Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటి వరకు జరిగిన చరిత్రను మార్చింది, భవిష్యత్తులో మార్చేది వర్గ పోరాటాలే. ప్రస్తుత బీజేపీ పాలనా దుష్ఫలితాలు వర్గ పోరాటాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. దేశంలోని ఈ దోపిడీ వ్యవస్థకు నాయకత్వ స్థానంలో వుంటూ, ప్రభుత్వాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని ప్రజల సంపదను, శ్రమను దోచుకొని లాభపడిన పెద్ద పెట్టుబడిదారులు నేటి ఆధునిక కార్పొరేట్ సంస్థల నగస్వరూపం ఎప్పటి కంటే బీజేపీ పాలనలో మరింత బట్టబయలవుతుంది. కొద్దిమంది దగ్గర సంపద ఎలా పోగుపడుతుందో, దానికి రాజ్యం ఎలా తోడ్పడుతుందో అదానీ వ్యవహరం ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది.
దోపిడీ, పీడనల నుండి మానవ జాతిని విముక్తి చేసేందుకు ఈ భూమండలంపై ఆవిష్కరించబడిన గొప్ప శాస్త్రీయ సిద్ధాంతం మార్క్సిజం. అన్ని సంపదలకు మూలం శ్రమ అని, చరిత్ర పురోగతికి పరస్పర విరుద్ధ శక్తుల ఘర్షణే కారణమని, చరిత్రను నిర్మించేది ప్రజలేనని, ప్రస్తుత దశలో కార్మికవర్గ ప్రత్యేకత, దాని నాయకత్వ శక్తిని ప్రకటించి, రానున్న సమసమాజ నిర్మాణానికి మార్క్స్, ఎంగెల్స్‌లు సిద్ధాంత పునాది వేశారు. ఆ ఆత్యున్నత మేధో సిద్ధాంతాన్ని ఆచరణ సాధ్యం చేసిన విప్లవ సారథి లెనిన్. నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అంచనా వేసి, సరైన ఎత్తుగడలు రూపొందించి రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేసిన విప్లవ యోధుడు లెనిన్. ఆయన 153వ జయంతి నేడు.
లెనిన్ అసలు పేరు వ్లదిమిర్ ఇల్యిచ్ ఉల్యనోవ్. 1870 ఏప్రిల్ 22న జన్మించిన ఆయన 54ఏండ్ల వయసులో అస్తమించారు. జీవించింది తక్కువ కాలమే అయినా, ఆయన అనుసరించిన అనేక ఆచరణాత్మక మార్గాలు, రూపొందించిన బోధనలు నేటికీి నిత్యనూతనమే, ఆచరణీయమే. నేడు భారతదేశంలో మితవాద శక్తులు రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకొని పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో ప్రాచీన కాలం నాటి మత విశ్వాసాలను, మూఢాచారాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దేశ చరిత్రను వక్రీకరిస్తున్నాయి. ఒకవైపు కార్మిక వర్గ హక్కులను కాలరాసి, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి, నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలిని పెంచి పోషిస్తున్నాయి. మరోవైపు దేశ సంపదను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు, వ్యక్తులకు అప్పగించేస్తున్నాయి. రాజకీయ పక్షాలన్నింటిని తమ గుప్పిట్లోకి తెచ్చుకొని దేశాధిపత్యం సాధించాలని చూస్తున్నాయి. భారతదేశంలోని భిన్న సంస్కృతులు, ఆచారాలు, భాషలు, జాతులన్నీంటిని మతం ఆధారంగా ఏకీకృతం చేయడానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సైద్ధాంతిక, రాజకీయ శక్తిగా ప్రజల ముందు నిలిచి, ప్రజలను సమీకరించి, పోరాడాల్సిన చారిత్రక కర్తవ్యం నేటి కమ్యూనిస్టు ఉద్యమంపై ఉంది. ఆ కృషిని కొనసాగించేందుకు లెనిన్ బోధనలు ఎంతో అవసరం. రష్యాలో విప్లవానికి ముందున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను లెనిన్ ఎప్పటికప్పుడు మార్క్సిజం వెలుగులో పరిశీలించి అనేక రచనలు చేశారు. ఆ రచనలు నాటి రష్యా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాసినవే అయినప్పటికీ అందులోని సూత్రీకరణలు నేటికి మనకు ఆచరణీయంగానే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా వర్గ పోరాటాలను, మతోన్మాద విధానాల ఫలితంగా సామాజిక ప్రజాతంత్ర ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం మరింతగా పెరిగింది. