Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రక పరిస్థితుల్లో యూరప్ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు . ఇలానే ఉంటుంది.
పెట్టుబడిదారీ విధానం మొదలైన తొలి కాలంలో అది నిరుద్యోగాన్ని పెంచుతుందని, దాని వలన పేదరికం పెరుగుతుందని, కాని, మొదట్లో కలిగిన ఈ నష్టాన్ని ఆ తర్వాత అది అభివృద్ధి చెందుతున్న కాలంలో పూడ్చి వేస్తుందని చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది. మొదట్లో ఉపాధి పోగొట్టు కున్నవారంతా ఆ తర్వాత కాలంలో ఉద్యోగాలు పొంది కార్మికులుగా తిరిగి పనుల్లో చేరుతారని, నిరుద్యోగం తగ్గడంతో వేతనాలు పెరగడం ప్రారంభమవుతుందని, వేతనాలు పెరుగుతున్నకొద్దీ కార్మికుల ఉత్పాదకత కూడా పెరుగుతుందని వారు భావిస్తారు.
గత చరిత్ర అనుభవాలు కూడా ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నట్టు పైకి చూస్తే అనిపిస్తుంది కూడా. మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్‌బామ్ అంచనా ప్రకారం పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం మొదలైన తర్వాత బ్రిటన్‌లో నిరుద్యోగం పెరిగింది. కాని 19వ శతాబ్దపు నడిమి కాలం నాటికల్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి. కార్మికవర్గానికి అనుకూలంగా మారాయి. ఈ విధమైన దృక్పధం ఉంటే పెట్టుబడిదారీ విధానానికి పరివర్తన చెందే సమయంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం వలన కార్మికులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి అన్న నిర్ధారణకి వస్తాం. ఈ విధమైన అవగాహన మొత్తంగానే తప్పు. పెట్టుబడిదారీ విధానం తాను తొలుత కార్మికవర్గానికి కలిగించిన నష్టాన్ని ఆ తర్వాత కాలంలో పూడ్చి వారికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తుంది అని భావించడానికి ఎటువంటి సిద్ధాంత ప్రాతిపదికా లేదు. కార్మికుల స్థితిగతులలో తర్వాత కాలంలో కనిపించిన మెరుగుదలకు, పెట్టుబడిదారీ విధానపు సహజ సద్యోజనిత స్వభావానికి ఎటువంటి సంబంధమూ లేదు.
ఇంగ్లీషు ఆర్థికశాస్త్రవేత్త డేవిడ్ రికార్డో పరిశ్రమల్లో యంత్రాలను వినియోగించడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఈ విధమైన వాదన ముందుకు తెచ్చాడు. మొదట్లో యంత్రాల వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి కష్టాలపాలౌతారని, కాని ఆ తర్వాత లాభాలరేటు పెరిగి పెట్టుబడి ఎక్కువగా పోగుబడుతుందని, దానితో మరిన్ని ఎక్కువ పరిశ్రమలు వస్తాయని, వాటిలో గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నవారందరికీ మళ్ళీ ఉపాధి లభించడమేగాక వారి స్థితిగతులు బాగా మెరుగు పడతాయని రికార్డో ప్రతిపాదించాడు. కార్మికుల జనాభా మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఉండేవిధంగా వాళ్ళు తమను తాము నియంత్రించుకుంటే వారి వేతనాలు పెంచుకోవచ్చునని కూడా ఆయన చెప్పాడు.
రికార్డో వాదనలో రెండు లోపాలు ఉన్నాయి. పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది ఒకే ఒక్కమారు జరిగే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. కాని వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్త కొత్త యంత్రాలను, నూతన ఉత్పత్తి ప్రక్రియలను ప్రవేశపెట్టడం అనేది నిత్యం జరుగుతూనేవుంటుంది. యంత్రాలను మొదట ప్రవేశపెట్టినప్పుడు పెట్టుబడిదారుల లాభాల రేటు పెరగడం అనేది జరిగినా, వారివద్ద పెట్టుబడి ఎక్కువగా పోగుబడినా, దాని ఫలితంగా అంతకుముందు కోల్పోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ రావడం అనేది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ఈ లోపునే మళ్ళీ కొత్త యంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగిపోతూవుంటుంది.
