Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రబ్బరు ధరలు కరోనా కాలంలో పడిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతమేరకు పెరిగినా ప్రస్తుతం మళ్ళీ పడిపోయాయి. కేరళ రాష్ట్రంలో రబ్బరు సాగు ఎక్కువ. దేశంలోని మొత్తం రబ్బరు పంటలో 80శాతం ఒక్క కేరళలోనే సాగుచేస్తారు. ఆ రైతులంతా ఇప్పుడు దారుణంగా దెబ్బతిన్నారు. కేంద్ర ప్రభుత్వం రబ్బరు రైతులను ఆదుకోడానికి ఏ మాత్రం తటపటాయింపూ లేకుండా తిరస్కరించింది. ఆ విధంగా తిరస్కరించడానికి మోడీ ప్రభుత్వం చూపిస్తున్న సాకులు ఏ మాత్రమూ సహేతుకంగా లేవు.
సీపీఐ(ఎం)కు చెందిన పార్లమెంటు సభ్యులు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పియూష్ గోయెల్‌ను కలిసి కేంద్ర ప్రభుత్వం రబ్బరు రైతులను ఆదుకోడానికి జోక్యం చేసుకోవాలని, రబ్బరుకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. కాని మంత్రిగారు ఆ డిమాండ్‌ను పూర్తిగా తోసిపుచ్చారు. వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ విధానం కానేకాదన్నారు. దేశంలో విస్తృత ప్రాంతంలో ఎక్కువగా పండించే ప్రధాన పంటలకు, ఎక్కువమంది ప్రజానీకం వినియోగించే పంటలకు, ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే పంటలకు, ముఖ్యంగా ఆహార భద్రతకు అవసరమైన పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటించడం ప్రభుత్వ విధానం అని పియూష్ గోయెల్ వివరించారు. వాణిజ్య పంటలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వాటికి కనస మద్దతు ధర నిర్ణయించడం కుదరదని ఆయన చెప్పారు.
ఇది రోతపుట్టించే వాదన. అసలు కనీస మద్దతు ధర అనేది ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో బహుశా మంత్రికి తెలియదనుకుంటాను. ఒకానొక సరుకు ధర ఎక్కువకాలం పాటు స్థిరంగా కొనసాగుతూ ఉంటే దానికి కనీస మద్దతు ధర అవసరం ఉండదు. ఒకానొక పంట ధర అస్థిరంగా కిందకు, పైకి మారిపోతూ ఉంటే, దాని ధర పడిపోయినప్పుడు ఆ పంటను పండించిన ఉత్పత్తిదారులకు (రైతులకు) దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికే కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం వచ్చింది. అంతే తప్ప ఆ పంట ఎంత ఎక్కువ భూ భాగంలో పండిస్తారన్న ప్రమాణం కాని, ఇంకొక ప్రమాణం కాని కనీస మద్దతు ధర నిర్ణయించడానికి ప్రాతిపదిక కానేకావు. పంటల ధరల ఎగుడు, దిగుడుల నుండి రైతులను రక్షించడానికి మాత్రమే మద్దతు ధర నిర్ణయించడం అవసరమైంది. వాస్తవానికి ఆహార పంటలకన్నా, వాణిజ్య పంటల ధరలే ఎక్కువగా ఎగుడు దిగుడులకు లోనవుతూ ఉంటాయి.
దీని వెనుక కారణం ఇది: ఏదైనా పంట పండిన వెంటనే, ఎక్కువ మొత్తంలో మార్కెట్లో ఆందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం గనుక కనీస మద్దతు ధర రూపంలో ఆదుకోకపోతే, ఆసమయంలో దాని ధర పడిపోతూ ఉంటుంది. దానిని కొని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకునే హోల్‌సేల్ వ్యాపారులు ఎంత తక్కువ ధరకు దానిని కొనగలిగితే అంత తక్కువకే కొనడానికి మొగ్గు చూపుతారు. రాబోయే కాలంలో ఆ సరుకు ఏ రేటుకు అమ్ముడు పోగలదో అంత కచ్చితంగా చెప్పలేనప్పుడు దానిని ఇప్పుడు వీలైనంత తక్కువ రేటుకే కొనడానికి వాళ్ళు సిద్ధపడతారు. అదే భవిష్యత్తులో ఆ సరుకు ధరలో అంత ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండబోవు అని అంచనా ఉన్నప్పుడు ఆ సరుకును ఎక్కువ మొత్తంలో కొని నిల్వ ఉంచుకోడానికి సిద్ధపడతారు. అందువలన ఆ సరుకు ప్రస్తుత ధర పడిపోకుండా నిలదొక్కుకుంటుంది.
