Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్'' అన్నాడు గురజాడ అప్పారావు. ఆ విధంగా చూసినట్లయితే ప్రపంచం అనేక దేశాలు, ద్వీపాల కలయిక. ఇక్కడ నివసిస్తున్న జనాభాయే ప్రపంచానికి వెన్నెముక. దేశంలో భౌగోళిక స్వరూపాలు, వాతావరణం, జీవించడానికి అనువైన పరిస్థితులు ఆధారంగా జనాభా పెరుగుదల ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే జీవించడానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో కొన్ని జంతువులు కనుమరుగైన ఘటనలు అనేకం చూశాం. నేడు ఈ ప్రపంచంలో ఆకలి కేకలతో, వివక్షతలతో, యుద్ధాలతో అనేక మంది మరణిస్తున్నది చూస్తున్నాం. అయితే మానవ జనాభా కూడా తిరోగమన దిశలో ఉందని వస్తున్న వార్తలు ఆందోళన కలిగించే అంశం. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 2.1గా ఉంటే జనాభా పెరు గుదల ఉన్నట్లు భావిస్తారు. ప్రస్తుతం మన దేశంలో టీఎఫ్ఆర్ 2.05గా ఉంది. అంటే జనాభా వృద్ధి రేటు తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణ భారతదేశంలో ఈ తగ్గుదల మరింత క్షీణించి 2.01గా ఉన్నది. మరీ లోతుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో 1.7, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 1.8గా ఉన్నది. అదే సమయంలో బీహార్‌లో 3, ఉత్తర ప్రదేశ్‌లో 2.4గా కొంచెం పెరుగుదల ఉన్నట్లు కనబడుతోంది. దీనికి అంతటికీ ప్రధాన కారణం దంపతుల మధ్య ప్రేమ, అనురాగం తగ్గటం, ఆధునిక జీవనం, ఆర్థిక సంబంధాలు, ఆహారపు అలవాట్ల వల్ల కుటుంబ వ్యవస్థకు దూరమవడంతో సంతాన ప్రక్రియ లేక జనాభా తగ్గుతున్నట్టు అంచనా. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం పెరగడం, ఒంటరి జీవితాలకు యువత మొగ్గుచూపడం జరుగుతున్న తంతు. పెళ్లి అనే సామాజిక బంధానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, డేటింగ్‌తో గడపడం, విలువలకు తిలోదకలివ్వడం పెరుగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరికాదని తల్లిదండ్రులు తమ పిల్లలకు కుటుంబ, సామాజిక, నీతి, మానవీయ విలువలు భోధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం' అన్నారు పెద్దలు. దాని ప్రకారం చూస్తే జనాభా తక్కువగానే ఉంటుంది కాదా అనే సందేహం రాక మానదు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని పరిశీలించాలి. మనదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే 1960లో 5.91 టీఎఫ్ఆర్ ఉంటే, నేడు 2.05కి పడిపోయింది. 2036 నాటికి మనదేశంలో జనాభా వృద్ధి రేటు పడిపోతుందని, దీనిలో పనిచేసేవారు సంఖ్య 50శాతం దిగువున ఉంటుందనే విషయం ఇక్కడ గుబులు రేపుతోంది. అంటే వృద్ధ జనాభా అధికంగా ఉండి మేధో సంపత్తితో పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది. మంచిదే కదా అనుకోవడం సహజం. కానీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పరిస్థితి ఏమిటి? శ్రామిక జనాభా లేకుండా పంటల ఉత్పత్తి, వస్తుఉత్పత్తి సాధ్యమా? ఇది అందరూ ఆలోచన చేయాలి. ఇక తాజా జనాభా గణాంకాలు ప్రకారం 2048 వరకూ భారత్ జనాభా 160కోట్లు చేరి, అక్కడ నుంచి వృద్ధిరేటు పతనం అవుతూ, తిరోగమన దిశలో ఉంటుంది అని విద్యావంతులు అంచనా వేస్తున్నారు. కుటుంబం కానీ, దేశం కానీ సరైన జనాభా ఉంటేనే అభివృద్ధి అని పాలకులు గ్రహించాలి. దానికి అనుగుణంగా పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందిం చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో జీవితాలకు భరోసా కల్పించాలి. బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించాలి. ఆర్థిక అంతరాలు లేకుండా, అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉండాలి. గిరిజన, మైనారిటీ వర్గారల వారి అభ్యున్నతికి కృషి చేయాలి. అభివృద్ధి అంటే ఏసీ గదులు, రంగు మేడలు, విమాన ప్రయాణాలు మాత్రమే కాదు. సమస్త మానవాళి ఈ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వంతో శాంతి యుతంగా జీవించడమే ఈ ప్రపంచంలో నిజమైన అభివృద్ధి.
- ప్రసాదరావు