అందుచేత ఈ విషయాన్ని నిరంతరం మారుతూవుండే క్రమంలోనే చూడాలి. పరిశ్రమల్లో పెట్టే పెట్టుబడి వృద్ధిచెందే రేటు 'జి' అనుకుందాం. అప్పుడు ఉత్పత్తి వృద్ధిరేటు కూడా 'జి' యే ఉంటుంది. (ఒకవేళ సాంకేతిక పరిజ్ఞానం పెంచడం కోసం అదనపు పెట్టుబడి పెట్టినా, దాని వలన శ్రామికులకు చెల్లించే వేతనాలు ఆ మేరకు తగ్గుతాయే కాని ఉత్పత్తి అయే సంపదలో వృద్ధిరేటు మాత్రం పెట్టుబడిలో వృద్ధిరేటు ఎంత ఉంటుందో, అదే మోతాదులో ఉంటుంది) శ్రామిక ఉత్పాదకత వృద్ధిరేటు 'పి' అనుకుందాం. అప్పుడు అదనపు కార్మికుల అవసరం పెరిగే రేటు జి-పి ఉంటుంది. కార్మికుల జనాభా పెరిగే రేటు 'ఎన్' అనుకుంటే జి-పి కన్నా ఎన్ తక్కువ ఉన్నప్పుడే నిరుద్యోగం తగ్గుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో జి-పి విలువ ఎన్ ను దాటి ఉండేట్టు చూసే ఏర్పాటు ఏదీ లేదు. కార్మికుల ఉత్పాదకత పెరుగుతూ మరోవైపు నిరుద్యోగం రేటు కూడా పెరుగుతూవుంటే (అప్పుడు వేతనాల రేటు కనీస స్థాయిలోనే ఎప్పుడూ ఉండిపోతుంది) లాభాల రేటు పెరుగుతూపోతుంది. దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుంది. దానిని వినియోగించినప్పుడు కొత్త ఉద్యోగాలు వస్తాయి. అప్పుడునిరుద్యోగం పడిపోతుంది. - రికార్డోను సమర్థించేవారి వాదన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే రికార్డో వాదనలోని రెండో సమస్య ముందుకొస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అయే సరుకులకు డిమాండు ఎప్పుడూ పెరుగుతూనేవుంటుంది అని రికార్డో భావించాడు. అందువలన ఉత్పత్తి పెరిగితే దాని ఫలితంగా లాభాలు పెరుగుతాయని, దానివలన అదనపు పెట్టుబడి పోగుబడుతుందని, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకమూ ఉండదని అతను భావించాడు. ''సరుకులు ఎంత ఎక్కువగా మార్కెట్లోకి వస్తే అంత ఎక్కువ డిమాండ్ వాటికి ఉంటుంది'' అన్న సూత్రాన్ని అతను విశ్వసించాడు. కాని లాభాలు రావాలంటే ఎక్కువ సరుకులు ఉత్పత్తి చేసినంతమాత్రాన సరిపోదు. అవన్నీ అమ్ముడుపోయినప్పుడే వాస్తవంగా పెట్టుబడిదారుడికి లాభం పోగుపడుతుంది. ఉత్పత్తి అయిన సరుకులన్నీ అమ్ముడుపోవాలంటే అది కొనుగోలుశక్తిని బట్టి ఉంటుంది. కొనుగోలుశక్తి వేతనాల రేటుని బట్టి ఉంటుంది. మరి వీలైనంత తక్కువ స్థాయిలో వేతనాలను ఉంచాలని పెట్టుబడిదారులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ నిరంతరం పెరగడానికి గ్యారంటీ ఏమిటి? అందుచేత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దాని ఫలితంగా నిరుద్యో గం పెరిగితే, ఆ విధంగా ఉద్యోగాలను పోగొట్టుకున్న వారిని తిరిగి ఉద్యోగాలలో పెట్టుకోడానికి పెట్టుబడి దారీ వ్యవస్థలో ఎటువంటి ఏర్పాటూ లేదు. అందుచేత పెట్టుబడిదారీ విధానం ప్రారంభదినాల్లో కార్మికులకు నష్టం కలిగించినా, తర్వాత అది పుంజు రకున్నాక కార్మికులకు మేలు జరుగుతుందన్న రికార్డో వాదనకు ఎటువంటి సైద్ధాంతిక ప్రాతిపదికా లేదు.