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించడం, అది పురోగమించడం సాధ్యం కాదు. అయితే ఆధునిక పెట్టుబడిదారీవర్గం తన గత అనుభవాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని భూస్వామ్య వ్యవస్థతో రాజీ పడింది. మన దేశంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఒకవైపు ఆధునిక శాస్త్రవిజ్ఞాన ఫలితంగా సృష్టించబడిన పరికరాలను, సరుకులను ఉపయోగిస్తూనే, మరొకవైపు ఆదిమ, ప్రాచీన కాలం నాటి ఆచారాలు, సాంప్రదాయాలను ఆచరిస్తుండటాన్ని రోజూ చూస్తునే ఉన్నాం. కులం, మతం, లింగ వివక్షలు నేటికీ కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిచేయాల్సిన ప్రజాస్వామిక కర్తవ్యాలను అది పూర్తిచేయకుండా వదలి వేయడం నేటి ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం సులభంగా ప్రజల్లోకి చొరబడడానికి, అది రాజకీయంగా బలపడడానికి పునాదిగా తోడ్పడుతుంది. ఈ పరిస్థితులను మార్చాలి. అందుకు నాడు లెనిన్ సోషల్ డెమోక్రాట్లకు చేసిన బోధనలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. కమ్యూనిస్టుల ఆచరణాత్మక కార్యకలాపాల లక్ష్యం ఏమిటని లెనిన్ ప్రశ్నించి అందుకు జవాబుగా రెండు ముఖ్యమైన కార్యకలాపాల గురించి వివరించాడు. ఒకటి కార్మిక వర్గ పోరాటానికి నాయకత్వం వహించడం, ఆ వర్గ పోరాటాన్ని కర్షక, పీడిత వర్గాల వరకు విస్తరించి వర్గపోరాటాలను ఉధృతం చేయడం, ప్రస్తుత దోపిడీ, పీడనలకు కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చివేసి, సోషలిస్టు వ్యవస్థ ఔన్నత్యాన్ని ప్రచారం చేయడం పెంచాలి. రెండు ప్రజాస్వామిక ప్రచార, ఆందోళన కార్యకలాపాలు చేపట్టడం. రాజకీయ, సామాజిక వ్యవస్థలను పురోగామి భావాల వైపు మళ్లించడం ఉధృతం చేయాలి.
వర్గ పోరాటాలు - కమ్యూనిస్టుల కృషి
ఇప్పటి వరకు జరిగిన చరిత్రను మార్చింది, భవిష్యత్తులో మార్చేది వర్గ పోరాటాలే. ప్రస్తుత బీజేపీ పాలనా దుష్ఫలితాలు వర్గ పోరాటాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. దేశంలోని ఈ దోపిడీ వ్యవస్థకు నాయకత్వ స్థానంలో వుంటూ, ప్రభుత్వాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని ప్రజల సంపదను, శ్రమను దోచుకొని లాభపడిన పెద్ద పెట్టుబడిదారులు నేటి ఆధునిక కార్పొరేట్ సంస్థల నగస్వరూపం ఎప్పటి కంటే బీజేపీ పాలనలో మరింత బట్టబయలవుతుంది. కొద్దిమంది దగ్గర సంపద ఎలా పోగుపడుతుందో, దానికి రాజ్యం ఎలా తోడ్పడుతుందో అదానీ వ్యవహరం ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. దేశ ప్రజలు సృష్టించిన సంపద, ప్రకృతి సహజ వనరులు ఎలా వీరి కబంధ హస్తాల్లోకి పోతున్నాయో కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. శ్రమజీవుల హక్కులను కాలరాస్తూ ఆధునిక వెట్టి బానిసలుగా మారుస్తున్న తీరు, వ్యవసాయాన్ని కార్పొరేటైజ్ చేసి గ్రామాల నుండి ప్రజలను తరిమికొడుతున్న విధానాలు, కొందరు ఐ.