Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేములవాడ రాజన్న, యాదాద్రి లక్ష్మీనర్సింహా, తిరుపతి వెంకన్న, కొండగట్టు ఆంజనేయ, ఆలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళి... పేర్లు, ప్రమాణాలు ఏవైతేనేం...ప్రజల్ని ఎటు తీసుకెళ్తున్నారు ఈ క్షుద్ర రాజకీయ సన్నాసులు. ఉన్నాడో... లేడో విశ్వాసం మీద ఆధారపడిన దేవుణ్ణి తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. మనుధర్మ సూత్రాలను అమల్లోకి తెస్తూ, దేవుడి చుట్టూ బీజేపీ రాజకీయాలు నడుపుతుంటే, సెక్యులర్ అంటూ చంకలు గుద్దుకొనే నేతలు, పార్టీలు కూడా అనుకోకుండా ఆ 'అజెండా సెట్టింగ్'లో కొట్టుకుపోతున్నారు. ప్రమాణం చేయకపోతే ప్రజలు విశ్వసించరేమో అనే అవిశ్వాస, అశక్త రాజకీయానికి ఒడిగడుతున్నారు. ఈ బూర్జువా రాజకీయ నేతల్ని ఫాలో అయ్యే ప్రజలు కూడా 'అమ్మతోడు' అంటూ అయిందానికీ, కానిదానికీ ఒట్లు పెట్టుకుంటున్నారు. ఆ ఒట్లే తమను గట్టెక్కిస్తాయని విశ్వసిస్తున్నారు. త్రేతాయుగంలోనే ఆకాశవాణి, పుష్పక విమానాలు ఉన్నాయనీ, 'బోడి మీ సైన్స్ గొప్పేంటి' అని ప్రచారం చేసే బీజేపీ రాజకీయ భక్తాయిలు కమ్యూనిస్టులు మినహా అన్ని రాజకీయపార్టీలను మతం మత్తులోకి లాగేస్తున్నారు. గతంలో ఈ ప్రమాణాల లొల్లి అప్పుడప్పుడు వినిపించేది. ఇప్పుడు 'బండి' ఎక్కాక ఈ దురదగొండి పీక్కు వెళ్లి అందరికీ అంటుకుంది. ఈతరం రాజకీయ నాయకుడికి కావల్సింది ప్రజలకు సేవచేసి మన్ననలు, గుర్తింపు పొందడం కాదు. ఉలుకుపలుకులేని దేవుడి ముందు తడిబట్టలతో ప్రమాణాలు చేయడం, ఆ సెంటిమెంట్‌ను తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడం. ఇంతకన్నా దుర్మార్గం, రాజకీయ పలాయనవాదం ఏమన్నా ఉందా? ప్రజలకు ఆదర్శంగా ఉంటూ, సమాజాన్ని చైతన్యపర్చాల్సిన ఈ నేతలు దేవుళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ, మతాన్ని, రాజకీయాలను అనుసంధానం చేసుకుంటూ వ్యూహాత్మకంగా 'ఒట్టు'ను గట్టెక్కిస్తూ ప్రజల్లో విభజన సృష్టిస్తున్నదనే సోయిని ఆయా పార్టీల నేతలు కోల్పోతున్నారు. కేంద్రంలో మహామౌనజ్ఞాని మోడీ 9ఏండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు చెప్పడం మానేసి, ఆదిశంకరుడు, తీర్థంకరుడు, రామానుజాచార్యులు వంటి విగ్రహాలను ఆవిష్కరిస్తూ, ప్రజల్లో 'ఒట్టు' పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నారు. దేశం ఎటుపోతుందో..? ప్రజల్ని ఏ మార్గంలోకి తీసుకెళ్తున్నామో దిశాదశ లేకుండా దేశ రాజకీయం సాగుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించేనేమో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించడాన్ని నేరంగా పరిగణించారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థల మాదిరే ఈ మతరాజకీయ నిషేధాన్ని కూడా బీజేపీ తుంగలో తొక్కి 'ప్రమాణాలు' పేరుతో అడ్డతోవలు తొక్కుతుంది. ఆ మాయలో, ఆ ఉచ్చులో, ఆ అజెండా సెట్టింగ్‌లో మనమూ కొట్టుకుపోవద్దు. కాస్త చైతన్యవంతమైన, స్ఫూర్తి దాయకమైన ఆలోచన చేద్దాం. సమాజాన్ని 'ప్రమాణాల' సంస్కృతికి దూరంగా తీసుకెళ్దాం!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి, సెల్:9490099086