Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని దేశాల్లో జనాభా పెరిగింది. కొన్ని దేశాల్లో జన సంఖ్య తగ్గుముఖం పట్టింది. వృద్ధుల సంఖ్య పెరిగి, యువ జనాభా తగ్గడం కూడా ఆందోళన కలిగించే విషయమే. తక్కువ భూభాగం కలిగి ఎక్కువ జనాభాతో బాధపడే దేశాలు అభివృద్ధిని సాధించలేవు. అధిక జనాభాతో బాధపడే దేశాల్లోని ప్రజలకు అన్ని సదుపాయాలూ కల్పించడం కష్టం. ఈ కారణంగానే చాలా దేశాలు వెనకబడే ఉంటున్నాయి. వాస్తవ పరిస్థితులను ప్రభుత్వాలు, ప్రజలు అర్థం చేసుకోవాలి. జనాభాను తగ్గించుకుని, పేదరికాన్ని పారదోలాలి. లింగ వివక్షతను రూపు మాపి, సమానత్వాన్ని, మానవత్వాన్ని మెరుగు పరచి మానవ హక్కులను కాపాడాలి. 1989లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి) నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వాల్లో కదలిక రావాలి. 800కోట్లకు చేరువలోనున్న ప్రపంచ జనాభాకు అన్ని వసతులు సమకూర్చవలసిన బాధ్యత వాటిపై ఎంతైనా ఉంది. ఇప్పటికే అడవులను, పచ్చని భూములను ధ్వంసం చేసి, పర్యావరణాన్ని నాశనం చేసేశారు. దాని ఫలితాలను ప్రజలు చవిచూస్తున్నారు. సరైన వసతి లేదు. ఆహార భద్రత లేదు. విద్యా వైద్య సదుపాయాలు గగన కుసుమంలా మారాయి. ఆధునిక ప్రపంచంలో చాలా గ్రామాల్లో తాగునీరు లేక వ్యాధుల బారిన పడుతున్నారు. నగరాలన్నీ మురికి కూపాలుగా మారిపోతున్నాయి. కుటుంబ పోషణార్థం బాలలు వెట్టిచాకిరీ వైపు పయనిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ పురుడు పోసుకోవడానికి ఆర్థిక లేమి కారణమవుతున్నది. విద్యా సౌకర్యాలు లేక, పట్టించుకునే వారు కరువై వీధి బాలలుగా మారే వారి సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పెరిగే అవకాశముంది.
జనాభా పెరుగుదల వలన కలిగే దుష్ఫరిణామాలను అవగతం చేసుకున్న ఐక్యరాజ్యసమితి దశాబ్దాల క్రితమే కార్యాచరణ ప్రారంభించింది. పలు ప్రపంచ దేశాలు సైతం చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ప్రపంచ ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే ఫలితం శూన్యం. కాబట్టి జనాభా పెరుగుదల వలన కలిగే విపత్కర పరిణామాలపై ప్రజల్లో నిరంతర చైతన్యం కలిగించాలి. చైనా జనాభా కొద్ది దశాబ్దాల్లో గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటంతో చైనా వన్ చైల్డ్ విధానానికి వీడ్కోలు చెప్పింది. ఇద్దరు పిల్లలను కనేందుకు జంటలకు అనుమతి ఇచ్చింది. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జనాభా విస్ఫోటనం జరిగింది. కాని ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పడుతున్నది. ఇటలీ జనాభా తరిగిపోయి, వృద్ధులు పెరిగిపోతున్నారు. జపాన్ జనాభాలో సగం మంది వృద్ధులు ఉండే అవకాశాలున్నాయి. భారత జనాభా చైనాను అధిగమించిందని వార్తలు. జన విస్ఫోటనం మధ్య మానవాళి ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆహార, ఆవాస, తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ప్రపంచమంతా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రపంచ దేశాలన్నీ నిర్దిష్టమైన ప్రణాళిక, కార్యాచరణతో సమిష్టితత్వంతో ముందుకు సాగాలి.
- సత్తిరాజు