Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యధావిధిగా శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. ఆదిలక్ష్మి తన భర్త పాదములు ఒత్తుతున్నది. లక్ష్మికి ఏదో అనుమానం వచ్చింది. తన సందేహాన్ని తీర్చుకొనుటకై ''స్వామీ!'' అని భర్తను పిలిచింది. కానీ స్వామి వారు శ్రీదేవి పిలుపును ఆలకించలేదు! నిద్రను వీడలేదు! ఇంతలో నారదుడు ప్రవేశించాడు. వస్తూనే ''నారాయణ! నారాయణ!'' అంటూ కీర్తించాడు.
శ్రీహరి కళ్ళు తెరిచి, ''ఏమి! నారదా బహుకాల దర్శనము! ఏమి భూలోక విశేషాలు?'' అని చిరునవ్వుతో కుశలప్రశ్నలు వేశాడు.
''ఆహాహాఁ! పాదాలు ఒత్తే దేవేరి పిలుపు ఆవధరించరుగాని, కీర్తనలు చేసే భజన పరులను మాత్రం ఆదరిస్తారు'' అన్నది ఆదిలక్ష్మి ఆగ్రహంగా.
''ఆగ్రహించకు దేవీ! నారదుడు భజనపరుడే కాదు! మన మనవడు పైగా మన ఇంటికి వచ్చినాడు. అతడు కలహభోజనుడు. మన ఇంట్లోకి రాకుండానే భోజనం దొరికనట్లున్నది!'' అన్నాడు శ్రీహరి.
''ఎంత మాట స్వామి! ఆది దంపతుల మధ్య కలహం పెట్టగల సమర్థుడనా! ఏదో మీ జగన్నాటకంలో నేనూ ఒక పాత్రధారినే. అంతే. ఒక సందేహము నివృత్తి చేసుకొనుటకై మీ దర్శనం చేసుకుంటిని కాని మా నాయనమ్మ గారేమో కారాలు, మిరియాలు నూరుతున్నారు. నాకు సెలవిప్పించండి!'' అన్నాడు నారదుడు.
''ఎంత మాట నారదా! నేనూ సందేహ నివృత్తికే స్వామివారిని పిలిచాను! ఇంతలో నీవు వచ్చి పిలిచారు! స్వామి నీకు ముందుగా ప్రసన్నమయ్యారు! అంతే కానివ్వు!'' అన్నది లక్ష్మి నవ్వుతూ.
''చిత్తం! భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసుకుందామని వస్తిని స్వామి!'' అన్నాడు నారదుడు.
''స్వామీ! నాకునూ ఇదే సందేహం కలిగినది!'' అన్నది లక్ష్మి ఆశ్చర్యంగా.
శ్రీహరి ముసి ముసి నవ్వు నవ్వాడు ''ఇది చాలా చిన్న ప్రశ్న! మన భారతదేశం వెళ్ళినచో మీకు బోధపడును కదా!'' అన్నాడు.
''వద్దు! తాతగారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్ను అక్కడికి పంపించవద్దు!'' అన్నాడు నారదుడు.
''ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా వెల్లడించగల స్వేచ్ఛనే భావ ప్రకటనా స్వేచ్ఛ అంటారు నాయనా! ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. భారత రాజ్యాంగం ఈ హక్కును కల్పించింది! అది తెలుసుకోగలవని నిన్ను అక్కడికి వెళ్ళమంటిని!'' అన్నాడు శ్రీహరి.
''అక్కడ భావ ప్రకటనా స్వేచ్ఛ కొందరికే ఉన్నది. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారే ఆ హక్కును అనుభవిస్తున్నది. మిగిలినవారు ఆ హక్కును అనుభవించే ప్రయత్నం చేసినా అరెస్టు అవుతున్నారు!'' అన్నాడు నారదుడు.
''అధికారంలోని వారు భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నదని ప్రజల సమైక్యత, దేశ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయరాదు కదా! నిజానికి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం అని గుర్తించాలి!'' అన్నాడు శ్రీహరి.
''స్వామీ విమర్శకు, నిందకూ, ఎత్తిచూపటానికి, అప్రతిష్టపాలు చేయటానికి వ్యత్యాసం లేదా!'' అడిగాడు నారదుడు.
''లేకేమి నారదా! విమర్శ తప్పును ఎత్తి చూపి సరిచేయుటకు నిందించటం అప్రతిష్టపాలు చేయటానికి తోడ్పడుతాయి!'' అని వివరించాడు శ్రీహరి.
''అధికారంలో ఉన్నవారు విమర్శలకు, ప్రశ్నలకు అతీతులా? వారిని ఎవరూ పల్లెత్తు మాట అనటం ప్రజాస్వామ్యంలో నేరమా?'' మళ్ళీ ప్రశ్నించాడు నారదుడు.