ఎక్కువ మంది ప్రజానీకం తరచూ వినియోగించే ఆహార ధాన్యాల వంటి సరుకుల ధరలు మరీ అంత హెచ్చుతగ్గులకు గురికావు. ఎందుకంటే ఆహారధాన్యాల ధరలు మరీఎక్కువగా పెరిగిపోతే దాని పర్యవసానాలను ఏ సమాజమూ భరించలేదు. అత్యంత దుర్మార్గమైన వలసపాలన కాలంలో మాత్రమే ఆహార ధాన్యాల ధరలు విపరీతమైన ఎగుడుదిగుడులకు గురయ్యాయి. అందుచేత కనీస మద్దతు ధర ఉన్నా, లేకున్నా ఆహార ధాన్యాల ధరల్లో ఎగుడుదిగుడులు కొంతమేరకు పరిమితంగానే ఉంటాయి. కాని వాణిజ్య పంటల విషయంలో అలా కాదు. ఎగుమతుల కోసం పండించే పంటలు, లేదా దేశీయంగా అంత అవశ్యం కాని సరుకుల తయారీకి ముడిసరుకుగా వినియోగించే పంటలు ధరల విషయంలో అంత స్థిరంగా ఉండవు. ఎక్కువ ఎగుడు దిగుడులకు లోనవుతూ ఉంటాయి.
ఈ వాస్తవం రబ్బరు ధరలను పరిశీలిస్తే బాగా కనిపిస్తుంది. 2014లో ఒక కిలో ముడి రబ్బరు ధర రూ.245 నుండి రూ.77కి పడిపోయింది. అంటే దాదాపు 70శాతం పడిపోయింది. ఇది రబ్బరు రైతుల పాలిట ఆశనిపాతంగా పరిణమించింది. ఈ మధ్య కాలంలో చూసినా ఇదే ధోరణి కనిపిస్తోంది. నవంబరు 2021లో కిలో ముడి రబ్బరు రూ.200 ఉంటే అది ఇప్పుడు రూ.120కి పడిపోయింది. అంటే దాదాపు 40శాతం. ఇటువంటి విపరీతమైన పతనం నుంచి రైతులను ఆదుకోడానికే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, కనీస మద్దతు ధర ప్రకటించడం అవసరం. అప్పుడే ధరల హెచ్చు తగ్గులను కొంతమేరకు అదుపు చేయడం సాధ్యపడుతుంది.
నయా ఉదారవాద విధానాలను మన దేశంలో అమలు చేయడం మొదలు పెట్టక మునుపు, అంటే ప్రభుత్వ జోక్యం, నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ నడిచిన కాలంలో, వాణిజ్య పంటలకు వివిధ బోర్డులు ఉండేవి. అవి ఆ వాణిజ్య పంటలను నిర్ణీత కనీస ధరలకు కొనుగోలు చేసేవి. ధరలు పతనం అయ్యే పరిస్థితులు ఏర్పడితే బలంగా జోక్యం చేసుకునేవి. కాని, నయా ఉదారవాద విధానాల మొదలయ్యాక, ఈ బోర్డులు ఉనికిలో కొనసాగుతున్నప్పటికీ, వాణిజ్య పంటలను కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం వంటి కార్యకలాపాలను నిలిపివేశాయి. అంటే అవి మార్కెట్లో జోక్యం చేసుకోవడం మానేశాయి.
పియూష్ గోయెల్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాల ధరలను స్థిరంగా ఉంచడం అవసరం అని, అటువంటి స్థిరత్వాన్ని వాణిజ్య పంటల విషయంలో కల్పించనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇది అర్ధంలేని వాదన. ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర కల్పించడం అవసరం అన్న విషయంలో రెండోఅభిప్రాయం లేనేలేదు. కాని ఏ విధమైన మద్దతు ధర వాణిజ్య పంటల విషయంలో కూడా అవసరం. అప్పుడే డిమాండ్ ను పెంచగలుగుతాం. రబ్బరు పంటకు కనీస మద్దతు ధర లేకపోతే ఆ పంట రేట్లు మార్కెట్ లో కుప్పకూలిపోతే, అప్పుడు రబ్బరు రైతుల ఆర్థిక స్థితి ఛిన్నాభిన్నమైపోతుంది. అప్పుడు వాళ్ళు తమకు అవసరమైన వస్తువులను మార్కెట్లో కొనుగోలు చేయలేరు. ఆహారధాన్యాల ధరలను స్థిరంగా ఉంచినా, రబ్బరు రైతులు వాటిని కొనగలిగే స్థితిలో ఉండరు.
ఒకవేళ రబ్బరు ధరలు పడిపోయినప్పుడు కూడా ఆ రైతులు ఆహారధాన్యాలను ఇంతకు ముందులాగే కొనుగోలు చేయడం కొనసాగించగలిగారు అని మాటవరసకి అనుకుందాం. అప్పుడు వాళ్ళు వేరే ఇతర సరుకులను అంతకు ముందు కొనుగోలు చేసిన స్థాయిలో కొనలేరు. అప్పుడు ఆ ఇతర సరుకులను ఉత్పత్తి చేసేవారి కొనుగోలుశక్తి పడిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆహారధాన్యాలను అంతకుముందరి స్థాయిలో కొనుగోలు చేయలేరు.
