Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2012లో ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ఉద్యమంలోనూ పాల్గొని పాడాదంటే ఆయన చైతన్యం, శక్తి అర్థమవుతాయి. తన తొలినాటి సహచరుడైన గాయకుడు బాబీ డైలాన్‌కు నివాళులర్పిస్తూ 2012లో ఫార్ ఎవర్ యంగ్ గీతం ఆలపించారు. ఆయన రచనలు పాటల ఆల్బంలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. అత్యంత ఉత్తేజ కరమైన కళాత్మకమైన ఆయన జీవితంలో చెప్పుకోదగిన ఘట్టాలు, సృజనాత్మక విజయాలు, ధిక్కార గాథలు లెక్కలేనన్ని. ఈ శతజయంతి సందర్భంలో వాటిని తల్చుకోవడం ప్రపంచ వ్యాపితంగా ప్రగతిశీల వాదుల ముఖ్యంగా కళాకారుల కర్తవ్యం.
పద పదవే గీతమా... పదవే సంగీతమా... తోరణాలు తీరి జనం బారులుగా నిలిచిరే అంటూ తన గీతాలతో సంగీతంతో శ్రామిక జన సందోహాన్ని ఉర్రూతలూపిన ప్రపంచ ప్రజాగాయకుడు పీట్ సీగర్. ప్రపంచాధిపత్య దేశంలో ఆఫ్రికన్ అమెరికన్ల తరపున నిషేధాలు నిర్బంధాలు తట్టుకుంటూ అశేష కష్టజీవుల తరపున గొంతెత్తి పాడిన పౌరహక్కుల యోధుడు సీగర్. సంగీత ప్రపంచలో అధునాతన సాంకేతికతనూ జానపద కళాకారుల అపురూప సంప్రదాయా లనూ మేళవించి పదండి ముందుకూ అంటూ కదం తొక్కించిన ప్రజా గాయకుడు. ఈ రోజు ఆయన శతజయంతి. ప్రజా కళాకారులు ఆలోచనా పరులు ఎక్కడున్నా తన జీవితాన్ని కృషినీ స్మరించుకునే సందర్భం. దేశంలో మతతత్వ అభివృద్ధి నిరోధకత్వం, అంతర్జాతీయంగా మితవాద మతవాద భావజాలం చెలరేగిపోతున్న తరుణంలో స్ఫూర్తినిచ్చే వారసత్వం. పీట్ సీగర్ రాసి పాడిన పాటలు ప్రపంచ మంతా ప్రతిధ్వ నిస్తున్నాయి. పౌర హక్కుల ఉద్యమానికి సంకేతమే గాక మానవ ప్రస్థానానికి ఉత్తేజమిచ్చే వురుషల్ ఒవర్ కమ్ సరే సరి. వేర్హావ్ ఆల్‌ద ఫ్లవర్స్ గాన్ ఐ హాడ్ ఎ హ్యామర్, టర్న్ టర్న్ టర్న్ ఎవరీ థింగ్ కిసెస్ స్వీటర్ దాన్వైన్ తదితర గీతాలు కూడా అమెరికాలో అద్బుతమైన ఆదరణ పొందాయి
తలిదండ్రుల అడుగుల్లో
పాటల బాటసారిగా...
