Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈస్టర్డే నాడు ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని పవిత్ర హార్ట్ కేథడ్రల్ చర్చిని సందర్శించడం గుర్తించుకోదగ్గ పరిణామం. తొమ్మిదేండ్ల క్రితం ప్రధాని అయిన దగ్గర నుండి మోడీ చర్చిని సందర్శించడం ఇదే ప్రథమం. అదే రోజు అంటే ఈస్టర్ సండేనాడు బీజేపీ నేతలు కూడా వివిధ ప్రాంతాల్లో చర్చి నేతలను కలుసు కున్నారు, వారి ఇండ్లకు వెళ్ళి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేశారు. క్రైస్తవుల పట్ల అకస్మాత్తుగా మారిన ఈ వైఖరి చాలామందిని విస్మయపరిచింది. అయితే ఈ చర్య తీసుకోవడానికి వెనుక గల కారణం, ఉద్దేశ్యాలను కూడా మోడీని సూచనప్రాయంగా తెలిపారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్న మద్దతు దారులను, కార్యకర్తలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ... క్రైస్తవులు ప్రాబల్యంగా ఉండే మేఘాలయ, నాగాలాండ్‌లో బీజేపీ ఎలా విజయం సాధించిందో వివరించారు. అంటే క్రైస్తవులకు కూడా బీజేపీ ఆమోదయోగ్యం అవుతోందనడానికి ఇదొక సంకేతమని చెప్పుకున్నారు. ఇక బీజేపీ తదుపరి గురి, లక్ష్యం కేరళనే అని ప్రకటించారు. అసలు మేఘాలయ, నాగాలాండ్‌లో క్రైస్తవుల మద్దతు ఉందని చెప్పు కోవడమంతా బూటకం. ఎందుకంటే, మేఘాలయ అసెంబ్లీలో 60సీట్లకుగాను బీజేపీ రెండు సీట్లే గెలుచుకోగలిగింది. నాగాలాండ్‌లో పాలక సంకీర్ణంలో జూనియర్ భాగస్వామిగా ఉంది.
జనాభాలో ముస్లింలు, క్రైస్తవులు కలిపి 45శాతం ఉండే కేరళలో పెద్దగా విజయం సాధించకపోయినా నిలదొక్కుకునేందుకు బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ముస్లిం జనాభాలో పెద్దగా పురోగతి సాధించలేమని గ్రహించిన బీజేపీ క్రైస్తవుల్లో నైనా కొంత ప్రభావాన్ని చూపగలగాలని భావిస్తోంది. కేరళ జనాభాలో 18శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఇందుకుగాను, రెండంచెల వ్యూహాన్ని ఆమోదించింది. క్రైస్తవ కమ్యూనిటీలో ముఖ్యంగా కేరళలో సైరో-మలబార్ చర్చిగా చిరపరిచితమైన కేథలిక్ చర్చిలో ముస్లిం వ్యతిరేక భావాలు రెచ్చగొట్టేందుకు యత్నించడం ఇందులో మొదటిది. ఇటీవల కాలంలో, కొంతమంది చర్చి నేతలు లవ్ జిహాద్ గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. క్రిస్టియన్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఇది ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తూ, కొన్ని ఆర్ఎస్ఎస్ సంస్థలకు సహకరిస్తోంది. క్రైస్తవులను, ముస్లింలను విభజించడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఉబలాటపడుతున్నాయి. బీజేపీ- ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు అనుగుణంగా లేని ఎవరినైనా బెదిరించి, భయపెట్టి లొంగదీసుకోవడమనేది మోడీ ప్రభుత్వం అనుసరించే, పలుసార్లు ప్రయత్నించి విజయం సాధించిన పద్ధతి. ఇది రెండో వ్యూహం. కేరళలో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ బిషప్ ధర్మరాజ్ వంటి చర్చిల్లో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు, కె.పి.యోహాన్, పాల్ దినకరన్ తదితర మతనేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులు ప్రారంభమయ్యాయి.
