Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో ఇది కార్మికవర్గ పోరాటాలు పెరుగుతున్న కాలం. కడుపు మండిన కార్మికులు ఉవ్వెత్తున కదులుతున్న కాలం. ధర్నాలూ, ప్రదర్శనలే కాదు... నిరవధిక సమ్మెల రూపం దాల్చుతున్నాయి. సమరశీల ముట్టడులకు దారి తీస్తున్నాయి. కనీస వేతనాలు, పనిగంటలు తగ్గింపు, ఉద్యోగ భద్రత, హక్కులు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం శ్రామికలోకం, కార్మికవర్గం కదం తొక్కుతున్నది. పారిశ్రామిక కార్మికులు, స్కీం వర్కర్లు, ట్రాన్స్‌పోర్టు కార్మికులు పోరుబాట పడుతున్నారు.
అంగన్వాడీలు మూడు రోజుల రాష్ట్ర వ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చారు. సీఐటీయూ అనుబంధ సంఘమే అయినా, యూనియన్ల గీతలు దాటి, అన్ని యూనియన్ల సభ్యులు ఉవ్వెత్తున కదలి వచ్చారు. 30జిల్లాలలో సమ్మె అత్యంత జయప్రదంగా జరిగింది. గత అక్టోబరు, నవంబరు మాసాలలో అనేక జిల్లాలలో వేలాది మంది ఆశాలు సామూహిక పాద యాత్రలు చేశారు. గత కొన్నేండ్లు గా యూనియన్లతో మాట్లాడటానికే నిరాకరిస్తున్న అధికారులు, ఆశాలలో వస్తున్న కదలికతో వారూ దిగిరాక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పీఆర్సీ ప్రకారం వీరికి కూడా 30శాతం పెంచి చెల్లించాలని జారీ చేసిన ఆదేశాల కాపీని, యూనియన్ నాయకత్వానికి స్వయంగా ఉన్నతాధికారులు అందజేశారు. రాష్ట్రంలో 17,606మంది ఐకేపీ, వీవోఏలు మార్చి 16 నుంచి 18వరకు సమ్మె చేశారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ పనులు నిలిపివేశారు. పోరాటం తీవ్రతరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర నాయకత్వ బృందం 17రోజుల పాదయాత్ర చేసింది. ఆరువేల మంది హైదరాబాద్‌లో ధర్నా చేశారు. 23 వేలమంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 80రోజులు రాష్ట్ర వ్యాపిత సమ్మె చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం మేరకు పేస్కేల్స్ అమలు చేయాలనీ, వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రమంత్రి కేటీఆర్ హామీ మేరకు పోరాటం విరమించారు. సింగరేణి కాలరీస్‌లో 10వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు 14రోజుల పాటు సమ్మె చేసారు. కుదిరిన ఒప్పందం మేరకు సమ్మె విరమించారు. 24సంఘాలతో విద్యుత్తు రంగంలో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. ఆర్టిజన్లు, రెగ్యులర్ ఉద్యోగులు 51,157మంది ఉద్యమ బాటపట్టారు. మార్చి 24న వేలాది మంది విద్యుత్‌సౌధను ముట్టడించారు. కనీస వేతనాలు, రోజుకు 7గంటలు, వారానికి 5రోజుల పని కోసం రాష్ట్ర వ్యాపితంగా పారిశ్రామిక కార్మికులు పెద్దయెత్తున క్యాంపెయిన్ సాగించారు. ధర్నాలలో విస్తృతంగా కదిలారు. ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనవరిలో ట్రాన్స్పోర్ట్ రంగం నాయకత్వం 10రోజుల జీపుయాత్రలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వాల విధానాల పట్ల తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ఏండ్ల తరబడి చాకిరీ చేస్తున్న పశుమిత్రలు సంఘటితమవుతున్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రంలో 50 కేంద్రాల్లో వేలాది మంది అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని పోరాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికవర్గంలో ఇంత విస్తృతమైన కదలిక గతంలో ఎన్నడూలేదు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పట్టుదలతో పోరాడుతున్నారు. క్రమంగా కసి పెరుగుతున్నది. కొన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ కార్మికులు పోరాటాలలోకి వచ్చేదాకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. కార్మికుల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం మీదకు మరలుతున్నది.
ముద్దాయి మోడీ సర్కారే!
నిజానికి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలి. సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేయడం, యూనియన్ల పట్ల శత్రుపూరితంగా వ్యవహరించడం, స్థూలంగా రెండు ప్రభుత్వాలూ అనుసరిస్తున్నవే. కానీ మౌలికంగా కేంద్రం మరింత ప్రమాదకర విధానాలు అమలు చేస్తున్నది. పరిశ్రమల నుంచి కొనుగోలు చేసిన పౌష్టికాహారం సరఫరా చేయాలనీ, ఇప్పుడున్న అంగన్వాడీ వ్యవస్థను వదలించుకోవాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చి, స్కీం వర్కర్ల వ్యవస్థకు చరమగీతం పాడాలని చూస్తున్నది. ఈ మేరకు గత కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కోత పెట్టింది. విద్యుత్తు సవరణ బిల్లుకు చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రంలో బీజేపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు బతికి బట్టకట్టజాలవు. ఇది విద్యుత్తు ఉద్యోగులకే కాదు.... రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు హానికరం. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తూ ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కనీస వేతనాల కోసం, పనిగంటల తగ్గింపు కోసం కార్మికులు పోరాడుతుండగా, కేంద్రం కార్మిక చట్టాలనే రద్దు చేసింది. కోరలు పీకేసి, నాలుగు కోడ్స్ రూపంలో తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఫ్లోర్ లెవెల్ మినిమమ్ వేజ్ పేరుతో రోజుకు రూ.178లుగా నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్యాల చేతిలో ఇది ఆయుధంగా తయారైంది. సంక్షేమానికి తిలోదకాలిస్తున్నది. సబ్సిడీలకు 'ఉచితాలని' పెరుపెట్టి, వాటిని రద్దు చేయాలని బీజేపీ నాయకులు కోర్టుకు పోయారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానిని సమర్ధించింది. 2022 డిసెంబర్ 31 లోపు దేశంలో అందరికీ సొంత ఇల్లు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసిన ప్రధాని మోడీ, ఆ విషయం వదిలేసి, తన నివాసం మాత్రం విలాసవంతంగా నిర్మించుకుంటున్నారు. ప్రయివేటీకరణ విధానాలు దుందుడుకుగా అమలు చేస్తున్నది కేంద్రం.
