేసిన ధర్నా విజయవంతమైంది. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
- పి. సతీష్