Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల సంఘటనకు మించి, వివిధ రాష్ట్రాలలో, దేశం వ్యాపితంగా ప్రజలను దహిస్తున్న జీవనోపాధి సమస్యలపై పోరాటాలను అభివృద్ధి చేయటంలోను, వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ నిర్మించటంలో ఏప్రిల్ 5 ర్యాలీ, నిర్ణయాత్మకమైనది. రైతుల, కార్మికుల ఐక్యపోరాట వేదికలైన సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాటు ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్లు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగట్టి, దానికి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన కార్యాచరణను ఇప్పటికే ప్రకటించాయి. ఇది భారత దేశ ప్రజానీకానికి, ముఖ్యంగా కష్టజీవులకు అందిస్తున్న స్పష్టమైన రాజకీయ మార్గనిర్దేశం. నయా ఉదారవాద దశను అధిగమించి, నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్ర సాధనకు ఇది మార్గం చూపుతుంది. ఆ మార్గంలోనే చారిత్మాత్మక ఏప్రిల్ 5 సామూహిక కార్యాచరణ విజయవంతానికి మనవంతు కర్తవ్యం నిర్వహిద్దాం.
ఏప్రిల్ 5న జరుగనున్న కార్మిక, వ్యవసాయ కార్మిక రైతు సంఘర్ష ర్యాలీ దేశ ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు ఊపందుకోటానికి నాంది పలకనున్నది. అంతర్జాతీయ పెట్టుబడిదార్ల ఆదేశాలకు లోబడిన పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను దహిస్తున్న జీవనోపాధి సమస్యలపై వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ నిర్మాణం అత్యంత కీలకం.
స్వాతంత్య్రానంతర కాలంలో ఎన్నడూ లేనంత భారీ సమీకరణతో ఈ కార్మిక-రైతు ప్రదర్శన జరుగనున్నది. రెండవది, పాలక వర్గాల విధానాలతో ముడిపడివున్న స్థానిక సమస్యలు, ఉమ్మడి సమస్యలపై నిర్దిష్ట డిమాండ్లతో కార్మిక-రైతుకూటమి వర్గ ఐక్యతతో పోరాటాలు సాగించనున్నట్టు ఈ ప్రదర్శనలో ప్రకటించ నున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న వ్యవసా యక సంక్షోభాన్ని అధిగమించటానికి, అలాగే అంతర్జాతీయ విత్తపెట్టుబడి, గుత్త పెట్టుబడి నియంత్రణ కింద నడుస్తున్న అత్యంత దోపిడీి, దుర్మార్గ స్వభావంగల నయాఉదారవాద పాలనను అంతమొందించటానికి పునాదివర్గాల మధ్య ఐక్యత, వాటి నాయకత్వాన నిర్ధిష్టమైన భారీ పోరాటాలు చేయటం అవసరం. స్వాతంత్య్రానంతరం బడా పెట్టుబడిదారీవర్గం, భూస్వామ్యవర్గం సంయుక్తంగా సామ్రాజ్యవాదంతో జతకూడి భారతదేశంలో పాలకవర్గంగా అవతరించింది. ఈ శక్తులు భూస్వామ్య వ్యవస్థలోని జమిందార్లను పెట్టుబడిదారీ భూస్వాములు మార్చటానికి ప్రయత్నాలు చేశాయి. స్వాతంత్య్రంవచ్చి, గడిచిన 75సంవత్సరాలలో భారతదేశం ఆధునిక పారిశ్రామిక సమాజంగా అభివృద్ధి చెందటానికి పాలకవర్గాల విధానాలు అడ్డంకి అయినాయి.