కథలిక్ చర్చి అత్యున్నత నేత, కార్డినల్ జార్జి అలెన్ చెర్రీ, ఎర్నాకులం-అంగమలై ఆర్చిడియోస్ ఆర్చిబిషప్పై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. ఆర్చిడియోస్కి చెందిన ఆస్తుల అమ్మకాల్లో అవకతవ కలకు పాల్పడ్డారంటూ ఆయనపై మనీ లాండరింగ్ కేసును ఈడీ దాఖలు చేసింది. కఠినమైన విదేశీ విరాళాల నియంత్రణా చట్టాన్ని (ఎఫ్సిఆర్ఎ) అస్త్రంగా చేసుకోవడం ద్వారా కూడా ఒత్తిడి తెస్తున్నారు. దీని ద్వారా చారిటబుల్, విద్యా సంబంధ కార్యకలాపాల కోసం చర్చిలు అందుకునే విదేశీ నిధులను కోత పెట్టాలని చూస్తున్నారు. ఇటువంటి పద్ధతుల ద్వారా వివిధ చర్చిల నేతలను మెతకపరిచిన తర్వాత, ఇప్పుడు బెదిరింపులతో పాటూ కల్లబొల్లి మాటలు కూడా చెబుతున్నారు. కేథడ్రల్ చర్చిని మోడీ సందర్శించడాన్ని, కేరళలో చర్చి నేతలను బీజేపీ నేతలు కలుసు కోవడాన్ని ఈ నేపథ్యం నుండే చూడాల్సి ఉంది. తడి గుడ్డతో గొంతుకోసే ఈ వైఖరి క్రైస్తవ కమ్యూనిటీలో తాము చొచ్చుకు పోవడానికి ఉపకరిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. అయితే కేరళలో ఈ సందేహాస్పదమైన పాత్ర మిగిలిన భారతదేశంలో బీజేపీ పాలన కింద క్రైస్తవులు ఎదుర్కొంటున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది. 2014లో మోడీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుండి, క్రైస్తవుల ఆరాధనా స్థలాలపై, క్రైస్తవ కమ్యూనిటీపై 5,82,774 దాడులు చోటు చేసుకున్నాయి. క్రైస్తవులపై హింస, వారి పట్ల శత్రు వైఖరి వంటి వాటికి మూలాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోనే ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవులు ఇరువురూ హిందూ సమాజానికి పరాయివారనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం.పైగా ఆర్ఎస్ఎస్ సంఘ సంచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ మూడు అంతర్గత ముప్పులు (ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు) ఉన్నాయని పేర్కొన్నారు.
భారతదేశంలో క్రైస్తవ జనాభా చాలా తక్కువ, దశాబ్దాలుగా ఈ జనాభా కూడా తగ్గుతూ వస్తోంది. 1971లో 2.53 శాతంగా ఉన్న క్రైస్తవులు, 1991కి వచ్చేసరికి 2.43 శాతానికి తగ్గారు. 2001లో 2.34శాతంగా ఉండగా, 2011లో గత జనాభా లెక్కల్లో 2.30శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న జనాభా కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో ముట్టడికి గురవుతున్నారు. క్రైస్తవులపై దాడులు 2022లో విపరీతంగా పెరిగాయని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యుసిఎఫ్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 21 రాష్ట్రాల్లో క్రైస్తవులపై 598 హింసాత్మక కేసులు నమోదయ్యాయి. 2018లో హింసాత్మక సంఘటనలు 292 ఉండగా, 2019లో 328 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా 2020లో కేసులు తగ్గి 279గా నమోదయ్యాయి. తిరిగి 2021లో ఒక్కసారిగా కేసులు పెరిగి 505కి చేరుకున్నాయి. 2022 చివరి త్రైమాసికంలో చత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ ఆది వాసీలపై విస్తృతంగా దాడులు జరిగాయి. ఆర్ఎస్ఎస్కి చెందిన వివిధ సంఘాలతో ఏర్పడిన జన్జాతి సురక్షా మంచ్ పేరుతో క్రైస్తవ వ్యతిరేక విషపూరిత ప్రచారం నిర్వహించబడింది. ఫలితంగా దక్షిణ చత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాల్లో విచ్చలవిడిగా దాడులు, హింస చోటు చేసుకున్నాయి. ఈ హింస, తమపై వివిధ రూపాల్లో అమలవుతున్న సామాజిక బహిష్కరణల కారణంగా వేలాదిమంది క్రైస్తవులు తమ గ్రామాలను వదిలివెళ్ళాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోని క్రైస్తవ గిరిజనుల మీద జరిగిన దాడులపై ఆ ఏరియాల్లో పర్యటించిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం రూపొందించిన సమగ్ర నివేదిక ప్రచురితమైంది.
