Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబేద్కర్ చెప్పేదాని ప్రకారం, కుల రహిత సమాజాన్ని సృష్టించడానికి కులాంతర వివాహాలు ఓ ముఖ్యమైన ముందడుగు. కులపరమైన ప్రత్యేక హక్కులను పునరుత్పత్తి చేయడానికి, ప్రస్తుతం ఉన్న సామాజిక క్రమాన్ని కొనసాగించడానికి వివాహం ఒక సాధనం అని ఆయన వాదించాడు. కులాంతర వివాహాలు కుల అవరోధాలను బద్దలు కొడతాయి. ఇలాంటి వివాహాల ద్వారా పుట్టిన వ్యక్తులు ఒకే కులంతో సంబంధాలు కలిగి ఉండరు, కుల స్వచ్ఛత సాంప్రదాయ భావనను వారు సవాల్ చేస్తారు. కులాంతర వివాహాలు, ఐక్యత, కులరహిత సమాజాన్ని సాధించడానికి అవసరమైన భాగస్వామ్య గుర్తింపును సృష్టించడానికి సహాయపడతాయని అంబేద్కర్ విశ్వసించాడు.
కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానంగా ఉండే ఆధునిక సమాజాన్ని సృష్టించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుల వ్యవస్థ, భారతీయ సమాజపు ముఖ్యమైన లక్షణంగానే మిగిలిఉంది. చారిత్రాత్మకంగా కొన్ని వృత్తులతో ముడిపడిన కులాలలో, కొన్ని కులాలు ఇతర కులాల కంటే ఉన్నతమైనవిగా పరిగణించబడి శ్రేణీగత వ్యవస్థలో ఏర్పాటు చేయబడినాయి. ఆ విధంగా ఇతర కులాల కంటే ఎక్కువ అధికారాలు కట్టబెట్టబడ్డాయి. ఇది తక్కువ కులాలకు చెందిన వారి పట్ల వివక్షతకు, అసమానతలకు దారి తీసింది కాబట్టి ఇలాంటి సామాజిక వర్గీకరణ వ్యవస్థ, అధికార సంబంధాలు భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా ఉంటూ వస్తున్నాయి.
'కుల రహిత' సమాజ భావన
'కుల రహితుడు' అనే పదం కేవలం 'ఒక కులం లేని వ్యక్తిని' లేదా 'కులానికి దూరంగా ఉండే వ్యక్తిని' సూచిస్తుంది. అయినప్పటికీ ఒక సామాజిక భావనగా దానికి సంబంధించిన చిక్కులు, వ్యక్తీకరణలు చాలా లోతుగానే ఉంటాయి. 'కుల రహితం' అనే పదం సమాజంలో 'కులం లేకుండా ఉండే పరిస్థితిని' సూచిస్తుంది. కులంపై ఆధారపడే వివక్షత, అణచివేత లేనటువంటి సమాజ ఏర్పాటుకు ఇది (కుల రహితం) బహిరంగ మద్దతును ఇస్తుంది. పుట్టుక, వారసత్వంతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరికీ సమాన అవకాశాలు సమకూర్చే, అందర్నీ కలుపుకొని పోయే సమాజాన్ని సృష్టించడం దీని లక్ష్యం. 'కుల రహిత' సమాజంలో భిన్నమైన నేపథ్యాలు గల ప్రజలను గౌరవంగా చూస్తారు, ఆదరిస్తారు. కుల ఆధారిత వివక్షత, పక్షపాతం లేకుండా ప్రజలంతా స్వేచ్ఛగా ఒకర్నొకరు కలుసుకోవడం, కలిసి పని చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమాజంలో కులం, సామాజిక హౌదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య పరిరక్షణ, ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలుంటుంది. ఇలాంటి సమాజంలో వ్యక్తి యొక్క విలువ, విజయాలు ఆ వ్యక్తుల సామాజిక హౌదా కంటే కూడా వారి సామర్థ్యం, వ్యక్తిత్వం, కష్టపడి పనిచేసేతత్వంపై ఆధారపడి మాత్రమే నిర్ణయించ బడతాయి. ఇలాంటి కుల రహిత సమాజ భావనను, సంఘ సంస్కర్తలతో పాటు అనేకమంది సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. అయినప్పటికీ వాస్తవం ఏమంటే కుల వ్యవస్థ వేల సంవత్సరాలనాటి మూలాలతో మన సమాజంలో బాగా పాతుకుపోయింది.
కుల రహితం అనేది అపోహ?
