Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య ''మన మార్క్స్ మహర్షి అంబేద్కరే'' అనే మకుటంతో డా|| పట్టా వెంకటేశ్వర్లు ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఒక వ్యాసం రాశారు. మార్క్సిజం చెప్పేదాని ప్రకారం చరిత్రే హీరోలను తయారు చేస్తుంది అని అంటారాయన. దీనిని కాదని ఎవరంటారు?
తరువాత పేరాలో న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్‌కు 1853లో మార్క్స్ రాసిన ఒక వ్యాసం నుండి ఒక వాక్యం కోట్ చేశారు. ''బ్రిటిష్ పరిపాలన ఏషియన్ సమాజంలో గతంలో కనీ, వినీ ఎరుగని సామాజిక విప్లవాన్ని తట్టి లేపింది'' అన్నారు. అందులో ఏమున్నదంటే English interference... and this produced the greatest, and so, to speak the truth, the only social revolution ever heard of in Asia ఇదే కొటేషన్‌ను వెంకటేశ్వర్లు గారు కూడా తెలుగులో ఇచ్చారు.
బ్రిటిష్ వాళ్ళు మనదేశంలో తమ లాభాలను పెంచుకోటానికి ఎలాంటి మార్పులు అవసరమో, అలాంటి మార్పులనే వాళ్లు మనదేశంలో చేపట్టారు. దాంట్లో భాగంగానే కొద్దిగా రైల్వే మార్గాలు, కొన్ని పరిశ్రమలు స్థాపించారు. 'మెకాలే' విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారంతే. అంతకు మించి ఏమీలేదు. మార్క్స్ కూడా ఇలాంటి అభివృద్ధిని గురించి గొప్పగా ఎక్కడా ప్రస్తావించలేదు. సామ్రాజ్య వాదాన్ని గురించి ఆయన ఒకచోట పాజిటివ్‌గా కామెంటు చేసినా, అది పెట్టుబడిదారీ విధానపు పొటెస్షియాలిటి గురించి ప్రస్తావించటానికి మాత్రమే.
నాయకుల అవసరం ఎప్పుడంటే, ఉత్పత్తిశక్తుల అభివృద్ధికి ఆనాడు ఉన్న ఉత్పత్తి సంబంధాలు ఆటంకంగా తయారైనప్పుడు, ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి ఉత్పత్తి సంబంధాలు అతి క్రమించలేని సంకెళ్లుగా మారినప్పుడు ఉత్పత్తి స్తంభించిపోతుంది. ఆర్థికాభివృద్ధి నిలిచిపోతుంది. ఈ పరిస్థితిని మార్చాలంటే, ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే, అభివృద్ధ్ధికి తోడ్పడే ఉత్పత్తిశక్తులకు బంధాలుగా మారిన ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టాలి. ఈ బంధాలను బద్దలు కొట్టాలంటే పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి. జనాన్ని సమీకరించగల నాయకులు తయారవ్వాలి. ఆ విధంగా తయారైన నాయకులు పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రజా సమూహాలను నడిపించి, ప్రజాబలంతో వారిని ఓడిస్తారు. దోపిడీ సంబంధాలు రద్దు చేస్తారు. ఆ విధంగా బంధించబడ్డ ఉత్పత్తి శక్తులు విడుదల అవుతాయి. దీనినే సామాజిక విప్లవం అంటారు. ఆ విప్లవాన్ని జయప్రదం చేయటానికే నాయకులు అవసరం ఏర్పడుతుంది. వాళ్లు ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే సాధారణంగా జన్మిస్తారు. అంతేగాని, డా|| పట్టా చెప్పినట్లుగా అంతా సజావుగా ఉండి, ఉత్పత్తి శక్తులు పెరుగుతున్న దశలో కాదు.
