Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ పాలకవర్గం మత దురాభిమానంతో అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తుంది. చరిత్రకారులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకుల నుండి వచ్చిన అభ్యంతరాలు, నిరసనలను తోసిపుచ్చి మొఘల్ పాలన, గాంధీజీ హత్య, ఆరెస్సెస్ ప్రమేయం వంటి అధ్యాయాలను ఎటువంటి కారణాలను చూపకుండానే ఎన్సీఈఆర్టీ సిలబస్ నుండి తొలగించింది. చరిత్రను వక్రీకరించి, కొన్ని విషయాలను మొత్తానికే మాయం చేసి చరిత్రకు కొత్త భాష్యాన్ని కల్పిస్తూ... బీజేపీ చెప్పేదే చరిత్ర అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు మతం మత్తులో మునిగిన ప్రజలు తమ ఆలోచనా శక్తినీ, విజ్ఞతను కోల్పోయి ప్రభుత్వం ఏది చేసినా, చెప్పినా తమ ఆమోదాన్ని బహిరంగంగా కొందరు, మౌన సమ్మతితో మరి కొందరు తెలుపుతున్నారు.
ఇక ఇప్పుడు ఇంకా తెగించి శాస్త్ర విజ్ఞానానికే ఎసరు పెడుతున్నారు. విద్యావంతులు, వైజ్ఞానిక ప్రపంచం దిగ్భ్రాంతి చెందేలా, శాస్త్రీయతకు షాక్ ఇస్తూ, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఎన్సీఈఆర్టీ పదవ తరగతి సైన్స్ పుస్తకాల నుండి తొలగించబడింది. జీవ రాశుల పరిణామం, ముఖ్యంగా మనిషి పరిణామ క్రమాన్ని విశదపరిచేది డార్విన్ ్ష్ట్రవశీతీy శీట వఙశీశ్రీబ్ఱశీఅ. ఇది ప్రపంచం మొత్తం ఆమోదించబడిన సిద్ధాంతం. దీనిని ప్రతిపాధించిన తరువాత అనేక ఆధారాలూ రుజువులతో క్రమానుగత సమాజం ఆమోధించింది కూడా.
18వ శతాబ్దంలో మొదటసారి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టినప్పుడు సహజంగానే మత విశ్వాసాలకు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మనిషి దేవుడి సృష్టి అని నమ్మించే మత ఛాందస వాదులకు ఇది మింగుడు పడలేదు. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఉరుములు, మెరుపులను చూసి భయపడే స్థితి నుండి, తనతో పాటు భూమి మీద మనుగడ సాగించే అనేక జీవరాశుల ఉనికిని గుర్తించి వాటిలో కొన్నిటిని మచ్చిక చేసుకునే స్థితికి ఎదిగిన మానవ జీవన క్రమం అర్థం చేసుకోవటానికి దోహదపడేది శాస్త్రీయ విజ్ఞానమే. కోపర్నికస్ భూమి కాదు సూర్యుడు కేంద్రంగా విశ్వం ఉన్నదని ప్రకటించినప్పుడు అంగీకరించని ఆనాటి సమాజం తర్వాతి కాలాల్లో ఆయనను ఎంతో గౌరవించింది. 16వ శతాబ్దంలో సూర్యుడు భూమి చుట్టూ తిరగడం కాదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని గెలీలియో నిరూపించాడు. గెలీలియో గ్రీక్ దేశపు భౌతిక, భౌగోళిక శాస్త్రవేత్త, గొప్ప తత్వవేత్త. తను కనుగొన్న టెలీస్కోప్ ద్వారా గ్రహాల కదలికలను నిర్ధారించగలిగాడు. ఆనాడు మత పెద్దలు చర్చీ ధిక్కారానికి పాల్పడుతున్నాడని, నేరం మోపి అతనికి శిక్ష విధించారు. అతని రచనలను ప్రచురించరాదని ఆంక్షలు విధించారు. అతని సిద్ధాంతాలు సత్యం అనే విషయాన్ని అతని మరణం తరువాతే గ్రహించారు. ఇటు వంటి శాస్త్రీయ అవగాహన కొరవడితే, ఇప్పటికీ గ్రహాల గురించి తెలిసేది కాదు. గ్రహణం అంటే రాహు, కేతువులు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మింగుతాయి అనే అపోహలోనే ప్రజలు ఉండేవారు. విద్యను హేతుబధీకరించడం అనే ప్రలోభంలో అహేతుక మైన, అశాస్త్రీయ మైన పాఠ్యాంశాలను చొప్పించి విద్యార్థులను కేవలం అక్షరాస్యులుగా మాత్రమే మిగల్చదలచు కుందా ఈ ప్రభుత్వం?
