Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరు మరింత తీవ్రం అవుతున్నది. చైనాతో సహా ఇతర దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా పూనుకోవటంతో ఈ రంగంలో ముందున్న దేశాలు తమవైన జాగ్రత్తలు తీసుకుం టున్నాయి. మన దేశంలో సెమి కండక్టర్లు లేదా చిప్స్ తయారీకి మద్దతు ఇస్తామని అమెరికా చెప్పినప్పటికీ దాని చర్యలు అనుమానా స్పదంగా ఉండటంతో మన దేశం కూడా ప్రపంచ వాణిజ్య సంస్థలో అభ్యంతరం తెలిపింది. గతేడాది అక్టోబరులో అమెరికా వాణిజ్యశాఖ చైనాకు చిప్స్, సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ను తయారు చేసే యంత్రాలను ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. అంతటితో ఆగితే అదొక దారి, ఇతర దేశాలు కూడా అలాగే ఉండాలని లేకుంటే తమ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించింది. ఈ ఆంక్షలు తమ న్యాయమైన హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్లు డిసెంబరు నెలలో ప్రపంచవాణిజ్య సంస్థలో చైనా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం అప్పీళ్ల కమిటీ ఏర్పాటుపై వివిధ దేశాల మధ్య ఏకీభావం కుదరకపోవటంతో అది పని చేయటం లేదు.అందువలన చట్టపరంగా జరిగేదేమీ ఉండదు. కమిటీ పునరుద్దరణ జరిగిన తరువాతనే దాని మీద విచారణ జరుగుతుంది.
చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో డోనాల్డ్ ట్రంప్ సర్కార్ విధించిన పన్నులు న్యాయసమ్మతం కాదని 2022 డిసెంబరు తొమ్మిదిన ప్రపంచ వాణిజ్య సంస్థ తీర్పు చెప్పింది. ఈ తీర్పు తరువాతనే చిప్స్ నిషేధంపై చైనా ఫిర్యాదు దాఖలు చేసింది. దీని మీద అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిప్స్ మీద విధించిన ఆంక్షలు తమ జాతీయ భద్రతకు చెందిన అంశాలని చైనాకు ముందే తెలిపామని, ఇలాంటి అంశాలపై తీర్పు చెప్పేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ సరైన వేదిక కాదని అన్నాడు. ఇంతకు ముందు చిప్స్‌ను, వాటిని తయారు చేసే యంత్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్నడూ జాతీయ భద్రత గురించి అమెరికా, మరొక దేశం ఎన్నడూ ప్రస్తావించలేదు. షీ జింపింగ్ అధికారానికి వచ్చిన తరువాత పశ్చిమ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని, అలాంటి వాటి మీద ఎక్కువగా పరిశోధనలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆంక్షలకు పూనుకున్నాడు. చైనా హువెయి టెలికాం కంపెనీని అడ్డుకోవటంతో అమెరికా అసలు రంగు వెల్లడైంది.చైనాపై సాంకేతిక పోరులో కలసి రావాలని జపాన్, నెదర్లాండ్స్‌ను కూడా అమెరికా కోరింది. చివరకు చైనాలో ఉన్న కంపెనీలకు సేవలందించే సిబ్బందిని కూడా అమెరికా కంపెనీలు తగ్గించాయి. ఎవరైనా చైనా కంపెనీల్లో పని చేసేందుకు వెళ్తే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా ఆంక్షలు విధించింది.
