Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి పన్నెండ్లేండ్లకు ఒకసారి మన భారతదేశంలో కుంభమేళా జరుగుతుంది. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో గంగా - మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో సిప్రా - మహారాష్ట్ర నాసిక్‌లో గోదావరి - ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునల సంగమంలో కుంభమేళా జరుగుతుంది. అయితే, అది తన మూల ఉద్దేశాన్ని మరిచిపోయి, మూఢనమ్మకాలకు కేంద్రబిందువుగా మారిపోయింది. ఈ నాలుగు ప్రదేశాల్లో లక్షల జనం అక్కడి నదుల్లో స్నానాలు చేస్తుంటారు. తమ పాపాలు కడిగివేయ బడతాయనీ, తమకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయనీ, భవిష్యత్తులో తమకు, తమ కుటుంబానికి అంతా మంచే జరుగుతుందనీ ఆశపడుతుంటారు. ఆశపడటంలో తప్పులేదు గాని - మంచి జరుగుతుందన్న దానికి ఆధారాలు లేవు. కుంభమేళా శతాబ్దాలుగా కొనసాగుతున్నా ఆధారాలు మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. కాలమెంత గడిచినా, అంధ విశ్వాసాలకు ఆధారాలు దొరకవుకదా? నదీ జలాల్ని కలుషితం చేసి, లక్షల మంది నీటిలో మునుగుతున్నందు వల్ల తప్పక అంటువ్యాధులు వ్యాపిస్తాయి తప్ప, ఒనగూరే మంచి-అంటూ ఏదీ ఉండదు. అసలు ఈ కుంభమేళాలకు మూలాలు ఎక్కడీ అది ఎలా ప్రారంభమైంది? కాలక్రమంలో మార్పులు చేర్పులతో, వక్రీకరణలతో అంధవిశ్వాసాలకు ఎలా ఆలవాలమైందీ? తెలుసుకోవాలంటే సాధారణ శకం ఏడవ శతాబ్దంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో ఉత్తర భారతదేశాన్ని ఏకరాజ్యాధికారంలోకి తెచ్చిన చక్రవర్తి హర్షుడి గూరించి తెలుసుకోవాలి. ఆయన ''దానవీరుడి''గా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో.. తెలుసుకోవాలి!
చక్రవర్తి హర్షుడి పేరు మనకు కొత్తేమీ కాదు. చరిత్ర పాఠాల్లో చదువుకున్నదే! సాధారణ శకం 590-647 మధ్య జీవించిన వాడు. 606 నుండి 647 వరకు పరిపాలించిన వాడు. ఒకవైపు యుద్ధాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించడంలోను, ప్రజలను శాంతియుతంగా పరిపాలిం చడంలోనూ ఆయన తనకు తానే సాటి అని అనిపించు కున్నవాడు. కుంభమేళా ఈ బౌద్ధచక్రవర్తి హర్షుడు రూపొందించుకున్న సంప్రదాయం. దాన్ని ధ్వంసం చేసి - వైదికులు మరో రకంగా ప్రచారం చేశారు. హర్షుడికి 'శిలాదిత్య' అనే బిరుదు ఉండేది. ఏడవ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చీనీ యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ రచనల్లో విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన రచనకు తర్వాత కాలంలో హిందీ అనువాదం కూడా అందుబాటులో కొచ్చింది. అందువల్ల ఏ మాత్రం అనుమానం లేకుండా, మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. బౌద్ధ వారసత్వాన్ని నాశనం చేసి కుట్ర పూరితంగా కుంభమేళ ఆశయాన్ని భ్రష్టు పట్టించారు. అందుకు బలం చేకూర్చడానికి కల్పిత కథలు, అభూత కల్పనలూ జోడించారు. హర్షుడికి యుద్ధ వీరుడిగా ఎంత పేరుందో దానవీరుడిగా అంతకన్నా ఎక్కువ పేరుంది. దయార్ద్ర హృదయుడు కాబట్టే, ప్రజలు ఆయనను కోరుకుని రాజును చేశారు. తమ ప్రియబాంధవుడిగా భావించారు. ఆరోజుల్లో ఆయన చేపట్టిన ధాన ధర్మాలకు - ఇప్పుడు మనం చూస్తున్న కుంభమేళాకు కొంత సంబంధముంది. ఇప్పుడు మనం చూస్తున్నది వైదిక ధర్మ ప్రభోధకులు వికృతంగా తయారు చేసిన మేళా! హర్షుడు ప్రారంభించినప్పుడు దాని ఉద్దేశం వేరు.
