Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని కార్యాలయం, అంతే హడావుడిగా ఉంది. ఈసారి పెద్దాయన తన మనసులోని మాట చెప్పటానికి ఒక కొత్త అంశం కావాలని ఆలోచిస్తున్నారని అంతరంగికులకు తెలిసింది. ఇంతలో మరోవార్త వచ్చింది. తన మనసులోని మాట ఏమై ఉంటుందో ఊహించి ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా వేదికల్లో చర్చలకు పెట్టాలని పెద్దాయన ఆలోచిస్తున్నారట.
ఇంకేం! సోషల్ మీడియాకన్నా ముందే ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిద్రలేచాయి. వేడి వేడి డిస్కషన్లు, చర్చావేదిక లైవ్ ప్రోగ్రాములు ఎలక్ట్రానిక్మీడియాలో హౌరెత్తాయి. ఇక ప్రింట్ మీడియా తక్కువ తింటుందా! అక్షరుకుమార్, సచిన్, ఇళయరాజా లాంటి సెలబ్రిటీలతో పేజీల కొద్దీ ఇంటర్వ్యూలతో స్పెషల్ టాబ్లాయిడ్లు ముద్రించి వాకిళ్ళలో గుమ్మరించేశాయి. అన్నింటిపైనా పెద్దాయన ముఖచిత్రం షరా మామూలే కదా!
ఎలక్ట్రానిక్, ఫ్రింట్ మీడియాలో వస్తున్న కథనాల సారాంశమంతా ఒకటే! గత 60ఏండ్లలో సాధించని అభివృద్ధి పెద్దాయన అధికారంలోకి వచ్చిన పదేండ్లలోనే జరిగిందని, మరో ఐదేండ్లలో ట్రిలియన్ డాలర్ల స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరేందుకు పెద్దాయన మనసులో ఏముందో చెప్పాలని రెండు మీడియాలు వేయి విధాలుగా తాపత్రయపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ''పెద్దాయన మనసులోని మాట కోసం దేశమే కాదు! ప్రపంచం కూడా ఎదురుచూస్తోందని'' ఊరూ పేరూ లేని పోస్టులు పుంఖాను పుంఖాలుగా వెల్లువెత్తుతున్నాయి!
మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది! అది పెద్దాయన మనసులోని మాట బయటపెట్టే రోజు. ఇంతకుముందు కూడా పెద్దాయన మనసులోని మాటలు చాలా చెప్పారు. కాని ఈసారి మాత్రం ఎందుకో చర్చ ఎక్కువగా జరుగుతున్నది. లేబాన్ కళ్ళద్దాలు, ఇటలీ సూటు ధరించిన పెద్దాయన టీవీల్లో కనబడగానే పెద్దాయన భక్త బృందం ఆనందం, ఆవేశంగా మారింది.
''చూశారా! భగవంతుని అవతారం! ఆయన్ని చూడటం కన్నా ఈ కళ్ళకి సంతోషకరమైన విషయం ఏముంటుంది!'' అన్నాడు ఒక భక్తాగ్రేసరుడు భక్తి పారవశ్యంతో.
''ముందు నువ్వు నోరు మూసుకో!'' అన్నాడు ఒకాయన విసుగ్గా!
''మిత్రోఁ'' అన్నాడు పెద్దాయన.
టీవీలు చూస్తున్నవారు, రేడియోలో వింటున్నవారు ఒక్కసారి నిశ్శబ్దమైపోయారు.
''మిత్రోఁ'' అన్నాడు మళ్ళీ పెద్దాయన.
''ఆగు పెద్దాయనా!'' అంటూ శబ్దం వచ్చింది. చూస్తున్న వారూ, వింటున్న వారూ ఆశ్చర్యపోయారు.
పెద్దాయన ముందు ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత ఆగ్రహానికి లోనయ్యాడు.తన ఉపన్యాసానికి అడ్డు తగలటమా! ఎంత ధైర్యం? ఎంత సాహసం? ఈ మనసులోని మాట వినటానికి మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తుంటే.. ఆగ మన్న అల్పజీవి ఎవరా అని అటూ ఇటూ చూశాడు! ఎవరూ కనబడలేదు. ఆగు అని విన్నది తన భ్రమ కావచ్చునని అనుకున్నాడు. మళ్ళీ ప్రారంభించబోయాడు.
''మిత్రోఁ!'' అంటుండగానే మళ్ళీ ఆగమంటూ శబ్దం వచ్చింది. అటూ, ఇటూ చూడబోయాడు.
''అటూ, ఇటూ చూడొద్దు! ఆగమంటున్నది నేనే'' పెద్దాయన మాట్లాడుతున్న మైకు నుండే శబ్దం వచ్చింది.
