Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన వేళ ఫూలే దంపతులు ఆమెకు తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి, ఆమెకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తతతీసుకొని తమ బిడ్డగా స్వీకరించి పెంచి పెద్ద చేశారు. ఆ బిడ్డ పేరే యశ్వంతరావు ఫూలే! ఒక శూద్ర మాలి కుటుంబానికి వారసుడైన ఒక బ్రాహ్మణ బిడ్డ! ''నిఖిలలోకమెట్లు నిర్ణయించిన గాని తరుగులేని విశ్వనరుడ నేను!'' అంటూ మొన్న మొన్న జాషువా కవి అన్న మాటలను ఆనాడే తన జీవితాచరణ ద్వారా నిరూపించిన మహాత్ముడు ఫూలే!
భారతదేశంలో బ్రిటిష్షోడి ఆధిపత్యం రెండువందల యేళ్ల పాటు సాగింది. ఈ విశాల భారత దేశంలోని భూమిపుత్రులను బానిసలుగా మార్చి నిరంకుశ వలస పాలనను వారు కొనసాగించారు. ఈ దేశపు ప్రజలను పీడిస్తున్న మరో తరహా బానిసత్వం కుల వ్యవస్థ పేరుతో మొదలయింది. రెండువేల యేండ్ల క్రితం ప్రారంభమై నేటికీ అది కొనసాగుతున్నది. బ్రిటిష్ వాడు రుద్దిన బానిసత్వాన్ని రద్దు చేయడానికి షహీద్ భగత్‌సింగ్, గాంధీ, నెహ్రూ... అమరు లెందరో ఉద్యమిస్తే... మనువాద గులాంగిరీని రద్దుచేయడానికి ఆధునిక భారత చరిత్రలో తొట్టతొలిగా ఉద్యమించిన మహనీయుడు జ్యోతిబాఫూలే. ఆ స్వాతంత్య్ర ఉద్యమనేత గాంధీ మహాత్ముడైతే... ఈ స్వాతంత్య్ర ఉద్యమ నేత ఫూలే సైతం నిస్సందేహంగా మహాత్ముడే!
జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన 'మాలి' కులానికి చెందిన ఆయన కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెండ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెండ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. శూద్రులు, అతిశూద్రులపై అగ్రవర్ణాలవారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న 'సత్య శోధక్ సమాజ్'ను స్థాపించాడు. మెజారిటీగా ఉన్న నిమ్నవర్గాల ప్రజలను కులదోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను తమ హక్కుల కోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు.
ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కృత్రిమ కుల వ్యవస్థను సృష్టించి, దేశంలోని మెజారిటీ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా అణచివేసిన స్వార్థపర వర్గాల దోపిడీని జీవితాంతం వ్యతిరేకించి పోరాడిన మహానుభావుడు ఫూలే. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి అందించే ఒక మహాత్తర సాధనంగా ఆయన రచన ''గులాంగిరీ'' నేటికీ నిలిచి ఉన్నది. ఈ దేశపు వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైన కులవ్యవస్థ నికృష్ట స్వభావం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ''గులాంగిరీ''. కాలాన్ని ఎదిరించి ఘనీభవించిన ఫూలే మూర్తి... ఆయన రాసిన గులాంగిరీ పుస్తకంలో మనకు ప్రత్యక్షమవుతుంది. నేటికాలంలో మనం చేపట్టాల్సిన సామాజిక న్యాయ పోరాటాలను ఎలా కొనసాగించాలో దగ్గర కూచోబెట్టుకుని మనకు నేర్పుతుంది.
సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే భాషలో... ఉద్యమ సహచరుడు దోండిబా, ఫూలేల మధ్యన సంభాషణల రూపంలో గులాంగిరీ పుస్తకం కొనసాగుతుంది. ఈ దోండిబా ఎవరో కాదు ఫూలేను హత్య చేయించడానికి పూణే బ్రాహ్మణులు సుపారి ఇచ్చి కుదుర్చుచున్న కిరాయి హంతకుడు! ఓ అర్థరాత్రి వేళ దోండిబా ఫూలేను చంపడానికి ఆయన ఇంట్లో దూరాడు. అలికిడికి నిద్రలేచిన ఫూలే దోండిబాను నిలదీసాడు. నిన్ను చంపడానికి బ్రాహ్మణులు డబ్బులు ఇచ్చారని దోండిబా తెలుపగా... ''నా చావుతో నీ ఆకలి తీరుతుందనుకుంటే అలానే కానియ్యి'' అని ఫూలే సమాధానమిచ్చాడు. ''మీ నిమ్నవర్గాల పిల్లలకు మేము చదువులు చెప్పడమే బ్రాహ్మణుల కోపానికి కారణమయిందని తెలుసుకో...'' అని ఫూలే తెలపడంతో దోండిబా తన తపనను గ్రహించి హత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. క్రమక్రమంగా ఫూలే ఉద్యమ సహచరుడయ్యాడు.
బ్రాహ్మణుల ఆధిపత్యానికి దారులు వేసిన పురాణాల బండారాన్ని ఫూలే తన గులాంగిరీ పుస్తకంలో అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరిస్తాడు. బ్రాహ్మణులు బ్రహ్మముఖం నుండి జన్మించారనే కథనంపై వ్యాఖ్యానిస్తూ... మగ వ్యక్తి ముఖం నుండి వారు పుట్టడమే నిజమైతే... ఎవరి స్తన్యం తాగి పెరిగినట్టు? అని ఫూలే ప్రశ్నిస్తాడు. ఫూలే ప్రయోగించిన తార్కిక వాదనలతో బ్రాహ్మణులు సృష్టించిన కృత్రిమ కథనాలు దూది పింజల్లా తేలిపోతాయి.
బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ మహాత్ముడికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం నేటికీ దక్కడం లేదు. తెలంగాణకు ఫూలేకు సంబంధమేమిటి? తెలంగాణలోని బీసీ గురుకులాల పేరులో నుంచి మహాత్మాజ్యోతిరావు ఫూలే పేరును తొలగించాలని ఆ మధ్య ఒక బీసీ నేత డిమాండ్ చేశారు. ఇక అగ్రవర్ణాల వారైతే ఫూలేను చులకన చేస్తూ, ఆయనొక బ్రాహ్మణ వ్యతిరేకి అంటూ కొట్టిపారేస్తున్నారు. ఫూలే జీవితం గురించి తెలిసిన వారెవరైనా ఆయన బ్రాహ్మణులనే కాదు, ఏ వర్గం వారినీ ద్వేషించలేదని అర్థం చేసుకుంటారు. ఆ రోజుల్లో ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన వేళ ఫూలే దంపతులు ఆమెకు తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి, ఆమెకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తతతీసుకొని తమ బిడ్డగా స్వీకరించి పెంచి పెద్ద చేశారు. ఆ బిడ్డ పేరే యశ్వంతరావు ఫూలే! ఒక శూద్ర మాలి కుటుంబానికి వారసుడైన ఒక బ్రాహ్మణ బిడ్డ! ''నిఖిలలోకమెట్లు నిర్ణయించిన గాని తరుగులేని విశ్వనరుడ నేను!'' అంటూ మొన్న మొన్న జాషువా కవి అన్న మాటలను ఆనాడే తన జీవితాచరణ ద్వారా నిరూపించిన మహాత్ముడు ఫూలే! ఆయన జీవితము, సత్యశోధక సమాజ ఉద్యమం, ఆయన రచనలూ, నేటి కాలంలో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపుతాయి.
(నేడు మహాత్మా జ్యోతిరావుఫూలే 196వ జయంతి)
- ఆర్. రాజేశమ్
సెల్: 9440443183