Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ.కే. రాజ్యలక్ష్మి
''ముప్పై ఐదేండ్లుగా నేనొక అంగన్వాడీ కార్మికురాలిని. ఇతర ప్రభుత్వోద్యోగులవలె ప్రభుత్వం మమ్ముల్ని 60ఏండ్లకు పదవీవిరమణ చేయిస్తుంది. కానీ ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే హౌదా, జీతం మాత్రం ఇవ్వదు. వృద్ధాప్యంలో మమ్ముల్నెవరు చూస్తారు? మోడీ ప్రభుత్వం 370ఆర్టికల్‌ను రద్దుచేసి, మమ్ముల్ని కేంద్రప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది, కానీ మా జీతాల్ని మాత్రం పెంచలేదు. మా సమస్యల్ని ప్రభుత్వానికి వినిపిద్దామని ఇక్కడికి వచ్చామని ''కాశ్మీర్‌లోని కుల్గాం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్(ఐసీడీఎస్)వర్కరైన పర్వీనా చెప్పింది. కుల్గాం జిల్లాలోని ఒక బ్లాక్ అంగన్వాడీ యూనియన్‌కు ఆమె అధ్యక్షురాలు. ప్రభుత్వ పథకాల కింద చేసే అన్నిరకాల పనులకు ఆమె గౌరవ వేతనంగా నెలకు రూ.4100 పొందుతుంది. ఆమె ఏప్రిల్ 6వ తేదీన తమ సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించాలని రైతులు, కార్మికులతో కలిసి ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్కి వచ్చింది. ఢిల్లీ ఎండల్ని సైతం లెక్క చేయకుండా వారొచ్చారు.
ఆ నిరసన ప్రదర్శన ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లనుంచింది. అవి: నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలి, విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద చేసే పనిని 200పని దినాలకు పెంచాలి, నెలకు రూ.10 వేలు సార్వత్రిక పెన్షన్ ఇవ్వాలి, నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి, ఒప్పంద పని విధానాన్ని రద్దు చేయాలి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా పెట్టిన పంట పెట్టుబడికి, సగం పెట్టుబడిని కలిపే ఫార్ములా ప్రకారం చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను కల్పించాలి అనేవి డిమాండ్లు. ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్), సీఐటీయూ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు పై డిమాండ్లతో పాటు సార్వత్రిక ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, వివాదాస్పద అటవీహక్కు చట్టసవరణల్ని విరమించుకోవాలని కూడా డిమాండ్ చేశాయి.
శ్రమజీవులైన పారిశ్రామిక కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు సమస్యల సాధనకు ఐక్యతను చాటడం చారిత్రాత్మకమని ఉపన్యాసకుల్లో ఒకరైన ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ''ఉత్పాదక వర్గాలైన ఈ శ్రామిక వర్గాలు నయా ఉదారవాదం చేతుల్లో ఘోరంగా దెబ్బ తిన్నాయని'' ఆయనన్నారు.
రూ.4000 మాకే మాత్రం సరిపోవు, నెలకు 26వేలకు తక్కువ వేతనాన్ని మేం ఒప్పుకునే ప్రసక్తే లేదని ప్రదర్శనలో కార్మికులు నినదించారు. వారిలో ఐసీడీఎస్ సహాయకులు, ఆశా పథకం కింద పనిచేసే ఆరోగ్య కార్మికులు, మధ్యాహ్న భోజనపథకం కింద పనిచేసే కార్మికులున్నారు. ఒక కోటికి పైగా ఉన్న ఈ ''స్కీంవర్కర్లు'' మంచి వేతనాలు, సామాజిక భద్రతతో తమను శాశ్వత కార్మికులుగా గుర్తించాలని గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు.
దేశ నలుమూలల నుండి ఎంతో క్రమశిక్షణతో, శ్రేణి తప్పకుండా దేశ రాజధానిలోని రామ్ లీలా గ్రౌండ్ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో భాగస్వాములైన కార్మికుల్ని చూసి ఒక పోలీస్ అధికారి ప్రశంసలు కురిపించాడు. ఒకరోజు ముందే ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చిన విషయాన్ని ప్రతిరోజూ వచ్చిపోయే ప్రజలకు తెలియజేశారు. కానీ ఈ ప్రదర్శనలో దాదాపుగా 70వేలకు పైగా భాగస్వాములైన కార్మికులు ఢిల్లీ నగరవాసులకు ఎలాంటి అసౌకర్యం కలిగించలేదు.
