Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ చరిత్రలో దారుణ మారణకాండ అది. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రకెక్కిన రక్తపుటేరు. జల్,జంగిల్,జమీన్ కోసం నినదించిన అడవి బిడ్డలపై సర్కార్ తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనలో ఆదివాసులు పిట్టల్లా కాల్చి చంపబడిన ఘటనకు నెత్తుటి సాక్ష్యం. అదే ఇంద్రవెల్లి ఘటన. చరిత్రపూటల్లో నెత్తుటి గాయమైన ఇంద్రవెల్లి పోరాట ఘట్టానికి 42ఏండ్లు పూర్తవుతున్నా అడవి బిడ్డల బతుకులు మాత్రం మారలేదు. వారి ఆకాంక్షలూ నెరవేరలేదు. నాలుగు దశాబ్దాలుగా న్యాయం ఊసే లేదు. ఆదివాసుల హక్కులు రాజకీయ నాయకులకు ఎన్నికల ఎజెండాగానే మారాయి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు అసౌకర్యాలతో పోరాడుతున్న పరిస్థితి నేటికీ ఉంది.
ఆరోజు 1981 ఏప్రిల్ 20. ఆదివాసుల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుంచి నాలువైపుల నుండి భారీగా ఆదివాసులు తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయలుదేరారు. ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతితో పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు, ఆదివాసులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కేవలం 13మంది మాత్రమే చనిపోయినట్లు, 60మంది వరకు గాయపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పోలీసుల భయంతో బయటికి రాలేక వైద్యమందక సుమారు 40మందికి పైగా ఆదివాసి గిరిజనులు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం తన నివేదికలో స్పష్టం చేసింది. కాల్పుల ఘటన తరువాత అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్ట బోంగారం గ్రామాన్ని సందర్శించి బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు. ఆయన ప్రకటించిన పరిహారం నేటికీ అందలేదు. అలాగే కేంద్ర మంత్రి హోదాలో వచ్చిన జైరామ్ రమేష్ ఇంద్రవెల్లి స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దుతామని, పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని ఇచ్చిన హామీ కలగానే మిగిలిపోయింది.
అలాగే గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం అదిలాబాద్,వరంగల్ జిల్లాల్లో గిరిజనులకు పోడు భూములకు పట్టాలిస్తామన్న ప్రభుత్వ హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఏజెన్సీ ఏరియాగా గుర్తించబడిన ప్రాంతాలలో 1/70 చట్టం సంపూర్ణంగా అమలు కావడం లేదు. ఈ చట్టాన్ని కాపాడాల్సిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు పట్టించు కోకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో అక్రమార్కులు భూముల క్రయవిక్రయాలు జరుపుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా జిల్లాలోని పోడు గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రమే. నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోరు గ్రామాలు నేటికీ అసౌకర్యాలతో సహవాసం చేస్తున్నాయి. సరైన రహదారులు, తాగునీరు లేక భూమిపై యాజమాన్య హక్కులు లేక మనుగడు కోసం నిత్యం పోరాటం కొనసాగిస్తున్నారు. ఆదివాసుల బతుకులు బాగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇంద్రవెల్లి ఘటనలో అసువులు బాసిన అమరుల ఆశయాల సాధన కోసం కృషి చేయాలి. అధికారికంగా వారి సంస్మరణ దినోత్సవం జరపాలి.
- అంకం నరేష్, 6301650324