Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని ప్రధాన దేశాలలోకల్లా అతి వేగంగా పెరుగుతోందని మన ప్రభుత్వ అధికారులు అలుపూ, విరామం లేకుండా చెపుతూనే వుంటారు. 2020-21లో మన దేశం అత్యంత దుర్మార్గమైన లాక్డౌన్ను అమలు చేసిన సంగతి గాని, దాని పర్యవసానంగా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకీ మన దేశమే అత్యంత ఎక్కువ మోతాదులో జీడీపీ పతనాన్ని చవిచూసిన సంగతి గాని వారు ఎన్నడూ ప్రస్తావించరు. అలా అతి హీన స్థాయికి పడిపోయిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని అక్కడినుంచి మన పెరుగుదలను లెక్కించి మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందంటూ చెప్పుకుంటున్నారు.
లాక్డౌన్ కన్నా ముందటి ఏడాది, అంటే 2019-20తో 2021-22 సంవత్సరపు (లాక్డౌన్ తర్వాత ఏడాది) జీడీపీని పోల్చి చూస్తే కేవలం 1.5శాతం మాత్రమే ఎక్కువగా ఉంది. ఇక 2022-23 సంవత్సరపు జీడీపీ అంతకు ముందటి ఏడు (2021-22) కన్నా 6.8శాతం ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ గాని, మన రిజర్వు బ్యాంకు గాని అంచనా వేస్తున్నాయి. అంటే అది 2019-20 కన్నా 8.4శాతం ఎక్కువ అన్నమాట. మధ్యలో 2020-21ని పక్కన పెట్టి చూస్తే (అది లాక్డౌన్ సంవత్సరం కనుక) 2019-20 నుండి 2022-23 దాకా ఉన్న మూడు సంవత్సరాలకాలంలో ఏడాదికి 2.7శాతం చొప్పున మాత్రమే మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను నమోదు చేసినట్టు కనిపిస్తుంది. ఈ హీనమైన పెరుగుదల కూడా 2023-24లో కొనసాగే అవకాశాలు లేవు. గత ఏడాది కన్నా తక్కువ స్థాయిలోనే పెరుగుదల ఈ ఏడు ఉండబోతున్నట్టు అంచనాలు సూచిస్తున్నాయి.
దాదాపు అన్ని సంస్థలూ 2023-23లో వృద్ధి రేటు గతేడాది కన్నా తక్కువగానే ఉండబోతున్నట్టు తమ తమ అంచనాలను ప్రకటించాయి. ఐఎంఎఫ్ అంచనాలనే చూసుకుంటే భారతదేశం 2022-23లో 6.8శాతం వృద్ధి నమోదు చేసిందని, అదే 2023-23లో వృద్ధి 5.9శాతం మాత్రమే ఉండబోతున్నదని తెలిపింది. మన ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తున్న వృద్ధిరేటు తప్పుడు ప్రాతిపదికలతో లెక్కించినందువలన వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని, వాస్తవ వృద్ధి రేటు కన్నా బాగా ఎక్కువగా చూపిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి గతంలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా పనిచేసినవారు తెలిపారు. లాక్డౌన్తో కుదేలైన మన ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత పడుతూ లేస్తూ ముందడుగు వేస్తోందని, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని, ఈ ఏడాది వృద్ధిరేటు తగ్గబోతోందని అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పుడు వేస్తున్న అంచనాలకన్నా కూడా ఇంకా తగ్గుదల ఎక్కువగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఎందుకంటే చమురు ఉత్పత్తి దేశాలు మే ఒకటో తేదీనుండి తమ ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ళ మేరకు తగ్గించుకోవాలని నిర్ణయించాయి. గత అక్టోబర్లో 20లక్షల బ్యారెళ్ళ చేరకు తమ రోజువారీ ఉత్పత్తిని తగ్గించాయి. దానిమీద ఇప్పుడు అదనంగా మరోసారి తగ్గించబోతున్నాయి. దీని ఫలితంగా మన దేశ వృద్ధిరేటు మరింత దెబ్బ తింటుంది.
చమురు ఉత్పత్తి తగ్గించినందువలన అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం మరింత కష్టసాధ్యం ఔతుంది. (గత వారం వ్యాసంలో ఈ విషయాన్ని వివరంగా మనం చర్చించాం) అందువలన అమెరికా తన వడ్డీ రేట్లను మరింత పెంచక తప్పదు. అప్పుడు మన దేశంనుండి పెట్టుబడులు అమెరికావైపు మరింత ఎక్కువ వేగంగా తరలిపోతాయి. మనదగ్గర ఉండే డాలరు నిల్వలు తరిగిపోతే మన రూపాయి విలువ పడిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే విదేశీ నిల్వలు అమెరికాకు తరలిపోకుండా ఆపాలి. అందుకోసం మనదగ్గర వడ్డీ రేట్లను కూడా బాగా పెంచాలి. అప్పుడు మన దేశంలో ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది. దాని ఫలితంగా మన ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతుంది.