2018 తరువాత రామ్ లీలా మైదానంలో నిర్వహించిన అతిపెద్ద భారీ ప్రదర్శన ఇది. తమ సమస్యల్ని ఢిల్లీకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్ని ప్రజాసంఘాలు నిర్ణయం చేసినప్పుడే అంటే సెప్టెంబర్ 2022లోనే ఈ ప్రదర్శనకు సమీకరణ ప్రారంభమైంది. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు దారి తీసిన రైతుల నిరసనలు విజయవంతం కావడం ఈ కార్యక్రమానికి ప్రేరణ అని నిర్వాహకులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి వ్యక్తీకరణకే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు, రైతుల నిరసనలకు నాయకత్వం వహించిన సంఘం 'సంయుక్త కిసాన్ మోర్చ' లో ప్రముఖ వ్యక్తి, పశ్చిమబెంగాల్ నుండి గతంలో లోక్‌సభకు ఎన్నికైన హన్నన్ మొల్లా అన్నారు.
ఈ ప్రదర్శనలో దాదాపు 20వేలకు పైగా వ్యవసాయ కార్మికులు వారిలో ఎక్కువ మహిళలు హాజరయ్యారు. వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీల వేతనాల చెల్లింపులు, వారి పని దినాల తగ్గింపు ప్రధానమైన సమస్య అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ అన్నాడు. పురుషులు కష్టమైన పనుల కోసం వలస వెళ్తుంటే, మహిళలు వ్యవసాయపనుల్లో నిమగమవుతున్నారు. ఈ రంగంలో ఈ పనిని చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇది విద్యారంగానికి సంబంధించిన వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చగా ఉందని ఆయన అన్నాడు. ప్రభుత్వం 200పని దినాలకు, రోజుకు రూ.600 లేదా అంతకంటే ఎక్కువ వేతనానికి హామీ ఇవ్వాలని అన్ని సంఘాల నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే వారికి ఆన్లైన్ హాజరు విధానం విధింపు, ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఆధార్‌తో అనుసంధానం చేయబడిన డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్సఫర్ చెల్లింపుల విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ సేవల ప్రయివేటీకరణ పెరుగు తుండటంతో దళితులు వెనక్కి నెట్టివేయబడి, ప్రభుత్వ సేవలకు దూరమవుతున్నారని, వ్యవసాయ కార్మికుల్లో దళితులే అధిక సంఖ్యాకులని కూడా సింగ్ అన్నాడు.
వ్యవసాయ కార్మికులకు ఇంతవరకు కనీస వేతనం కన్నా తక్కువ కాని వేతనాన్ని ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అంతంత మాత్రం అమలు జరిపే వాటి వంతులను ప్రకటించాయి. వాటి అమలుకు హామీ ఇచ్చే ఎలాంటి చర్య లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉపాధి చట్టం కింద పనిచేసే వారికిచ్చే వేతనాలు వ్యవసాయ కార్మికులకిచ్చే కనీస వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. వ్యవసాయ కూలీలకిచ్చే వేతనాల విషయంలో కూడా రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయి. కేరళలో రూ.700 లేదా ఆపైన ఉంటే, బీహార్‌లో రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. స్వాతంత్య్రం సాధించిన 75ఏండ్ల తరువాత కూడా భారతదేశంలో కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తేలేదు. ''ఇది అన్ని పెద్ద డిమాండ్లలో ఒకటి. కమిటీలను రూపొందించారు, కొన్ని ప్రయివేటు బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టారు. కానీ వ్యవసాయ కార్మికులకు ఒక కేంద్ర వేతన చట్టాన్ని ముందుకు తెచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని'' విక్రమ్ సింగ్ అన్నాడు.