ఛార్లెస్ సీగర్, కాన్స్టన్స్ దంపతుల సంతానమైన పీట్ సీగర్ బాల్యం నుంచే గానవిద్యలో ఆరితేరారు. 1919 మే 3న పుట్టారు. తల్లివయోలిన్ కళాకారిణి కాగా తండ్రి సంగీత శాస్త్ర నిపుణుడు (మ్యూజికాలజిస్ట్), ఆయన జాతుల ఉపజాతుల సంగీత సంప్రదాయాలను నిక్షిప్తం చేసే పరిశోధకుడు. అమెరికాలో మొట్టమొదటి సంగీత కళాశాల స్థాపించింది తనే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా వైఖరికి భిన్నంగా ఆయన శాంతి ఉద్యమ వాదన చేయడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. 1932లో అతను భార్య నుంచి విడాకులు తీసుకుని మరో పెళ్లిచేసుకున్నాడు. 1938లోవారు న్యూయార్క్ చేరుకున్నారు. అప్పుడు మళ్లీ చార్లెస్‌కు సంగీత పరంగానూ ఇతరత్రా కూడా చాలా పదవులు లభించాయి. తలిదండ్రుల ప్రేరణతో పీట్ సీగర్ చిన్నప్పుడే పాడటం ప్రారంభించారు. ఏదో అనారోగ్యం కారణంగా పీట్ సీగర్ ప్రాథమిక విద్య సరిగ్గా సాగలేదు. అయితే అమ్మానాన్నతో కలసి అన్నదమ్ములిద్దరూ గ్రామాలు తిరిగేవారు. రకరకాల సంగీతాలు జానపదాలు ఆస్వాదించడం అభ్యసించడం అలవాటైంది. తనకు పదహారేళ్ల వయసునాటికి ఉత్తర కరోలినా జిల్లాలో ఆషేనిలో పర్వత ప్రాంత జానపద సమ్మేళనానికి వెళ్లినప్పుడు ఆ పాటలతో ఎంతో అనుబంధం ఏర్పడింది. పాత కాలపు తంబూరా లాంటి బాంజోతో తన పాటల పయనం అప్పుడే ఊపందకుంది.
వాస్తవంగా పీట్ సీగర్ పాత్రికేయుడు కావాలని కోరుకున్నాడు, కాని పాటల బాటసారిగా మారాడు. 1936లో క్యాప్ రైజింగ్ సన్ పాటల శిబిరానికి హాజరైనారు. మరుసటి ఏడాది పట్టభడ్రుడైనాడు. స్కాలర్‌షిప్‌తో హార్వర్డ్ కాలేజీలో చేరాడు గాని రాజకీయ కార్యకలాపాలు జానపద సాహిత్యంలో పూర్తిగా నిమగమైనాడు, వాగాబాండ్ పప్పెటీర్స్, తదితర బృందాలతో కలసి ప్రదర్శనలిచ్చారు. ఈ కార్యక్రమం నాటి మెక్కికో డెయిరీ రైతుల సమ్మెకు సంఘీభావంగా సాగింది. 1939 నాటి డైలీ వర్కర్ దీనిపై వివరమైన కథనం ఇచ్చింది. అమెరికన్ కాంగ్రెస్ గ్రంథాలయంలో జానపద చరిత్ర గ్రంధస్తం చేస్తున్న తండ్రి స్నేహితుడు అలెన్ మాక్స్‌తో కలసి పనిచేశాడు.
అలెన్ మాక్స్ వూడీ గూత్రీ జోష్వైట్ తదితరులతో కలసి కలసి 'ఆల్మనాక్ సింగర్స్' బృందాన్ని 1940లో స్థాపించారు. వారంతా ఆల్మనాక్ హౌస్‌లో సమిష్టిగా జీవించేవారు. ఎక్కడ జనంవుంటే అక్కడకువెళ్లి పాడేవారు. జనసమూహాలు చేరే ప్రతిచోటా సామాజిక కార్యక్రమాలు జరిగే ప్రతిచోటా ఆల్మనాక్ సింగర్స్ ప్రత్యక్షమయ్యేవారు. రెండో ప్రపంచ యుద్ధం తనపై చాలా ప్రభావం చూపింది. శాంతి ఉద్యమంలో చేరాడు. ఎల్ రాబ్సన్తో 'లోన్సమ్ ట్రైన్' గానంలో పాలుపంచుకున్నాడు. కొలంబియా బ్రాడ్ కాస్టింగ్‌లో ఈ షో బాగా ప్రచారమైంది. మోడీ జెస్ ఆష్కు చెందిన లిటిల్ స్టూడియో స్పెయిన్ అంతర్యుద్ధ గీతాలు గానం చేశాడు. వీరి సహచర్యం జీవితాంతం సాగింది.