అమెరికా వడ్డీరేట్ల సంగతి పక్కన పెట్టినా, చమురు ఉత్పత్తి తగ్గిందంటే దాని ఫలితంగా పెట్రోలు, ఇతర చమురు ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. అప్పుడు మన దేశం దిగుమతి చేసుకునే చమురుకు ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. దాని కారణంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలకు చేసే ఖర్చు తగ్గిపోతుంది. దానిఫలితంగా మన వృద్ధిరేటు తగ్గిపోతుంది.
ఈ చమురు ధరలు పెరగడం వలన కలిగే ప్రభావం పక్కన పెట్టినా, మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గిపోనుంది. నిజానికి 2022-23 చివరి త్రైమాసికంలోనే వృద్ధిరేటు అంతకు ముందరి మూడు నెలలతో పోల్చితే 4.4. నుండి 4.2కి తగ్గిపోయిందని రిజర్వుబ్యాంకు అంచనాలు చెపుతున్నాయి. కరోనా మహమ్మారి అనంతరం మన దేశం సాధించిన స్వల్పమైన వృద్ధి రేటు కూడా నిలబడకుండా ఎందుకు దిగజారిపోతోంది?
దీనికి మూలకారణం నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ స్వభావంలోనే ఉంది. ఈ తరహా ఆర్థిక వ్యవస్థలో జరిగే మొత్తం ఉత్పత్తిలో ప్రయివేటు వ్యక్తుల వినిమయం భాగం తగ్గిపోతుంది. ఆర్థిక అసమానతలు నయా ఉదారవాద విధానాల ఫలితంగా పెరిగిపోతాయి. అందువలన ఎక్కువ మంది వ్యక్తుల వినిమయ శక్తి తగ్గిపోతుంది. తమ ఆదాయాలతో నిమిత్తం లేకుండా ఖర్చు చేయగలవారు (సంపన్నులు) కొద్దిశాతమే ఉంటారు. వారి వినిమయం ఎంత ఉన్నా, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టడానికి అది సరిపోదు. ఇంకోవైపు ప్రయివేటు వ్యక్తులు పెట్టే పెట్టుబడులు మార్కెట్లో వృద్ధి ఎంత మోతాదులో ఉండబోతోంది అన్న అంచనా బట్టి ఉంటాయి. కాబట్టి ప్రయివేటు పెట్టుబడులూ ఆర్థిక వృద్ధిని ముందుకు నెట్టడానికి తోడ్పడవు. ఇక ప్రభుత్వం చేసే వ్యయంతో ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాలనుకుంటే, ఆ ప్రభుత్వ వ్యయం కూడా పరిమితులకు లోబడే ఉండాలి. ఎందుకంటే ద్రవ్యలోటు జీడీపీలో ఒక నిర్దిష్ట శాతానికి (దాదాపు 4శాతం) మించి ఉండకూడదన్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన నిబంధన. ఆ నిబంధనను అతిక్రమించకుండా ప్రభుత్వ వ్యయం పెరగాలంటే సంపన్నులమీద విధించే పన్నులను పెంచడమే మార్గం. కాని అందుకు కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. ఇంక మిగిలినవి రెండే మార్గాలు. మొదటిది: దిగుమతులకన్నా ఎగుమతులు బాగా ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, రెండోది: గృహాల, భూముల విలువలను కృత్రిమంగా పెంచివేయడం. అప్పుడు వ్యక్తుల ఆదాయాలతో నిమిత్తం లేకుండా ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొంతవరకూ జరగవచ్చు.
