Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి ప్రేమికులు ఉన్నట్టే చరిత్ర ప్రేమికులూ ఉంటారు. ఏదేని ఓ వ్యక్తిపైనా, పనిపైనా, అంశంపైనా ప్రేమలో పడ్డామంటే త్రికరణ శుద్ధిగా వాటిలో విలీనమవడమే కదా..! ప్రకృతిని ఎలా మానస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఆస్వాదిస్తారో, వాస్తవ చరిత్రను అంతే తీరులో ఆస్వాదిస్తూ అధ్యయనం చేసేవారు కోకొల్లలు.
తేనెటీగలు పుష్పాల నుండి మకరందాన్ని గ్రోలినట్టు చరిత్రకారులు మట్టిపొరల నుండి మట్టి (చరిత్ర) పరిమళాన్ని పసిగడతారు. మానవ రక్త స్వేదంతో కలగలసిన మట్టి పొరలేకదా మానవ చరిత్ర అంటే.
'ప్రజలే చరిత్ర నిర్మాతలు' అని మార్క్స్ - ఏంగెల్స్‌లు పేర్కొంటే, కొనసాగింపుగా డి.డి. కొశాంబి-ప్రజలు తమకు తెలియకుండానే చరిత్రను నిర్మించుకుంటూపోతారని, ఆక్రమంలో వారి సామూహిక జీవన స్వచ్ఛత, ఔదార్యాం, సంస్కృతి, శ్రమ అన్నీ కలగలసి నిబిడీకృతమై ఉంటాయని విశదపరుస్తాడు.
సామాజిక పరివర్తనకు సంబంధించిన వాస్తవ సంఘటనలను, విషయాలను, విలువలను, అవిచ్ఛన్నంగా ఒక క్రమం అనుసరించి సంగ్రహంగా రాయడమే చరిత్ర అని కొందరంటే, మానవ ప్రగతి కోసం తెగలు, జాతులు మధ్య నడిచిన శ్రమ ఘర్షణలే చరిత్ర అని మరికొందరు భావిస్తారు.
క్రీ.పూ. పాతికవేల సంవత్సరాల ముందున్న కాలాన్ని పాతరాతి యుగం అని, అప్పటి నుండి క్రీ.పూ. పదివేల సంవత్సరాల వరకు కొత్తరాతి యుగం అని చరిత్రకారులు వర్గీకరించారు. క్రీ.పూ. 3500 సంవత్సరాల నుండి చారిత్రక యుగం ప్రారంభమైనట్టు తెలిపారు.
క్రీ.పూ. 3500-1750 సంవత్సరాల ప్రాంతంలో భారతగడ్డపై విలసిల్లిన గొప్ప నాగరికత సింధు నాగరికత. అప్పటికి ఆర్యుల ప్రవేశం జరగలేదు. సింధు నాగరికతగా భాసిల్లిన ప్రాంతాలు హరప్పా- మొహంజదారోలు ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి. దాదాపు వందేండ్ల క్రితం 1920లో ఈ నాగరికత చిహ్నాలు బయల్పడ్డాయి. అప్పటి నుండి ప్రపంచం, భారతదేశాన్ని మరో (నాగరిక) దృష్టికోణంతో చూడటం ప్రారంభించింది.
మానవుడు తన కల్పనాశక్తితో ప్రకృతిలో లేని అనేక అపూర్వ విషయాలను సృష్టించడం నాగరికత అయితే, వివిధ రంగాల్లో మానవుడు సాధించే విజయాలే నాగరిక చరిత్ర అవుతుంది. ఈ కోణంలోనే సర్వమానవాళి ఆశయాలకు, కళలకు భారతదేశం కాణాచివంటిదని ప్రముఖ చరిత్రకారులు రోమరోలా కితాబు ఇస్తారు. కానీ ఇప్పుడు బిజేపీ ప్రభుత్వం చరిత్ర పాఠ్యాంశాల్లో విద్వేష విషబీజాలు నాటేందుకు పూనుకున్నది. క్రమబద్దీకరణ పేరుతో కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. కలుషితమైన ఈ మైండ్ గేమ్‌కు ఎస్సి ఇఆర్టిని (జాతీయ విద్యా పరిశోథక శిక్షణా మండలిని) వేదికగా చేసుకున్నది.
హిందు-ముస్లింల ఐక్యత కోసం మహాత్మాగాంధీ తదితరులు చేసిన గొప్ప కృషి, ఉద్భవించిన సామరస్య ఉద్యమాలు, ఆర్ఎస్ఎస్ శక్తులకు మింగుడుపడటం లేదు. అందుకే ఏకపక్షంగా తొలగించింది.
ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథూరాం గాడ్సే, గాంధీజిని హత్యచేసిన విషయం జగద్వితిం. అప్పుడు ఆర్ఎస్ఎస్ కొంత కాలం నిషేధమైంది కూడా. ఇదంతా చరిత్ర. ఈ చరిత్రను చెరిపేయాలని బీజేపీ ఇప్పుడు భావిస్తున్నది. అందుకే ఈ తొలగింపు అని రొమిల్లాథాపర్ వంటి చరిత్రకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే మొఘలు చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో, నాడు విలసిల్లిన పరమత సహనం శిఖరాయమానంగా నిలచింది. దీనినీ తొలగించింది. 2002 గుజరాత్ అల్లర్లూ, నక్సలైట్ల ఆవిర్భాం మొదలైన చారిత్రక సంఘటనలన్నింటినీ క్రమబద్దీకరణ పేరుతో తొలగించడం ఎలా సమంజసం? అని చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, భారత్‌ను ఆర్యుల జన్మస్థలిగా చిత్రీకరించడానికి ఆర్ఎస్ఎస్ పూనుకుంటున్నది. పురాణ, ఇతిహాస కావ్యాల్లోని కల్పిత ఘట్టాలను వాస్తవ చరిత్రగా నిర్ధారించాలని తలపోస్తున్నది. కాగా, భారత్‌లో ఇస్లాం మతం ప్రవేశించిన తర్వాతనే వర్ణవ్యవస్థ మొదలైందని కట్టుకథలు అల్లుతున్నది. చరిత్రను ఇలా బరితెగించి బహిరంగంగా వక్రీకరించడానికి సిద్ధమయింది గనుకనే అవి పాఠ్యాంశాలుగా పుస్తకాల్లోకి వస్తున్నాయి.
ఈ మొత్తం వక్రీకరణను హిస్టరీ కాంగ్రెస్ ఖండించింది కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత్‌లో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన చరిత్ర అధ్యాపకులు, చరిత్రకారులు దాదాపు 250మంది ఏండ్ల తరబడి శ్రమకోర్చి రూపొందించిన ఈ చరిత్ర పాఠాలను అకస్మాత్తుగా ఓ చిన్న ఆదేశంతో ఎస్‌సిఇఆర్‌టి తొలగించడం, వక్రీకరించడం నిరంకుశత్వానికి పరాకాష్ట. అభం శుభం తెలియని పసిహృదయాలపై విద్వేష విషబీజాలు నాటే హక్కు వీరికెవరిచ్చారని హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కేశవట్ వెలథుట్ ప్రశ్నించారు.
అయితే కేంద్రంలోని బీజేపీ పాలనా విధానాలు పరిశీలించిన వారికి ఈ మార్పులు - చేర్పులు అనూహ్యం కాదు. భవిష్యత్‌లో జరగబోయే ప్రమాదాల పట్ల భయాందోళనలు తప్ప. ఆర్ఎస్ఎస్ వెనకుండి బీజేపీని నడిపిస్తున్నది కదా.
సమత, సత్యం కోరుకోనివారే మతోన్మాదానికి, యుద్ధోన్మాదానికి మాటమాటకీ తెరతీస్తూ ఉంటారు. జనం అప్రమత్తంగా ఉంటూ ఆ దుర్మార్గాన్ని ఎదుర్కొవలసిందే.
మన పొరుగునున్న పాకిస్థాన్ ప్రస్తుతం ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. అజ్ఞానం, ఆకలి కోరల్లో నలిగిపోతూ వెనుకబాటు చీకటి కూపంలోకి జారిపోతున్నది. దీనికి ప్రధానకారణం భారత్‌పై అక్కడి పాలకులు రగిలించిన విద్వేష పాఠలే కీలకం అనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. విద్వేష ఉన్మాద పాఠాలను మనం కూడా పాకిస్థాన్ పాలకులులాగా మన పిల్లల తలకెక్కిస్తే మనకి కూడా ఆ చీకటి కాలం ఎంతో దూరంలో లేదు అని వారు ఆందోళన పడుతున్నారు.
మానవాళి శాంతికి, సమానత్వానికి, సామరస్యానికి దోహదపడే ఘటనలను గుణపాఠాలుగా చరిత్ర ఎప్పటికప్పుడు ఎత్తిపడుతుంది. అలాగాక కక్షతో విద్వేష విషబీజాలను పాఠాలుగా నూరిపోస్తే ఎవరైనా చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. చరిత్ర హీనులకు చరిత్ర ప్రేమికులకు నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇది చారిత్రక సత్యం.
- కె శాంతారావు
సెల్:9959745723