Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దొంగకు తేలుకు అవినాభావ సంబంధం ఉంది. ఓ సినిమాలో దొంగ తన జేబులో ఓ నల్ల తేలును పెట్టుకొని తిరగడం చూడొచ్చు. అయితే ఆ తేలు వేరు ఈరోజు చెప్పుకునే తేలు వేరు. తేళ్ళయందు ఉన్న రకములు వేరయా అని పద్యంలా కూడా చెప్పుకోవచ్చు. అసలు తేలు కొన్ని చోట్ల దాక్కొని ఉండి దొంగలాగా కుడుతుందని అనుకున్నా దాని పని మీద అది పోతూ ఉంటే మనిషే దాంతో కుట్టించుకుంటాడని కొందరి అనుభవం. ఏమైనా తేలుతో పెట్టుకుంటే కష్టమే. ఒక్కోసారి ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు ఎక్కువైపోయి గుర్తులు కేటాయించడం కష్టమైనప్పుడు తేలు గుర్తు కూడా పెట్టిన సందర్భా లున్నాయి. అలా తేలు పై చెప్పు కుంటూ, వినుకుంటూ పోవచ్చు.
ఓ దొంగతనానికై పోయిన దొంగకు తేలు కుట్టిందట. అనుకుంటాం కాని చాలా కష్టమైన సందర్భం, దొంగకి. గట్టిగా అరవలేడు, అరిస్తే ఇంటివాళ్ళొచ్చి బొక్కలిరగదీస్తారు. మరేం చేయాలి. వేరే దారి లేదు, నోరు మూసుకుని చేస్తున్న దొంగతనాన్ని ఆపి, ఇంటికిపోయి మందేమైనా వేసుకొని రెస్టు తీసుకోవాలి. లేదూ వచ్చిన పని ముఖ్యం అని ఆ సామాను, ఈ సామాను తాను తెచ్చిన సంచిలో వేసుకుంటూ ఉంటే చిమక్ చిమక్కుమని తేలు కుట్టిన నొప్పి, దాని విషం ఒంట్లోకి పోతున్న క్రమం తెలుస్తూ, మనిషి ఏకాగ్రత లేక వచ్చిన వ్యవహారమేమో కాని, తాను ఇంకెక్కడో కొట్టుకొచ్చిన వస్తువులు కూడా ఇక్కడ అంటే తేలు కుట్టిన ఇంట్లో పెట్టి పోవలసి వస్తుంది. అది సంగతి. అందుకే అరవడం లాంటివి లేకుండా, ఇక ఆలస్యం చేయకుండా వచ్చిన దొంగ దొంగలా జారుకోవడం ఉత్తమం. బయటకొచ్చాక ఏమైనా అరుచుకోవచ్చు, అది వేరే సంగతి.
అసలు ఏ పల్లెలో కూడా ఇప్పుడు తేళ్ళు కనబడని పరిస్థితి. వర్షాకాలం మొదట్లో భూమి లోపల ఉండే వేడికి తట్టుకోలేక తేళ్ళు బయటికొస్తాయి. ఇప్పుడైనా పొలాల్లో రాళ్ళు తీసి చూస్తే కనిపిస్తాయవి. పురుగుల కోసం, బొద్దింకల కోసం, ఇంకా ఇతర కీటకాలు రాకుండా మానవుడు మందులేయబట్టి ఈ తేళ్ళు, జర్రులు కనబడకుండా పోయిన పరిస్థితి. పిల్లలకి తేలు అని చెప్పినా అర్థం కాని కాలం, స్కార్పియన్ అని చెబితే కాని సమజై చావదు. మానవుడు తాను బతకడానికి ఎన్నో జంతువులను, జీవులను చంపుతాడు. అసలు జీవితం వాటితో పాటు జీవించడమని మరచిపోయాడు. మెదడుకు పోయే కాలం వచ్చినప్పుడు అలాగే ఉంటుంది మరి.
తేలంటే నాకు వెంటనే గుర్తొచ్చేది మన పాత ముఖ్యమంత్రి అంజయ్య గారు. ఆయన్ పేరు వింటేనే నవ్వొస్తుంది. ఆయనలోని పిల్లవాడే ఎప్పుడూ బయటకు కనిపించేది. పిల్లల్లాగే ఆయన ప్రజలను ప్రేమించే మనిషి. ఆయన ఎంత సాధారణ మనిషో, ఎంత మంచివాడో, ఎంత లోకప్రియుడో చెప్పాలంటే పేజీలు పేజీలు చాలవు. ఒక సారి గోదావరిలో అంటే నదిలో చమురు పడింది. ఆ సంతోషం తట్టుకోలేకనేమో గోదారిలో తేల్ పడింది అనేశాడాయన. తేల్ అంటే నూనే అని కదా అర్థం. హిందీ కాని, ఉర్దూ కాని అంత సరిగా తెలీని జనాలు గోదావరిలో తేలు పడితే ఏమవుతుంది అని ఎవరి మెదడుకు తోచినంత వాళ్ళు అనుకున్నారు. కొందరైతే బయటికే అనేశారు. అలా గోదారిలో తేల్ పడ్డ సంఘటన తమాషాగా చెప్పుకోవచ్చు. గుర్తుకు రాక మానదు, అలాంటిది మరి మనం ఎంచుకున్న సబ్జెక్టు.
