Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ హడావుడి ప్రధాని మోడీ రాకతో పరాకాష్టకు చేరింది. అక్షరాలా అధికార కార్యక్రమమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దాడికి దిగిన మోడీ దాదాపు ఎన్నికల ప్రచారసభలా మార్చేశారు. ఒకటికి రెండు ఆడియో విజ్యువల్స్ ప్రదర్శిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి గొప్ప కృషి జరుగుతున్నట్టు చిత్రించుకున్నారు. తర్వాత తనే స్వయంగా తన ప్రసంగంలోనూ అదే పాట పాడారు. దేశంలో ప్రాథమిక సదుపాయాల మెరుగుదల కోసం రవాణా విస్తరణ కోసం కేంద్రం పరితపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తిట్టిపోశారు. తాను అవినీతిపై పోరాడుతుంటే పరివార్‌వాదులు అంటే కుటుంబపాలన చేసేవారు అడ్డుతగులు తున్నారని ఆరోపణలు గుప్పించారు. మరో విధంగా చెప్పాలంటే పరోక్ష భాషలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుటుంబంపై కసితీరా దాడి చేశారన్నమాట. ఇతర పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలసిరావడం లేదని అందరిపై అభాండం వేశారు. దానికి ముందు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోడీ నాయకత్వం వర్థిల్లాలని పదేపదే నినాదాలు చేయించి తమ ఉద్దేశం బయటపెట్టుకున్నారు. హైదరాబాద్‌కు చార్మినార్ సంకేతమైతే మోడీ మాత్రం భాగ్యలక్ష్మి ఆలయం చిహ్నమనడంలోనూ, కిషన్‌రెడ్డి పదేపదే హిందువులు తిరుపతి దేవుణ్ని చూడాలనుకుంటారని నొక్కిచెప్పడం లోనూ వారి మతరాజకీయం బహిర్గతమైంది. అంతేగాక సంతుష్టీకరణ విధానాల పేరిట మైనార్టీ సంక్షేమంపై ధ్వజమెత్తే బీజేపీ నిరంతర పల్లవి కూడా ఆలపించారు.
ఏపీలో మూడు పార్టీల వంత
నిజానికి దేశంలో వందేభారత్ రైలుకు పదోసారి పచ్చజెండా ఊపడం మోడీకే చెల్లింది. దశాబ్దాలుగా నడుస్తున్న ఎంఎంటిఎస్ పనులకు కూడా మరోసారి శంకుస్థాపన చేశారు. అయితే ఇవేవీ యాదృచ్చికమైనవి కానేకాదు. తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో విధంగా రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతున్నది. ఇక్కడి ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బతీసి తను పాదం మోపడం. బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ మతతత్వ రాజకీయాలు కేంద్రం నిరంకుశ పోకడలపై తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ విషయంలో వామపక్షాలు సహకారం ఇస్తున్నాయి కూడా. తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న కాంగ్రెస్ విచిత్రంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఆరోపిస్తుంది. మిగిలిన రెండుపార్టీలూ ఇదే విధంగా అవతలివారిపై ఆరోపణలు చేస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా చెబుతూ బీఆర్ఎస్తో అవగాహన సాధ్యమేనన్నట్టు మాట్లాడుతుంటారు. జాతీయ స్థాయిలో ఈ మధ్య చాలా సందర్భాలలో ప్రతిపక్ష కార్యాచరణలో ఈ రెండు పార్టీలూ కలసి పనిచేస్తున్నాయి గాని రాష్ట్రంలో ఆ సూచనలు లేవు. అదే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి మోడీ సర్కారుతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రధాన ప్రతిపక్షనేత టీడీసీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నట్టు చూపించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అంతకు ముందునుంచి బీజేపీతో మిత్రుడుగా కొనసాగుతూ వచ్చే ఎన్నికలలో ఓట్లచీలిక నివారిస్తానంటున్నారు. సీపీఐ నాయకులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా అందరూ ఒకతాటిపైకి రావాలని మాట్లాడుతున్నారు. వామపక్షాలు కూడా మాతోనే ఉంటాయన్నట్టు చెబుతున్న టీడీపీ నేతలు ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలను అందుకు నిదర్శనంగా చూపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీని కూడా కలుపుకోవాలని చెప్పడంపై సీపీఐ(ఎం) బహిరంగంగానే భిన్నాభిప్రాయం వెలిబుచ్చుతున్నది. వైసీపీ సర్కారులాగే ఈ పార్టీలు కూడా బీజేపీ కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడం గాక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటం చేయాలని, లౌకిక ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని నొక్కి చెబుతున్నది. ఇటీవలే ముగిసిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఇదే