Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై దేశ వ్యాపితంగా అనేక రూపాలలో ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం ఉధృతమవుతున్న సమయంలో కర్నాటక శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మే10న ఒకే విడతగా ఎన్నికలు పూర్తవుతాయన్న ప్రకటనే ఒక విధంగా ఆశ్చర్యం కలిగించింది. ఆయన మూలపీఠమైన గుజరాత్ వంటి చిన్న రాష్ట్రంలోనే ఏడు దఫాలుగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొంత వింతగానే అనిపిస్తుంది. అదలా ఉంచితే అదానీ భాగోతంతో మోడీ ఇరకాటంలో చిక్కుకోవడం, రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు దేశవ్యాపిత నిరసన, కార్పొరేట్ అనుకూల విధానాలపై ఉద్యమాలు, సంఫ్‌ు పరివార్ మతతత్వ రాజకీయాలపై ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వస్తున్నాయి. దక్షిణాదిన కాలూనడం కష్టమైన బీజేపీకి కర్నాటక ఒక్కటే దింపుడుకళ్లెం ఆశకాగా ఇప్పుడు అదీ ఎదురీతగా మారింది. కులాలకుంపట్లకు మారుపేరైన కర్నాటకలో దాంతోపాటు మతతత్వ మంటలు రాజేసిన ఘనత బీజేపీదే. గత ముప్పై ఏండ్లలో ఒకసారి కూడా అధికారంలోని సర్కారు మళ్లీ గెలవకపోవడం కర్నాటక ప్రత్యేకత. దేవగౌడ కుమారస్వామి జేడీఎస్ అవకాశవాద రాజకీయాల ఫలితంగా మొదటిసారి రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందిన బీజేపీ తరపున యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే లింగాయత్‌లను సమీకరించి, అవినీతి గని సామ్రాట్ గాలి జనార్థన్‌రెడ్డి వత్తాసుతో స్వంతంగా మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే కుంభకోణాల పరంపరలో వరుసగా మరో ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోవలసి వచ్చింది. ఒకదశలో యడ్యూరప్ప కూడా తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్నారు. కాని మళ్లీ 2018 ఎన్నికల నాటికి అన్యథా శరణం నాస్తి అంటూ ఆయననే మళ్లీ చేర్చుకోవడం బీజేపీ దురవస్థకు అద్దం పడుతుంది. గత ఎన్నికల్లో 102స్థానాలతో పెద్దపార్టీగా బీజేపీ వచ్చినా ఎవరికీ మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37స్థానాలు వచ్చాయి. మెజార్టీ లేకున్నా యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, బలపరీక్ష రణరంగంగా మారడంతో తోకముడవడం తెలిసినవే. కుమారస్వామిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దాన్ని బతకనివ్వలేదు. ఫిరా యింపుల ఆసరాతో మళ్లీ బీజేపీ గద్దెక్కడం, బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి కావడం తెలిసిన విషయాలే.
అవినీతి, మతతత్వ ప్రజ్వలన
బొమ్మై ప్రభుత్వ పాలనతో కర్నాటక పరిస్థితి దారుణంగా పరిణమించింది. ఉత్తరాది తరహా మతోన్మాద రాజకీయాలను రాజేసింది. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి రాకూడదనే ఆంక్షలు దేశంలోనే చిచ్చుపెట్టాయి. విద్యార్థులు ఏ మతానికి చెందిన వారైనా యూనిఫాం ఒకటే ధరించాలి గాని బురఖా వేసుకూడదనే కొత్త షరతు విమర్శల పాలైంది. దీనిపై రాజ్యాంగరీత్యా తమకు గల హక్కులను గురించి ముస్లిం సంస్థలు చేసిన పోరాటం, వాదోపవాదాల మధ్య విద్యా సంవత్సరాన్నే దెబ్బతినిపోయింది. కర్నాటక హైకోర్టు కూడా ఇందుకు మద్దతు తెల్పడంతో కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అక్కడ కూడా కొందరు న్యాయమూర్తులు మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ అది అపరిష్క్రతంగానే ఉంది. టిప్పుసుల్తాన్ జయంతి విగ్రహ స్థాపన వంటి విషయాలపై సంఫ్‌ు పరివార్ సృష్టించిన వివాదం మరో రభజకు దారితీసింది. దీనికి