ప్రపంచ చిప్ మార్కెటో ఆధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. అందుకోసం 280 బిలియన్ డాలర్ల పథకాన్ని రచించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే చిప్స్‌ను అనుమతి లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన ప్రస్తుతానికి చైనాను దెబ్బతీసేందుకు ఉద్దేశించినప్పటికీ తన దారికి రాని ఏదేశం మీదనైనా ఆ నిబంధనను రుద్దే అవకాశం ఉంది. గతంలో విదేశీ ఉత్పత్తుల నిబంధనల పేరుతో చైనా కంపెనీ హువెయి టెలికాం ఉత్పత్తులను అమెరికాకు దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించింది. రష్యాకు చిప్స్ ఎగుమతి నిలిపివేసింది. ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా భంగకరమే అని గుర్తించిన మన ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన అమెరికా వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో అభ్యంతరాన్ని నమోదు చేసింది. అమెరికా కోసం ఉత్పత్తి చేసే సెమికండక్టర్లకు తోడ్పడే ప్రోత్సాహకాల పేరుతో అమెరికా రూపొందించిన ఒక చట్టం ప్రకారం ఇవ్వనున్న రాయితీలు ప్రపంచమంతటా మరింత పోటీని పెంచుతాయని, నష్టాన్ని కలిగిస్తాయని ఈ రంగంలో ఉత్పత్తిదారులు ప్రత్యేకించి వర్దమాన దేశాలలో వారికి సమాన అవకాశాలు కలిగించేందుకు ప్రతి పాదన లేమిటని మన దేశం ప్రశ్నించింది. వివిధ సందర్భాలలో ఇతర దేశాల సబ్సిడీ విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అమెరికా తన వైఖరిని మార్చుకుందా అంటూ మన దేశ వాదనకు మద్దతుగా చైనా కూడా గొంతు కలిపింది. తమ దేశం రూపొందించుకున్న చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థకు లోబడే సబ్సిడీలు ఇస్తున్నట్లు అమెరికా సమర్థించుకుంది.
అనేక దేశాలు అమెరికా పోకడలను గమనించి తాము కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. తమ దేశంలో చిప్స్ ఉత్పత్తిదారులకు పన్నుల రాయితీ ఇవ్వాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. దానికి గాను కొరియా చిప్స్ చట్టాన్ని తెచ్చింది. రక్షణాత్మక చర్యల వలన తమ కంపెనీలకు అమెరికా నుంచి నిధులు రావటం కష్టమని మంత్రి ప్రకటించాడు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీ వర్తిస్తుంది. గతంలో తగ్గింపు ఎనిమిది శాతం ఉన్నదానిని ఇప్పుడు 15శాతానికి పెంచారు. వచ్చే ఇరవై సంవత్సరాల్లో 230 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఐరోపా కమిషన్ కూడా అమెరికా మాదిరే 2022 చిప్స్ చట్టాన్ని చేసింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పదిశాతంగా ఉన్న ఐరోపా వాటాను 2030 నాటికి కనీసం ఇరవై శాతానికి పెంచేందుకు దాన్ని తెచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఐరోపాలోనే చిప్స్ ఉత్పత్తి చేయటం వాటికి ప్రోత్సాహకాల చుట్టూ దానిలో నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం 2030 నాటికి 17బిలియన్ డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించారు.
డిజిటలైజేషన్ వంటి ఆధునిక ఉత్పత్తుల నుంచి మిలిటరీ పరికరాల వరకు చిప్స్ ప్రాణవాయువు వంటివి. అందువలన చైనాకు దాన్ని నిలిపివేస్తే తమ దారికి వస్తుందని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా భావిస్తున్నాయి. పశ్చిమ దేశాల కంపెనీలకు ఫౌండ్రిగా పని చేసేందుకు ఇంకే మాత్రం చైనా సిద్దంగా లేదని స్వంతంగా రూపొందించేందుకు పూనుకుందని ఐరోపా ఐడిసి పరిశోధనా డైరెక్టర్ ఆండ్రూ బస్ వంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆధునిక చిప్స్ తయారీలో తైవాన్‌లోని టిఎస్ఎంసి కంపెనీ 80శాతం వాటాను కలిగి ఉంది. చైనా బలవంతంగా దాన్ని విలీనం చేసుకొనేందుకు పూనుకుంటే చైనాకు దక్కకుండా అక్కడి చిప్స్ పరిశ్రమలను ధ్వంసం చేస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఒక్క చిప్స్ రంగాన్నే కాదు విద్యుత్ వాహనాలకు సైతం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు పూనుకుంది. చైనాపై అమెరికా జరుపుతున్న సాంకేతిక దాడిలో తాత్కాలికంగానైనా పొగపెట్టే నాలుగు అంశాలున్నాయి. 