బ్రిటిష్ వాళ్లు మనదేశానికి వచ్చే ముందు మనదేశంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థతో కూడిన భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ఆ దశలో మనదేశం పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థకు ప్రతినిధులైన బ్రిటిష్ సామ్రాజ్య వాదుల చెరలో చిక్కుకుంది. పెనం నుండి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది మన పరిస్థితి. వాళ్లు మన సంపదలన్నింటినీ దోచేశారు. రైతాంగ దోపిడీ, రైతులను కూలీలుగా మార్చేసింది. చేతి వృత్తులను ధ్వంసం చేసి వారిని దిక్కులేని వారిగా తయారు చేసింది.
న్యూయార్క్ డైలీ ట్రిబ్యూన్‌కు రాసిన తన రెండు వ్యాసాల్లో భారతదేశంలో జరిగిన బ్రిటిష్ దోపిడీ గురించి మార్క్స్ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. బ్రిటిష్ వాళ్లు రాక పూర్వం శతాబ్దాల పాటు మనదేశంలో స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా పని చేసింది. భూమి ప్రభుత్వానిది. సాగు చేసుకోటానికి రైతులకు హక్కు ఉండేది. సాగునీటి వ్యవస్థను కూడా ప్రభుత్వమే నిర్వహించేది. వీటిని ఉపయోగించి రైతు పంటను పండించేవాడు. పండిన పంటలో ఒక భాగంతో శిస్తు చెల్లించేవాడు. వృత్తిదార్లు కూడా గ్రామంలో ఉండేవారు. తమ స్వంత పరికరాలతో తయారు చేసిన వస్తువులను వృత్తిదారులు రైతులకు ఇచ్చేవారు. రైతులు దానికి బదులుగా వృత్తిదారులకు ధాన్యం ఇచ్చేవారు. మిగిలిన ధాన్యాన్ని రైతు తన కుటుంబానికి వాడుకునేవాడు. ఇలా గ్రామంలో వస్తు మారక పద్ధతి ద్వారా ఇటు రైతుల అవసరాలు, అటు వృత్తిదారుల అవసరాలు, రెండూ తీరేవి. ఉప్పు, ఇనుము మినహా ఏదీ కొనాల్సిన అవసరం ఉండేది కాదు. అలా వ్యవసాయానికి, పరిశ్రమలకు మధ్య మనదేశంలో గ్రామస్థాయిలో బంధం ఏర్పడిందని మార్క్స్ అంటారు. ఈ బంధం కొనసాగినంత కాలం మన గ్రామాలు స్వయం పోషకత్వంతో ఉండేవి. వాటి మనుగడకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కాని ఈ బంధం తెగిపోతే ఈ గ్రామీణ వ్యవస్థ మనుగడ కుంటుపడుతుంది. అలాగే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సాగు నీటి వ్యవస్థ దెబ్బతిన్నా ప్రమాదమే. బ్రిటిష్ వాళ్లు వచ్చిన తరువాత వాళ్ల ప్రభుత్వం ఈ సాగునీటి వ్యవస్థను విస్మరించింది. పంటలు దెబ్బతిన్నాయి. దేశం కరువు, కాటకాల వాత పడింది. ఒకదాని తరువాత ఒకటిగా కరువులు వస్తూనే ఉండేవి. వచ్చిన ప్రతి కరువు లక్షలాది మందిని పొట్టనబెట్టుకునేది. 20వ శతాబ్దం, 4వ దశకంలో బెంగాలులో వచ్చిన కరువుకు 45 లక్షల మంది బలయ్యారు. బ్రిటిష్‌వాడు రైల్వేలు వేశాడు. టెలిగ్రాఫ్‌ను ఏర్పాటు చేశాడు. ఓడరేవులు నిర్మించా డు అని అంటారు. అవన్నీ తమ దోపిడీకి అవసర మైన మేరకు మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ ప్రజలకు పెద్దగా ఉపయోగ పడేవి కావు.