విషయం నొక్కి చెప్పడమే గాక కార్యాచరణ కూడా ప్రారంభించినట్టు కనిపిస్తుంది. తాజాగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఇందుకో ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకూ సీనియర్ నాయకులు వడ్డే శోభనాదీశ్వరరావుకు మధ్య జరిగిన వాడీవేడి చర్చ ఇందుకు అద్దం పడుతుంది. పోలవరం విషయంలో కీలకమైన కేంద్రాన్ని పక్కన పెట్టి గత ప్రస్తుత ప్రభుత్వాల కోణంలోనే విమర్శలు గుప్పిస్తే ఉపయోగం ఏమిటన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. నిజానికిది ఏపీ రాజకీయాలలోనే సంక్లిష్టమైన అంశం.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య అవగాహన, ఉద్యమాలు ఉమ్మడి పోరాటం పెరుగుతున్న కొద్ది వచ్చే ఎన్నికలలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి పెద్ద సవాలుగానే తయారవుతున్నది. నిరంకుశ కార్పొరేట్ మతతత్వం అదానీ కుంభకోణాలు, రాహుల్ అనర్హత వేటు వంటివాటిపై అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న నిరసనలు ప్రజాగ్రహాలు బీజేపీని భయపెడుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీలూ, వామపక్షాలు ఉన్న చోటగతంలో వలే నల్లేరు మీద బండిలా గెలవలేకపోవచ్చన్న వాస్తవం భయపెడుతున్నది. ఉన్న మిత్రపక్షాలు కూడా దూరం కాగా కలసివచ్చే వారు కరువవుతున్నారు. అందులోనూ దక్షిణాదిన కాలూనడం బీజేపీకి ఎప్పుడూ సవాలుగానే ఉంది. కర్నాటక చేజారవచ్చన్న అంచనాలు అన్నివైపులా వినిపిస్తున్నప్పుడు, కేరళ, తమిళనాడులలో ఠికానాలేనప్పుడు తెలుగు రాష్ట్రాలపైనే ఆ పార్టీ అధిష్టానం దింపదుడు కళ్లం ఆశ పెట్టుకుంది.
ప్రాంతీయ పార్టీల తీరు
మొదటగా టీడీపీ 41వ వ్యవస్థాపక సభ హైదరాబాదులో జరిగింది. చంద్రబాబు ప్రసంగంలో బీజేపీ విధానాలపై ఒక్క విమర్శ కూడా లేకపోగా ఒకటి రెండు సార్లు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనతో కలసి తాను సాధించిన విజయాలు కూడా చెప్పడమే గాక పరోక్షంగా పెద్దనోట్ల రద్దును సమర్థించారు. పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబుకు అవగాహన ఉందనీ, జనసేన సీట్ల వరకూ చెప్పి బీజేపీ విషయం తనకు వదిలేయమని ఆయనకు చెప్పారని టీడీపీ కీలక నాయకులు చెబుతున్నారు. ఈ మధ్య ఒకటి రెండు సందర్బాలను పురస్కరించుకుని బీజేపీ అధ్యక్షుడు నడ్డా టీడీపీ గురించి సానుకూల సందేశాలిచ్చారు. అయితే వారే తమ వెంటపడుతున్నారని బీజేపీ నేతలంటారు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి జగన్ ఒకటికి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులను కలసి వచ్చాక పార్లమెంటులో ఏపీ ప్రశ్నలకు దాటివేత సమాధానాలు ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపేది లేదనీ చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎంత సానుకూలంగా చిత్రించినా పోలవరం సహా ఏ సమస్యపైనా కేంద్రం అవసరమైన చర్యలు నిధుల విడుదల చేసింది లేదు. విచిత్రంగా ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఆపార్టీ ఎంత హంగామా చేసినా కంటితుడుపుగా కొద్దిసేపు నడ్డాను కలిసాననిపించారు తప్ప భాగస్వామిగా ఆదరించింది లేదు. ఓట్ల చీలిక నివారించడం అనే పాట తప్ప ఆయన కొత్తగా చెప్పింది లేదు. మోడీ విశాఖ రాకలోనూ ఇలా కొద్దిసేపు భేటీ జరిపి రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయి అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనూ సాధించింది శూన్యమే. ఏపీ విషయంలో సానుకూల చర్చలు తీసుకునే ఉద్దేశమే బీజేపీకి లేదని దీంతో మరోసారి స్పష్టమైంది. అయితే దీని తర్వాత కూడా జనసేన నాయకులు కేంద్రం ఏదో ఒరగబెట్టినట్టు రాష్ట్రందే తప్పయినట్టు మాట్లాడటం వింత గొల్పుతుంది. రాహుల్‌గాంధీ అనర్హత సమస్యపై కలసి రావాలని కెవిపి రామచంద్రరావు ప్రత్యేకంగా అభ్యర్థించినా టీడీపీ నుంచి అధికారిక స్పందన లేదు! 'మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాతో కలసిరాని ప్రాంతీయ పార్టీలతో మేమెందుకు కలవాలని' టీడీపీ నేతలు జవాబిచ్చారు. కనుకనే మూడు ప్రాంతీయ పార్టీలూ ఏదో రూపంలో బీజేపీ వ్యూహాలకే ఊతమిస్తున్న తీరును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఇటీవలి రాష్ట్ర కమిటీ సమావేశానంతరం నిశితంగా విమర్శించారు.