కాని వాస్తవ చరిత్ర చూస్తే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాక అక్కడి కార్మికుల స్థితిగతులు మెరుగుపడ్డాయి. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? యూరప్ ఖండంలోని కార్మికులు చాలా భారీ సంఖ్యలో ''కొత్త ప్రపంచానికి'' (అంటే అమెరికా ఖండానికి) వలసలు పోయారు. ఈ వలసలు మొదటి ప్రపంచయుద్ధం మొదలయేదాకా (1914) కొనసాగాయి. 19వ శతాబ్దంలో నెపోలియన్ యుద్ధం నాటినుండి మొదటి ప్రపంచయుద్ధం దాకా మధ్య కాలంలో దాదాపు 5కోట్లమంది యూరపియన్ కార్మికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు వలసలు పోయారని ఆర్థికవేత్త ఆర్థర్ లూయిస్ అంచనా వేశాడు.
ఈ వలసలు ''అధికవేతన'' వలసలు. అంటే ఆ కార్మికులు అంతవరకూ ఉండిన స్వస్థలాల్లోనూ, అదే విధంగా వాళ్ళు వలసలు పోయిన కొత్త ప్రదేశాల్లోనూ వేతనాలు అధికస్థాయిలో ఉన్నాయి. ఇదే కాలంలో ''అల్పవేతన'' వలసలు కూడా మరోవైపు కొనసాగాయి. ఈ రెండో తరహా కార్మిక వలసలు ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలైన ఇండియా, చైనా వంటి దేశాలనుండి ఫిజీ, మారిషస్, వెస్ట్ ఇండీస్, తూర్పు ఆఫ్రికా, నైరుతి అమెరికా వంటి ఉష్ణ, సమశీతోష్ణ ప్రదేశాలకు జరిగాయి. ఇక్కడ ఆ కార్మికుల స్వంత దేశాలలోనూ, వాళ్ళు వలసలు వచ్చిన దేశాల్లోనూ వేతనాలస్థాయి తక్కువగానే ఉంది. ఈ కార్మికులను శ్వేతజాతి కార్మికులు వలసలు వచ్చిన ప్రదేశాలకు రానివ్వలేదు. (ఇప్పటికీ కోరుకున్నవారందరినీ అక్కడికి వలసలు రానివ్వడం లేదు)
ఇలా ఒకవైపు అధికవేతన వలసలు, మరోవైపు అల్పవేతన వలసలు ఎందుకు జరిగాయి? దీనికి లూయిస్ చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ కాలంలో బ్రిటన్‌లో వ్యవసాయ విప్లవం జరిగి, తక్కిన యూరప్‌కంతటికీ విస్తరించింది అని, దాని వలన గ్రామీణ కార్మికులకు యూరప్‌లో ఆదాయాలు బాగా పెరిగాయని అతను అన్నాడు. కాని ఆ విధమైన వ్యవసాయ విప్లవం ఏదీ బ్రిటన్‌లో జరిగిన దాఖలాలు లేవు. మరి అసలు కారణం ఏమిటి? అధికవేతన వలసల విషయంలో జరిగినదేమంటే యూరప్ నుండి వలసలు పోయినవారు అమెరికా, ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలలోని స్థానికులను వారి వారి భూములనుండి తరిమివేసి ఆక్రమించుకుని వ్యవసాయదారులుగా స్థిరపడి అధిక ఆదాయాలు ఆర్జించసాగారు. మరోవైపు యూరప్‌లో కార్మికవర్గం సంఖ్య వలసల కారణంగా తగ్గిపోయింది. అందుచేత ఇక్కడ కూడా కార్మికుల వేతనాలను పెంచకతప్పలేదు. ఒక శీతల దేశం నుండి మరొక శీతల దేశానికి జరిగిన వలసలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1820 