జనాలు సెల్లులో మొహం పెట్టి చదవడం మానేశారు కాని, వాళ్ళకో సూచన. వీరేశలింగం పంతులు గారి హాస్య సంజీవని అదే సెల్లులో కొడితే గూగుల్ తల్లి చూపిస్తుంది. ఒకానొక పోరగాడు తేలు మంత్రం నేర్చుకుందామని ఒక అయ్యోరి దగ్గరికి పోతాడు. తేలు మంత్రమేమిటి అని పిల్లలు ఆశ్చర్యపోవచ్చు. కాని ఇప్పుడు చెప్పుకునే స్టోరీ పాత కాలానికి చెందింది అని మరవొద్దు. సరే ఆ అయ్యోరు తేలు మంత్రం నేర్పుతాను, ఫలానా చెట్టెక్కి దాని ఆకులు కోసుకురమ్మని పంపించాడు. మనోడు, అంటే తేలు మంత్రం నేర్చుకోవాలని తహతహలాడే పోరగాడు ఊరంతా తిరిగి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి ఆ చెట్టేదో కనిపెట్టి ఆకులు కోద్దామని చెట్టెక్కుతాడు. ఆకులు కోస్తున్నాడు. ఇంతలో ఒక ఆకు వెనుకనున్న ఒకానొక తేలు నా పుట్టలో ఏలెడితే కుట్టనా అన్న చీమ మాదిరి వాణ్ణి కుట్టేసింది. వాడు కుయ్యో మొర్రో అనుకుంటూ ఆ అయ్యోరి దగ్గరికే పోతాడు మందో, మాకో, మంత్రమో ఏదో ఒకటి వేసుకుందామని. ఇంతటి తమాషా కథని ఆ కాలానికే రాసిన వీరేశలింగం గారిని మనం మెచ్చుకోవలసిందే. అలా తేలు మంత్రం నేర్చుకుందామని పోయిన పోరగాడికి తేలు కుట్టినందుకు వచ్చే నొప్పికి మంత్రం వేయడమేమో కాని అసలు తేలుతో కుట్టించుకోకపోవడమ సుఖం అన్న విషయం తెలిసి వచ్చింటుంది. వాడి బుర్రలో తెలివి ఉంటే అలాగే చేస్తాడు.
ఇక దొంగల ప్రతిజ్ఞ గురించి చూద్దాం. దొంగతనానికి పోయే దొంగ ఇతర దొంగలతో కలిపి ఇలా ప్రతిజ్ఞ చేయొచ్చు ''దొంగనైన నేను, నా పని నిర్వర్తించే సమయంలో, తేలుకుట్టినా, ఇంకేదైనా కీటకం కుట్టినా, గట్టిగా అరవనని, సహనంతో తట్టుకుంటానని, నేను చేసేది దొంగతనమైనా పట్టుబడితే ఇతరులవైపు వేలు చూపించి దొంగ దొంగ అని అరుస్తానని...'' ఇలాగుండొచ్చు. రౌడీ అల్లుడు సినిమాలో చిరు మారువేషంలో ఇంకో చిరుగా పోవలసి వస్తే, తనను పంపుతున్న దొంగలతో ప్రమాణం చేయిస్తాడు, మాట తప్పము అని. అలా దొంగలకూ ప్రతిజ్ఞలుంటాయని మరువరాదు. దొంగకు దొరలాగా మాట్లాడటం కూడా వచ్చి ఉండాలి. దొరలతో స్నేహం ఉండాలి, దొంగలను దొరలుగా మార్చడమెట్లో వచ్చి ఉండాలి. స్వతహాగా తాను ఆ క్రమంలో ఎలా పైకొచ్చిందీ తేలును చంపాల్సి వచ్చినప్పుడు దొరకని చెప్పు, వేరే సమయంలో దొరికితే వాటిని మోసి పరవశించి పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని మురిసి మురిసి పోయే వాళ్ళు దొరతనానికి దగ్గరయ్యే మార్గమేదో కనిపెట్టా మని ఫీలవుతుంటారు. అలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని ఆరాటపడుతుంటారు.
- జంధ్యాల రఘుబాబు
9849753298