కొత్తపార్టీగా వచ్చిన వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిల బీజేపీతో కలసి కార్యక్రమాలు ప్రతిపాదించడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం ఇదే కోవలో ఉంది. నిరుద్యోగ సమస్యపై అంతా కలసి పనిచేయాలని చెప్పే పేరుతో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలను సందర్శించిన షర్మిల ఆ పార్టీలపై అనుచిత ఆరోపణలు చేస్తే తమ్మినేని గట్టిగానే ఖండించారు. బీజేపీ హానికర విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు మునుగోడు ఎన్నికలలో మద్దతివ్వడం సరైందేననీ స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్ బీ టీమ్‌గా ఉన్నారని మా ఆఫీసుకు వచ్చి నిందలు వేయడం మర్యాద కాదని షర్మిలకు సూటిగానే చెప్పారు. మీడియాలోనూ ఇది ప్రధాన చర్చనీయాంశమైంది గానీ కొన్ని పత్రికలు పనిగట్టుకుని షర్మిల వ్యాఖ్యలే ప్రధానం చేయడం మరోకథ.
నిరసనలే సమాధానం
తెలంగాణలో తామే అధికారానికి రాబోతున్నామని ఆర్భాటంచేసిన బీజేపీకి క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదని తేలిపోయింది. లిక్కర్ కేసు పేరిట బీఆర్ఎస్ ఎంఎల్‌సి కవితను అనేకసార్లు విచారించడమే గాక అరెస్టు అనివార్యం అని హల్చల్ చేసినా ఇంతవరకూ అది సాధ్యం కాలేదు. ఇక ముందు ఏమయ్యేది తెలియదు. దేశవ్యాపితంగానే ప్రతిపక్షాలు ఈడీ, సిబిఐల దుర్వినియోగాన్ని రాజకీయంగా, న్యాయపరంగా కూడా సవాలు చేయడం వాతావరణం మార్చింది. ఈ లోగా ప్రశ్నపత్రాల వ్యవహారంలో బీజేపీ పాత్ర అనుమానా స్పదంగా తేలి సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అరెస్టయ్యారు. బెయిలు మీద ఆయన వచ్చినా కేసు కొనసాగుతున్నది. బీజేపీ ఆశించినట్టు ప్రముఖు లెవరూ ఆ పార్టీలో చేరిందిలేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మాత్రం చేరారు గాని ఆయన వల్ల ఒరిగేది ఏమీలేదని బీజేపీ నేతలే చప్పరిస్తున్నారు. తెలంగాణలో ఆశించింది జరగలేదని అర్థమైన మోడీ అమిత్ షాలు పదేపదే పిలిచి మాట్లాడటం, పర్యటించడం సర్వసాధారణమై పోయింది. బీఆర్ఎస్ స్థాపన తర్వాత కేటీఆర్ ఏపీ వ్యవహారాలపైనా దృష్టి పెంచి విశాఖ ఉక్కుపై లేఖ రాయడం చర్చకు కారణమైంది. ఈలోగా సింగరేణిలో ఐదు బావులు వేలం పెట్టడంతో విశాఖ ఉక్కు తంతు పునరావృత మవుతున్నది. మోడీ పర్యటన సమయంలోనే బీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఆయనకు నిజమైన సమాధానంగా ఉన్నాయి. తెలంగాణలో సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రలు పూర్తికాగా సీపీఐ సాగిస్తున్నది. ఏపీలోనూ ఉభయ పార్టీలూ 14వ తేదీనుంచి ప్రజా సమీకరణలకు ప్రచారోద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి.
- తెలకపల్లి రవి