సాధారణ ప్రజలమీద భారాలు మోపుతూ అంబానీలు, ఆదానీలు, ఇతర కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తున్నది. బడాబాబుల ప్రయోజనాలకే బాసటగా నిలిచింది. కార్మికుల మౌలిక హక్కులకే ముప్పు తెస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలే కీలకమైనా, రాష్ట్ర పాలకులు అనుసరించిన అప్రజాస్వామిక విధానాలతో కార్మికవర్గం రాష్ట్ర పాలకుల మీద ఆగ్రహంగా ఉన్నది.
తెలంగాణ కోసం ఉద్యమానికి నాయకత్వం వహించినవారే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కానీ ఉద్యమాల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించారు. కనీసం యూనియన్ల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించేందుకు కూడా కొన్ని సంవత్సరాల పాటు సిద్ధపడలేదు. ధర్నాలు, ప్రదర్శనల మీద ఆంక్షలు విధించారు. సమ్మె పోరాటాల మీద కక్షపూరితంగా వ్యహరించారు. 56 రోజుల పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర వ్యాపిత సమ్మె పట్ల అణచివేత ధోరణి ప్రదర్శించారు. ఇప్పటికీ ఆర్టీసీలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా, యూనియన్ల కార్యకలాపాల పట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్కీం వర్కర్లలో యూనియన్లను చీల్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న రంగాలన్నింటిలోనూ ఇదే ధోరణి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులలో కొందరిని వాడుకున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల్లో కూడా అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పరిణామాల పర్యవసానాలు రాష్ట్ర పాలకులు గ్రహించకపోతే రాజకీయంగా వారు నష్టపోవడమే కాదు... తెలంగాణ ప్రజల ప్రయోజనాలకూ, ప్రజా స్వామ్యానికీ, ప్రజల మధ్య మత సామరస్యానికే ముప్పు ఏర్పడుతుంది.
వనరులన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని, తనతో విభేదించే రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఒకే భాష, ఒకే ప్రజ, ఒకే ఎన్నికల పేరుతో కేంద్రం పట్టు బిగిస్తున్నది. ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు అనే వైపు దేశాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నది. ఇంతదాకా వచ్చిన తర్వాత గానీ రాష్ట్ర పాలకులు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రమాదాన్ని గుర్తించలేదు. కార్మికులలో పెరుగుతున్న అసంతృప్తిని రాజకీయంగా తనకు అను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ. మరోవైపు ఐక్య పోరాటాలు పెరగకుండా చూడటం కోసం మతం పేరుతో విద్వేషాలు పెంచుతున్నది. దీనికోసం సోషల్ మీడియానూ, మీడియానూ, పండుగలనూ, ఆలయా లనూ సాధనాలుగా వాడుకుం టున్నది. దేవుడిని, మతాన్నీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నది. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర పాలకులు, బీఆర్ఎస్ నేతలూ వ్యవహరించాలి. ఉద్యమాల పట్ల వారి వైఖరి మారాలి. ఆలస్యంగానైనా కేంద్రంతో రాష్ట్రాల హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. రాజకీయంగా బీజేపీ-ఆర్ఎస్ఎస్ విధానాల మీద రాజీలేని పోరాటానికి పూనుకోవడం మంచి విషయం. కానీ ఇవి మాత్రమే చాలవు. వారి మోసపూరిత ఎత్తుగడలు కార్మికవర్గాన్నీ, ఇతర ప్రజలను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. కార్మికవర్గం పట్ల, ఇతర పేదల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించాలి. కార్మివకర్గం కూడా ఈ సంక్లిష్ట పరిస్థితులలో మెలకువగా వ్యవహరించాలి. శ్రామికుల ఐక్యతను కాపాడుకోవాలి. మతం పేరుతో విభజించే వ్యూహాలు చిత్తుచేయాలి. సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలి. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ-ఆర్ఎస్ఎస్ల రాజకీయ ఎత్తుగడల్ని తిప్పికొట్టాలి. బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయడంలో కార్మికవర్గం అగ్రభాగాన ఉండాలి. అంతేకాదు... కార్మికవర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న ఎర్రజెండా రాజకీయాలను, ఎర్రజెండా పార్టీలను బలోపేతం చేసుకోవాలి. తమకంటూ ఒక బలమైన రాజకీయ ఆయుధం లేకుండా విముక్తి సాధ్యంకాదు. అది ఎర్రజెండా వెలుగులోనే సాధ్యం.
- ఎస్. వీరయ్య