Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్ లాబీ ఉందన్నది స్పష్టం. మన జీడీపీతో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ. అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ దానికే మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ధి కుంటుపడుతుంది. అమెరికా ఆయుధ కంపెనీలకు లాభసాటి గనుక అది మిలిటరీ ఖర్చు ఎంతైనా పెడుతుంది. దాని జీడీపీ కూడా ఎక్కువే. తనకు లాభం కనుక ఇతర దేశాలనూ ఉసిగొల్పుతుంది. తనను చక్రబంధం చేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు చైనా కూడా మిలిటరీ ఖర్చు పెడుతున్నా అది తక్కువే.
సోమవారంనాడు స్టాక్‌హౌమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు చైనా లేదా మరొక ఏ దేశమైనా యావత్ మానవాళికే ముప్పు తెచ్చే ఆయుధాలతో ఆమెరికా, దాని మిత్ర దేశాలు భూమి, ఆకాశాలను నింపుతున్నప్పుడు ఎవరైనా వాటిని ఎదుర్కొనేందుకు పూనుకోకతప్పదు. స్టార్‌వార్స్ పేరుతో గగనతలంలో అమెరికా రూపొందిస్తున్న అస్త్ర, శస్త్రాల గురించి దశాబ్దాల తరబడి జరుపుతున్న ప్రచారం అదెలా ఉంటుందో చూపుతున్న సినిమాలు, వాస్తవాల గురించి అందరికీ తెలిసిందే. అందువలన దానికి పోటీగా ఏ దేశం ఏం చేస్తున్నదనే వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ ఏదో ఒకటి చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబీలతో స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు తమ ప్రభుత్వానికి సీఐఏ నివేదించినట్లు ఇటీవల బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది. చైనా ఆయుధాల గురించి సీఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక జరిపిన సమీక్షలో పేర్కొన్నారు. చైనా కొత్త ఆయుధాలను రూపొందించటం ఇదే కొత్త కాదంటూ కొందరు విశ్లేషకులు గుండెలుబాదుకుంటున్నారు. వారికి అమెరికా, ఇతర దేశాలు ఏం చేస్తున్నదీ కనపడవా? చూడదలచుకోలేదా?
కంటికి కనిపించని సైబర్‌దాడులు అంటే కంప్యూటర్లతో పని చేసే మిలిటరీ, పౌర వ్యవస్థలను నాశనం లేదా పని చేయకుండా చేయటం. అమెరికా తరచూ చేసే ఆరోపణ ఏమంటే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తమ నుంచి అపహరించిందన్నది. సైబర్‌దాడులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా తమ జాతీయ భద్రతా సంస్థ(ఎన్ఎస్ఏ) నుంచి తస్కరించినట్లు కథనాలు రాయిస్తున్నది. చైనా 2016లోనే ఎన్ఎస్ఏ, అమెరికా మిత్రదేశాలకు చెందిన ఐరోపా కంపెనీల నుంచి గుప్త సంకేతాలను తీసుకొని వాటితో అదే కంపెనీల మీదే దాడులు జరుపుతోందన్నది సారం. గత సంవత్సరం అమెరికా కనీసం ఆరు దేశాల ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసినట్లు ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక సమాచార వ్యవస్థ ఆరోపించింది. అంతరిక్షం, సైబర్ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్ ఆయుధాలతో గూఢచర్యం, సమాచారాన్ని పంపే అమెరికా ఉపగ్రహాల వ్యవస్థలను పనిచేయకుండా చేయవచ్చని, ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సీఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దీని మాతృసంస్థ ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.
