Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మనిషి జీవించే హక్కులో భాగంగా మానవ హక్కులు ఏర్పడ్డాయి. జీవించడం అంటే గౌరవంగా, స్వేచ్ఛగా జీవించడం. ప్రతి వ్యక్తికి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయం, సమానత్వం అందించాలనేది భారత రాజ్యాంగం స్ఫూర్తి. ప్రాథమిక హక్కులు అందరికీ సమానమే అలాగే మానవ హక్కులు కూడా అందరికీ సమానమే. మన దేశంలో మానవ హక్కులు ఎలా ఉన్నాయి? స్వేచ్ఛా, స్వాతంత్య్రాల మాటేమిటి? వాక్ స్వాతంత్య్రపు హక్కు ఉన్నదా? దర్యాప్తు సంస్థలు, పోలీసులు చట్టానికి లోబడి పనిచేస్తున్నారా? లేదా అనే ప్రశ్నలకు లేదనే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితులను చూస్తున్నది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్.ఎస్. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. విచారణ చేపడుతున్నది.
తమ స్వార్థం కోసం, రాజకీయాలు చేయడం కోసం చట్టాలను ఉల్లంఘించడం బీజేపీ పెద్దలకు అలవాటే. దేశానికే మోడల్‌గా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రం కస్టోడియన్ మరణాల్లో గత ఐదేండ్లలో దేశంలో నెంబర్1 అనే పార్లమెంట్ సాక్షిగా తాజాగా బయటపడింది. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పార్లమెంటులో అందజేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం.. గుజరాత్లో 2017-18 సంవత్సరంలో14 మంది, 2018-19 లో 13, 2019-20లో 12, 2021లో 24 కస్టోడియల్ మరణాలు సంభవించాయి. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలీక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హౌం వ్యవహారాల సహాయ మంత్రి తెలిపిన వివరాలివి. ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం, జైలులో నిర్బంధించడంతో గుజరాత్ రాష్ట్రంలో జైళ్లు కూడా కిక్కిరిసిపోయిన విషయం తేటతెల్లమైంది. గుజరాత్ రాష్ట్రంలోని మొత్తం జైళ్లలో 13,999 మంది ఖైదీల సామర్థ్యం ఉంది. కాగా ప్రస్తుతం వాటిల్లో16,597 మంది ఖైదీలు ఉన్నారు. గుజరాత్లో పెరుగుతున్న కస్టోడియన్ మరణాలు, కిక్కిరిసిన జైళ్లు.. బీజేపీ పెద్దల చట్టబద్ధపాలన, చట్టాలను గౌరవించే తీరు, మానవ హక్కుల రక్షణకు చేస్తున్న కషికి అద్దం పడుతున్నాయి.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతియుతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు, పాత్రికేయులు, రచయితలు, రాజకీయ, ప్రజా సంఘాల లీడర్లను నిరంకుశ చట్టాల కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసి, దీర్ఘకాలం జైలులో ఉంచడం విపరీతంగా పెరిగింది. ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు అంతర్జాతీయ వేదికలపై పలు దేశాలు బాహాటంగానే విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. 2021-22లో మొదటి పది మాసాల్లో మానవ హక్కుల ఉల్లంఘన కేసులు 37 శాతం పెరిగాయని అంచనా. మానవ హక్కులకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ఏటా విడుదలచేసే వార్షిక నివేదికను 2019 నుంచి ప్రచురించకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తే నామ్ కే వాస్తే కొన్ని లెక్కలు బయటపెడుతున్నది. మోడీ పాలనలో ఉపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద మొత్తం గతేడాది వరకు10,552 అరెస్టులు చేస్తే, అందులో అభియోగాలు రుజువైన వారు కేవలం 253 మంది మాత్రమే. మిగతా 10,299 మంది కనీస హక్కులను, స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం కాలరాసినట్లే కదా! దేశ ద్రోహం కేసుల్లోనూ ఇలాంటి అణచివేత వైఖరే కొనసాగుతున్నది. గత 8ఏండ్లలో దేశ ద్రోహం కేసులు 7,110 నమోదు చేస్తే, వాటిలో నేరం రుజువై, శిక్షలు పడిన కేసులు పది శాతానికి మించవు. ఇవీగాక మోడీని విమర్శించినందుకు కూడా 149 కేసులు నమోదు చేయడం రాజ్యాంగ, మానవ హక్కుల స్ఫూర్తికి నిలువుటద్దం.
