Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలంలో వరినాట్లు, మిరుప తోటలు వివిధ పంటలకు సంబంధించిన వ్యవసాయ పనులకు సమయం ఆసన్నమైంది. ఈ కాలంలో రెక్కడితే కానీ డొక్కాడని జీవితాలను గడుపుతూ నిరుపేద ప్రజలు తమ గ్రామాల్లోని వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. బతుకుదెరువు కోసం ఎక్కువ కూలీ డబ్బులకు ఆశపడి తమ చుట్టూపక్కల గ్రామాలకు ఆటోలు, టాటాఏసీలు, టాటా మ్యాజిక్ మొదలయిన వాహనాలలో కూలీ నిమిత్తం వెళ్తున్నారు. కొన్ని సార్లు మండలాలను సైతం దాటి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు కూలీకి వెళ్తున్నారు. ఈ తరుణంలో వాళ్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలలో లెక్కకుమించి మందితో ప్రధాన రహదారుల వెంట ప్రయాణం చేస్తున్నారు. గతేడాది హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట గుట్ట వద్ద మూల మలుపుల వద్ద కూలీలతో వెళ్తూ ఉన్న ఆటో ట్రాలీ లారీ ఢ కొట్టడంతో నలుగులు కూలీలు అక్కడే మరణించారు. అనేక మంది కూలీలు కాలు, చేతులు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సంఘటన అందరినీ కలచి వేసింది. తాజాగా వారం క్రితం పరకాల ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను వెనక నుండి వేగంగా వస్తున్న కార్ ఢ కొనడంతో ఇద్దరు కూలీలు చనిపోయారు. మిగతా వారికి కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 7గంటల సమయంలో మధ్యాహ్నం ఒంటి గంటకి, సాయంత్రం 5 నుండి 6 గంటల వేళలో ఈ వ్యవసాయ కూలీల వాహనాల రద్దీ పలు గ్రామాల్లో జోరుగా కనిపిస్తుంది. ఎలాంటి భయం లేకుండా లెక్కకుమించిన కూలీలతో వాహనాలలో ప్రయాణం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి నిరుపేద కూలీల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ పరిస్థితికి సంబంధిత వాహనాదారులకు అడ్డుకట్టవేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. వాహనాలలో తగిన మోతాదు కూడిన మందితో ప్రయాణాలు చేసేలా డ్రైవర్లకి నిబంధనలు విధించాలి. అలాగే వాహనాలకు సంబంధించిన కండీషన్, వివిధ ధృవపత్రాలను పూర్తి స్థాయిలో సంక్రమంగా ఉండేలా తనిఖీలు చేయాలి. అదే విధంగా రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలలో ప్రధాన రహదారుల వెంట ప్రయాణిస్తున్న భారీ వాహనాల విషయంలో సమయానుకూలమైన ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలి. రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాలి. మూల మలుపుల వద్ద హెచ్చరిలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
- కామిడి సతీష్ రెడ్డి,9848445134.