Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ఎన్నికల గాలి జోరుగా వీస్తున్న తరుణమిది. డబ్బు, మద్యమే రాజకీయాలను శాసిస్తున్న కాలమిది. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు గెలవక ముందోమాట, గెలిచాక ఒక మాట చెప్పుతున్న పరిస్థితి. వీటికి భిన్నంగా గత కాలచరిత్రలో నిక్కచ్చిగా నిలిచి నిస్వార్థ రాజకీయాలను నింగెత్తు నిలిపిన మహానేత నర్రా రాఘవరెడ్డి. చివరికంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవించిన నిండైన వ్యక్తిత్వమూర్తి. నాటి అసెంబ్లీలో పల్లెపరిమళం. మాటల ఊట, ఉద్యమాల కోట, స్ఫూర్తినిచ్చే బాట ఆయనది.
1924న ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో నర్రా కనకమ్మ, రాంరెడ్డి దంపతులకు రాఘవరెడ్డి జన్మించాడు. చిన్ననాడే భాగవతం, నీతికథలు, శతక పద్యాలను పుక్కిటబట్టాడు. కొన్ని కారణాలరీత్యా బొంబాయికి వలసపోయాడు. తొలుత ఒక హౌటల్లో కార్మికునిగా చేరాడు. తర్వాత సూరత్‌కు చేరుకుని బట్టలమిల్లులో పనిచేశాడు. అక్కడే లాల్‌బావుటా కార్మిక సంఘానికి ఆకర్షితుడై ఉద్యమంలో తిరుగుతూ వచ్చాడు. అలా 1945 నుండి ప్రజా ఉద్యమాల్లోకి ప్రవేశించిన నర్రా ఎక్కడా వెనుదిరగలేదు. అన్యాయం, అక్రమం ఉన్నచోట ఫిరంగై నిలబడ్డాడు. తండ్రి పిలుపుతో తిరిగి స్వగ్రామం చేరుకుని జిల్లా కేంద్రంగా ఉద్యమించడం, విస్తృతంగా కమ్యూనిస్టు పార్టీలో తిరగడం ప్రారంభించాడు. సామాన్యుల, రైతుల, కార్మికుల పక్షాన నిలబడి నడిచాడు. 1950లో పార్టీ సభ్యత్వం తీసుకుని క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు. తారకమ్మతో వివాహమైనప్పటికీ ప్రజాసేవలో వెనకడుగు వేయలేదు.
1952 సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరపున అతికష్టం మీద 12మంది అభ్యర్థులను ఎంపికచేసి ఎన్నికల్లో నిలబెట్టగా యువకుడైన రాఘవరెడ్డిని చినకొండూర్ నియోజకవర్గానికి ప్రచారకుడిగా పంపింది. అక్కడినుండే ఆయన కళాకారుడిగానూ రాణించాడు. వట్టిమర్తిలోనే గాక, జిల్లా వ్యాప్తంగా పార్టీ నిర్మాణానికి ఎనలేని కృషి చేస్తూ వచ్చిన నర్రా 1959-67 మధ్యకాలంలో వట్టిమర్తి గ్రామసర్పంచ్‌గా ఎన్నికైనాడు. తర్వాత అనేక పదవులు చేపడుతూనే ప్రజలతో మమేకమై మంచిపేరును గడించాడు.
భారత-చైనా యుద్ధం కారణంగా సీపీఐ(ఎం) నాయకుల్ని బంధించింది నాటి ప్రభుత్వం. అలా రాఘవరెడ్డి ఒకటిన్నర సంవత్సరాలు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. 1966లో విడుదలై 1967లో అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో రాఘవరెడ్డి పోటీచేశాడు. కేవలం రూ.300లు మాత్రమే ఖర్చుచేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. పాతకాలపు మోటర్ సైకిల్‌పై ఒక సహాయకుడిని వెంట పెట్టుకుని ప్రచారం చేయడం, గెలవడం గమనార్హం. 1972 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. నిజానికి నక్సల్బరీ వాదం రావడం, పార్టీ చీలికకావడం ఆ ఓటమికి కారణాలు. వ్యక్తిగతంగా నర్రా గెలుపొందినట్లే లెక్క అటు తర్వాత వరుసగా 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలుపొందడం, వృద్ధాప్యం కారణంగా స్వచ్ఛందంగా పోటీనుండి తప్పుకోవడం రాఘవరెడ్డి ప్రత్యేకతలు. 1994 ఎన్నికల ప్రచారంలోనూ కేవలం రూ.30వేలు మాత్రమే ఖర్చుచేయడం చెప్పదగిన విషయం. సుదీర్ఘకాలం పదవిలో ఉన్నా చిల్లి గవ్వకూడా అక్రమంగా సంపాదించలేదు. ఏ ఒక్కరికీ అన్యాయం చేసిన దాఖలాలు లేవు. నిరంతరం ప్రజాసమస్యల పట్ల స్పందిస్తూ అధికార పార్టీకి చురకలు అంటిస్తూనే వాటిని పరిష్కరింపజేసిన ఘనత రాఘవరెడ్డిది.
