Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికుల హక్కుల సాధన కోసం సాగిన మహౌజ్వలిత చికాగో పోరాట స్ఫూర్తితో నేడు ఉద్యమించవలసి ఉన్నది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పరితపిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం సాగించవలసి ఉన్నది. 'మేం ఉద్యోగులం, మేం ఉపాధ్యాయులం, మేము కార్మికులం కాము' అనే భావన నుండి బయటపడి శ్రమశక్తితో, మేధోశక్తితో సరుకులను, జ్ఞానాన్ని అభివృద్ధి చేసే శ్రామికులమైన మనమంతా కార్మికులమే... అని గుర్తెరిగి, ఒకరికొకరు అండగా నిలవాలి. కార్మిక చట్టాల రక్షణ కోసం చేసే పోరాటాలలో ఉద్యోగులు సైతం పాల్గొనాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేసే ఉద్యమాలలో కార్మికులు కూడా సంఘటితమవ్వాలి.
''శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు'' అన్నారు.. ప్రముఖ అభ్యుదయ కవి శ్రీశ్రీ. శ్రమకు మించిన ఆయుధం లేదు. శ్రమశక్తి లేనిదే దేశం అభివృద్ధి చెందదు. అందుకే శ్రమను గుర్తించాలి, గౌరవించాలి. శ్రమ సంస్కృతిని అలవర్చుకోవాలి. కొన్ని పురాణ గాధల వల్ల కొన్ని రోజులు పండుగలుగా మారాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆయా సమాజాలకు పర్వదినాలు అయ్యాయి. కొందరు మహనీయులు... తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి, తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మార్చారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగో నగరంలోని కార్మికశక్తి అద్వితీయమైన పోరాటం ద్వారా రక్తతర్పణం చేసి, తమ హక్కులను సాధించుకున్న దినం. తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా... ప్రపంచానికి అంతటికీ ఒక కొత్త వెలుగును అందించిన చిరస్మరణీయమైన దినం. కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్న పరిస్థితుల్లో ''మేమూ మనుషులమే. మా శక్తికి కూడా కొన్ని పరిమితులుంటాయి. ఈ చాకిరీ చేయడం ఇక మా వల్ల కాదు...'' అని పనిముట్లు కింద పడేసి, పోరాటంలో నిలిచి, చివరకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన చికాగో పోరాటం అజరామరం. 8గంటల పని, 8గంటల విశ్రాంతి, 8గంటల రిక్రియేషన్.. ఈ పోరాటం ద్వారా సాధించుకున్న అత్యంత విలువైన ఫలితాలు.
పారిశ్రామిక విప్లవం వల్ల సరుకుల ఉత్పత్తి పెరిగి, యజమానుల మధ్య పోటీ ఎక్కువైంది. పరిశ్రమలు పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం వల్ల.. అధిక ఉత్పత్తి కోసం కార్మికులపై ఒత్తిడి పెంచి, అదనపు పని చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఇది క్రమంగా శ్రమదోపిడీకి దారి తీసింది. పెట్టుబడిదారులు ఆర్థికంగా బలపడుతున్న సమయంలోనే. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికవర్గంలో చైతన్యం, సామాజిక స్పృహ పెరుగుతూ వచ్చాయి. ఇది సంఘటితశక్తిగా మారి శ్రమదోపిడీ నుండి విముక్తి కోసం పెట్టుబడిదారులపై తిరగబడడం మొదలైంది. ఈ పోరాటాల ఫలితంగా కార్మికుల హక్కుల రక్షణకు, సౌకర్యాల కల్పనకు పెట్టుబడిదారులు ఒప్పుకోక తప్పలేదు. ఈ తిరుగుబాట్లు కొన్నిచోట్ల బలహీనంగా, మరికొన్ని చోట్ల బలంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో చాలా చోట్లకు విస్తరించాయి. 1805 సంవత్సరంలో గ్లాస్గోలోని నేత కార్మికులు వేతనాల పెంపు కోసం తిరగబడ్డారు. 1811లో నాటింగ్ హాంలో 'మెషిన్ బ్రేకర్' ఉద్యమం ఉధృతంగా సాగింది. 1812 సంవత్సరంలో స్కాట్లాండ్లోని చేనేత కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 1837లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పనిగంటల తగ్గింపు కోసం కార్మికులు పోరాటం సాగించారు. 1862 సంవత్సరంలో కలకత్తాలోని హౌరా రైల్వే స్టేషన్ లోని కార్మికులు నిర్ణీత పని గంటల కోసం సమ్మె చేశారు. ఇవన్నీ కార్మిక ఉద్యమానికి మచ్చుతునకలు మాత్రమే. 18, 19 శతాబ్దాలు ప్రపంచమంతా ఉధృతంగా సాగిన కార్మిక పోరాటాలకు ఆనవాళ్ళుగా నిలిచాయి. మే ఒకటి 1886 నాడు చికాగో నగరంలో 40వేల మంది కార్మికులు సమ్మె మొదలుపెడితే, మే 3 నాటికి వారి సంఖ్య లక్ష మందికి చేరుకుంది. ఈ సమ్మె ఉధృతమైన సమయంలో పారిశ్రామిక సంస్థల యజమానులు పోలీసుల సాయం కోరారు. హే మార్కెట్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో 8మంది కార్మికులు అసువులు బాశారు, 40మంది గాయపడ్డారు. వారిలో కూడా తదనంతరం ఏడుగురు చనిపోయారు. ఈ సమ్మెకు కారణం కార్మిక నాయకులేనని వారిపై నింద వేసి, హత్యా నేరం మోపి, ఉరిశిక్షను అమలు చేశారు, పోరాటాన్ని అణచివేయాలని చూశారు. ఈ ఉదంతంతో చికాగో ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. అనేక దేశాల్లో ఈ హత్యాకాండను నిరసిస్తూ, నిరసనలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల డిమాండ్లకు ఒప్పుకొంది. 8గంటల పని సాధించబడింది. చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక అమరవీరుల త్యాగానికి సంకేతంగా... ప్రతి సంవత్సరం మే 1న ఎర్రజెండా ఎగురవేసి, నివాళులు అర్పించడం, వారి త్యాగాన్ని శ్లాఘించడం జరుగుతున్నది.