దేశపాలనలో ప్రభుత్వ నియంత్రణ అంతమై, నయా ఉదారవాద విధానాలు ఆరంభమవటంతో, అంతర్జాతీయ విత్తపెట్టుబడి ఆధిపత్యం పెరిగింది. దానితో భారత గుత్తపెట్టుబడి కూడా మమేకమైంది. వ్యవసాయానికి అవసరమైన వస్తుసామాగ్రి ధరలు హద్దూపద్దు లేకుండా పెరగటంతో పాటు ద్రవ్యోల్బణం వలన జీవనవ్యయం పెరిగింది. వీటికితోడు అన్ని వ్యవసాయోత్పత్తుల ధరలు పతనం కావటంతో భారత వ్యవసాయరంగం పై కార్పొరేట్ల పట్టు బిగిసింది. వ్యవసాయం అనేది నష్టదాయక వృత్తిగా మారిపోయింది. రైతు కుటుంబాలు అప్పుల విషవలయంలో చిక్కుకున్నాయి . రైతులు, వ్యవసాయ కార్మికుల్లో ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయి. నయా ఉదారవాద పెట్టుబడిదారి వ్యవస్థ కింద వ్యవసాయక సంక్షోభంలో గోడ్డుగోద, భూమిపుట్ర కోల్పోయి పీకల్లోతు అప్పుల్లోకూరుకుపోయి దారుణమైన దారిద్య్రంలోకి రైతులు దిగబడ్డారు. ఈ విధంగా దుర్భర దారిద్య్రంలోకి నెట్టబడిన రైతులు వలస కార్మికులుగా మారుతున్నారు. ఇలా వలస కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరిగి ఇప్పుడు 23 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద ఏకైక వర్గంగా ఉన్నది.
1999-2004 సంవత్సరాల మధ్య ఎన్డీఏ నాయకత్వన ఉన్న వాజ్పేయి ప్రభుత్యం వ్యవసాయక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతులిచ్చింది. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు, వ్యవసాయ రంగంలో బహుళజాతి కంపెనీల, గుత్త పెట్టబడిదారీ కార్పొరేట్ల ప్రవేశానికి ఆ ప్రభుత్వం లాకులెత్తేసింది. మహారాష్ట్రలోని విదర్భ, కేరళలోని వయనాడ్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం లాంటి కొన్ని ప్రాంతాలలో మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ఘడ్ లాంటి రాష్ట్రాలలో అప్పులబాధ, రైతు ఆత్మహత్యలు పెరిగాయి. దీని పర్యవసానంగా రైతాంగంలో ఆగ్రహావేశాలు పెరిగి ప్రతిఘటనా పోరాటాలు నిర్మించ వలసిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా వ్యవసాయక సంక్షోభం ఒక ముఖ్యమైన తక్షణ రాజకీయ సమస్యగా దేశ ఎజెండాలోకి వచ్చింది.
2004 ఎన్నికలలో ఎన్డీఏ వాజ్పేయి ప్రభుత్వం ఘోర పరాజయం పాలైంది. రైతాంగంలోను, గ్రామీణ ప్రజలలోను పెరిగిన అశాంతి ఈ ఓటమికి ప్రధాన కారణం. ఎన్నికల చరిత్రలో మొదటిసారి 64మంది వామపక్ష, ప్రజాస్వామిక కూటమి సభ్యులు పార్లమెంటుకు ఎన్నికైనారు. వీరి మద్దతుతో కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా మొదటి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ యూపీఏ-1 ప్రభుత్వం తీవ్రంగా ఉన్న వ్యవసాయక సంక్షోభం పరిష్కరించటానికి అనేక చర్యలు తీసుకున్నది. ఎం.ఎస్ స్వామినాధన్ ఛైర్మన్గా 2004లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ (ఎన్సీఎఫ్) ఏర్పాటుచేయటం, 'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, రూ.70వేల కోట్లతో రైతుల రుణమాఫీ వంటివి ఆ చర్యలలో కొన్ని.
అన్ని పంటలకు పంట సేకరణ హామీని ఇస్తూ, పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లుతో ఎం.ఎస్.పి.ఎ జ2ం50 కనీస మద్దతు ధరను ప్రతిపాదించుతూ స్వామినాధన్ కమిషన్ 2006లో తన నివేదికను సమర్పించింది. అయితే, 2014 దాకా అధికారంలో ఉన్న యూపీఏ -1, యూపీఏ- 2 ప్రభుత్వాలు ఈకీలకమైన సిఫార్సులను అమలు చేయలేదు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పాలకపార్టీలపై అంతర్జాతీయ విత్త పెట్టుబడి- గుత్తపెట్టుబడికి ఉన్న బలమైనపట్టు దీనికి కారణం. అంతేకాకుండా, బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీల ప్రయివేటీకరణ, పెట్రోలియం ఉత్పత్తల ధరలపై నియంత్రణ ఎత్తివేయటం మొదలైన కార్పొరేట్ అనుకూల విధానాలను చేపట్టింది. ఈ విధానాలను రైతుసంఘాలు, కార్మికసంఘాలు, వామపక్ష, ప్రజాస్వామికశక్తులు పార్లమెంటు లోపల, బయటా తీవ్రంగా వ్యతిరేకించాయి. అనేక ప్రభుత్వ పధకాలలో కార్పొరేట్ కంపెనీల అవినీతి విశంఖలంగా సాగటంతో యూపీఏ- 2 ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.