హర్షుడి రాజధాని కనౌజ్ (ఉత్తరప్రదేశ్). ఆయన త్రివేణి సంగమానికి వెళ్ళి, అక్కడ నుండి అందరికీ దానాలు చేసేవాడు. ఆయన ఇచ్చే దానాలు స్వీకరించాలని జనం దూర దూర ప్రాంతాల నుండి తరలివచ్చేవారు. ఆ ప్రదేశాన్ని 'మహాదాన భూమి' అని అనేవారు. మొదటిరోజు ఆయన బుద్ధుడి విగ్రహాన్ని కడిగి, వైభవోవేతంగా పూలతో అలంకరించేవాడు. తరువాత స్థానికంగా ఉన్న భిక్కులను, మేధావులను, పండితులను గౌరవించి వారికి కానుకలు ఇచ్చి సాగనంపేవాడు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయ అధ్యాపకుల్ని సత్కరించి కానుకలిచ్చేవాడు. ఆ తర్వాత ఇతర మతాలు పాటించే వారిని కూడా పిలిచి, మర్యాద పూర్వకంగా కానుకలు సమర్పించేవాడు. తరువాత వరుసలో విధవరాండ్రు, దుఃఖితులు, దరిద్రులు, రోగులు, అంగవైకల్యం ఉన్నవారు, ప్రార్థనా స్థలాల్లో పనిచేసే మహంతులు, పాండాలు, పూజారుల వంటి వారికందరికీ వరుసగా దానాలు చేసేవాడు. తన చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలు, మెడలోని రత్నాల హారాలు మొదలైన వాటిని కూడా దానం చేసేవాడు. అలా చేస్తున్నప్పుడు ఆయనకు విచారంగా, బాధగా ఉండేది కాదు. ఎంతో సంతృప్తిగా ఉండేది. అలా చేస్తున్నందుకు అమితానందం పొందేవాడు. తన కోశాగారంలోని ధనరాశులు, ప్రజలకు పంచిపెట్టడం జరుగుతూ ఉండేది. మహాదాన భూమిలో ఈ కార్యక్రమమంతా పూర్తిచేసుకుని, చక్రవర్తి శిలాదత్య ఇలా అన్నాడు... ''నా దగ్గరున్నదంతా ప్రజా కోశాగారానికి చేరింది. ఒక మహౌపకార్యానికి ఉపయోగ పడింది. అక్కడ - అది దుర్వినియోగం కావడానికి ఆస్కారం లేదు. ప్రజాధనం ప్రజలకు చేరిందంటే అంత కన్నా సార్థకత ఏముంది?'' అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేవాడు. ఇలాంటి విషయాలన్నీ హ్యూన్ త్సాంగ్ నోట్స్ వల్ల తెలుస్తున్నాయి.
హర్ష చక్రవర్తి దాన గుణం ఏ స్థాయిలో ఉండేదో తెలుసుకోవడానికి ప్రచారంలో ఉన్న ఒక కథను పరిశీలిద్దాం... ఒకసారి ఒక త్రివేణి సంగమం చేరుకుని మహాదాన భూమి నుండి దానాలు చేశాడు. ఒంటిమీద ఆభరణాలు, చేతి ఉంగరాలు, పైన ఉన్న వస్త్రాలు అన్నీ దానం చేశాడు. మెలకు ధోవతి తప్ప ఏమీ మిగలలేదు. అప్పుడు ఒకడు వచ్చి 'రాజా' అని చేయి చూపాడు. అప్పుడు ఒక ఏం చేయాలో తోచక హర్షుడు పక్కన ఉన్న మహిళను అభ్యర్థించి ఓ కండువా తీసుకున్నాడు. ఆ కండువా తను చుట్టుకుని, తన విలువైన ధోవతిని - ఆ చేయి చాపి నిలుచున్న వాడికి అందించాడు. ఒంటిమీద ఉన్న గుడ్డలతో సహా ఆయన ప్రజలకు దానం చేసేవాడని ఆ కథ చెపుతుంది. దాని ఆధారంగా వైదిక ప్రభోదకులు నగ సన్యాసుల్ని, నాగబాబాల్ని, అఘోరాల్ని కుంభమేళాలో చేర్చారు. ఉన్నదంతా ప్రజలకు, సమాజానికి దానమివ్వాలని శిలాదిత్య హర్షచక్రవర్తి చెబితే, దాన్ని కుంభమేళాగా మార్చి - నీటిలో మునిగితే చాలు సర్వపాపహరణ జరుగుతుందని మనువాదులు ఊదరగొట్టారు. ఎక్కడా ఏమీలేని దిగంబర సన్యాసులు ఈ సమాజానికి ఏమివ్వగలరూ? ఏ రకంగా ఆదర్శప్రాయులు కాగలరూ? ఆలోచించే పనిలేదా? హర్షుడు ప్రారంభించిన ఆ సంప్రదాయం ఆయన తర్వాత కూడా కొంత కాలం కొనసాగింది. జమీందారులు, ధనవంతులూ కొందరు ఆ మహాదాన భూమికి వచ్చి, నదీ స్నానాలు చేసి తమ దగ్గరున్న ధనం, బంగారం, దానం చేసి వెళ్ళేవారు. కాలక్రమంలో దానాలు ఆగిపోయి ఉట్టి స్నానాలు మిగిలాయి.