కులం, సంస్కృతీకరణ, సామాజిక వర్గీకరణల గురించి చాలా విస్తృతంగా రాసిన భారతీయ సామాజికవేత్త ఎం.ఎన్.శ్రీనివాస్ ఒక సామాజిక శాస్త్ర భావనగా 'కులరహితం' అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. చరిత్ర అంతటా పరిస్థితుల కనుగుణంగా ఉంటూ, మార్చబడిన ఒక సంక్లిష్టమైన సామాజిక నిర్మాణమే కులం అని శ్రీనివాస్ తన 'క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా' అనే రచనలో వాదించాడు కానీ అది ఆధునిక భారతీయ సమాజంలో ఒక బలమైన శక్తిగా మిగిలి ఉంది. 'కులరహితం' అనే భావన భారతదేశం ఉన్న పరిస్థితుల్లో అదొక అపోహే అనేది శ్రీనివాస్ కీలక వాదనలలో ముఖ్యమైనది. కొంతమంది కులరహితంగా ఉంటాం లేదా కులరహిత సమాజానికి మేము అనుకూలంగా ఉన్నామని చెపుతున్నప్పటికీ వారు అనేక విధాలుగా ఇప్పటికీ కులం చేత ప్రభావితులవుతున్నారని ఆయన అన్నాడు.
ఉదాహరణకు, అనేక మీడియా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు మొత్తం ఉన్నత కులాలకు చెందిన వారితో నిండిపోయాయి, ముఖ్యంగా ఉన్నత స్థానాలు. కుల రహితం అనే వాదనలు అనేకం ఉన్నప్పటికీ, ఉన్నత కులాలకు చెందిన యజమానులు తక్కువ కులాలకు చెందిన వారి కంటే కూడా వారి కులాలకు చెందిన వారినే నియమించుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
కులం నైజం
కుల రహితం అనే భావన కుల వ్యవస్థ వివక్షాపూరితమైన ఆచారాలకు ప్రతిస్పందన. అయినప్పటికీ, ఉన్నత కులాలకు చెందిన వారు మాత్రమే తాము'కులరహితంగా' ఉన్నామని భావించుకునే అవకాశం ఉంటుండగా తక్కువ ప్రాధాన్యత గల తక్కువ కులాలకు చెందిన వారు వారి కుల అస్తిత్వాలకే పరిమితమవుతున్నారని భారతీయ సామాజికవేత్త సతీష్ దేశ్ పాండే ''క్యాస్ట్ అండ్ క్యాస్ట్ లెస్ నెస్:టూవర్డ్స్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ద జనరల్ కేటగిరీ'' అనే తన వ్యాసంలో పేర్కొన్నాడు.
కులరహితం భావజాలం ఉన్నత కులాల విషయాలకు చాలా విజయవంతంగా గుర్తింపు ఇస్తుంది. వారి కుల అస్తిత్వాలను యాదృచ్ఛికమైనవిగా లేదా వారి వాదనలను అసంబద్ధమైనవిగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. కానీ ఇది ఊహాజనితమైనదే, ఎందుకంటే వాస్తవానికి వారు వారి కుల అస్తిత్వాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. వారు తమ కులాన్ని స్పష్టంగా తెలియజేయకుంటే వారు కులరహితులుగానే భావించబడతారు. అందువల్ల వారు కుల రహితంగా కనిపిస్తూనే వారి అధికారాన్ని, ప్రత్యేకతల్ని నిలబెట్టుకుంటారు. ఉన్నత కులాలకు చెందిన వారిలో వారి కులాలను సూచించే వారి పేర్లలో, వారు సృష్టించే కుల సంఘాలు, క్లబ్బుల ద్వారా వారి కులాలకు చెందిన వారిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయడంలో వారి కుల అహంకారాన్ని గమనించవచ్చు. కుల అస్తిత్వం, కుల అహంకారం ఒక వ్యక్తి పెంపకంలో, సామాజికీకరణలో చాలా లోతుగానే పాతుకొనిపోయి ఉండవచ్చు. అది వాళ్ళ చర్యలను, ఆలోచనలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో కూడా వారు గమనించకపోవచ్చు.
ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రత్యేకతల కారణంగా మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను తరచుగా పొందుతున్నారు. ఇది, వారు సాధించిన విజయంలో సహాయపడిన కుల అస్తిత్వాన్ని దాచిపెడుతూనే, వారి కృషి, యోగ్యతల ద్వారా విజయం సాధించిన వ్యక్తులుగా చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. మరొకవైపు తక్కువ కులాలకు చెందిన వ్యక్తులు విద్య, ఉపాధి అవకాశాలను పొందే క్రమంలో వారి కుల అస్తిత్వం కారణంగా తరచుగా వివక్షతను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా అనేక సందర్భాల్లో వారి కుల అస్తిత్వం ఇతర గుర్తింపుల స్థానంలోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఎంతో కృషి చేసినప్పటికీ, సమాజం వారికి సమాన అవకాశాలు కల్పించలేక పోవచ్చు. ఇది, వారు తమ హక్కుల సాధన కోసం, సామాజిక, ఆర్థిక అవకాశాల కోసం కుల అస్తిత్వమే సాధనంగా దానిపై ఆధారపడేట్లు వారిపై ఒత్తిడి తెస్తుంది. బీ.ఆర్.అంబేద్కర్ స్మారక ఉపన్యాసం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇలా వ్యాఖ్యానించారు... ''కులరహితం అనేది ఉన్నత కులాలకు చెందిన వారు మాత్రమే పొందగలిగే ఒక ప్రత్యేకమైన హక్కు, ఎందుకంటే వారి కులపరమైన ప్రత్యేక హక్కు ఇప్పటికే సామాజిక, రాజకీయ, ఆర్థిక పెట్టుబడిగా మారిపోయింది.''
