Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ హద్దుల్లో పెట్టుబడి విశ్వ గద్దై ఎగిరాక
చరిత్ర తన చైతన్యాన్ని జమ్మిచెట్టుపై పెట్టి
అశోక వక్షం నీడలో నిద్రలోకి జారుకుంది
కలుగులు దాటుతున్న దేశీయ ధనపతులు
కార్పొరేట్ పందికొక్కుల అవతారమెత్తి
అదునుకు ఉన్న పదునును పసిగట్టి
రాజకీయ పందిరిని మందిరం చేసుకున్నాయి
పుల్లా పుడక కూడేసి పిచ్చుకలు కట్టిన గూళ్ళపై
గద్దలు ఏకమై పెద్దరికపు తీర్పులు చేశాయి
ఇంకేముంది...
నెల వేతనాల కోతలు దిన కూలీలకు గోతులు
తెల్లోడిని తరిమి సాధించిన స్వాతంత్య్రం వెతలు
అరకొరగా పెంచిన ఉపాధి కొమ్మల నరికి వేతలు
తినే తిండీ, ఉండే గూడూ, కట్టే బట్ట కరువయ్యాయి
ధరలు సగటు మనిషికందని పరుగు పోటీకి దిగాయి
శ్రమ బతుకులు మెతుకులు వెతుక్కో సాగాయి
పోరాటాలు నేరమనే చట్టాలు పీఠాలెక్కాయి
హక్కుల గొంతుకలు నొక్కేశాయి
ఇప్పుడేం చేయాలి .... ?
చరిత్రను కదిపి లేపి జనానికి తాపితేగాని
జమ్మిచెట్టుపై చైతన్యం
జనంచేతి ఆయుధం కాదనేది నిజం
అందుకు గడ్డి పోగులకు
పోరాట పాఠాలు చెప్పాలి
పోగూ పోగూ కలిస్తేనే
యెంటి(తాడు) అవుతుందని
ఏనుగునైనా బంధించేది యెంటేననీ
ఇప్పుడు ఆ యెంట్లు పేనే(అల్లే)
నిపుణులు కదలాలనీ
గడ్డి పోగులు ఏరి కలపాలనీ ...
సందేహం లేని సందేశం
గుండెగుండెనూ తాకేలా చేయాలి
అందుకు ఏ కులమైనా మతమైనా
ద్వేషాల దేహాలు వదిలి
చెమట చుక్కలు ఒక్కటిగా కలిపి
ఊరూ వాడా ఏకమై కదలాలి
- ఉన్నం వెంకటేశ్వర్లు