పరాకాష్టగా, ఎన్నికల తేదీ ప్రకటనకు కొద్దిగా ముందే హోంమంత్రి అమిత్ షా కర్నాటకలో ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. తమ హిందూత్వ రాజకీయాలకు దక్షిణ భారత దేశంలో కర్నాటకను కేంద్రంగా చేసుకోవాలన్నదే ఇక్కడ దుర్నీతి. వీటన్నిటి ఫలితంగా రాష్ట్రంలో ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు కూడా కొంత పట్టు సంపాదించడంతో బీజేపీ మరింత వ్యతిరేతను రెచ్చగొట్టే అవకాశం కలిగింది. మతాంతర వివాహాలు మత మార్పిళ్లు, చరిత్ర పాఠాల మార్పు వంటి నిర్ణయాలన్నీ ఇందుకే కారణమైనాయి. లింగాయత్‌లలో పట్టు పెంచింది యెడ్యూరప్ప అయినా ఆ సమీకరణాలలో కొత్త ఫార్ములాలు తీసుకురావాలన్న కోణంలోనే ఆయనను తప్పించి బొమ్మైని తీసుకొచ్చారు. ముస్లింలకు రద్దుచేసిన నాలుగు శాతం రిజర్వేషన్లలో వొక్కలింగ లింగాయత్ రిజర్వేషన్ రెండు శాతం చొచ్పున కోటా ఇవ్వడం ఇందులో భాగమే. దీనివల్ల ఆ తరగతులు కూడా సంతృప్తిచెందింది లేదు. ముఖ్యమంత్రి ఇంటిదగ్గర నిరసనలు కూడా జరిగాయి. అధిష్టానం తనను దూరం పెట్టడం జీర్ణించుకోలేని యడ్యూరప్ప అసంతృప్తి శిబిరం నడిపించారు. ఆఖరుకు ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ఆయనను బహిరంగ వేదికపై పొగిడి బుజ్జగించాల్సి వచ్చింది. అవినీతి ఏ స్థాయికి చేరిందంటే కాంట్రాక్టర్ల సంఘం తాము 40శాతం కమిషన్లు భరించలేక బహిరంగ ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే రూ.93కోట్లు అక్రమ ధనం పట్టుపడటం దీనికో ఉదాహరణ. ఇదేగాక గిడ్డండులలో గుట్టలు పేర్చిన మద్యం ఖరీదైన కానుకలు భారీ ఎత్తున పట్టుపడ్డాయి. ఇవి బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఎంఎల్ఎ సిటి రవికి సంబంధిం చినవిగా తేలింది. కర్నాటక సోప్స్ డిటర్జంట్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మదల్ విరూపాక్షను లోకాయుక్త అభిశంసించగా ముందస్తు బెయిల్ కూడా రద్దయి అరెస్టయ్యారు. అనేక అక్రమ లావాదేవీలలో అనుమానితుడుగా ఉన్న మరో దళారీ అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు.
కాంగ్రెస్ ఆశలు, సవాళ్లు
బొమ్మై సర్కారు పట్ల ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగానే ఉందని పరిశీలకులు అంచనా వేస్తుంటే అదే తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీలు, వక్కలింగలు ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. సిద్దరామయ్యతో సహా బలమైన గుర్తింపు గల నాయకులు కూడా కాంగ్రెస్‌లో ఉన్నారు. మధ్యలో జేడీఎస్ కూడా పరిమిత ప్రాంతాలలో వక్కలింగలలో పట్టు కలిగివున్నా ఆ ప్రభావం తగ్గుముఖంలో ఉంది. పలుసార్లు రాజకీయ పొత్తులు మార్చిన ఆ పార్టీకి విశ్వసనీయతా లోపం కూడా ఉంది. దక్షిణభారతంలో కాంగ్రెస్ ప్రధాన శక్తిగా ఉన్న ఒకే ఒక రాష్ట్రం ఇదొక్కటే. ఆ విధంగా కర్నాటక ఎన్నికల ప్రభావం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడే చోట్ల పరిస్థితికి సంకేతాలుగా నిలుస్తాయి. కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న దళిత నేత మల్లికార్జునఖర్గే స్వంత రాష్ట్రం గనక ఇది ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఒక పరీక్షగా ఉంటాయని ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. దేశంలో మూడే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్న కాంగ్రెస్‌కు ఇది చాలా కీలకమైన పరీక్ష. అంతర్గత విభేదాలు కూడా ఎక్కువే అయినా ఏకాభిప్రాయం ఉన్న 124చోట్ల అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ ముందుగా రంగంలో నిలిచింది.
