Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 30న విడుదలైన దసరా సినిమా కథ, కథాంశాలు చిత్రీకరణ, ఆటలు, మాటలు, సంగీతం గురించి పక్కన పెడితే అందులో అంగన్వాడీలను అవమానించే సన్నివేశాలను పెట్టడం ఎంత మాత్రం సరికాదు. హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ పాత్ర పేరు వెన్నెల ఓ పల్లెటూరులో అంగన్వాడీ టీచర్‌గా పాత్ర పోషించారు. చాలా ఒదిగిపోయి బాగా నటించారు కూడా. వెన్నెల చిన్నారులకు చదువు చెప్పడంతో పాటు మల,మూత్రాలు కడిగే సన్నివేశాలను సినిమాలో బాగానే చూపించారు. కానీ డైరెక్టర్ అంగన్వాడీ పాత్రను ఇంకాస్తా సేవా దృక్పథంతో చూపించాల్సింది పోయి అవమానపరిచే విధంగా చిత్రీకరణ చేశారు. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో ఉన్న అంగన్వాడీ టీచర్ కేంద్రం మూసేసిన తర్వాత సాయంత్రం తాళం పగలగొట్టి అందులో ఉన్న కోడి గుడ్లు, ఇతర వస్తువులను తన చీర కొంగులో దాచుకొని దొంగచాటుగా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంలో హీరోతో పాటు తన స్నేహితుడు అక్కడికి వచ్చి కోడిగుడ్లు దొంగిలిస్తున్నారని అవమానకరంగా మాట్లాడు తారు. బయట సమాజంలో గుడ్లు ఇవ్వకుండా దొంగి లిస్తున్నారని తప్పుడు భావన సినిమా ద్వారా చెప్పడం అభ్యంతరకరం.
గతంలో సినిమాలు తీస్తే అందులో మంచి సందేశాలు ఉండేవి. సమాజానికి చాలా ఉపయోగపడేవి.కానీ ఇప్పుడు లాభాపేక్షతో జరగనవి జరిగినట్టుగా ఊహాజనితంగా చిన్న విషయాల్ని పెద్దగా చూపి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చూపడం ద్వారా కులాలు, మతాలు, వృత్తులు ఇలా చాలాసార్లు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సినీ పెద్దలు రోజురోజుకూ తమ సినిమా సక్సెస్ కోసం కొంతమందిని కించపరుస్తూ చిత్రీకరిస్తున్నారు. దానికి ఉదాహరణ దసరా సినిమాలో అంగన్వాడీలో చోరీ సన్నివేశం. సమాజంలో పేదల సొమ్మును అందినకాడికి దండుకుని, ప్రభుత్వ పెద్దలతో కలిసి కోట్ల రూపాయలకు పడగలెత్తిన అక్రమార్కుల పట్ల ఎలాంటి పట్టింపు లేదు. గనులు, ల్యాండ్, మైనింగ్ ఇలా అనేకమైన మాఫియాలతో లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను లూటీ చేస్తున్నారు. వాటిని లోతైన పరిశోధన చేసి ప్రజల పక్షాన కథలు రాసి సినిమాలు తీయాల్సిన దర్శకులు, నిర్మాతలు 'దసరా' వంటి సినిమాలో అంగన్వాడీ టీచర్ దొంగతనానికి పాల్పడే సీన్ తీయడం బాధాకరం. దేశ జనాభాలో సగం భాగమైన మహిళలు పేదరికం వల్ల రక్తహీనత, పౌష్టికాహారం లోపంతో బాధపడు తున్నారు. చిన్నారులు కూడా దాదాపు 60శాతం ఇదే సమస్యతో ఉన్నారు. దీన్ని అధిగమించడం కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా 75లక్షల మంది అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. చిన్న పిల్లలు, బాలింతలు గర్భిణులకు గుడ్లు, ఆహారం, మందులు ఇవ్వడంతో పాటు చిన్నపిల్లల్లో విద్యాభ్యాసం పట్ల ఆసక్తి చూపించడం కోసం ప్రాథమిక విద్యను కూడా అంగన్వాడీలు నేర్పుతున్నారు. బాలింతలకు కూడా తగిన ఆహారం ఇవ్వడంతో పాటు తల్లిపాల ప్రాధా న్యతను వివరిస్తూ సేవలందిస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర ఆరోగ్యపరమైన క్యాంపులలో, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. ఇలాంటి వారిని దసరా సినిమాలో అవమానించడం శోచనీయం. సెన్సార్ బోర్డు వారు సినిమాలో కోడిగుడ్లను చోరీ చేసే సీన్‌ను వెంటనే తొలగించాలి. సినిమా డైరెక్టర్, నిర్మాత అంగన్వాడీలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- ఎం. వరుణమ్మ
సెల్:8184899654