1.ఆధునిక కృత్రిమమేధ చిప్స్‌ను చైనాకు చేరకుండా అడ్డుకోవటం, 2. అమెరికాలో రూపొందించిన చిప్ రూపకల్పన సాఫ్ట్‌వేర్‌ను చైనాకు అందకుండా చూడటం, 3.చిప్స్‌ను తయా రు చేసేయంత్రాలు చైనాకు చేరకుండా చేయటం, 4. చైనా చిప్స్ తయారీకి అమెరికాలో రూపొందిన విడి భాగాలు అందకుండా చూడటం. ప్రపంచం లోని ఇతర అమెరికా మిత్ర దేశాల నుంచి కూడా ఇదే విధంగా అడ్డుకోవటం ప్రస్తుతం బైడెన్ పనిగా ఉంది. పౌర అవసరా లకు ఉపయోగపడే వాటిని కూడా చైనా మిలిటరీకి వాడుతున్నదనే ప్రచారం మరోవైపు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ చిప్స్ మార్కెట్ విలువ 2022లో 574 బి.డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఇతర రంగాలన్నీ మందగించి నప్పటికీ చిప్స్ మార్కెట్ పెరగటం వాటి అవసరాన్ని వెల్లడిస్తున్నది. ఈ మొత్తంలో చైనా ఒక్కటే 180 బి.డాలర్ల మేరకు కొనుగోలు చేస్తున్నది, 2021తో పోలిస్తే 6.2శాతం తగ్గినప్పటికి ఇంత వాటా కలిగి ఉంది కనుకనే దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దెబ్బతీయాలని అమెరికా కూటమి చూస్తున్నది. 1990లో ప్రపంచ చిప్స్ రంగంలో అమెరికా వాటా 37శాతంగా ఉన్నది 2021 నాటికి 12కు పడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వాటి ప్రాధాన్యత ఎంతో పెరిగింది కనుకనే తిరిగి పూర్వపు స్థితికి చేరాలని, తద్వారా ప్రపంచ మార్కెట్‌ను శాసించాలని అమెరికా కలలు కంటున్నది. ఇటీవలి కాలంలో చైనా ఈ రంగంలో పురోగమించినప్పటికీ ఆధునిక చిప్స్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడే స్థితిలోనే ఉంది. కొన్ని ఆధునిక ఉత్పత్తులు జపాన్, నెదర్లాండ్స్, అమెరికాలోని కొన్ని కంపెనీల చేతుల్లో ఉన్నాయి.
ఆధునిక సాంకేతికరంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఎప్పటికైనా పశ్చిమ దేశాల నుంచి సవాలు ఎదురవుతుందని గమనించిన చైనా 2015లో చిప్స్ రూపకల్పన, ఉత్పత్తికి పూనుకుంది. అంతకు ఏడాది ముందే 21బిలియన్లు, 2019లో 35బి.డాలర్లు నిధులు కేటాయించింది, 2020 నాటికి ఈ మొత్తం 150 బి.డాలర్లని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఎక్కువ భాగం పరిశోధనకే వెచ్చించారు. తాజా పరిణామాలతో మరింతగా బడ్జెట్‌ను పెంచేందుకు పూనుకుంది. స్థానిక పరిశ్రమలకు 143 బి.డాలర్ల మేర సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు డిసెంబరులో వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం చైనాను అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు ఒక్కటిగా ముందుకు పోవాలని నిర్ణయించాయి. ఇరవై మూడు రకాల ఉత్పత్తులను చైనాకు విక్రయించకూడదని జపాన్ శుక్రవారం నాడు ప్రకటించింది. మిలిటరీ అవసరాలకు వాడకుండా చూసేందుకే ఈ పని చేసినట్లు చెప్పుకుంది. అమెరికా ప్రారంభించిన ఈ పోరుతో వినియోగదారులకు ఉపయోగం లేకపోగా భారం పడుతుందని తైవాన్ కంపెనీ ప్రతినిధి హెచ్చరించాడు. అక్కడ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ గనుక ధరలు పెరుగుతాయన్నాడు. కనీసం 40శాతం ధరలు పెరగవచ్చని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఐఫోన్ 14ప్లస్ ధర ఉత్పత్తి ఖర్చు 527 డాలర్లు కాగా దానిలో 54శాతం చిప్స్‌కే చెల్లించాల్సి ఉంది.దీనిలో 5జి మోడెం ధర 47 డాలర్లు కాగా, 618 డాలర్ల శాంసంగ్ 22 ప్లస్‌లో మోడెం ధర 193, గూగుల్ పిక్సెల్ 441 డాలర్లలో మోడెం ధర 69 డాలర్లు ఉంది. అమెరికా చిప్స్‌ను వాడితే ఐఫోన్ ధర మరో వంద డాలర్లు పెరగవచ్చని అంచనా. పశ్చిమ దేశాలు ప్రారంభించిన ఈ పోరు ఎటుదారి తీస్తోందో అని ప్రపంచం ఎదురు చూస్తోంది!
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288