యుద్ధకాలంలో గూఢచారుల కన్ను
ఆ యుద్ధం నేపథ్యంలోనే అమెరికాలోని జపాన్ మూలాలు గలవారిని పంపించేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే పీట్ సీగర్ దానిపై నిరసన లేఖ రాశాడు. ఆ విధంగా ఆయనపై గూఢచారి సంస్థ ఎఫ్బిఐ కన్ను పడింది. అప్పటికే ఆయన బాగా ప్రసిద్ధిలో ఉన్నాడు. 1940లోనే డైలీ వర్కర్ పత్రిక మేడే సందర్భంగా సభా కార్యక్రమం ప్రకటిస్తూ ఏప్రిల్ 30వ తేదీ సంచికలో పీట్ సీగర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రకటించడం చూస్తాం. ''మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ సభకు రండి'' అని ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తుంది. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో యూరప్ అమెరికాలలో రచయితలు, కళాకారులు వామపక్ష భావజాలంవైపు ఆకర్షితులై శాంతి సందేశం వినిపించడం, కార్మిక సంఘాల చొరవ పాలకులకు బొత్తిగా మింగుడు పడలేదు. మరోవైపున యుద్ధంలో పాల్గొనడం కోసం యువతను సామూహికంగా సైన్యంలో చేరుస్తున్నారు. ఆ కోవలో పీట్ సీగర్ బృందాన్ని సైనికులను ఉత్సాహపరిచడం కోసం తీసుకోవాలనుకున్నారు. అయితే ఆయన జపాన్ మూలాలు గల అమెరికన్లను పంపేయడంపై నిరసన లేఖ రాసిన సంగతి బయిటకు వచ్చింది. డైలీవర్కర్తో సహా అనేక పత్రికలలో తన గురించిన కథనాలూ వార్తలు ఉన్నాయని గూఢచారి వర్గాలు సమాచారమిచ్చాయి. జాతిద్వేషం కరుడుగట్టిన అమెరికా గూఢచారులు అతన్ని నీగ్రోహంతకుడుగా అభివర్ణించారు. సామాన్య ప్రజలను అమోఘంగా ఆకర్షించగల గాయకుడని నివేదించారు. కనెక్టికట్కూ హార్వర్డ్‌లలో ఆయన చదివిన స్కూళ్లకు కూడా వెళ్లి అప్పుడతని వేషభాషలు కార్యకలాపాలు ఎలా ఉండేవో విచారించారు. చిన్నప్పుడే సీగర్ విద్యార్థి సంఘ కార్యదర్శిగా పనిచేశారని తెలుసుకున్నారు. అప్పటికే అతనిపై విచారణ నివేదికలు అందాయి. ముందు ముందు ప్రభుత్వ వ్యతిరేక కుట్రదారుడుగా మారే ఆదర్శవాదిలా ఉన్నారని సీగర్ను అభివర్ణించారు. ఇన్ని ఫిర్యాదులున్నా తనను సైన్యంలోకి తీసుకున్నారు. 1942 నుంచి 1945వరకూవ అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహించారు. వూడిగాధ్రీ తనకు తోడైనాడు. వూడీ గిటార్పైన 'ఇది ఫాసిస్టులను హతమారుస్తుంది' అని రాసివుండేదట. అప్పుడే సీగర్ బాబీ డైలాన్ నిర్వహించే న్యూపోర్ట్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు. 1943లో తోషి ఆలీన్ ఓహ్తాను పెళ్లి చేసుకున్నాడు. సైన్యం నుంచి వచ్చేశాక పీపుల్స్ సాంగ్స్ స్థాపించారు. అది దేశవ్యాపితంగా ఎంతో ప్రభావం చూపింది. యుద్ధకాలమంతా ఆయన కమ్యూనిస్టు భావజాలంతోనూ సోవియట్ యూనియన్ విధానాలతోనూ పనిచేశారు. 1948లో అధ్యక్ష ఎన్నికలలో ప్రోగ్రెసివ్ పార్టీ తరపున ఉపాధ్యక్షుడుగా పోటీ చేసిన హెన్రీ వ్యాలస్ తరపున ప్రచారం చేశారు. అప్పుడే మరో ప్రసిద్ధ ప్రజా గాయకుడైన పాల్రాబ్సన్తో కలసి పనిచేశాడు.
