Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ మానవ సౌభ్రాతృత్వం... స్వేచ్ఛను కోరి చీకట్లు నిండిన పీడిత ప్రజల జీవితాలలో తమ అలోచనలతో వెలుగులు నింపిన వెలుగు దివ్వెలు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్లు. స్ఫూర్తివంతమైన వారి ఆలోచనలు ఆనాటి మతం, కులరక్కసి, ఆధిపత్య భావజాలంపై సవాలు చేసి పీడితులకు, తాడితులకు అండగా నిలడ్డాయి. బ్రాహ్మణీయ భావజాలంపై నిరంతరం పోరు సల్పి మత జాడ్యాలను, కుల జాడ్యాలను ఎండగట్టారు. స్వార్థపూరితమైన జీవితానికి తావులేకుండా తమ సహచరులను(సావిత్రి భాయిఫూలే-రమాభాయి) సైతం సమ సమాజ స్వప్నం కోసం పరితపించేలా ప్రేరేపించారు.
దేశంలో అనేక విజయాలకు, అద్వితీయమైన పోరాట స్ఫూర్తిని అందించినవారు బాబా సాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో ఆధిపత్య సమాజంలో అంటరాని వ్యక్తి గా చూడబడిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా అతని ప్రయాణం విజయం మాత్రమే కాదు. ఈ దేశం సాధించుకున్న స్వాతంత్య్రాన్ని ధృఢ సంకల్పంతో పరిరక్షించడమేనన్న అంబేద్కర్ జాతీయ వాది. అంబేద్కర్ తన జీవితాంతం హిందూ సమాజంలో వేళ్ళూనికుపోయిన అంటరానితనానికి, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు. పీడిత ప్రజలపై ఆధిపత్య భావజాలాన్ని నిరంతరం సవాలు చేశారు. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి భరోసా ఉండదని అన్నారు. అతని తత్వం అణగారిన వర్గాలకు స్ఫూర్తి గాను, రాజకీయ జ్ఞానోదయంగా పనికి వచ్చాయి. అంబేద్కర్ రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక, ఆర్థిక జీవితంలో అసమానతల ఫలితంగా ఏర్పడిన వైరుధ్యాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఆ విధంగా బహుజనులను చైతన్యం చేస్తూ వారికి దారి దీపం అయ్యారు. అంబేద్కర్ స్ఫూర్తి నేటికి సజీవంగా ఉన్నది అంటే వారి భవిష్యత్ ఆలోచనలు, దార్శనికతకు నిదర్శనం.
19వ శతాబ్దంలో భారత దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. తన జీవన ప్రయాణం మొత్తం కూడా భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా కొనసాగించారు. సమాజంలో పేరుకుపోయిన మూఢ అజ్ఞానానికి కారణమైన బ్రాహ్మణాధిక్యతను కూకటి వేళ్లతో పెగిలించాలంటే దళిత బహుజన జీవితాలలో విద్య అనే వెలుగు నింపడమే సరైన మార్గం అని ఫూలే విశ్వసించారు. విద్య అనే అఖండ జ్యోతులు వెలిగించడానికి ఆజన్మాంతం ఆధిపత్య వర్గాలతో అక్షర యుద్ధం చేసిన మహనీయుడు ఫూలే. సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని స్త్రీలలో విద్యను అభివృద్ధి చేయడానికి తన సహచరి సావిత్రిబాయి ఫూలేకు విద్యాబుద్దులు నేర్పించి స్త్రీల పురోభివృద్ధికి పాటుపడిన వారు ఫూలే. కుల మత వివక్షతలు లేని సమ సమాజ స్థాపన కోసం పాటుపడిన ఫూలే పోరాట స్ఫూర్తిని ఎత్తిపట్టాల్సిన బాధ్యత ఈ దేశ తాడిత, పీడిత వర్గాల సామాజిక బాధ్యత.
పరమత సహనం విరాజిల్లిన భరత భూమిపై అసహనం, మత విద్వేషాలు చెలరేగుతున్నాయి. దళితులు, మైనారిటీ, మహిళలు, ఆదివాసీల మీద నిరంతరం దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒక వైపు ఫూలే అంబేద్కర్ ఆలోచనా స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం అంటూ వాటికి విరుద్ధంగా అసమ్మతిని ప్రకటించే, ప్రశ్నించే సామాజిక ఉద్యమకారులపై, కవులపై, కళాకారులపై, జర్నలిస్టులపై, తమకు వంతపాడని న్యాయమూర్తులపై, కిడ్నాప్లకు, భౌతిక దాడులకు, హింసకు పాల్పడటం అంబేద్కర్, ఫూలే ఆలోచనలకు విరుద్ధం కాదా! కులం, మతం పేరుతో దురహంకార హత్యలకు పాల్పడటం, మత విద్వేషం నింపడం లాంటి సంఘటనలు ఈ దేశంలో చూస్తూనే ఉన్నాం. విభిన్న సంస్కృతులకు నిలయమైన ఈ దేశంలో ఏక మత సంస్కృతిని వ్యాప్తి చేయడానికి బీజేపీ తహతలాడుతుంది. బీసీ కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, పౌర సమాజం గొంతెత్తి నిలదీస్తుంటే బీజేపీ మాత్రం కనీసం ఆ వైపుగా ఆలోచన కూడా చేయడం లేదు. ప్రభుత్వ రంగాలను నిర్లక్ష్యం చేస్తూ మొత్తానికి ప్రయివేటు రంగాన్నికి అప్పజెప్పుతూ రిజర్వేషన్ల వ్యవస్థకు మంగళం పాడే కుట్రలకు తెరలేపుతున్నారు. శాస్త్రీయమైన రాజ్యాంగాన్ని విస్మరించి అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ విద్వేష పాలనకు చరమగీతం పాడాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించబడాలంటే, పీచడిత, అణగారిన వర్గాలకు న్యాయం దక్కాలంటే ఫూలే, అంబేడ్కర్ ఆలోచనల స్ఫూర్తితో సంఘటితంగా ఉద్యమించాలి. సాంస్కృతిక భావజాలం కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మైనారిటీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఆదివాసీలు పిడికిలి బిగించి మతోన్మాద ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగించాలి. ఫూలే-అంబేద్కర్ ఆలోచనా స్ఫూర్తిని కొనసాగించాలి.
- పాలడుగు నాగార్జున,
సెల్:9492358458