Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''యువత ముందు నిలుచొని చెబుతున్నాను. ఢిల్లీలోని ప్రభుత్వం సిబిఐని చూపించి మమ్మల్ని భయపెట్టలేదు'', ''సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది'', ''సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని'', ''మీరు ఏమైనా చేసుకోండి, కానీ సిబిఐ భయంతో అభివృద్ధి బాటను వీడేది లేదు'', ''పరిణామాలు ఎలా మారతాయో నాకు తెలుసు. కానీ మేము సిద్ధపడి ఉన్నాం''... పాఠకులకు ఈ మాటలు ఎవరివో అర్థమయ్యే ఉంటాయి. ఇంకెవరివి! మోడీ ఏలుబడిలో వేధింపులకు గురవుతున్న ప్రతిపక్ష నేతలు చేసిన ప్రకటనలు అనుకుంటే పొరపాటు. సాక్షాత్తూ మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం పదవిలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు. సిబిఐ గురించి మోడీ చెప్పిన ఈ అంశాలు నరేంద్రమోడీ వెబ్సైట్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అంతే కాదు మోడీ చెప్పిన సుభాషితాలు ఇంకా ఇలా ఉన్నాయి. ''సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్'', ''గుజరాత్‌ను కించ పరిచేందుకు అబద్ధాలు చెప్పవద్దు'', ''సిబిఐని రాజకీయమయం కావించేందుకు సమయం వెచ్చించే బదులు ఉత్తరాఖండ్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయ పడేందుకు వెచ్చించండి''... అని కూడా చెప్పారు. 2013 జూన్ 24న గాంధీనగర్‌లో స్వామి వివేకానంద ఉపాధి వారంలో భాగంగా జరిగిన సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. పైన పేర్కొన్న ఆరోపణలన్నీ అక్కడ చేసినవే.
ఇంతే కాదు... నరేంద్ర మోడీ పదే పదే సిబిఐపై దాడి చేశారు. ఒక్క సిబిఐ మీదనే కాదు, చివరికి కోర్టులు, జడ్జీలను కూడా లాగారు. భావనగర్‌లో 2010 జులై 31న మాట్లాడుతూ ''గుజరాత్ నుంచి కేసులను బదిలీ చేయాలని సిబిఐ చెబుతున్నది. ఇది గుజరాత్‌లోని కోర్టులను, లాయర్లను అవమానించటమే, ఎంతకాలం దీన్ని సహించాలి? మన న్యాయ విశ్వవిద్యాలయాలను మూసుకోవాలా? లాయర్లు రోడ్డున పడాలా? తొలుత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత పోలీసులు, ఇప్పుడు కోర్టులు. నా రక్తం ఉడికిపోతోంది... నా సన్నిహితుడు అమిత్ షా మీద సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది ప్రభుత్వాన్ని బలహీనపరిచే రాజకీయ ప్రయత్నమే. నరేంద్ర మోడీని భయపెట్టే ప్రయత్నాలు మాను కోండి. అతన్ని భయపెట్టలేరు....'' అని చెప్పారు.
ప్రస్తుతానికి వద్దాం... అవినీతిలో కూరుకుపోయిన వారందరూ ఒక దగ్గరకు చేరుతున్నారని ప్రధాని మోడీ ఇటీవల ఆరోపించారు. కాంగ్రెస్‌తో సహా 14పార్టీలకు చెందిన వారు సిబిఐ, ఈడీలను తమ నేతల మీద ప్రయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టగా విచారణకు స్వీకరించింది. దీంతో మో-షా రంగం లోకి దిగారు. యూపీఏ 2004-14 పాలనా కాలంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి కేవలం రూ.5 వేల కోట్ల విలువ గల ఆస్తులు మాత్రమే పిఎంఎల్ఏ కేసుల్లో స్వాధీనం చేసుకున్నట్లు... తాము తొమ్మిది సంవత్సరాల్లో రూ.