Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొహం చూసి బొట్టు పెట్టినట్టు...వడ్డించేటోడు మనోడైతే కడబంతిలో కూసున్నా మూల్గబొక్క పడ్డట్టు బంగారు తెలంగాణ సర్కారు తీరుంది. కాల్జేతులు విరగ్గొట్టుకుని, కెమెరాలు కింద పడి పగిలినా వెనకడుగు వేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని సమాజానికి కండ్లకు కట్టినట్టు చూపెట్టడంలో ఫొటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వారి శ్రమను ఎవ్వరూ కాదనలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సర్కార్లూ వారి పట్ల గౌరవంగానే ఉండేవి. సీఎంలు సైతం పేర్లు పెట్టి పిలిచేటంతటి చనువు ఉండేది. పెద్దపెద్ద ప్రోగామ్స్లలో సైతం వేదికలెక్కి ఫొటోలు తీసేవారు. రాష్ట్రానికి బిల్‌క్లింటన్, యాసర్ అరాఫత్, ప్రిన్స్ చార్లెస్, కోఫీ అన్నన్, జార్జ్‌బుష్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు కూడా వారిపై ఆంక్షలు లేవు. ఇదంతా గత చరిత్ర. బంగారు తెలంగాణలో ఫొటోజర్నలిస్టులపై రాష్ట్ర సర్కారు అడుగడుగునా వివక్ష చూపుతున్నది. ఏ ప్రోగ్రామ్‌కి కూడా వారిని అనుమతించడం లేదు. చివరకు పరిస్థితి ఎంతకు దిగజారిదంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణకు, సచివాలయ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదు. దీనిపై ఫొటో, వీడియో జర్నలిస్టులంతా గుర్రుగా ఉన్నారు. ఇదే కాదండోరు...టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానూ పిలిచి బొట్టు పెట్టినట్టుగా 'చిన్నసార్' కొన్ని పత్రికలకే ఇంటర్వ్యూలు ఇవ్వడంపైనా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారముందీ, యాజమాన్యాలు చేతుల్లో ఉన్నాయని పాలకవర్గాలు భ్రమల్లో మునిగి... జర్నలిస్టులపై చిన్నచూపు చూపితే పుట్టి మునగడం ఖాయం సుమా!
- కె.ఎన్.హరి