పంటలన్నింటికి కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపై ఒకటిన్నర రెట్లు (జ2ం50), ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానునే హామీలను బీజేపీ తన ఎన్నికలు మ్యానిఫెస్టోలో చేర్చుకుని ప్రచారం చేసుకుంది. ఈ హామీలు గ్రామీణప్రాంత ప్రజలలో, మరీ ముఖ్యంగా వ్యవసాయక సంక్షోభం బారిన పడిన ప్రాంతాలలో బీజేపీ మద్దతు కూడగట్టుకోవటానికి ఉపయోగ పడడ్డాయి. అయితే, ఇచ్చిన హామీలకు విరుద్ధంగా గత ఎనిమిదేళ్ళ మోడీపాలనలో పంటలకు జ2ం50 కనీస మద్దతు ధరను అమలు పరచలేదు, నిరుద్యోగం స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేనంతగా తారస్థాయికి చేరింది. పాలకవర్గపార్టీలలో ప్రధాన పార్టీగావున్న బీజేపీ - ఆర్ఎస్ఎస్లు అంతర్జాతీయ విత్తపెట్టుబడి - గుత్త పెట్టుబడుల ఒత్తిడికి లొంగిపోయింది, నయాఉదారవాద విధాన సంస్కరణల అమలు వేగాన్ని పెంచింది.
ఈ విధానాలు రైతాంగంలో పేదరికాన్ని మరింత పెంచాయి. గ్రామాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరిగాయి. ప్రయివేటీకరణ విచ్చలవిడిగా సాగించటం, మొత్తం ఆర్ధికవ్యవస్థను కార్పొరేట్లకు వీలుగా ప్రణాళిక ప్రక్రియను ధ్వంసం చేశారు. కార్పొరేటీకరణే లక్ష్యంగా పార్లమెంటులో ఏ కొద్దిపాటి చర్చకు అనుమతించకుండా మూడు వ్యవసాయ చట్టాలు చేశారు. ప్రపంచ దేశాల దారిద్య్ర సూచీలో 2014లో 56వ స్థానంలో ఉన్న భారతదేశం 2021లో 107వ స్థానానికి చేరింది. కార్మికసంఘ హక్కులు, కనీస వేతనం, ఉద్యోగ భద్రతలు నిరాకరించే లక్ష్యంతో 4 లేబర్ కోడ్స్ ను తెచ్చారు. గ్రామీణ ఉపాధి చట్టం కేటాయింపులు క్రమంగా రూ.30 వేల కోట్లకు తగ్గించారు, హామీగా ఇచ్చిన 100 సగటు పనిదినాలను హీనస్థాయికి 42 పనిదినాలకు తగ్గించారు, పనిదినానికి ఇచ్చే వేతనం కూడా నిరంతరం పెరుగుతున్న ధరలతో పోలిస్తే అత్యల్పం. జనవరి 1, 2023 నుంచి రూ.2 సబ్సిడీ బియ్యం, రూ.3 సబ్సిడీ గోధుమలు ఎత్తివేయటం ద్వారా పేదలపై దాడి తారస్థాయికి చేరింది. 2023-24 బడ్జెట్లో ఆహార సబ్సిడీకి రూ.90 వేల కోట్ల భారీ కోత పెట్టటంతో ఆహారభద్రతకు పెనుప్రమాదం ముంచుకొచ్చింది. ఇది ఆకలికి, ఆకలిచావులకు దారితీస్తోంది. దీనికి ప్రతిగా నయా ఉదారవాద దాడులను ప్రతిఘటించటానికి రైతులు, గ్రామీణ కార్మికుల చొరవతో కార్మిక-రైతు కూటమి ఏర్పడింది. ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు), సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు)లు స్వతంత్రంగాను, అలాగే ఇతర సంఘాలతో కలిసి నిరంతరం పోరాటాలు సాగిస్తున్నాయి. ఈ పోరాటాలను, సమస్యల ఆధారంగా ఏర్పడిన ఐక్యవేదికలైన భూమి అధికార్ ఆందోళన్ (బిఎఎ), ఆల్ ఇండియా కిసాన్ సమన్వయ సమితి (ఎఐకెఎస్సిసి), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) సంస్థలు పోరాటాలు సాగించాయి. మహారాష్ట్రలో సాగిన రైతుల దీర్ఘయాత్ర ప్రపంచ వ్యాపితంగా శ్రమజీవుల దృష్టిని