నిర్బంధంలోనూ ఆశయాలతో
1949లో న్యూయార్క్‌లో ప్రోగ్రెసివ్ సిటీస అండ్ కంట్రీ స్కూల్లో సంగీతం బోధించారు. 1950లో అమెరికాలో కమ్యూనిస్టులు నల్లజాతి ఉద్యమకారులపై ఘోరమైన వేట సాగింది. డేవిడ్ కార్గ్ అనే సిఐడి 1800 పేజీల రహస్య నివేదిక తయారు చేశారు. (ఇటీవలనే దాన్ని బహిర్గతం చేశారు. గాని 90 పేజీలు రహస్యంగానే అట్టిపెట్టారు.) ఆ వేట నుంచి తప్పించుకోవడం కోసం ఆల్మనాక్ సింగర్స్‌ను వీవర్స్‌గా మార్చారు. తండ్రి ఉన్నతవిద్యావేత్త గనక పీటర్ మరో పేరుతో కూడా ప్రదర్శనలిచ్చేవాడు. ఏదేమైనా ఇక భరించడం అనే పాట అప్పటిదే. అయితే అంతకుముందు పద్ధతులను పాటలను వేషాలను కూడా మార్చేశారు. ఆ కాలంలో ఆన్ టాప్ ఓల్డ్ స్మోకీ, గుడ్‌నైట్ ఇర్నే వంటి పాటలు రికార్డు సృష్టించాయి. 13వారాలు అగ్రస్థానంలో నిలిచాయట. పాప్ గాయకులంతా దాన్ని పాడటం మొదలెట్టారు. అయితే పైనే చెప్పినట్టు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అది వరకూ వీరిని ఆదరించిన ప్రదర్శించిన టీవీ కేంద్రాలు ఇప్పుడు అవకాశమివ్వడం మానేవాయి. మెకార్తిజంగా పేరొందిన ఆ కాలంలోనూ పీట్ సీగర్ తన పోరాటం ప్రదర్శనలు మానలేదు. పైగా పౌరహక్కుల కోసం ప్రత్యేకంగా కేంద్రీకరించాల్సి వచ్చింది. 1955 ఆగస్టులో తనను అమెరికా వ్యతిరేక కార్యకలాపాల విచారణ కమిటీ పిలిపించింది. కమిటీ ముందు ఏమీ చెప్పడానికి ఆయన నిరాకరించారు. అమెరికాలో ప్రసిద్ధమైన ఫిప్ల్ అమెండ్మెంట్ కింద తన సహచరుల కార్యకలాపాల వివరాలు చెప్పజాలనని ప్రకటించాడు. కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలపైనా సూటిగా జవాబివ్వలేదు. పార్లమెంటును ధిక్కరించారనే నేరంపై ఏడేండ్లు జైలుశిక్ష విధించారు గాని న్యాయపోరాటంతో ఏడాడిలోనే తిరిగివచ్చారు.