గత పది సంవత్సరాలుగా నీ మనసులోని మాటలు వింటూ ఉన్నాను. ప్రతిసారీ ఒక కొత్త సమస్యను ప్రస్తావించి, దానికి సమానమో వివరణో ఇస్తున్నారు. ఈసారి చిన్న మార్పు చేసుకుందాం! నా మనసులోని మాటలు మీకు చెబుతాను. ఆ మాటలకు మీ స్పందన ఏమిటోచెప్పండి'' అన్నది మైకు.
పెద్దాయనకు తన వాక్ ప్రవాహం మీదా, తన విజ్ఞానం మీదా తిరుగులేని నమ్మకం. అందుకే కానివ్వమంటూ ఎడమ చేయి ఊపాడు. అచ్చు ప్రారంభోత్సవానికి జెండా ఊపినట్లే చేయి ఊపాడు.
''అయితే ఒక షరతు! నేనడిగే ప్రతి మాటకు మీ మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పాలి! మీరు అబద్ధం చెప్పినా, నిజం బయటకు చెప్పకపోయినా మీరు శిలగా మారిపోతారు!'' అన్నది మైకు.
పెద్దాయన ఒక్కక్షణం ఆలోచిం చాడు. తర్వాత సరేనన్నా తన శక్తి సామర్థ్యాల మీద అంత నమ్మకం మరి!
త''దేశంలోని సహజవనరులను, ఓడ రేవులను, విమానాశ్రయాలను, గోడౌన్లను ఆదానికి కట్టబేట్టడానికి మీ అధికారాన్ని వినియోగిస్తున్నారు! ఆదానికోసం నిబంధనలు మార్చు కున్నారు. అవసరమైతే చట్టాలు కూడా మార్చుతున్నారు. ఇటీవల ఆయనకు జీఎస్టీ నుండి మినహాయింపు కూడా ఇచ్చారు! ఇదంతా దేనికోసం చేస్తున్నారు? అడిగింది మైకు.
పెద్దాయన తనకు అలవాటైన రీతిలో మైనంగా ఉండిపోయాడు! అయిదు నిమిషాలు తడిచాయి. చూస్తుండగానే పెద్దాయన తొడల వరకూ శిలగా మారిపోయాడు.
మైకు మళ్ళీ ప్రారంభమైంది.
''దేశ రక్షణకు సైనికులు తమ ప్రాణాలు పణంగా పెడతారు. గత ప్రభుత్వాలు,సైనికులను పట్టించుకోలేదని మీరు పలుమార్లు విమర్శించారు! కాని పుల్వామాలో సైనికుల ప్రయాణానికి మీ ప్రభుత్వాన్ని హెలికాప్టర్లు కోరితే నిరాకరించారు! దాంతో అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో ప్రయాణించి, పాకిస్థాన్ కుట్రకు బలై 39మంది వీరసైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమంతా మీకు తెలిసే జరిగిందని, మీ గవర్నరే స్వయంగా ప్రకటిస్తే, ఆయనపై సీబీఐ ఎంక్వైరీ పెట్టారు! పుల్వామా దుర్ఘటన గురించి మీ మనసులోని మాట బయటకు చెప్పండి!'' అడిగింది మైకు.
మైకు అడిగింది విననట్లు చూశాడు పెద్దాయన. మైకు నుండి చిన్న నవ్వు వినిపించింది.'' మీకు వినిపించింది! కాని మాకు కావల్సింది మీ మనసులోని మాట!
పెద్దాయన ఆలోచిస్తున్నాడు. సమయం గడుస్తోంది! ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఐదు నిమిషాలు గడిచాయి. పెద్దాయన 56అంగుళాల ఛాతీవరకు శిలగా మారిపోయింది!
''ఇక చివరి ప్రశ్న! దేశం తరఫున ఎక్కడైనా ప్రాతినిధ్యం వహించి, పతకాలు, అవార్డులు సాధిస్తే మీరు వెంటనే వారికి అభినందనలు తెలుపుతారు! వారితో ఫొటోలు దిగుతారు! వారి విజయానికి మీ ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తారు! మంచిదే కాని గత కొంత కాలంగా దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు, తమను ఒక ఎంపీ వేధిస్తున్నాడని నిరసన దీక్షలు చేస్తుంటే మీరు వారిని పిలిపించి మాట్లాడలేదు! కనీసం వారికి మద్దతుగా ఒక్క మాటైనా మాట్లాడలేదు! దేశానికి పతకాలు సాధించిన రెజ్లర్లు అందునా మహిళలు ఈ దేశంలో అవమానాలే జరుగుతాయా? దేశానికి గర్వకారణమైన మహిళా రెజ్లర్లు గురించి, మీ మనసులోని మాటను ఈ కార్యక్రమంలో తెలియచేయండి!'' కోరింది మైకు.
పెద్దాయన తల అటూ ఇటూ ఆడిస్తున్నాడు. మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడో లేదో తెలియదు! మౌనం మాత్రం వీడలేదు. సమయం ముగిసింది. పెద్దాయన పూర్తి శిలగా మారిపోయాడు!