Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం లాంటి మూడో ప్రపంచదేశాలలో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆర్థిక మాంద్యం ధోరణులు ఉధృతమవుతున్నాయి. పెట్టుబడులు మాత్రం భారత ఉత్పాదకత సామర్థ్యాలు పెరచేలా పెరగడం లేదు. ఉపాధి కల్పన చాలా స్తబ్ధతగా ఉంది. దారిద్య్రమేమో చాపకిందనీరులా విస్తరిస్తున్నది. దీనికి ప్రధాన కారణం... సంపద కొద్దిమంది సుసంపన్నుల వద్ద పోగుబడి ఉండటం. వారు ధనవంతులు కావడానికి దేశ ఏలికలు ఎర్రతివాచీ పరవడం. మరి లేకపోతే దేశం సృష్టిస్తున్న ఆదాయంలో నలభై శాతం పైగా సంపద ఒక శాతం మంది వద్దే ఉండటమేంటి? ఇది ఆశ్చర్యకరమే కాదు ఆందోళనాకరం కూడా. పెట్టుబడిదారి వ్యవస్థ నయా ఉదారవాదం మిగులును రాబట్టుకోవటానికి అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నది ఇది వాస్తవం. హక్కులను హరించటం ద్వారా బహుముఖ వేగంతో సంపదను పోగుచేసుకుంటున్నది. పది మంది సుసంపన్నుల మొత్తం సంపద 2022లో రూ.27.5లక్షల కోట్లుగా ఉంటే అది 2021తో పోల్చితే 32.8శాతం ఎక్కువ. యాభై శాతం మంది ప్రజల వద్ద ఉన్నది కేవలం మూడు శాతం సంపద మాత్రమే. 2022లో మొత్తం శతకోటీశ్వరుల సంఖ్య 102మంది. 2022లో ఈ సంఖ్య 166కి పెరి గితే దీనికి విరుద్ధంగా దాదాపు 23కోట్ల మంది ప్రజలు ఆకలి, దారిద్య్రంలో బతుకులీడుస్తున్న దైన్యస్థితి. సంపన్న వర్గాలు చెల్లించే పన్నుల కన్నా సాధారణ ప్రజలు చెల్లించే పన్నులు ఆరు రెట్లెక్కువ. ఇక్కడున్న పెట్టుబడిదారీ విధానం వల్ల కార్మికవర్గం (గ్రామసీమలలో పనిచేస్తున్న కార్మికవర్గంతో సహా), రైతాంగం మీద దోపిడీ రోజురోజుకీ పెరుగుతున్నది. తిరోగమన ఫ్యూడల్, అభివృద్ధి నిరోధక సామాజిక పద్ధతులు, కులం, మతం, లింగ, జాతి లాంటి తారతమ్యాలు మనదేశంలో ఆచరణలో ఉన్నాయి. వీటన్నింటిని పాలకవర్గాలు ఉపయోగించుకోవటమే కాదు దుర్వినియోగం చేసి, మరింత దోపిడీని సాగించటానికి, లాభాలు పోగేసుకోవటానికి సాధనాలుగా వాడుకుంటున్నాయి. భూస్వామిక, పితృస్వామిక, కుల వ్యవస్థకు మూలమైన తిరోగామి 'హిందుత్వ' విధానంపై ఆధారపడి ఉన్న పాలనలో మనం జీవిస్తున్నాం. దేశంలో భూస్వామిక విధానానికి గుర్తులుగా ఉన్న కులం, లింగం వంటి వివక్షతలను పాలకవర్గాలు తమ రాజకీయ ప్రయోజనాలకే కాదు, ఆర్థిక ప్రయోజనాలకూ ఉపయోగించుకుంటున్నాయి.