20చోట్ల తెలుగు ముద్ర
కర్నాటకకూ తెలుగువారికి సంబంధాలు చారిత్రకమైనవి. తెలుగు వారి సంఘాలు, తెలుగునాట గల పార్టీలపట్ల అనుకూల ప్రతికూలతలు అక్కడ సర్వసాధారణం. మొత్తం కోటి మంది వరకూ తెలుగువారు అక్కడ ఉన్నారని, బెంగుళూరులోనే పాతికలక్షల వరకూ ఉంటారని తెలుగు సంఘాలు చెబుతుంటాయి. మైసూర్ కర్నాటక, హైదరాబాద్ కర్నాటక, బెంగుళూరు కర్నాటక అని మూడు భాగాలుగా పిలుస్తుంటారు. జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కేసీఆర్‌తో కలవడమే గాక బీఆర్ఎస్ ప్రారంభసభకూ హాజరైనారు. అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందని కూడా కథనాలు వచ్చాయి కాని తర్వాత లేదని వివరణ ఇచ్చారు. జేడీఎస్ ఒంటరిగా పోటీ చేస్తే పొత్తుపెట్టుకోవడమో బలపర్చడమో చేయొచ్చని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. తాము స్థానిక ఎన్నికలలో మాత్రం పోటీ చేస్తామన్నారు. 20 నియోజనవర్గాలలో తెలుగువారే నిర్ణాయక శక్తిగా ఉంటారని చెబుతున్నారు. ఇందులో ఒకటైన బాగేపల్లి గతంలో సీపీఐ(ఎం) గెలుచుకున్నది. ఇప్పుడు కూడా అక్కడ సన్నాహాల కోసం బి.వి.రాఘవులు, ఎం.ఎ.బేబీ పర్యటించారు. వైసీపీ ఏపీ బయట తాము జోక్యం చేసుకోమని చెబుతున్నా టీడీపీ పరోక్షంగానైనా ఏదైనా చేయొచ్చనే అభిప్రాయం ఉంది. అక్కడ తమ పార్టీని గెలిపించేందుకు సహకరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను హోంమంత్రి అమిత్‌షా ఇటీవల కోరారనే కథనాలు ఉన్నాయి. మజ్లిస్ కూడా రంగంలో ఉంటూ ఆప్ కూడా దాదాపు అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించడంతో ఓట్ల చీలిక ఇంకా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
పర్యటనల జోరు
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నాయకత్వ లోపం కారణంగా ఈ సారి తాము గెలిచే అవకాశం లేదని బీజేపీ నేతలు చాలామంది ఒప్పుకుంటున్నారు. ఆరెస్సెస్ నేతల అంచనా కూడా అలాగే ఉంది. అందుకే రాష్ట్రంలో మోడీ, అమిత్ షా వంటివారు విస్తారంగా పర్యటించి గట్టెక్కించాలని తంటాలు పడుతున్నారు. మోడీనే తమ ఎన్నికల ముఖచిత్రంగా ఉంటారని బీజేపీ నేతలు చెప్పడానికి కారణమదే. కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. తనపై పరువునష్టం కేసుకు శిక్ష అనర్హతలకు కారణమైన కోలార్ నియోజకవర్గం నుంచే రాహుల్‌గాంధీ పర్యటన ప్రారంభిస్తున్నారని సమాచారం. సోనియాగాంధీ కూడా బాధ్యతల విరమణ యోచన తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెబుతున్నారు. 1977, 78లో ఇందిరాగాంధీకి కర్నాటక అండగా నిలిచినట్టే ఇప్పుడూ తోడు కావచ్చనే ఆశ లేకపోలేదు. 2018లో బీజేపీకి 104 సీట్లు 36.35శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 78 సీట్లు 38.14 శాతం ఓట్లు వస్తే జెడిఎస్‌కు 37సీట్లు 18.3శాతం ఓట్లు రావడం అక్కడ తీవ్ర విభజనను తెల్పుతాయి. జేడీఎస్ ప్రభావాన్ని మరింత తగ్గించి ఆ స్థానంలో తాను ప్రవేశించాలనేది బీజేపీ వ్యూహంలో ఒక ముఖ్యాంశం. ఈ ఫలితాల ప్రభావం వెంటనే జరిగే తెలంగాణ ఎన్నికలపైనా 2024 లోక్‌సభ సమరంపైనా ప్రభావం చూపించడం ఖాయం. కనుకనే కర్నాటకలో బీజేపీని అధికారానికి దూరం చేయడం ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యంగా ఉంది. ఇందులో ఎవరి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఓటర్లే తేల్చి చెబుతారు.
- తెలకపల్లి రవి