ఆహార భద్రత కల్పించడం అంటే అవసరాలకు తగినంత మోతాదులో వాటిని అందుబాటులో ఉంచడం, వాటి ధరలను స్థిరంగా ఉంచడం మాత్రమే కాదు. వాటి డిమాండ్‌ను కూడా భద్రంగా ఉంచాలి. అంటే ప్రజానీకపు కొనుగోలుశక్తిని తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కేవలం తగినంత పరిమాణంలో ఆహారధాన్యాలను పండించేలా చూడడం ఒక్కటే ఆహారభద్రతకు సరిపోతుంది అనుకోవడం పొరపాటు. ఆహారధాన్యాల సరఫరా సక్రమంగా ఉండడంతోబాటు వాటి పంపిణీ కూడా సక్రమంగా జరిగేలా డిమాండ్ ను కూడా సక్రమంగా ఉంచుకోవడం కూడా ఆహార భద్రతలో భాగమే.
మరి ఒక కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అర్థంలేని వాదనలను ఎందుకు చేస్తున్నట్టు? కొద్ది కాలం క్రితం ఇదే ప్రభుత్వం అసలు కనీస మద్దతు ధరల విధానమే అనవసరం అని చెపుతూ దుర్మార్గమైన నల్ల చట్టాలను తెచ్చింది. అప్పుడు ఆహారధాన్యాలకు కూడా కనీస మద్దతు ధర అవసరం లేదు అన్న ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య పంటలకు అవసరం లేదంటున్నది. రైతులు పట్టుదలగా పోరాడడంతో దిగివచ్చి ఆ నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది.
కార్పొరేట్-హిందూత్వ శక్తుల కలయిక మీద ఆధారపడి నడుస్తున్న ఈ ప్రభుత్వం వ్యవసాయంలో ఎలాగైనా కార్పొరేట్ల ప్రవేశానికి తలుపులు తెరవాలన్న ప్రయత్నంలో ఉంది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల డిమాండ్లకు అనుగుణంగా వ్యవసాయ రంగ రూపురేఖల్ని మార్చేయాలని చూస్తోంది. కార్పొరేట్లకు రైతులకు నేరుగా సంబంధం నెలకొల్పితే అప్పుడు స్వదేశీ, విదేశీ కార్పొరేట్ రాబందుల ముందు రైతులు దాసోహం అనక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం లక్ష్యం ఇదే. పైకి దేశం గురించి, దేశ ప్రయోజనాల గురించి ఎన్ని కబుర్లు చెపుతున్నా, వాస్తవానికి అమలు చేస్తున్నది మాత్రం ఈ నయా ఉదారవాద ఎజెండానే. వ్యవసాయం విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏం కోరుతోందో దానినే మోడీ ప్రభుత్వం అమలు చేయడానికి పూనుకుంటున్నది.
వ్యవసాయానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చే విధంగా జోక్యం చేసుకోవడం అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టిలో అది మార్కెట్లో అనుచిత జోక్యం చేసుకోవడం అవుతుంది. అదే రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తే మాత్రం అది అనుచిత జోక్యం అనిపించుకోదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు వందల కోట్ల డాలర్లు తమతమ రైతులకు నేరుగా నగదు రూపంలో అందిస్తుంటాయి. అందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ ఏ అభ్యంతరమూ చెప్పదు. అదే కనీస మద్దతు ధర కల్పించే రూపంలో జోక్యం చేసుకుంటే మాత్రం అది మార్కెట్లో ధరలను ప్రభావితం చేస్తుంది అన్నవాదనతో దానిని వ్యతిరేకిస్తుంది. మార్కెట్ పూర్తిగా పోటీ మార్కెట్‌గానే ఉండాలని అంటుంది. అయితే వాస్తవంలో ఆ మార్కెట్ పూర్తిగా అగ్రి-బిజినెస్ కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో నడుస్తుంది. కనీస మద్దతు ధర అనగానే, వాళ్ళకి అదొక ఆటంకంగా, అనుచిత జోక్యంగా అనిపిస్తుంది. ఎంత తక్కువ రేటుకు వీలైతే అంత తక్కువకే రైతులను దోచుకోవాలను కునేవాళ్ళకి కనీస మద్దతు ధర అనే పద్ధతి ఆటంకంగానే అనిపిస్తుంది మరి.
అటువంటి శక్తులకి దాసోహం అంటూ మన దేశీయ వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి సిద్ధమైపోయిన కేంద్ర ప్రభుత్వ విధానానికి భిన్నంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్థిక వనరుల పరిమితులు ఎన్ని ఉన్నా, రబ్బరు రైతులకు అండగా నిలబడుతోంది. 204లో రబ్బరు ధరల స్థిరీకరణ నిధిని నెలకొల్పింది. గతేడాది బడ్జెట్లో అందుకోసం కేటాయింపులను రూ.600కోట్లకు పెంచింది. కిలో రబ్బరుకు కనీస ధర రూ.170గా నిర్ణయించింది. అంతకన్నా తక్కువ ధరకు రబ్బరును అమ్ముకోవలసివస్తే ఆ తేడాను రాష్ట్ర ప్రభుత్వం రైతుకు భర్తీ చేస్తోంది.
- ప్రబాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)