వాళ్ల రెవెన్యూ పెంచుకోటానికి బ్రిటిష్ వాళ్లు భూసంబంధాల్లో మూడు రకాల మార్పులు చేశారు. ఆ దెబ్బతో రైతాంగం మొత్తం దివాళా తీసింది. వారంతా కూలీలుగా మారారు. సామాజిక సంక్షోభమంటే ఇదే. మార్పు కొరకు ప్రజలు ఎదురు చూసేది ఇలాంటి పరిస్థితులలోనే. ఈ పరిస్థితులకు కారణమైన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టడానికి నాయకులు ముందుకు వచ్చారు. 1875లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. లాలా లజపతిరారు, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి నాయకులు ముందు కొచ్చారు. తరువాత గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ అజాద్ లాంటి నేతలు, విప్లవకారులు, అదే కాలంలో ముందుకు వచ్చిన కమ్యూనిస్టు విప్లవకారులు, ఇలా ఎంతో మంది నాయకులు బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచారు. బ్రిటిష్‌వాడు సృష్టించిన అదే సంక్షోభంపై నాయకులతో పాటు డా|| బి.ఆర్ అంబేద్కర్‌ను కూడా రంగం మీదకు తెచ్చింది. అంటే డా|| బి.ఆర్ అంబేద్కర్ కూడా పై నాయకులందరి మాదిరిగానే చరిత్ర సృష్టించిన మహా నాయకుడు. డా|| వెంకటేశ్వర్లు, డా|| తెల్తుమ్డే గురించి ప్రస్తావించారు. డా|| తెల్తుమ్డే అన్నట్లు డా|| అంబేడ్కర్ నిజంగానే ఫెబియన్ సోషలిస్టు. వాళ్లు కూడా అంటే, ఫెబియన్ సోషలిస్టులు కూడా సమానత్వాన్నే, సోషలిజాన్నే కోరుకుంటారు. కాని దానిని క్రమ క్రమంగా, అంచెలంచెలుగా తెస్తామంటారు. గంతు రూపంలో జరిగే విప్లవానికి వాళ్లు వ్యతిరేకులు.
ఈ వ్యాసంలో డా||వెంకటేశ్వర్లు ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. వాటన్నింటిని తడివి ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని చెడగొట్టదలచుకోలేదు. గతాన్ని తవ్వి పొందగల ప్రయోజనం శూన్యం. కొంతకాలం కలిసి పనిచేశారు. కాబట్టి కొన్ని సమస్యలు తలెత్తి ఉండవచ్చు. వాటిని వదిలేద్దాం. ఇంతవరకు కనీ, వినీ ఎరుగనంతటి ప్రమాదాన్ని ప్రస్తుతం దేశం ఎదుర్కొంటూ ఉంది. హిందూత్వ అనే ఫాసిస్టు భూతం ప్రజాస్వామిక సంస్థలు దేనినీ బతకనిచ్చేట్లుగా లేదు. రాజ్యాంగ సంస్థలన్నీ ప్రమాదంలో పడ్డాయి. పార్లమెంటు మొదలు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, సిబిఐ, ఈడీ లాంటి నిఘా సంస్థలు, విద్యారంగం, మన రాజ్యాంగ పీఠికలో పొందుపరచుకున్న ప్రజా స్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థ ఇలా ఆధునిక వ్యవస్థలు, విలువలు అన్నీ మంటగలిసిపోతున్నాయి. ఇప్పుడున్న రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని ప్రతిష్టించ బోతున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అమలు జరుపబోతున్నారు. ప్రజాస్వామ్యం స్థానంలో నిచ్చనమెట్ల కులవ్యవస్థ అమలు కాబోతున్నది. ఇప్పుడు కావలసింది, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తుల ఐక్యత. ఫాసిస్టు హిందూత్వకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం. మిగతావన్నీ పక్కన బెట్టి అందరం కలిసి ఫాసిస్టు భూతాన్ని తరిమికొడదాం, రండి.
- సి. సాంబిరెడ్డి