నుండి 1915 మధ్య బ్రిటన్‌లో ఎంత మేరకు జనాభా పెరిగిందో, అందులో సగం మేరకు అక్కడినుండి వలసలు పోయారు. ఇటువంటి స్థాయిలోనే మన దేశంలో కూడా వలసలు జరిగివుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివకూ దాదాపు 50 కోట్ల మంది వలసలు పోయివుండాలి. (యూరప్‌లో జరిగిన వలసల ప్రభావం ఎంత బలంగా ఉండిందో బోధపడడానికి ఈ పోలిక చూపడం జరిగింది.) ఆ విధంగా ఇతర దేశాలకు తరలిపోవడానికి యూరపియన్ కార్మికులకు లభించిన అవకాశాలు వారి స్థితిగతులు బాగా మెరుగుపడడానికి దోహదం చేశాయే తప్ప పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి క్రమంలో స్వతఃసిద్ధంగా కార్మికుల స్థితి గతులను మెరుగుపరిచే ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఇలా వేరే దేశాలకు పోయి అక్కడి స్థానికులను వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకునే అవకాశం సామ్రాజ్యవాద దురాక్రమణ స్వభావం నుంచి వచ్చింది.
సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా సంపన్న దేశాలలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపడే అవకాశం వచ్చింది. ఇది కేవలం స్థానికులనుండి భూములను లాక్కోవడం ద్వారా మాత్రమే కాదు. సంపన్నదేశాలలో ఉత్పత్తి అయిన సరుకులకు డిమాండ్ కల్పించడానికి, తద్వారా సంపన్న దేశాలలో అదనపు ఉద్యోగాలు కల్పించడానికి సామ్రాజ్యవాదులు తాము ఆక్రమించుకున్న వలసలలో చేతివృత్తిదారులను, చిన్న తరహా ఉత్పత్తిదారులను భారీ స్థాయిలో దెబ్బ తీశారు. అంటే ఒకవిధంగా సామ్రాజ్యవాదం సంపన్నదేశాలలోని నిరుద్యోగాన్ని వలసదేశాలలోకి ఎగుమతి చేసిందన్నమాట. ఆ వలసదేశాలకు తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోగలిగిన సత్తా లేదు. అవన్నీ సంపన్నదేశాల ఆధీనంలోనే ఉండేవి.
అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందితే మొదట్లో కార్మికులు నష్టపోయినా, ఆ తర్వాత వారూ ప్రయోజనం పొందుతారన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. సామ్రాజ్యవాద దోపిడీ పద్ధతుల కారణంగా ఒకానొక ప్రత్యేక, చారిత్రక పరిస్థితుల్లో యూరప్ ఖండంలోని కార్మికుల స్థితిగతులు పైన వివరించిన విధంగా మెరుగుపడడం సంభవించిందే తప్ప అదేదో పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో జరిగినది కాదు. దీనిని బట్టి యూరప్ ఖండంలోని కార్మికులు సామ్రాజ్యవాద దోపిడీ పట్ల మెతకగా ఉంటారన్న అభిప్రాయానికి రాకూడదు. సామ్రాజ్యవాద దోపిడీ విధానం నడిచే తీరు . ఇలానే ఉంటుంది.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్