Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పూవు పుట్టగానే పరిమ ళిస్తుందన్నట్టు...' చిన్న వయస్సు నుంచే స్వాతంత్య్రం కోసం ఉద్యమ జెండా పట్టిన వీర వనిత విమలా రణదివే. ''సోదరీ సోదరులారా! మేలుకోండీ! దేశం మంటల్లో ఉంటే మనం నిద్రపోతే ఎలా? 13ఏండ్ల వయస్సులోనే 'సేవాదళ్' అనే స్వచ్ఛంద సంస్థలో చేరి ప్రభాత భేరీలు మోగించిన స్వేచ్ఛా పిపాసి విమలా రణదివే. ఆ వీర వనిత జీవిత అనుభవాలు శ్రామిక మహిళాలోకానికి స్ఫూర్తినిస్తాయనడంలో సందేహమేమీ లేదు. ఆమె పోరాట పటిమను అలవర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి. 'విమలా దీ' అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే విమలా రణదివే జన్మదినం ఏప్రిల్ 10, 1915. ఆమె బతికున్నన్నాళ్లు శ్రామిక మహిళ హక్కుల కోసం నిరంతరం పోరాడారు. కార్మికవర్గ పోరాటాల్లో శ్రామిక మహిళల పాత్ర గురించి విమలా రణదివే జ్ఞాపకాల్లో ప్రస్తావించిన అనేక విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో శ్రామిక మహిళలు నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఉపకిరిస్తాయనటంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో విమలా రణదివే జయంతి సందర్భంగా ఈ నెల 10నుంచి 17వరకు శ్రామిక మహిళలు-పని ప్రదేశాల్లో హక్కులు అనే అంశంపై స్మారక ఉపన్యాసాలు, సదస్సులు, జనరల్ బాడీలు, సెమినార్లు నిర్వహించాలని సీఐటీయూ పిలుపునిచ్చింది.
కామ్రేడ్ విమల 12ఏండ్ల వయస్సులోనే ఉద్యమ ప్రస్థానం ప్రారంభించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని 13ఏండ్లప్పుడే ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. విదేశీ వస్త్రాలనమ్మే దుకాణాల ముందు పికెటింగులు నిర్వహించాలనే పిలుపునందుకుని షాపు గుమ్మంలో నిలబడి విదేశీ వస్త్రాలెవరూ కొనొద్దని నినదించారు. దీంతో విదేశీ సైనికులు ఆమెను అరెస్టు చేసి, కోర్టుకి తీసుకెళ్లి జడ్జీ ముందు నిలబెట్టారు. మీరు చిన్నపిల్లలు... ''మీకు రాజకీయాలు తెలియవు...'' కాబట్టి 'క్షమాపణ చెబితే... మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం' అని జడ్జి అన్నారు. ఆ మాటలకు సమాధానంగా విమలా రణదివే, ''కుసుమ్.. మేము ఏం చేశామో, ఎందుకు చేశామో మాకు తెలుసు. కాబట్టి మేము క్షమాపణ చెప్పబోమని' తెగేసి చెప్పారు. దీంతో వారికి ఆరుమాసాలు జైలు శిక్ష, కఠిన కారాగారవాసం 'సీ'క్లాస్...'' అని తీర్పు వెలువరించారు. విడుదలై వచ్చాక చదువు కొనసాగించారు. కుటుంబ పోషణ కోసం టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆమె పుట్టిల్లు వామపక్షభావాల నిలయం. ఆమె సోదరుడు సర్ దేశారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె కమ్యూనిస్టు భావాలను వంట పట్టించుకున్నారు. గిర్ని కాంగార్ (మిల్లు కార్మికులు) సంఘంలో చేరి వారిని సంఘటితం చేయడం మొదలు పెట్టారు. సర్ దేశారు, బీటీఆర్్ కుటుంబాల మధ్య స్నేహం, అనుబంధం ఏర్పడ్డానికి కారణం వామపక్షభావాలే. ఆ విధంగా బీటీఆర్ చెల్లెళ్లు అహల్య (రంగేకర్), కుసుమ్‌తో విమలకు స్నేహం ఏర్పడింది. అందరూ కలిసి 'గిర్ని కాంగార్ సంఘం'లో చేరి పనిచేసేవారు. మిల్లు కార్మికుల సమ్మె సందర్భంగా అప్పటి బ్రిటిషు ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. నిషేధాజ్ఞలను ధిక్కరించి మరీ ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో కమల్ ధోండీ ప్రాణాలు పోయాయి. కుసుమ్ కాళ్లల్లో తూటాలు దిగబడి గాయాలయ్యాయి. అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్య్రం రాలేదు. రహస్య జీవితంలోనే బీటీఆర్తో వివాహమైంది. అరెస్టులు, జైళ్లు, రహస్య జీవి తాలు ఆమె జీవితంలో అంతర్భాగమయ్యాయి. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన కాలం మినహా, ఊపిరి ఉన్నంత వరకు ఉద్యమ జీవితాన్ని సాగించారు. స్వాతంత్య్రానంతరం మహిళా ఉద్యమం, కార్మికోద్యమం రెండింటిలోనూ కొనసాగారు. కార్మిక సంఘం కేంద్రం కలకత్తాలో వున్న కాలంలో టీ-కాఫీ-రబ్బర్ ప్లాంటేషన్ కార్మిక సంఘంలో బాధ్యతలు తీసుకున్నారు. భాష సమస్య ఉన్నప్పటికీ కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు పట్టుదలతో బెంగాలి భాషపై పట్టు సాధించారు. 1979లో మద్రాసులో సీఐటీయూ మహాసభ సందర్భంగా మొదటి శ్రామిక మహిళా సదస్సు కూడా జరిగింది. ఆ సదస్సులో ఆమెకు కన్వీనర్ బాధ్యతను అప్పగించింది. 1989లో అంగన్వాడీ యూనియన్ ఏర్పడింది. ఆ సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. సుమారు 20ఏండ్లు 'ది వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. శ్రామిక మహిళల సమస్యలపై వర్గ దృక్పథంతో అర్థం చేసుకొని పని చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రామిక మహిళల హక్కులు, అవకాశాలను కత్తిరించబడుతున్నాయి. స్కీము వర్కర్లు, విద్యా, వైద్యం వంటి శాఖల్లో పని చేసే మహిళా కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమశక్తిని కారుచౌకగా ఉపయోగించు కుంటోంది.
వస్తూత్పత్తి ఖర్చు తగ్గించుకుని తద్వారా మార్కెట్లో పోటీని తట్టుకొని నిలబడేందుకు తక్కువ వేతనాలకే వారిని పనిలో చేర్చుకుంటున్నారు. ఫ్యాక్టరీ పనిని ఇళ్లకు బదలాయించి స్త్రీలను 'హౌమ్ బేస్డ్' వర్కర్లుగా మారుస్తున్నారు. వారి ఇళ్లనే కార్ఖానాలుగా, వస్తు తయారీ కేంద్రాలుగా మార్చి ఎంతో కొంత ఇచ్చి వారితో పని చేయిస్తున్నారు. ఈ విధంగా రకరకాల దోపిడీ పద్ధతులను అనుసరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమలను చావగొట్టి విదేశీ ప్రయివేటు కంపెనీలకు కారు చౌకగా కట్టబెడుతున్నది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవటం కోసమనే పేరుతో కోట్లాది కార్మికుల జీవితాన్ని బలిపెడుతున్నది. వారి శక్తి సామర్ద్యాలను నిర్వీర్యం చేస్తున్నది. లక్షలాది మంది మహిళలు అసంఘటిత 'కార్మికులుగా, అతితక్కువ వేతనాలకు, దుర్భరమైన పని పరిస్థితుల మధ్య నిర్బంధ శ్రమ చేస్తున్నారు. ఈ విషయాలు ఏవీ చర్చకు రాకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టి కాలం వెల్లదీస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విమలా రణదివే పోరాట స్ఫూర్తి, ఆమె జీవితానుభవం శ్రామిక మహిళా ఉద్యమాలకు ప్రేరణ కాక తప్పదు...
- ఎస్.వి.రమ
9490098899