Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్, వివిధ రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునే క్రమంలో రాజకీయ పార్టీలు, వివిధ రకాల పథకాలు, వాగ్దానాలతో ఓటర్ల ముందుకు వస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు సాధ్యం కాని, ఆమాటకొస్తే ఆదాయానికి మించి అప్పులు చేసే విధంగా వాగ్దానాలు ఇస్తూ అధికారం చేపట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నవరత్నాలు పేరుతో అధికారం చేపట్టిన ప్రస్తుతం ప్రభుత్వం ఆ వాగ్దానాలు అమలు కొరకు గత నాలుగేళ్లుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారో... అందరూ చూస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించుట మంచిదే. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, పరిశ్రమలు స్థాపించకుండా, కేవలం వచ్చిన ఆదాయాన్ని ఉచితాలకు ఖర్చు చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఏంటి..!? ఆలోచన చేయాలి.
ఇటీవల కాలంలో పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్ని పథకాలు, వాగ్దానాలు ఇస్తూ ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని కూడా ఆయా ప్రజలకు అనేక ఉచిత పథకాల హామీలు ద్వారా అధికారంలోకి వచ్చాయి. సంక్షేమ పథకాలు అమలు ద్వారా సమాజంలో అసమానతలు తొలగించేందుకు ప్రయత్నాలు చేయాలి. సంక్షేమ రాజ్య స్థాపనకు కృషి చేయాలని రాజ్యాంగం కూడా సూచిస్తుంది. కానీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయకూడదు. ముఖ్యంగా ప్రజలను, యువతను తమ కాళ్ళపై తాము స్వతంత్రంగా బతికే పరిస్థితికి ప్రభుత్వాలు కృషి చేయాలి. దానికనుగుణంగా విద్య, నైపుణ్యా లందించాలి. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడు మాత్రమే తలసరి ఆదాయం పెరుగుతుంది. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు మెరుగుపడుతాయి. రాష్ట్ర, దేశ జీడీపీ వృద్ధి చెందుతుంది. వస్తుఉత్పత్తి, రవాణా, ఎగుమతులు ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ రాష్ట్రాలు, దేశం కూడా పురోభివృద్ధి సాధిస్తారు. ఆ విధంగా పార్టీలు తమ ఎజెండాతో ఎన్నికల వేళ ప్రజల ముందుకు రావాలి.
ఇక ప్రస్తుతం జరుగుతున్న కర్నాటక రాష్ట్ర ఎన్నికల వేళ ఆయా పార్టీలు ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తూ అధికారం చేపట్టడానికి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబై ఐదు సంవత్సరాల పూర్తయినా, అనేక సంవత్సరాలుగా అనేక వర్గాల ప్రజలకు అనేక రాయితీలు ఇస్తున్నా, నేటికీ చాలామంది పేదరికంలో ఉండటానికి కారణం ఏమిటి..!? ఈ వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. ప్రజలందరికీ విద్యా, వైద్యం అందించకుండా, తగిన నిధులు మంజూరు చేయకుండా ఎన్ని పథకాలు, అమలు చేసినా దేశంలోని పేదరికం నిర్మూలించడం అసాధ్యం. చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. మేథోవలసలు అరికట్టాలి. ప్రతీ సంవత్సరం మనదేశం నుంచి అనేక లక్షల మంది దేశ పౌరసత్వం వదులుకుని, ఇతర దేశాలకు శాశ్వతంగా వెళ్ళిపోవడం దేనికి సంకేతమో చెప్పగలరా? ధరల పెరుగుదలకు ముకుతాడు వేయాలి. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలి. కేవలం ఉచితాలు ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేమనేది వాస్తవంగా గ్రహించాలి. ఇటీవల కాలంలో ప్రతి నెలా పేద మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీఈ రూపంలో వస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఏయే రంగాలకు ఖర్చు చేస్తున్నారో ప్రజలందరికీ తెలియాలి.
గత నెల ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 1.87లక్షల రూపాయలు జీఎస్టీ రాబడి వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాబడులతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎక్కువగా ఖర్చు చేస్తే గనుక స్వావలంబన దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. అంతేగానీ, అనుత్పాదక రంగాల్లో ఖర్చు చేయడం ద్వారా ఫలితాలు శూన్యం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకు పోయింది. అదేబాటలో వివిధ రాష్ట్రాలూ ఉన్నాయి. ఎఫ్ఆర్బియం పరిధి దాటి అనేక వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ప్రజల వాస్తవ జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన విద్యా, వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వాగ్దానాలు ఇస్తూ అధికారం చేపట్టడానికి ప్రయత్నాలు చేయాలి. అదే విధంగా ప్రజలు కూడా తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలకు అండగా నిలవాలి. తాత్కాలిక ