Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం, అనేక ఇతర బ్యాంకులు కూడా పతనం అంచున వేలాడటం, క్రెడిట్ సూస్సేని బలవంతంగా దివాళాతీయకుండా సొంతం చేసుకోవటంవంటి విషయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనారోగ్య స్థితినే కాకుండా ప్రపంచ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వానికి సంబంధించిన సమస్యలను, ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలరు పోషిస్తున్న పాత్రను చర్చనీయాంశం చేస్తున్నాయి. పుతిన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన తరువాత అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు రష్యా కేంద్ర బ్యాంకుకు చెందిన 300బిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ ఆస్తుల ను ఘనీభవింపజేశాయి. అమెరికా తీసుకున్న ఇటువంటి చర్యపై డాలరు ఆధిపత్యం కారణంగా పెద్దగా చర్చ జరగకపోయినా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వణికిపోయాయి. రష్యాలాంటి అగ్రరాజ్యానికే ఇలా జరిగితే భవిష్యత్తులో అమెరికాకు నచ్చని ఏ దేశానికైనా నిస్సందేహంగా ఇలా జరు గుతుంది. ఇప్పటికే ఇరాన్‌కు ఇటువంటి అనుభవం ఉంది. ట్రంప్ పాలన లో ఐరోపా రాజ్యాలు అభ్యంతరం తెలిపినప్పటికీ డాలరు ఆధిపత్యం కారణంగా అమెరికా ఏకపక్షంగా ఇరాన్‌పై ఆంక్షలను విధించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చలలో ప్రధానంగా చోటుచేసుకున్న అంశం గురించి మీడియా పెద్దగా పట్టించుకోని విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు ఫరీద్ జకారియా వాషింగ్టన్ పోస్టు పత్రికలో పేర్కొన్నాడు. అదే చర్చల అనంతరం పుతిన్ చేసిన ప్రకటన: ''రష్యాకు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మధ్య జరిగే వ్యాపార లావాదేవీలను చైనీస్ కరెన్సీ యువాన్‌ను రిజర్వ్ కరెన్సీగా చేసుకుని జరుపుకుంటాం''. అంతర్జాతీయ ఫైనాన్షియల్ వ్యవస్థ లో డాలరు ఆధిపత్యానికి గండి కొట్టటమే లక్ష్యంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా, ఆ దేశానికి చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులను అత్యంత అధికంగా ఎగుమతి చేస్తున్న రష్యాలు పని చేస్తాయనే ఉద్దేశం ఈ ప్రకటన వెనుక ఉన్నదని జకారియా విశ్లేషించాడు.
ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలరు స్థానంలో మరొక కరెన్సీ రాకపోవ చ్చు కానీ అది పలుచోట్ల దెబ్బతిని అనివార్యంగా బలహీనపడుతుంది. ఇటు వంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. చైనా, రష్యాలు తమ వాణిజ్యాన్ని గణనీయంగా తమతమ కరెన్సీలలోనే సాగిస్తున్నాయి. సౌదీ అరేబియా నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న చమురుకు చైనా యువాన్‌లోనే చెల్లింపులు జరుపుతోంది. 50 సంవత్సరాల తరువాత సౌదీ అరేబియా మొట్టమొదటిసారిగా తన చమురు ఎగుమతులకు అందుకునే చెల్లింపుల లో డాలరు కాకుండా మరో కరెన్సీని అంగీకరిస్తోంది. చైనా నుంచి ఎల్ఎన్జీ కొనుగోలు చేసినప్పుడు ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ చైనాకు యువాన్ లోనే చెల్లింపులు జరిపింది. లాటిన్ అమెరికాలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రాజిల్తో చైనాకు సాలీనా 150 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది. బ్రాజిల్కు చైనా ఆవిధంగా అత్యంత గరిష్ట వాణిజ్య భాగస్వామి. ఈ రెండు దేశాలు తమతమ కరెన్సీలలోనే తమ వాణిజ్యాన్ని కొనసాగించుకోవాలని నిర్ణయించటం కూడా డాలరు ఆధిపత్యానికి దెబ్బగా పేర్కొనవచ్చు. అంతే కాదు అమెరికా ఆధిపత్యంతో కొనసాగుతున్న అంతర్జాతీయ చెల్లింపుల, మెస్సేజింగ్ వ్యవస్థ స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా చైనా ఒక వ్యవస్థను నెల కొల్పబోతోంది. అంతేకాక త్వరలో బ్రిక్స్ (బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల ఆధ్వర్యంలో బ్రిక్స్ కరెన్సీ కూడా వచ్చే అవకాశం కనపడుతోంది.
గతంలో బ్రిటీష్ వలస పాలనతో ప్రాబల్యంలోకి రావటం, వలసలపై ఆధిపత్యం కోల్పోయాక పౌండ్ స్టెర్లింగ్ బలహీనపడటం ఎలా జరిగిందో అలాగే రెండవ ప్రపంచ యుద్ధానంతరం పెట్టుబడిదారీ ప్రపంచంపై అమెరికా ఆధిపత్యంతోపాటు డాలరు ఆధిపత్యం కూడా ఆవి ర్భవించింది. నేడు అమెరికన్ డాలరు ఆధిపత్యంపై విసురుతున్న సవాలు వాస్తవంలో ప్రపంచం మీద అమెరికా సామ్రాజ్య వాదం చలాయిస్తున్న ఆధిపత్యంపైన విసురుతున్న సవాలుగా ఉంది. ఇది ''ఏక ద్రువ ప్రపంచం'' నుంచి ''బహుళద్రువ ప్రపంచం''గా పరిణామం చెందే ప్రక్రియ. డాలరు ఆధిపత్యం శాశ్వతం అని నమ్మటం అంటే వర్తమాన ఏక ద్రువ ప్రపంచం శాశ్వతం అని నమ్మటమే. ''ఏక ద్రువ'' ప్రపంచం ''అనేక ద్రువాలు''గా పరిణ మించటం కాదు ప్రజాస్వామిక వాదులు కోరుకోవలసింది. కావలసింది ద్రువాలు అనేవే లేని ప్రపంచం. దేశాలు తమ స్థానిక, ద్వైపాక్షిక లేక బహుళ అవసరాలను అంగీకరిస్తూ తమతమ కరెన్సీలలో వాణిజ్యాన్ని కొనసాగించు కోవటమే సముచితంగా ఉంటుంది.
- నెల్లూరు నరసింహారావు