6నుంచి 14వరకు సామాజిక న్యాయ వారోత్సవాలు
జాతీయోద్యమ కాలంలోనూ, స్వాతంత్య్రానంతర కాలం లోనూ భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష, అంటరాని తనం, అణచివేత, మూఢ నమ్మకాలు, స్త్రీల హక్కులు, ఆర్థిక, సామాజిక దోపిడీ, పీడనల నుండి విముక్తి కోసం దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలతో పాటు వెనకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఎందరో మహనీయులు అశేషత్యాగాలు చేశారు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడారు. వారి పోరాటాలు, త్యాగాలు, వారుచేసిన కృషి ఫలితంగానే, నేడు ఆయా తరగతులకు కొన్ని హక్కులు, చట్టాలు, సౌకర్యాలు లభించాయి. ప్రజలను వారి స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ఆ మహనీయులను స్మరించుకోవడానికి ప్రతి ఏడాది ఏప్రిల్ నెల ఓ ప్రత్యేకత చాటుతున్నది. అంటరానితనం, అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు, విప్లవకారులు, దోపిడీ రహిత సమసమాజ స్థాపనను కాంక్షించే కార్మికోద్యమ నేతల వర్థంతులు, జయంతులు వరుసగా ఈ నెలలోనే రావడం విశేషం. 5న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, 6న అన్నిరకాల వివక్షతలు, అణచివేతలు, దోపిడీల నుండి ప్రజల్ని విముక్తి చేసి సమసమాజ స్థాపన లక్ష్యానికి కట్టుబడిన కార్మికోద్యమ నేత బీటీరణదివే జయంతి, 11న అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనలతో పాటు మహిళా ఉద్ధరణ, హక్కుల కోసం కృషి చేసిన జ్యోతిరావ్ ఫూలే జయంతి, 14న అంటరానితనం, బానిసత్వంపై పదునైన ఆయుధాన్ని ఎక్కు పెట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఈ మహానుభావు లను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన బాధ్యత మనం దరిపై ఉంది. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలను నిర్వహించాలని సీఐ టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మనుధర్మ శాస్త్రాన్ని మట్టుబెట్టడం, కుల వివక్షతను అంతం చేయడం, మతో న్మాద, విచ్ఛిన్నకర శక్తులను ప్రతిఘటించడం, సామాజిక న్యాయం కోసం కార్మికవర్గ ఐక్యతను చాటడం వంటి మౌలిక లక్ష్యాలుగా ఈ సామాజిక న్యాయ వారోత్సవాన్ని నిర్వహించాలని కార్మికులకు నిర్దేశిస్తున్నది.
మనుధర్మశాస్త్రం అమలుకు బీజేపీ-ఆరెస్సెస్ కుట్ర
కామ్రేడ్ బీటీఆర్, జ్యోతిరావ్‌ఫూలే, బీఆర్ అంబేద్కర్ ఆశించిన ఆశయాలకు బీజేపీ తూట్లుపొడుస్తున్నది. వారు పోరాడి మనకు అందించిన హక్కులను హరిస్తున్నది. ఆరెస్సెస్ గురువు గోల్వాల్కర్ 1930 నవంబర్ 30లో వారి అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 'భారత రాజ్యాంగాన్ని మేము అంగీకరించడం లేదు' అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరమ చెత్తని వ్యాఖ్యానించాడు. మన రాజ్యాంగంలో కొన్ని పేజీలు బ్రిటన్ రాజ్యాంగం, మరికొన్ని పేజీలు జర్మనీ రాజ్యాంగం, ఇంకొన్ని పేజీలు ఇంగ్లాండ్ రాజ్యాంగం ఇలా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకొచ్చి వాటిని అతుకుబెట్టి పుస్తకంగా తయారుచేసి రాజ్యాంగమన్నారని హేళనచేశాడు ఇది భారత సనాతన ధర్మానికి పనికిరాదని, హిందూ సంస్కృతిని రక్షించలేదని, కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగిస్తామని, కొత్త రాజ్యాంగాన్ని అమలు జరుపుతామని ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. ఏమిటా కొత్త రాజ్యాంగం? అది మనుధర్మ శాస్త్రమట. మనుధర్మ శాస్త్రమే మనదేశానికి అనువైన రాజ్యాంగమని బీజేపీ- ఆరెస్సెస్‌లు చెప్తున్నాయి. కుల ధర్మాన్ని పాటించాలనేదే మనుధర్మం. ఏ కులం వారు ఎలా జీవించాలో శాసించేదే మనుధర్మ శాస్త్రం. బ్రాహ్మణులు అత్యున్నత కులంలో పుట్టినవారు, ఆరాధనీయులు, అందరూ గౌరవించాల్సిన వారనీ, వారి తరువాత క్షత్రియులంటే రాజులని, వీరు రాజ్యాన్ని పరిపాలించడానికి పుట్టారని, మిగిలిన కులాల వారందరూ పై కులాల వారికి సేవలు