ఇప్పటి వరకు వ్యాపార ప్రకటనలు, సినిమా ప్రకటనలు మాత్రమే చూసాం. ఈ ప్రభుత్వం పబ్లిసిటీ ఇచ్చుకోవటంలో మేటి. ఒక ఆబద్దమైనా పదిసార్లు చెప్తే ప్రామాణికంగా స్వీకరించ బడుతుంది అని అంటారు. ఒక విషయమై వ్యతిరేకత తలెత్తి ఉధృతం కాక ముందే, తన చెప్పుచేతల్లో ఉండే మీడియాలో, ప్రభుత్వ ప్రసార సాధనాలైన రేడియో, దూరదర్శన్లలో ఈ చర్యను సమర్థిస్తూ వ్యాసాలు, డిబేట్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహించడం పకడ్బంది కార్యాచరణ ప్రణాళికకు నిదర్శనం.
శాస్త్రీయ జ్ఞానం, మతం ఎప్పుడూ ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతున్నాయనే వాస్తవాన్ని గుర్తించి, అవి రెండూ నాణానికి చెరో వైపు అనే సత్యాన్ని గమనంలో ఉంచుకుని పాశ్చాత్య సమాజాలు తమ మత విశ్వాసాలను చెక్కు చెదరనీకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగమించాయి. భారతదేశం అన్ని రంగాలలో పురోగమిస్తోంది ముఖ్యంగా 2014 నుండి కని, వినని రీతిలో దేశ ఆర్థిక పురోగతి, సాంకేతిక ప్రగతి, విద్యా, వైద్య రంగాలు ఎంతో ఉన్నతిని సాధిస్తున్నాయి అని మోడీ వర్గం సగర్వంగా చెప్పుకుంటుంది. అంతరిక్ష యానంలో కొత్త అంచులను చేరుకోవాలని, చంద్రయాన్ పేరిట ఇతర దేశాలకు ధీటుగా స్పేస్ పరిశోధనల్లో పరుగులు పెడుతుంది. చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి కూడా కృషి చేస్తున్నప్పుడు శాస్త్రీయ పురోగతిలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నప్పుడు, పాలక వర్గం తీసుకున్న ఈ నిర్ణయం తిరోగమనం తప్ప వేరే ఏదీ కాదు. హైందవ పురాణాలలో శ్రీమహా విష్ణువు ''దశావతారాలు'' మత్స్యావతారం నుండి మొదలుకొని కల్కి అవతారం వరకు మానవ పరిణామ క్రమాన్ని తెలియ చేస్తుందనే విశ్లేషణ, వివరణ పండితులు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇవి పురాణాలే అయినప్పటికీ దశావతారల్లో కూడా కొందరికి నచ్చని చేప, పంది, తాబేలూ వంటి వాటిని తొలగించి మరి కొన్నింటిని చేర్చే ప్రమాదమూ లేకపోలేదు సుమా! బుద్ధుణ్ణి అవతారాల్లో చేర్చిన ఘనత ఉండనే ఉందిగా! చరిత్రను మరుగుపరిచే ప్రయత్నం, విజ్ఞానాన్ని సమాధి చేసే చర్యలు - వీటి వల్ల మన తర్వాతి తరానికి ఏమి బోధిస్తున్నాం? విద్య పట్ల అశాస్త్రీయ విధానంతో మనం ఎలాంటి వారసత్వాన్ని నిలుపుతాం? శాస్త్రవేత్తల్లో మతాన్ని గాఢంగా విశ్వసించేవారు చాలా మంది ఉన్నారు. కానీ అది మానవజాతి పురోగతికి అవసరమైన కొత్త ఆవిష్కరణలు చేయడంలో, కాస్మోస్ రహస్యాలను చేదించడం నుండి వారిని ఆపదు. ప్రపంచం మొత్తం ప్రగతి వైపు పయనిస్తుంటే, అంధ విశ్వాసాల అగాధంలో భారతీయులమైన మనం వెనుకబడి ఉండాలా? ఈ సందర్భంగా గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన మాటలను స్మరించుకోవడం అవసరం. ''మతం లేని సైన్స్ కుంటిది, సైన్స్ లేని మతం గుడ్డిది''. పాలక వర్గం ఇకనైనా కళ్ళు తెరిచి తుగ్లక్ చేష్టలను కట్టి పెట్టి దేశాన్ని కాంతి మార్గంలో పయనింపచేయాలి.
- ఎన్. ఝాన్సీ లక్ష్మి