కాని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగానే ఆర్థికమాంద్యం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఆర్థికమాంద్యాన్ని ప్రయోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎగుమతులు పెరగడం మాట అటుంచి తగ్గే ప్రమాదం ఉంది. ఇక గృహాల, భూముల మార్కెట్ విలువలను కృత్రిమంగా పెంచడం అనేది మన దేశంలో అంతగా ఫలితాన్ని ఇవ్వదు. ఒక చిన్న సామాజిక తరగతిని మరింత ధనవంతులుగా చేయడానికి మాత్రమే అది తోడ్పడుతుంది. ఆ తరగతి చేసే వినిమయం ప్రధానంగా విదేశాల మార్కెట్లకు తోడ్పడుతుంది. మొత్తంగా చూస్తే మన దేశ ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతుందని ఆశించడానికి ఏ కారణమూ కనిపించడంలేదు. పైగా అది తగ్గుముఖం పడుతోందని చెప్పడానికి తగిన కారణాలు ఉన్నాయి. పెట్టుబడుల వృద్ధి రేటు తగ్గుతోంది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపధ్యంలో వినిమయం తగ్గుతోంది. ఐఎంఎఫ్ కూడా ప్రయివేటు వ్యక్తుల వినిమయంగాని, పెట్టుబడులు గాని పెరగని కారణంగానే భారతదేశ ఆర్థికవృద్ధి తగ్గుముఖం పట్టనున్నట్టు చెప్తోంది. ఇంత తేడా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా దానిని అధిగమించగలిగే పరిస్థితి ఎటుతిరిగీ లేనేలేదు.
ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తాను ఏ యే పద్దులమీద ఖర్చు చేస్తోందో ఆ ఖర్చు కేటాయింపులను మార్చితే మన ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం చేసే ఖర్చు నేరుగా శ్రామిక ప్రజానీకానికి అందించవచ్చు, లేదా, మౌలికవసతుల కల్పనపై ఖర్చు చేయవచ్చు. ఒకవేళ ప్రభుత్వం నేరుగా శ్రామిక ప్రజానీకానికి అందే విధంగా ఖర్చు చేసిందనుకుందాం. అప్పుడు ఆ సొమ్ము మొత్తం శ్రామిక ప్రజానీకం తిరిగి ఖర్చు చేసేస్తారు. వాళ్ళు సరుకులను, సేవలను పొందడానికి ప్రధానంగా ఖర్చు చేస్తారు. ఆ సరుకుల ఉత్పత్తి ప్రధానంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో జరుగుతుంది. ఆ పరిశ్రమలకు మిగిలే లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేగాక, ఆ చిన్న పరిశ్రమల యజమానులు తమవద్దకు వచ్చినసొమ్మును మళ్ళీ పెట్టుబడి రూపంలోనో, ఖర్చు రూపంలోనో మార్కెట్లోకి మరోసారి పంపిస్తారు. ఆ విధంగా శ్రామిక ప్రజలకు నేరుగా అందేలా ప్రభుత్వం ఖర్చు చేస్తే అది రెండు, మూడింతలు మార్కెట్లో వినిమయం జరగడానికి, అంటే డిమాండ్ పెరగడానికి దోహదపడుతుంది. అదే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తే అప్పుడు ఆ ఖర్చులో ఎక్కువ భాగం దిగుమతులకోసం గాని, ప్రాజెక్టులు చేపట్టిన కార్పొరేట్ల దగ్గర మిగులు రూపంలో గాని ఉండిపోతుంది. మార్కెట్లోకి ఎక్కువ భాగం రావడం అనేది ఉండదు. అందువలన మార్కెట్లో డిమాండ్ పెరగడానికి అంతగా దోహదపడదు.
కరోనా తర్వాత మన ప్రభుత్వం తనవద్ద నిల్వ ఉన్న ఆహారధాన్యాలలో కొంత భాగాన్ని పేద కుటుంబాలకు అందిస్తోంది. అందుచేత శ్రామిక ప్రజానీకానికి నేరుగా అందేలా ప్రభుత్వ వ్యయం ఉంటే, ఆ సొమ్ము ఆహారదినుసుల కొనుగోలు కన్నా ఇతర వినిమయ సరుకుల కొనుగోలు కోసం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ సరుకులను మళ్ళీ ఉత్పత్తి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆ విధంగా డిమాండ్ పెరిగి ఆరిక్థ వ్యవస్థ మళ్ళీ వేగం పుంజుకునే వీలుంటుంది. పైగా అదనపు ఉపాధికల్పన కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం ఆర్థిక భారాలతో నలిగిపోతున్న శ్రామిక ప్రజానీకానికి ఊరట లభించడంతో రబాటు ఆర్థిక వ్యవస్థవేగం కూడా పెరిగేందుకు వీలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు చేయడం లేదు? తన ఆశ్రయంలో ఉన్న కార్పొరేట్ల సేవ తప్ప తక్కినదేదీ పట్టని మోడీ ప్రభుత్వానికి శ్రామిక ప్రజలను పట్టించుకునే తీరిక ఎంతమాత్రమూ లేదు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్