చేయాలని, పంచములు ఊరు బయట ఉండాలని, వారికి చదువు, ఆస్తి ఉండకూడదని నిబంధనలు విధించే దుర్మార్గమైన పుస్తకమే మనుధర్మ శాస్త్రం. ఆ కుల ధర్నాన్ని పాటించాలంటున్నది బీజేపీ. ఏ కుల వృత్తి వారు ఆ కుల వృత్తే చేయాలట. అంటే ఈ ఆధునిక కాలంలో కూడా మాదిగలు చెప్పులే కుట్టాలి, మేదరులు బుట్టలే అల్లాలి, కుమ్మరులు కుండలే చేయాలి, చాకలివారు బట్టలే ఉతకాలి, మంగళి క్షవరాలే చేయాలి, మిగతా అగ్ర కులాలు మాత్రం రాజ్యాన్ని ఏలాలి. ఇది మనుధర్మం. మనుధర్మం శిక్షలు కూడా కులాన్ని బట్టే వేయాలని చెబుతున్నది. బ్రాహ్మణులు తప్పు చేస్తే శిక్ష లేదు. క్షత్రియులు తప్పు చేస్తే మందలించాలి. శూద్రులు తప్పు చేస్తే కొరడాలతో కొట్టి చంపాలి. పంచములు తప్పు చేస్తే మెడనరికి చంపాలి. ఇది మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రం పరమ పవిత్రమైందని, భారత రాజ్యాంగంలో అది పొందుపర్చా లనేటువంటి ఒక అనాగరికమైన సిద్ధాంతం బీజేపీ- ఆరెస్సెస్‌లది.
ముస్లింలు, క్రిస్టియన్లు దేశం విడిచిపోవాలట
భారతదేశంలో అనేక మతాల వారు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్శీయులు వందల సంవత్సరాలుగా ఐక్యమత్యంగా అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నటు వంటిది మన భారతీయ సంస్కృతి. ఇది అందరి మతస్తుల రాజ్యం కాదని, ఇది కేవలం హిందువుల రాజ్యమేనని బీజేపీ ఘంటాపథంగా చెపుతున్నది. 'హిందుస్థాన్‌ను స్థాపిస్తాం. ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశంవారు కాదు. ముస్లింలు పాకిస్థాన్ పోవాల్సిందే, క్రిస్టియన్లు ఇంగ్లాండ్ పోవాల్సిందే' అంటూ మతోన్మాద, భావోద్రేకాలను రెచ్చగొడుతున్నారు ఆ నాయకులు. ఇక్కడే ఉండదలచుకుంటే 'మా కాలు కింద చెప్పు లాగా, చెప్పు కింద తేలు లాగా బతకాలి' తప్ప ఇతర మతస్తులకు సమానమైన హక్కులు ఈ దేశంలో వారికి ఉండబోవని బాహాటంగా చెబుతున్నది బీజేపీ. మనుధర్మ శాస్త్రం వెలుగులోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కాలంలో దళితులపై మూడు రెట్లు హింస పెరిగింది. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఊనా పట్టణంలో ఆవు మాంసం వలుస్తున్నారనే నెపంతో నలుగురి దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఒక దళితుడు గుర్రం ఎక్కాడని కిందపడేసి కొట్టి చంపారు. యూపీలో ఓ దళిత యువతిని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ చేసి, నాలుక కోసి, నడుము విరిచినా పోలీస్‌స్టేషన్‌లో కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణిస్తే కనీసం ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వలేదు. ఇది వారి పాలనా విధానం. అనుసరిస్తున్న దుర్మార్గం. మతం పేరుతో, దేశ భక్తి ముసుగులో ప్రజలు, కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నది. దళితులు, గిరిజనులు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నది. జాతీయ వనరులను, ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా తన తాబేదారులకు కట్టబెడుతున్నది. ప్రభుత్వరంగాన్ని మొత్తం ప్రయివేటుపరం చేయడం ద్వారా దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు బీజేపీ ప్రభుత్వం గండి కొడుతున్నది. నూతన విద్యా విధానం పేరుతో మనువాద సిద్ధాంతాన్ని విద్యా విధానంలోకి చొప్పించి అమలు చేస్తున్నది. దీంతో అణగారిన పేదలను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నది. గోరక్షణ ముసుగుతో దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు పెంచుతున్నది. కార్మిక సంఘాలు, వారి హక్కులు, చట్టాలపై ఏకపక్ష దాడికి పూనుకున్నది. ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చివేస్తున్నది. ఈ దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తున్న ప్రజలు, కార్మికులు ఐక్యం కాకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. ఇది బీజేపీ ద్వంద్వ విధానం.