వీరోచిత చికాగో పోరాట ఫలితంగా కార్మిక ఉద్యమాలు ప్రపంచమంతటా విస్తరించాయి. అనేక దేశాల్లో తమ హక్కుల సాధన కోసం కార్మికులు యజమానులపై తిరగబడ్డారు. సమ్మెలు, పికెటింగ్ల ద్వారా కార్మికశక్తిని సంఘటితం చేయబడింది. ఫలితంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, శ్రమదోపిడీ నియంత్రణ కోసం కార్మిక చట్టాల రూపొందించబడ్డాయి. కార్మికుల పనికి తగిన కనీస వేతనాల చెల్లింపు, పని వేళలు 8గంటలకు కుదింపు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు భరోసాగా నిలవడం, వివక్ష లేకుండా చూడడం, కార్మికులను తొలగించే సందర్భంలో కఠినమైన నిబంధనలు పాటించడం, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడం తదితర అంశాలపై ప్రభుత్వాలు నిర్దిష్టమైన చట్టాలు చేసి, వాటి అమలుకు పూనుకున్నాయి.
అయితే... ప్రపంచ వ్యాప్తంగా నేడు కార్మిక చట్టాల అమలుపై దాడి జరుగుతోంది. పెట్టుబడిదారులకు మేలు చేసే ఉద్దేశంతో కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించబడిన కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలో కూడా జూలై 1, 2022 నుండి అమలుచేయ తలపెట్టిన నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు తీరని నష్టం వాటిలనున్నది. 50శాతం బేసిక్ పే ఉండాలని చెబుతున్న నిబంధన వల్ల కార్మికుని చేతికి వచ్చే నెల జీతం తగ్గనున్నది. సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్ పేరుతో కార్మికుల వేతన మినహాయింపులు పెంచి, తద్వారా వచ్చే డబ్బులను కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే కుట్రలు జరుగుతున్నాయి. పని గంటల పెంపు, ఓవర్ టైం డ్యూటీల వల్ల కార్మికుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కార్మికులను తొలగించే నిబంధనలను సరళీకృతం చేసే కుతంత్రాలు జరుగుతున్నాయి.
కార్మికుల హక్కుల సాధన కోసం సాగిన మహౌజ్వలిత చికాగో పోరాట స్ఫూర్తితో నేడు ఉద్యమించవలసి ఉన్నది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పరితపిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం సాగించవలసి ఉన్నది. 'మేం ఉద్యోగులం, మేం ఉపాధ్యాయులం, మేము కార్మికులం కాము' అనే భావన నుండి బయటపడి శ్రమశక్తితో, మేధోశక్తితో సరుకులను, జ్ఞానాన్ని అభివృద్ధి చేసే శ్రామికులమైన మనమంతా కార్మికులమే... అని గుర్తెరిగి, ఒకరికొకరు అండగా నిలవాలి. కార్మిక చట్టాల రక్షణ కోసం చేసే పోరాటాలలో ఉద్యోగులు సైతం పాల్గొనాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేసే ఉద్యమాలలో కార్మికులు కూడా సంఘటితమవ్వాలి. శ్రమశక్తిని కించపరిచేలా వ్యవహరిస్తున్న పాలకుల దుశ్చర్యలను ఎదిరించి నిలబడాలి. శ్రమ దోపిడీకి గురవుతున్న ఐటీ రంగంలోని ఉద్యోగులు, కాంటాక్ట్ - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కార్మిక వర్గ పోరాటాలలో మిళితం చేయాలి, వారికి కూడా పోరాట ఫలాలు అందేలా చూడాలి. సంఘటిత - అసంఘటిత రంగ కార్మికులు, ప్రభుత్వ - ప్రయివేటు ఉద్యోగులు, ఐటి - కాంట్రాక్ట్ - ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒకే గొడుగు కిందకు చేరి, పోరాటాలను నిర్మించి, హక్కుల సాధన కోసం ఉద్యమించినప్పుడే కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్న ఈ పాలకుల్లో అలజడి మొదలవుతుంది.
- వరగంటి అశోక్
9493001171