ఇండియాలో పౌరహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నదని 'ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (యూఎన్హెచ్ఆర్సీ)' ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేసింది. లక్షిత వర్గంపై ఉపా వంటి తీవ్రవాద వ్యతిరేక చట్టాలను అకారణంగా ప్రయోగించడం పెరిగిందని మండిపడింది. 'యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ' (యూపీఆర్) పేరిట నాలుగేండ్లకు ఒకసారి సమీక్షా సమావేశం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఈ సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధులు, పౌరహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో మోడీ సర్కారుకు పలు ప్రశ్నలు వేయడంతో పాటు.. ఆయా దేశాల ప్రతినిధులు కొన్ని సూచనలూ చేశారు. ఉపాచట్టం పేరుతో హక్కుల కార్యకర్తలను, మైనారిటీలను అరెస్టు చేసి జైలులో నిర్బంధించే చర్యలు మానుకోవాలని అమెరికా అంటే,ఉపా చట్టంలో మార్పులు చేయడంతోపాటు మతస్వేచ్ఛను రక్షించాలని కెనడా సూచించింది. బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడాలని జర్మనీ కోరితే, ఇంటర్నెట్, సోషల్‌మీడియాపై ఆంక్షలు పెట్టొద్దని స్విట్జర్లాండ్ హితబోధ చేసింది. జైలులో నిర్బంధించిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని ఐర్లాండ్, బెల్జియం, లక్సెంబర్గ్ లాంటి దేశాలు ఇండియాకు సూచించాయి. వాక్ స్వాతంత్య్రం, నిరసన తెలిపే హక్కుకు అవకాశం కల్పించాలని లాటిన్ అమెరికా, ఐరోపా దేశాలు మోడీ ప్రభుత్వాన్ని కోరిన విషయం గమనించాలి. గత రెండు నెలల కింద దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెర్రస్ మానవ హక్కుల విషయంలో ఇండియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన పరోక్షంగా విమర్శించారు. మానవ హక్కుల మండలి (కౌన్సిల్)లో ఎన్నికైన సభ్య దేశంగా ఉన్న ఇండియాకు ప్రపంచవ్యాప్త మానవ హక్కులను ఒక షేప్ లోకి తెచ్చే బాధ్యత ఉందని, మైనారిటీ వర్గాలతో సహా అన్ని సామాజిక వర్గాలు, వ్యక్తులందరి హక్కులను పరిరక్షించి.. ప్రమోట్ చేయాల్సి ఉందన్న గుటెర్రస్ వ్యాఖ్యల నుంచి దేశం పాఠాలు నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
దేశంలో మానవ హక్కుల పరిక్షణకు కషి చేయాల్సిన బాధ్యతను కూడా 'జాతీయ మానవ హక్కుల సంఘం' సరిగా నిర్వర్తించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేసి, కాశ్మీరీల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి, రాజకీయ నాయకులను నెలల తరబడి గహ నిర్బంధంలో ఉంచి, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సదుపాయాలను స్తంభింపజేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు సంస్థలు తీవ్రంగా విమర్శించినా, జాతీయ మానవ హక్కుల సంఘం పెద్దగా స్పందించ లేదు. బుల్డోజర్ దాడులతో సంఫ్‌ు పరివార్ మూకలు చెలరేగిపోతుంటే, ఎన్హెచ్ఆర్సీ మౌనం వహించింది. గుజరాత్ మారణకాండలో బాధితులకు న్యాయం చేకూర్చేందుకు సుదీర్ఘంగా పోరాడిన సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేస్తే, అది అన్యాయమని ప్రపంచమంతా ఘోషించినా ఎన్హెచ్ఆర్సీ పట్టించుకోలేదు. జర్నలిస్టు జుబేర్ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్‌తో సహా పలు పాత్రికేయ సంఘాలు, మేధావులు, న్యాయవాదులు ఖండించినా ఎన్హెచ్ఆర్సీ మౌనం వీడలేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు, బలగాలతో మానవ హక్కుల ఉల్లంఘన చర్యలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. అధికారంలో ఉన్న నాయకుల పట్ల, అధికారుల, పోలీసుల వైఖరి ఉదాసీనంగా ఉండటం, ప్రశ్నించేవారు, సామాన్య పౌరుల పట్ల కఠినంగా ఉండటం కూడా మానవహక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి చర్యలను పౌర సమాజం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. భారత రాజ్యాంగ స్ఫూర్తి, విశ్వమానవ సౌభ్రాతత్వ భావన కొనసాగాలంటే మానవ హక్కుల ఉల్లంఘనలపై అందరూ పోరాడాల్సిందే!
- బచ్చు శ్రీనివాస్
సెల్:9348311117