టి ఉద్యోగుల కృత్రిమ ఆదాయాలు ఐసు ముక్కల్లా రోజురోజుకు కరిగిపోతున్న పరిస్థితులు వర్గపోరాటాల అవసరాన్ని పెంచుతున్నాయి. అనేక ఆటంకాలు, పరిమితులున్న నేటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు చేసిన చొరవ, కృషి ఫలితంగా మన కళ్ళ ముందే జరిగిన చారిత్రాత్మక ఐక్య రైతాంగ ఉద్యమం, కార్మిక వర్గ సమ్మెలు, ఆ సమ్మెలకు మద్దతుగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు నిలవడం, ఈ నెలలో దేశ రాజధానిలో కార్మిక, కర్షకులు సమీకరణ శక్తి, దేశంలో పెరుగుతున్న వర్గ పోరాటాల ఉధృతికి నిదర్శనాలు. ఈ వర్గ పోరాటాలను ముందుకు తీసుకవెళ్లే క్రమంలో కమ్యూనిస్టులు ఎలా పని చేయాలో లెనిన్ బోధించాడు. కమ్యూనిస్టులు కేవలం పోరాటాలు చేయడమే కాదు, పోరాడుతున్న ప్రజల్లో శాస్త్రీయ సోషలిస్టు బోధనలను ప్రచారం చేయడం, సమాజంలోని వివిధ వర్గాల గురించి, వాటి మధ్య ఐక్యత అవసరం గురించి, ఆ వర్గ పోరాటాల్లో కార్మికవర్గ పాత్ర గురించి, సరైన అవగాహన వ్యాప్తి చేయడం, ఉమ్మడి ప్రయోజనాల పట్ల చైతన్యవంతం చేయడం, అనుభవజ్ఞలైన ఆందోళనకారులకు శిక్షణ ఇవ్వడం చేయాలన్నారు. తప్పుడు భావాల నుండి, అస్పష్టమైన వాగాబంబర సిద్ధాంతాల నుండి కార్మిక, కష్టజీవులను రక్షించేందుకు కమ్యూనిస్టులు నిరంతరం కృషి చేయాలన్నారు.
ప్రచార, ఆందోళనలు
ఈ రెండింటిలో ఏది ముందు, ఏది వెనుక అని కాకుండా రెండు ప్రధానమైనవేనని, రెండింటిని మేళవించి అమలు చేయాలని లెనిన్ చెప్పారు. సామాజిక మార్పు కోరే భావజాలానికి, సమాజాన్ని తిరోగమన దిశకు మళ్లించాలనే ఆలోచనలకు మధ్య నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. మానవ జీవితంలో ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రాధాన్యత వహిస్తుందో, దానికి ఏ మాత్రం తీసిపోకుండా సాంస్కృతిక అంశాలు కూడా అంతే పాత్ర నిర్వహిస్తాయి. అందుకని ఈ రెండు రంగాల ప్రాధాన్యత, వాటిల్లో కమ్యూనిస్టుల పని ఎలా చేయాలో లెనిన్ రచనల్లో సమాధానం ఉంది. ఆర్థిక పోరాటాల్లో భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఒక్కటే నిలబడుతుంది. కాని ప్రజాతంత్ర కార్యక్రమాల్లో అనేక మంది మిత్రులు దొరుకుతారు. వివిధ ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు, బృందాలు, మేధావుల్లోని ఒక భాగం ప్రజాస్వామ్య హక్కులను సాధించుకునేందుకు, ఉన్న హక్కులను నిలుపుకునేందుకు, సమాజంలో ప్రజాస్వామ్య విలువలను బలపర్చేందుకు ముందుకు వస్తారు. ఇందుకు కలిసి వచ్చే శక్తులతో విశాల ప్రాతిపదికన బహుముఖాలుగా కృషి చేయాలి. అనేక సమూహాలతో ఇచ్చి పుచ్చుకునే పద్ధతుల్లో పనిచేయాలి. ఇలాంటి వారితో కలిసి పనిచేసేటప్పుడు ఎలా వ్యవహరించాలో లెనిన్ బోధించాడు. దేశంలో చిన్న పిల్లల్లో మతోన్మాద విషబీజాలు నాటుతూ, యువతను పెడదారి పట్టిస్తూ, దళితులను, మహిళలను సనాతన సంప్రదాయాల పేరుతో సామాజికంగా అణచివేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పెద్దఎతున కృషి చేయాల్సిన అవసరముంది. అనేక శక్తులు ఈ కృషిలో భాగస్వాములు కావాలి. అలాంటివారికి వేదికలు కల్పించడం, వారి భావాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకవెళ్లడం కమ్యూనిస్టుల కర్తవ్యం. అదే లెనిన్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు లెనిన్ 153వ జయంతి)
- వి. రాంభూపాల్