సుదీర్ఘ శాసన సభ్యత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్, ఎన్. జనార్థనరెడ్డి, చంద్రబాబునాయుడు ఇలా అనేకమంది ముఖ్యమంత్రుల పాలనను చూశాడు. ప్రతిపక్ష నేతగా ఉంటూ అనేక సమస్యల్ని వాళ్ళ ముందుంచేవాడు. గ్రామాల విద్యుద్దీకరణ, ప్రాజెక్టులపై, ముఖ్యంగా ఎస్ఎల్బిసి విస్తరణ పూర్తికోసం ఎన్నో కార్యక్రమాలు, దీక్షలు చేశాడు. సాధించుకొచ్చాడు. 1975 ఎమర్జెన్సీ మూలంగా మరోసారి జైలుకెళ్ళినా జైలులోనూ అందరినీ నవ్విస్తూ, నిరంతర అధ్యయనం చేస్తూ వచ్చాడు. 1978 శాసనసభలో సీపీఐ(ఎం) అభ్యర్థులు 8మంది ఉన్నా రాఘవరెడ్డి క్రియాశీలకంగా ప్రజలపక్షాన పనిచేశాడు. బాగారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో గ్రామాలకు రోడ్లు సాధించుకున్నాడు.
జనార్థన్‌రెడ్డి ఎస్‌ఎల్‌బిసిపై ఎగతాళిగా మాట్లాడితే సహించలేదు. పట్టుబట్టి మరీ సాధించుకున్నాడు. చంద్రబాబు సీఎం అయినప్పుడు నర్రానే వారికి పెద్దదిక్కుగా వ్యవహరించాడు. రైతులపక్షాన నిలబడి నీటిసుంకాలు రద్దుచేయించాడు. గీతకార్మికులవైపు నిలబడి 'గీసేవారికే చెట్టువిధానం' ద్వారా సంఘాలను ఏర్పరచి వారికై పోరాడాడు. పేదలకు బంచరాయి భూపంపిణీలోనూ, డిబిఆర్ మిల్స్ కార్మికులకు న్యాయం చేయడంలోనూ, రైస్ మిల్లర్లకు స్లాబ్ రేటు తగ్గించడంలోనూ, హైదరాబాద్‌లో ఎస్సీకే స్థలసేకరణ, నిర్మాణంలోనూ, జిల్లా వ్యాప్తంగా తాగునీరు, కరెంటు సాధనలోనూ, విద్యకై పాఠశాలలను నెలకొల్పడంలోనూ, హైదరాబాద్- సికింద్రాబాద్‌లో కృష్ణాజలాల మళ్ళింపు విషయంలోనూ పోరాడాడు. మహిళా కమిషన్ బిల్లులో మార్పుల ఏట్లనూ, ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపెంపుదలలోని సమస్యలను వ్యక్తపరచడంలోనూ, బీబీనగర్-నడికుడి రైలుమార్గం సాధనలోనూ ఇలా అనేక ప్రజోపయోగ పనులకు రాఘవరెడ్డి నాడు ముందు వరుసలో నిలబడి సాధించే వరకు విశ్రాంతెరుగని స్వచ్ఛమైన ప్రజానేతగా వెలుగొందాడు.
నాటి పంచవర్ష ప్రణాళికలోని లోపాలు ఎండగడుతూ 'లత్కోర్సబ్ పుస్తకం తీయడంతోపాటు గొల్ల సుద్దులతో జనాలను చైతన్యం చేసిన కళాకారుడు. అసెంబ్లీలో తెలంగాణ తెలుగుభాషను నిటారుగా నిలిపిన మాతృభాషాభిమాని. తెలంగాణ నుడికారాలు, పలుకుబడులతో, సామెతలతో సభను ఉత్తేజపరిచిన ఘనత ఆయనది. ఈ విషయంలో రాఘవరెడ్డి కృషిని కొనియాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రస్తావించడం సముచితం. నిజమే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రిగారన్నట్లు నర్రా అచ్చంగా 'ప్రజలవ్యక్తి'. నిరాడంబర రాజకీయాలకు నిలువెత్తు స్ఫూర్తి. ముందుతరాలకు ఆదర్శదీప్తి.
(నేడు నర్రా రాఘవరెడ్డి వర్థంతి)
- నర్రా ప్రవీణ్‌రెడ్డి, సెల్:9393636405