క్రైస్తవ ఆదివాసీలను ఎస్టి రిజర్వేషన్ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని ఆదివాసీ సంఘాలు నిర్వహించిన ప్రచారం నేపథ్యంలోనే చత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ గిరిజనులపై దాడులను చూడాల్సి ఉంది. గిరిజనుల్లో క్రైస్తవ మతానికి మారిన వారు రిజర్వేషన్‌కు అర్హులు కారని వారు వాదిస్తున్నారు. ఈ డిమాండ్ పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఈశాన్య ప్రాంతంలోని పలు గిరిజన కమ్యూనిటీలు క్రైస్తవులే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఈ డిమాండ్ వల్ల వారు ఎస్టీ హోదా కోల్పోతారు. బలవంతంగా మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారనేది క్రైస్తవులపై మరో రూపంలో జరుగుతున్న దాడి. కేరళకు పక్కనే గల కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ''మత స్వేచ్ఛా హక్కు పరిరక్షణ చట్టం'' పేరుతో నిరంకుశ మత మార్పిడి చట్టాన్ని తీసుకు వచ్చింది. 2022 సెప్టెంబరులో దీన్ని ఆమోదించారు. ఈ చట్టంలో నిరంకుశ నిబంధనలు ఉన్నాయి. మత మార్పిడి జరిగిన వ్యక్తి కుటుంబానికి చెందని వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని బలవంతంగా మత మార్పిడికి పాల్ప డ్డారనే ఆరోపణలపై చర్చిల్లోని మతాధిపతులను అరెస్టు చేయవచ్చు. రాష్ట్రంలోని చర్చిల్లో వివిధ స్థాయిల్లోని వ్యక్తులు ఈ చట్టానికి వ్యతిరేకంగా సమైక్యంగా నిరసన తెలియచేశారు. వీటి పరిష్కారం కోసం కోర్టుకు కూడా వెళ్ళారు.
కేంద్రంలోని బీజేపీ పాలకుల నిరంతర ఒత్తిడి కారణంగా, కేరళలో కొంతమంది చర్చి నేతలు తలొగ్గారు, ఆర్చిబిషప్ జోసెఫ్, పాంప్లనీ ఆఫ్ ది తలస్సెరి ఆర్చిడియోసిస్ వంటి వారు రాజీ పడ్డారు. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ కార్డినల్ జార్జి అలెన్చెరీ సుప్రీంలో పెట్టుకున్న పిటిషన్ ఇటీవల తిరస్కరణకు గురైంది. జార్జి అలెన్చెరీ ఈస్టర్ సండే రోజున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మోడీ మంచి నేత అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో క్రైస్తవులు అభద్రతగా లేరని సెలవిచ్చారు. కొంతమంది చర్చి నేతలు చేస్తున్న ఈ ప్రకటనలను మొత్తంగా చర్చి, క్రైస్తవ కమ్యూనిటీ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలుగా చూడడం తప్పే కాగలదు. కేథలిక్ చర్చిలో కొన్ని వర్గాలు పాంప్లనీ అభిప్రాయాలను తిప్పికొడుతున్నాయి. కేరళ లోని క్రైస్తవులు కేరళ సమాజంలో లోతుగా పాతుకు పోయిన లౌకిక కూర్పులో భాగంగానే ఉన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ క్రైస్తవ వ్యతిరేక స్వభావం వారికి బాగా తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల అనుభవాలు కూడా వారికి తెలుసు. బీజేపీ, హిందూత్వ శక్తుల ఈ ఎత్తుగడలను తిప్పి కొట్టడానికి అవసరమైన చర్యలను వామపక్ష ఉద్యమం, కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన తీసుకుంటా యన్న నమ్మకం ఉంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)