చక్రవర్తి శిలాదిత్య తన కోశాగారంలో ఉన్నదంతా సమాజానికి - వివిధ వర్గాల వారికి దానం చేశాడే గానీ, గుడ్డలిప్పి నగంగా ఊరేగలేదు. ఊరేగాలనీ చెప్పలేదు. నదీ స్నానాల వల్ల పుణ్యం వస్తుందని గానీ, పాపాలు పోతాయని గానీ, కోర్కెలు తీరతాయని గాని హర్షుడు తన ప్రజలకు చెప్పలేదు. బౌద్ధస్థూపం కట్టించి, బౌద్ధ జీవన విధానానికి ప్రాముఖ్యమివ్వాలని చెప్పకనే చెప్పాడు. అదే సమయంలో ఇతర మతస్థుల్ని కూడా సమానంగా ఆదరించాడు. కుల, మత, లింగ, ప్రాంత భేదాలు ఉండకూడదని, అందరూ కలిసి మెలిసి ఉండాలని ఆయన భావించాడు. నదీస్నానం పేరుతో అందరినీ ఒక్కచోట చేర్చి, ఒక్కటిగా చూడాలని అనుకున్నాడు. తన నుండి దానం స్వీకరించడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన సదుపాయం కల్పించేవాడు. రాజు-అంటే తండ్రి లాంటి వాడని ఆయనకు తెలుసు. అందుకే ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా ఆ మహా మానవ సమూహానికి అన్నం పెట్టే బాధ్యత హర్షుడే తీసుకునేవాడు. ఉన్నవన్నీ ఇతరుల కోసం త్యజించి, సమాజానికి మహౌపకారం చేయడమన్నది బౌద్ధ చక్రవర్తి ఇచ్చిన సందేశం. అయితే ఇవ్వడానికి ఏమీలేని సన్యాసులంతా నగంగా తిరుగుతూ కుంభమేళాకు వక్రభాష్యం చెప్పారు. ఇదంతా 8వ శతాబ్దపు వాడైన శంకరాచార్య ఘనత! బహుశా ఆయన సమాజానికి అందించిన మహా ప్రసాదం-అదే!
వీర శైవుల దేవుడు శంకరుడు. ఒంటినిండా బూడిద పూసుకుని, మొలకు చిన్న జంతు చర్మం చుట్టుకుని ఉండేవాడు. ఆయనను అనుసరించే ఈ ఆధునిక శంకరులు విభూతి, బూడిద పూసుకున్నారే గాని, చిన్న గోచీ అయినా పెట్టుకోలేకపోయారు. సమకాలీనంలో మనమేం చూస్తున్నాం? వేల సంఖ్యలో సన్యాసులు వీధుల వెంట నగంగా అనాగరికంగా తిరుగుతూ ఉంటే - అదేదో పుణ్య కార్యమైనట్టు కొందరు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. నాగరిక సమాజాన్ని అపహాస్యం చేస్తూ అంతమంది నగంగా నడుస్తూ ఉంటే - ప్రభుత్వాలు ఇప్పటికీ చర్యలు తీసుకోవు. మూఢ భక్తులు వంగి వంగి దండాలు పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఇటు భక్తులకు గాని అటు నగ స్వాములగ్గానీ ఏమీరాదు. వచ్చేది ఏదైనా ఉంటే సామాన్య ప్రజలకు విపులంగా వివరించాలి. నిరూపించాలి.
అధికారంలో ఉన్న రాజకీయ ప్రముఖులు కోట్ల విలువ గల సూట్లు వేసుకుని తిరుగుతుంటారు. కానీ, నైతికత, జీవన విలువలు - అనే వలువలు వదిలేసి - నగంగానే తిరుగుతున్నారు.
'మేధావులు మౌనం వహించినప్పుడు
మూర్ఖుల సంఖ్య రెట్టింపవుతుంది.
ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం!'
- అని అన్నాడు నెల్సన్ మండేలా.
(ఈ 2023లో జనవరి 6 నుండి 18 ఫిబ్రవరి మధ్య 45రోజుల పాటు మఘ కుంభమేళ ప్రయాగలో జరిగింది)
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.