ఆకర్షించింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా 2018 సెప్టెంబరు 5న రెండు లక్షల మందితో సాగిన కార్మిక-రైతు సంఘర్ష ర్యాలీ కార్మికులు, రైతుల ఉత్సహాన్ని పెంచటంలో కీలకంగా ఉంది. ఐక్య కార్మిక ఉద్యమం ఇచ్చిన చురుకైన మద్దతుతో సంయుక్త రైతాంగ ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో చారిత్రక విజయం సాధించింది. గత మూడు దశాబ్దాలుగా ఉన్న నయా ఉదారవాద శక్తులకు ఇది వణుకు పుట్టించింది. అంతేగాక, నరేంద్రమోడీ ప్రభుత్వం, బీజేపీ - ఆర్ఎస్ఎస్లు కలిసి ప్రజలపై సాగిస్తున్న మతోన్మాద, నిరంకుశ దాడుల కీలక సందర్భంలో కార్మిక-కర్షక మైత్రిబంధం ప్రజాస్వామ్య పరిరక్షణలో నిర్ణయాత్మకంగా నిలిచింది.
2021లో కేరళలో ఎల్డిఎఫ్ తిరిగి ఎన్నిక కావడం అఖిల భారత స్థాయిలో కార్మిక, కర్షక ఉద్యమం సాధించిన నిర్ణయాత్మక విజయం. రోజు కూలీ కార్మికులకు అత్యధిక కనీస లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వరి పండించే రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఆర్ఎస్ఎస్-బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూడటం, ఆర్థిక వనరులలో రావాల్సిన వాటాను నిరాకరించడం, కేరళ ప్రభుత్వం వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై బురదజల్లటం చేస్తున్నది. ప్రస్తుతం దేశ ఆర్ధిక, రాజకీయ రంగాలలో ఆధిపత్యం వహిస్తున్న కార్పొరేట్లపై విజయం సాధించటానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, సమాఖ్యతత్వాన్ని, లౌకికపునాదిని కాపాడుకోవటానికై బీజేపీ-ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజల ఉమ్మడి వేదికను కార్మికుల, రైతులు చొరవతో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు తమ అధీనంలోకి తెచ్చుకోవటం అవసరం.
ఈవిధంగా, ఎన్నికల సంఘటనకు మించి, వివిధ రాష్ట్రాలలో, దేశం వ్యాపితంగా ప్రజలను దహిస్తున్న జీవనోపాధి సమస్యలపై పోరాటాలను అభివృద్ధి చేయటంలోను, వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ నిర్మించటంలో ఏప్రిల్ 5 ర్యాలీ, నిర్ణయాత్మకమైనది. రైతుల, కార్మికుల ఐక్యపోరాట వేదికలైన సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాటు ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్లు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగట్టి, దానికి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన కార్యాచరణను ఇప్పటికే ప్రకటించాయి. ఇది భారత దేశ ప్రజానీకానికి, ముఖ్యంగా కష్టజీవులకు అందిస్తున్న స్పష్టమైన రాజకీయ మార్గనిర్దేశం. నయా ఉదారవాద దశను అధిగమించి, నిజమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్ర సాధనకు ఇది మార్గం చూపుతుంది. ఆ మార్గంలోనే చారిత్మాత్మక ఏప్రిల్ 5 సామూహిక కార్యాచరణ విజయవంతానికి మనవంతు కర్తవ్యం నిర్వహిద్దాం.
- పి. కృష్ణ ప్రసాద్