ఉన్నత కులాలలో కులరహిత వాదనలు, చారిత్రక అన్యాయాలను సరిచేసి, తక్కువ కులాలకు చెందిన వారికి సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంగల నిశ్చయాత్మకమైన కార్యాచరణ విధానాలను ప్రతిఘటించే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు రిజర్వేషన్ విధానాలకు వ్యతిరేకంగా కుల రహిత సమాజం అవసరాన్ని నొక్కి చెపుతూ వాదిస్తారు. ఇది కొన్ని కులాలకు చెందిన వారిని ఏకీకృతమైన దేశ పౌరులుగా కాక వారి కుల అస్తిత్వంతో గుర్తించే విధంగా ప్రోత్సాహిస్తుంది. అది యోగ్యతాస్వామ్యానికి (మెరిటోక్రసీ) వ్యతిరేకంగా పనిచేస్తుందని వాదిస్తారు.
కుల రహితం గురించి వాదనలు చేస్తున్న క్రమంలో ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తులు ఇప్పటికీ సమాజంలో ఉన్న కుల ఆధారిత వివక్షత, అసమానతలను విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అనేకమంది తక్కువ కులాలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్ విధానాలు ఒక మార్గం చూపుతూ విద్య, ఉపాధి అవకాశాలను సమకూర్చాయి. లేకుంటే వారు ఆ అవకాశాలు కలిగి ఉండేవారు కాదు. అందువలన కుల రహితం అనేది ఇప్పుడు కుల అధికారం, కులపరమైన ప్రత్యేక హక్కులకు ఒక కొత్త ముసుగుగా చూడాలి. అదే సమయంలో ఇది కుల ఆధారిత వివక్షతను ఎదుర్కొంటున్న వారి ఆకాంక్ష కూడా.
డాక్టర్ అంబేద్కర్ దార్శనికత
భారతీయ సమాజంలో కులం చాలా లోతుగా పాతుకొని పోయింది. దానిని పెకిలించి వేసేందుకు తగిన విధంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ అన్నాడు. ఆయన చెప్పేదాని ప్రకారం కుల నిర్మూలనకు విద్య చాలా కీలకం. విద్య వ్యక్తులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అధికారాన్నిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారా విద్య, వ్యక్తులు పేదరికం, అణచివేతల నుండి తప్పించుకునేందుకు సహాయపడు తుంది. ఇది వారి హక్కుల సాధన కోసం, ప్రజాస్వామిక ప్రక్రియలో వారి రాజకీయ ప్రాతినిధ్యానికి సహాయపడుతుంది. ఉనికిలో ఉన్న సామాజిక క్రమాన్ని సవాల్ చేయడానికి, కుల ఆధారిత వివక్షతను కొనసాగించడానికి ఏర్పాటు చేయబడిన అవరోధాలను బద్దలు కొట్టడంలో ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ వారికి సహాయపడుతుంది.
అంబేద్కర్ చెప్పేదాని ప్రకారం, కుల రహిత సమాజాన్ని సృష్టించడానికి కులాంతర వివాహాలు ఓ ముఖ్యమైన ముందడుగు. కులపరమైన ప్రత్యేక హక్కులను పునరుత్పత్తి చేయడానికి, ప్రస్తుతం ఉన్న సామాజిక క్రమాన్ని కొనసాగించడానికి వివాహం ఒక సాధనం అని ఆయన వాదించాడు. కులాంతర వివాహాలు కుల అవరోధాలను బద్దలు కొడతాయి. ఇలాంటి వివాహాల ద్వారా పుట్టిన వ్యక్తులు ఒకే కులంతో సంబంధాలు కలిగి ఉండరు, కుల స్వచ్ఛత సాంప్రదాయ భావనను వారు సవాల్ చేస్తారు. కులాంతర వివాహాలు, ఐక్యత, కులరహిత సమాజాన్ని సాధించ డానికి అవసరమైన భాగస్వామ్య గుర్తింపును సృష్టించడానికి సహాయపడతాయని అంబేద్కర్ విశ్వసించాడు.
- తన్మయ ప్రకాష్
(''ద హిందూ'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్,
9848412451