లక్షా పది వేల కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు. యూపీఏ పాలనా కాలంలో ఈడీ 112 దాడులు చేసి రూ.5,346 కోట్లు స్వాధీనం చేసుకోగా, మోడీ అధికారానికి వచ్చాక ఎనిమిది సంవత్సరాల్లో 3010 దాడులు రూ.99,356 కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకున్నట్లుగా 2022 జులై 27న పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్ ఏలుబడిలో సగటున ఒక్కో కేసులో రూ.47.7కోట్ల వంతున స్వాధీనం చేసుకోగా, మోడీ పాలనలో అది రూ.33 కోట్లుగా ఉంది. విదేశీ మారకద్రవ్య అక్రమాల కేసులు ఇదే విధంగా 8,586 నుంచి 22,320కి పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. దాడులు జరిపిన 3,010 కేసులలో చార్జిషీట్లు దాఖలు చేసింది 888 కేసుల్లో కాగా, శిక్షలు పడింది 23 కేసుల్లో. వాటిలో స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ రూ.869 కోట్లని కూడా ప్రభుత్వం తెలిపింది. అందువలన దాడుల సంఖ్య పెరిగినా ఆస్తులను లక్ష కోట్ల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించినా తేలిన కేసులు, స్వాధీన మొత్తాలను చూస్తే అది నామమాత్రమే అన్నది స్పష్టం. మోడీ ఏలుబడిలో 2014 ఏప్రిల్ ఒకటి నుంచి 3,555 మనీలాండరింగ్ కేసులు నమోదు కాగా చార్జిషీట్లు దాఖలు చేసింది 2022 మార్చి వరకు 992 మాత్రమే. అవినీతి, అక్రమాల పట్ల తామెంత నిబద్దతతో ఉన్నదీ తమ ఏలుబడిలో కేసుల సంఖ్య పెరగటాన్ని సూచిస్తున్నదని ప్రభుత్వం చెప్పు కుంది. వాటిలో ఎక్కువ భాగం బెదిరింపులు, కేసు ల్లో ఇరికించేందుకు చేసిన దాడులే అన్నది విమర్శ.
అదానీకి 2014లో ఉన్న ఎనిమిది బిలియన్ డాలర్ల సంపద 2022 నాటికి 137 బి.డాలర్లకు పెరిగిందంటే అది సక్రమంగా జరిగింది కాదన్నది జగమెరిగిందే. గత తొమ్మిది సంవత్సరాల్లో మీకది నాకిది అన్నట్లుగా పంచుకుంటున్న ఉదంతాలు పెరిగాయి. పెద్దనోట్ల రద్దు, పారదర్శకతకు డిజిటల్ లావాదేవీలు, నల్లధనాన్ని అరికట్టినట్లు ఎన్నో కబుర్లు చెప్పారు. అంత పకడ్బందీగా చేస్తున్నపుడు అవినీతిపరులు తామర తంపరగా ఎలా పుట్టుకువస్తున్నట్లు? విదేశీ మారక ద్రవ్య అక్రమాల (ఫెమా) కేసులను చూస్తే యూపీఏ పాలనలో 8,586 కేసులు దాఖలు కాగా 2,780 కేసుల్లో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. తీర్పులు వచ్చిన 1,312 కేసుల్లో రూ.1,754 కోట్ల మేరకు జరిమానా విధించారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో 22,330 కేసుల్లో తీర్పులు వచ్చిన 5,160 కేసుల్లో విధించిన జరిమానా రూ.6,376 కోట్లు. అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల మీద ఎదురు దాడికి దిగటం ఆశ్చర్యం కలిగించదు. గతంలో సిబిఐ మీద ఆరోపణలు చేసిన మోడీ సర్కార్ దాని డైరెక్టర్లుగా తమకు అనుకూలురైన అలోక్ వర్మ, రాకేష్ అస్తానాలను నియమించటం వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవటం, ఆ ఇద్దరినీ తప్పించి మరొక స్వంత మనిషి నాగేశ్వరరావును కూర్చోపెట్టటం తెలిసిందే. ఇలాంటి నిర్వాకం ద్వారా సిబిఐ మీద విశ్వాసం పెంచినట్లు బీజేపీ నేతలు చెబుతుంటే వాషింగ్ పౌడర్ నిర్మా గుర్తుకు వస్తున్నది.
గత తొమ్మిది సంవత్సరాలలో సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన దాడులు, మోపిన కేసులు ప్రతిపక్షాలకు చెందిన వారి మీదనే. కేసులు మోపి కొంత మందిని లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకోవటం, కొందరిని బెదిరించి పార్టీలోకి లాక్కోవటం వంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు తమ నిర్వాకాలను చూసుకోవాలి. తమ ప్రభుత్వ చర్యలను సమర్థించుకోవటం చూస్తుంటే గురివిందలు గుర్తుకు వస్తున్నాయి.
- సత్య