కార్మికవర్గ జమిలి పోరాటాలే ఏకైక మార్గం
సమాజంలోని అన్నిరకాల పీడన, దోపిడీల నుండి సంపూర్ణ విముక్తి కోసం సీఐటీయూ నిలబడుతుందని తన నిబంధ నావళిలో ప్రకటించింది. ఈ లక్ష్య సాధన అనేక కష్టనష్టాలతో కూడినది. దీన్ని సాధించాలంటే కార్మికవర్గంలో విశాల ఐక్యతను సాధించడమే మార్గం. కులం మన దేశంలో కార్మికవర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికడ్డంగా, ముళ్ళ కంచెలా ఉంటుంది. దోపిడీ వర్గాల, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పాలకవర్గాలు కార్మికవర్గాన్ని కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, లింగం లాంటి అంశాలను ముందుకు తెచ్చి కార్మికవర్గాన్ని వారి ఐక్యతను విచ్ఛిన్నం చేసి పాలకవర్గాలు పబ్బం గడుపు కుంటున్నాయి. అయినప్పటికీ సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేస్తూ శ్రామిక వర్గాన్ని ఐక్యం చేయాలని సీఐటీయూ ఆకాంక్షిస్తున్నది. రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణ, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, మత సామరస్యం, ఫెడరలిజం వంటి రాజ్యాంగంలో ఉన్న మూల స్తంభాల రక్షణ కోసం కార్మికవర్గం నిరంతరం పోరాడాలి. నేటికి కులవివక్ష, అంటరానితనం కొనసాగుతున్నది.హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి, గుడిలోకి రానివ్వకపోవడం, పండుగలు, ఉత్సవాలలో దళితులను అంటరానివారుగా దూరం పెట్టటం, దళితులు చైతన్యం ప్రదర్శిస్తే వారిపై భౌతిక దాడులు నిత్యకృత్యమవు తున్నాయి. రాష్ట్రంలో 76కుల దురహంకార హత్యలు జరిగాయి. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో సాంఘిక బహిష్కరణలు చోటుచేసు కుంటున్నాయి. జోగిని వ్యవస్థ ఇంకా అమలులోనే ఉన్నది. వీటికి వ్యతిరేకంగా జరిగిన అన్ని పోరాటాల్లో కార్మికవర్గం అగ్రభాగాన నిలవాలి. ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా జమిలి పోరాటం చేస్తేనే మతోన్మాదాన్ని ఓడించడం సాధ్యమవు తుంది.ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కర్తవ్య సాధనకు కార్మికవర్గం పూనుకోవాలి. అప్పుడే కామ్రేడ్ బీటీ రణదివే, బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిరావుఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ల ఆశయాలను సాధిస్తాం. ఆ మార్గంలో కార్మికవర్గం కదన రంగంలోకి దిగాలి. సమరశీల పోరాటాలు చేయాలి. మతోన్మాద విధానాలను ఎండగట్టాలి. సమసమాజ స్థాపన కోసం ఉద్యమించాలి...
- పాలడుగు భాస్కర్