శ్రీహరి చిరునవ్వుతో లక్ష్మిదేవి వంక చూశాడు.
''నీ ప్రశ్నకు నా అవతారాల్లోనే సమాధానాలు ఉన్నాయి! లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది! నేనే వివరిస్తాను విను నేను కృష్ణావతారం దాల్చినప్పుడు శమంతక మణిని నేనే దొంగిలించానని నాపై కొందరు అపవాదు మోపినారు! అలాంటి వారిని నేను ఖైదు చేయటమో, జరిమానా విధించటమో చేయలేదు! నేను శమంతకమణి దొంగిలించలేదని రుజువు చేయటానికి ఎంతో కష్టపడి, ఆ మణి ఎక్కడుందో తెలుసుకుని, జాంబవంతుడితో యుద్ధం చేసి, ఓడించి ఆ శమంతకమణి తెచ్చి, సత్రాజిత్తుకి అందచేసి, నా జిజాయితీని నిరూపించుకున్నాను!'' అన్నాడు.
''తన నిజాయితీని నిరూపించుకునే క్రమంలోనే జాంబవతిని, సత్యభామ లను నాకు చెల్లెళ్ళుగా చేశాడు శ్రీవారు!'' అన్నది మహాలక్ష్మి శ్రీహరి ముసి ముసిగా నవ్వాడు.
''అధికారంలో ఉన్నవారిని, మీ అర్హతలు, యోగ్యతలు, చూపమని ప్రజలు తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యం కలదా ప్రభూ!'' అని అడిగాడు నారదుడు.
శ్రీహరి మరోసారి నవ్వాడు.
''తమను పరిపాలించే వారి గురించే తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న గొప్ప హక్కు. సమాచార హక్కు పేరిట ప్రజలకు ఈ హక్కును కల్పించి ప్రజాస్వామ్యాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది భారతదేశం. అయితే నీవడిగిన ప్రశ్నకు రామావతారం దాల్చి, త్రేతాయుగంలోనే సమాధానం ఇచ్చాను!'' అన్నాడు శ్రీహరి.
నారదుడికి రామావతారంలో తన ప్రశ్నకు ఏవిధంగా సమాధానం ఉండేనో స్ఫూరించలేదు! దాంతో బుర్ర గోక్కున్నాడు.
''నిత్యమూ నా నామాన్నే జపించే నీవే మర్చిపోతే ఎట్లా నారదా! వివరిస్తాను విను! నేను సీతను వెతుకుతూ సుగ్రీవుడిని కలుసుకున్న విషయం నీకు తెలుసుకదా! అప్పుడు వాలికి తనకున్న వైరం గురించి చెబుతూ, వాలి మహాబలశాలి యనీ, ఒక్క గుద్దుతో మూడు తాటిచెట్లను కూల్చగల శక్తిశాలి యని, మరి నాకు అంతశక్తి ఉందా? సుగ్రీవుడు సందేహం వ్యక్తం చేశాడు. అంటే నేను వాలికంటే బలవంతుడినా అని నా బల పరాక్రమాల మీదా, నా యోగ్యత మీద సందేహం వ్యక్తం చేశాడు. నా యోగ్యత మీద అనుమానం వెలిబుచ్చినందుకు సుగ్రీవుడి మీద నా తమ్ముడైన లక్ష్మణునికి కోపం వచ్చింది. కాని నేను లక్ష్మణుని వారించి, ఒక్క బాణంతో ఏడు తాటిచెట్లను కూల్చి, నా యోగ్యతను నిరూపించుకున్నాను! ప్రభువైన వాడు ఆచరించవలసిన తీరు తెన్నులను నేను నా అవతారాలలో స్పష్టంగా వివరించాను!'' అన్నాడు శ్రీహరి.
''రాజే సాక్షాత్తూ మహావిష్ణువు! అన్న నానుడి గలిగిన త్రేతచ్వాపర యుగాల్లోనే మీరు దాల్చిన అవతారాల్లో రాజు ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలో ఆచరించి చూపారు. మీ అవతారాల్లో ఇదే ముఖ్యమైన పరమార్థమని నేడు నేను తెలుసుకోగలిగాను. మీ అవతారాల్లోని ఈ ధర్మసూక్ష్మాన్ని, ఈనాటి ప్రజాస్వామ్య ప్రభువులు అర్థం చేసుకుని ఆచరిస్తే, అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది! ధన్యుడిని స్వామి సెలవు!'' అంటూ నారదుడు సెలవు తీసుకున్నాడు.
- ఉషాకిరణ్