కడదాకా అదే బాట
తర్వాత దశలో పీట్‌సీగర్ జీవితమంతా ప్రజలతోనూ వారిని ఉత్తేజ పరిచే పాటలతోనూ సాగింది. 1960లో శాండియాగోస్కూలు బోర్డు ఉత్సవంలో పాడటానికి తన కమ్యూనిస్టు భావాలు పాడబోనని ప్రమాణం చేయమంటే నిర్దంద్వంగా తిరస్కరించాడు. పౌరహక్కుల సంఘం కోర్టు ఉత్తర్వు తేవడంతో ఆ కార్యక్రమం యథాతథంగా సాగింది. యాభై ఏండ్ల తర్వాత 2009లో ఈ ఘటనకు గాను ఆ స్కూలు ఆయనకు క్షమాపణ చెప్పింది. అయితే ఈ అగ్నిపరీక్షా కాలంలో జీవితం కోసం స్కూళ్లలోనూ వేసవి శిబిరాల్లోనూ తను సంగీతబొధకుడుగా పనిచేశారు. 50, 60 దశాబ్దాల్లో పీట్ సీగర్ యుద్ధ వ్యతిరేక గీతాలు మార్మోగాయి. వేర్ హావ్ ఆల్ ఫ్లవర్స్గాన్, టర్న్ టర్న్ టర్న్, లాస్ట్నైట్ ఐ హాడ్ ది స్ట్రేంజెస్ట్ డ్రీమ్ వంటివి గొప్పపేరు తెచ్చాయి. 1963లో నల్లజాతి వీరుడు మార్టిన్ లూథర్ కింగ్‌తో కలసి వాషింగ్టన్లో మహాప్రస్థానంలో ఆయన పాల్గొన్నారు. అప్పుడే వురుషల్ ఒవర్కమ్ అనే గీతాన్ని కాస్త సవరణలతో పాడి ప్రఖ్యాతిలోకి తెచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ మానవహక్కుల గీతంగా ఉంది. పోలీసు వేట నిర్బంధం కాస్త తగ్గగానే ఆయన రేడియోలు టీవీ స్టేషన్లలో జానపదగీతాలు ఇతర పాటలు నేర్పడం మొదలెట్టాడు. ఓ సందర్భంలో 39గంటల పాటు కార్యక్రమం నిర్వహించాడు. వియత్నాం యుద్ధ వ్యతిరేక పోరాట తూటాగా మారాడు. 1972లో ఉత్తర వియత్నాం సందర్శించాడు, మరణశిక్షను నిరసిస్తూ 1979లో దెల్బర్ట్ తెగకు చెందిన ఖైదీని ఉద్దేశించి డెల్బర్ట్టిబ్స్ పాట రాసి పాడాడు. 1980, 90దశకాలలో ఈ కృషి కొనసాగింది. అన్ని రకాల ప్రజాపోరాటాలకు ఉద్యమాలకు తోడు నిలిచారు. చివరి దశలో పర్యావరణంపై ఎక్కువ కృషి చేశారు. దిస్ ల్యాండ్ మైల్యాండ్ అన్న పాట అందులో ఒకటి.
2012లో ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ఉద్యమం లోనూ పాల్గొని పాడాడంటే ఆయన చైతన్యం శక్తి అర్థమవుతాయి. తన తొలినాటి సహచరుడైన గాయకుడు బాబీ డైలాన్‌కు నివాళులర్పిస్తూ 2012లో ఫార్ ఎవర్ యంగ్ గీతం ఆలపించారు. ఆయన రచనలు పాటల ఆల్బంలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. అత్యంత ఉత్తేజ కరమైన కళాత్మకమైన ఆయన జీవితంలో చెప్పుకోదగిన ఘట్టాలు, సృజనాత్మక విజయాలు, ధిక్కార గాథలు లెక్కలేనన్ని. ఈ శతజయంతి సందర్భంలో వాటిని తల్చుకోవడం ప్రపంచ వ్యాపితంగా ప్రగతిశీల వాదుల ముఖ్యంగా కళాకారుల కర్తవ్యం. ఇంత మహత్తర సంపూర్ణ జీవితం గడిపిన పీటర్ సీగర్ 2014 జనవరి 27న కన్నుమూశారు. అయితే ఆయన జీవితమూ కృషి మాత్రం వురు షల్ ఓవర్ కం అనే ఆయన గీతం ప్రతి పాఠశాలలో వినిపిస్తూనే ఉంది.
- తెలకపల్లి రవి
(నేడు పీట్ సీగర్ శతజయంతి)