పట్టించుకోని ప్రభుత్వాలు
ప్రదర్శనలో భాగస్వాములైన వారితో ఫ్రంట్ లైన్ పలకరించిన వారిలో బీహార్‌లోని బేగుసరారుకి చెందిన వ్యవసాయ కార్మికుడు సురేష్ పాశ్వాన్, పని ఉంటే బీహార్‌లో ఎక్కడైనా రూ.100-150 మధ్య కూలీ వస్తుందని చెప్పాడు. ''బీహార్‌లో 22లక్షల ఎకరాల భూమి ఉంది. దానికి సమానంగా వ్యవసాయ కార్మికులున్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వం భూసంస్కరణలకు సంబంధించిన నివేదిక గురించి ఏమీ చేయలేదు, ఆ భూసంస్కరణల ద్వారానే తమకు పట్టాలిస్తామని చెప్పారని'' పాశ్వాన్ అన్నాడు. బీహార్ భూసంస్కరణలపై డీ.బంధోపాధ్యాయ నివేదికను పాశ్వాన్ ప్రస్తావించాడు. పిప్రా దొద్రాజ్ పంచాయతీలో భూమిలేని 500 కుటుంబాలు 2010-12 నుండి క్షేత్రవాసాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ 2019లో బుల్డోజర్తో అన్ని కుటుంబాల్ని వెళ్ళగొట్టారు, ఆ భూమి అలానే ఉంది. దానిని ఒక జమీందారు సాగుచేస్తునాడని పాశ్వాన్ చెప్పాడు.
మాధేపురకు చెందిన సంజరు శ్రీ రజత్ ది కూడా ఇలాంటి పరిస్థితే. ''మాకు 100రోజుల పని దినాలు లేవు. ఉపాధి హామీ చట్టం కింద జరిగే పనుల్లో మానవ శ్రమకు బదులుగా జేసీబీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ, పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తుంది. మాకు పని దొరకడానికి పరిశ్రమలు లేవు. నూనె లీటర్ రూ.200లు. మేమేం తినాలి? మమ్ముల్ని ఎవరు కాపాడుతారు?'' అని సంజరు అన్నాడు.
ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించకుండా, పంట సేకరణకు హామీ ఇవ్వకుంటే, రైతులు పంటల్ని ఉత్పత్తి చేయకుండా నిలిపి వేస్తారని ఘజియాబాద్‌కు చెందిన రైతు బ్రజేష్ అన్నాడు. ''మాకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది, (ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇచ్చే దానాన్ని ఉదహరిస్తూ) మా నుండి 20 వేల రూపాయలు తీసుకుంటుందని'' ఆయన అన్నాడు. ఫెర్టిలైజర్లు, గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడు సంవత్సరాల క్రితం ఒక కేజీ పొటాష్‌ను రూ.700కు విక్రయించారు ఇప్పుడది రూ.1700. గ్యాస్ సిలిండర్ ధర రూ.1130కు పెరిగింది. కాబట్టి పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బుకు అర్థం లేకుండా పోయిందని ఆయన అన్నాడు.
చెరుకు రైతుల వెతలు
చెరుకు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాల్లో చెరుకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పి)ను కేవలం రూ.70 మాత్రమే పెంచిందని వారంటున్నారు. పెట్టుబడి పెరిగింది కాబట్టి ప్రభుత్వం క్వింటా చెరుకుకు రూ.500 లేదా టన్ను చెరుకుకు రూ.5000 చెల్లించాలని వారన్నారు. ప్రస్తుతం ఎఫ్ఆర్పి ప్రకారం ఒక టన్ను చెరుకు రూ.2820లు మాత్రమే. చెరుకు మిల్లుల యాజమాన్యాలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు సరిగా చెల్లించడంలో కూడా ఎప్పుడూ వెనకబడిపోయాయని చెరుకు రైతు, హర్యానా రాష్ట్ర కిసాన్ సభ నాయకుడు బల్వంత్ సింగ్ అన్నాడు. రైతులు ఆందోళన చేపట్టిన సందర్భంలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. కొన్ని కో-ఆపరేటివ్ షుగర్ మిల్లులున్నాయి. కాని వాటిని ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఫ్రంట్ లైన్‌తో చెప్పాడు.
ఇంత పెద్ద ప్రదర్శనను కూడా ప్రధాన స్రవంతిలోని మీడియా పరిగణలోకి తీసుకోలేదు. ఇదే ఒకవేళ రాజకీయ నాయకుని ప్రసంగం ముఖ్యంగా పాలక ప్రభుత్వానికి చెందిన నాయకునిదైతే టీవీ ఛానెళ్లు రోజంతా ప్రసారం చేసేవి. మన కార్యక్రమానికి సంబంధించి వారికి సమయం లేదేమోనని కుల్గాంకు చెందిన ఐసీడీఎస్ వర్కర్ పర్వీనా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మా బాధల్ని ఆలకించకుంటే మేము మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తామని ఆమె చెప్పింది.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451