ప్రపంచంలో రోజు రోజుకూ మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది. ప్రపంచం ఏమైనా సరే ఈ ఖర్చు ఎంత పెరిగితే అమెరికా కార్పొరేట్లకు అంతగా లాభాలు. మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. ప్రపంచ జీడీపీ వృద్ధి 2.9శాతం, అంతకంటే తక్కువే అని అంచనా వేస్తున్నారు. డాలర్లలో చెప్పుకుంటే 2022 ఖర్చు 2,240బిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ జీడీపీలో 2.2శాతం. ఐరోపాలో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగింది. ప్రపంచం మొత్తం చేస్తున్న ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. దేశాల వారీ అమెరికా 39, చైనా 13, రష్యా 3.9, భారత్ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అందచేసిన దాదాపు 20బి.డాలర్లను కూడా కలుపుకుంటే దాని వాటా 40శాతం. ఐరోపాలో అధికంగా ఖర్చు చేస్తున్న బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఎనిమిది శాతం, అమెరికా నీడలో ఉండే జపాన్, దక్షిణ కొరియా 2.1శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మొత్తం మీద ప్రపంచ ధోరణులను గమనిస్తే ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య, తూర్పు ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దీనికి మూలంగా కనిపిస్తున్నాయి, వాటికి అమెరికా, దానితో చేతులు కలుపుతున్న పశ్చిమ దేశాలే కారణం అన్నది బహిరంగ రహస్యం. సోవియట్ ఉనికిలో లేదు, దానిలో ఉన్న అనేక దేశాలు ఇప్పుడు అమెరికా చంకనెక్కాయి. అయినప్పటికీ ప్రచ్చన్న యుద్ధం నాటి స్థాయిని దాటి మధ్య,పశ్చిమ ఐరోపా దేశాల మిలిటరీ ఖర్చు ఇప్పుడు పెరిగింది. ఉక్రెయిన్ సంక్షోభంతో నిమిత్తంలేని ఫిన్లండ్ 36, లిథువేనియా 27, స్వీడెన్ 12, పోలాండ్ 11శాతం చొప్పున ఖర్చు పెంచాయి. అనేక తూర్పు ఐరోపా దేశాలు 2014తో పోల్చితే రెట్టింపు చేశాయి.
ఇక రష్యా ఖర్చు దాని జీడీపీలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్ ఖర్చు 640శాతం పెరిగి జీడీపీలో 3.2 నుంచి 34శాతానికి చేరింది. అమెరికాలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్బణం పెరిగి ఇబ్బందులు తలెత్తినా మిలిటరీ ఖర్చు పెంచుతూనే ఉంది. ఉక్రెయిన్‌తో సహా ప్రపంచంలో ఏ దేశానికి మిలిటరీ సాయం చేసినా అది అమెరికా ఆయుధ పరిశ్రమల లాభాలు పెంచేందుకే అన్నది తెలిసిందే. అమెరికాకు యుద్ధం వచ్చిందంటే చాలు పండుగే. రెండవ ప్రపంచ యుద్ధంలో డ్యూపాంట్ కంపెనీ లాభాలు 950శాతం పెరిగాయి. ప్రతి పోరూ అలాంటిదే. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా విదేశాంగశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం నాటో ద్వారా ఆయుధాల అమ్మకం 2021తో పోల్చితే 2022లో 35.8 నుంచి 51.9 బి.డాలర్లకు పెరిగాయి. అదే నేరుగా ఈ కాలంలోనే 103.4 నుంచి 153.7 బిడాలర్లకు పెరిగాయి. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి. పేట్రియాట్ క్షిపణులను రూపొందించే రేతియాన్, ఎఫ్-16, 22, 35 రకం యుద్ధం విమానాలను తయారు చేసే లాక్‌హీడ్ మార్టిన్, నార్త్రాప్ గ్రుయిమాన్ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగానే ఉక్రెయిన్ వివాదంలో సంప్రదింపులు జరగకుండా అడ్డుపడుతున్నది, పదే పదే తైవాన్ మీద చైనాను రెచ్చగొడుతున్నది. మరోవైపున ఆఫ్రికాలో కొత్త చిచ్చు రేపేందుకు, ఉన్నవాటిని కొనసాగించేందుకు చూస్తున్నది.
అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే గత మూడు దశాబ్దాలుగా దాని ఖర్చు పెరుగుతూనే ఉన్నప్పటికీ అమెరికా 877 బి.డాలర్లతో పోలిస్తే దాని ఖర్చు 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది. దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది. ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. నైజీరియా 2021లో 56శాతం ఖర్చు పెంచగా గతేడాది 38శాతం తగ్గించింది. నాటో మిలిటరీ ఖర్చు 1,232 బి.డాలర్లకు పెరిగింది. ఐరోపాలో 68.5బి.డాలర్లతో బ్రిటన్ మొదటి స్థానంలో ఉంది. తుర్కియె(టర్కీ) వరుసగా మూడవ ఏడాది మిలిటరీ ఖర్చును తగ్గించింది. ఐరోపా మొత్తంగా 13శాతం పెరిగింది.
స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం 4వ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. చైనా తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్ 12.5 బి.డాలర్లతో 21వ స్థానంలో ఉంది. నలభై దేశాలలో చివరిదిగా 5.2బి.డాలర్లతో రుమేనియా ఉంది. 2021తో పోలిస్తే అనేక దేశాల రాంకుల్లో మార్పు వచ్చింది. సిప్రి వివరాలను అందచేసిన 36 ఐరోపా దేశాల్లో 23 ఖర్చును పెంచటం ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావాన్ని వెల్లడిస్తున్నది. వీటి ఖర్చు 0.4శాతం స్విడ్జర్లాండ్ నుంచి లక్సెంబర్గ్ 45శాతం గరిష్టంగా ఉంది. పదమూడు దేశాల ఖర్చు 0.4శాతం నుంచి 11శాతం వరకు తగ్గింది. వరల్డో మీటర్ విశ్లేషణ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ తన జీడీపీలో 61శాతం ఖర్చు చేస్తున్నది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240, చైనా 163, శ్రీలంక 116, పాకిస్థాన్ 50, మయన్మార్ 48, భారత్ 43, బంగ్లాదేశ్ 27, నేపాల్ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది.
ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచితే అది జనాల మీద భారం, జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని పైన పేర్కొన్న తలసరి ఖర్చు వెల్లడిస్తున్నది. అలాగే మన దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్థాన్ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్ లాబీ ఉందన్నది స్పష్టం. మన జీడీపీతో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ. అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ దానికే మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ధి కుంటుపడుతుంది. అమెరికా ఆయుధ కంపెనీలకు లాభసాటి గనుక అది మిలిటరీ ఖర్చు ఎంతైనా పెడుతుంది. దాని జీడీపీ కూడా ఎక్కువే. తనకు లాభం కనుక ఇతర దేశాలనూ ఉసిగొల్పుతుంది. తనను చక్రబంధం చేస్తున్న అమెరికాను అడ్డుకొనేందుకు చైనా కూడా మిలిటరీ ఖర్చు పెడుతున్నా అది తక్కువే. తనకోసం అది అయుధాలను రూపొందిస్తున్నది కనుక కొన్నింటిని ఎగుమతి కూడా చేస్తున్నది. 2021లో ప్రపంచ మిలిటరీ సేవలు, అయుధాల వంద పెద్ద కంపెనీల మార్కెట్ 592 బి.డాలర్లని అంచనా. వాటి ఎగుమతిలో 2018 నుంచి 2022 వరకు పది అగ్రశ్రేణి దేశాల వారీ వాటా అమెరికా 40, రష్యా 16, ఫ్రాన్స్ 11, చైనా 5.2, జర్మనీ 4.2, ఇటలీ 3.8, బ్రిటన్ 3.2,స్పెయిన్ 2.6, దక్షిణ కొరియా 2.4, ఇజ్రాయెల్ 2.3శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మన దేశంలో కూడా కొన్ని బడా కంపెనీలు లాభసాటిగా ఉండే ఆయుధ తయారీకి ఉబలాటపడు తున్నాయి. మిగిలిన అంశాలన్నీ సరిగా ఉంటే అలాంటి పని చేసినా అదొక తీరు లేనప్పుడు మన పెట్టుబడులను వాటి మీదే కేంద్రీకరిస్తే జనం సంగతేంగాను. అందుకే ఎదుటి వారు తొడకోసుకుంటే మనం మెడకోసుకుంటామా అని పెద్దలు ఏనాడో చెప్పారు. దాన్ని మన పాలకులు పాటిస్తారా?
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288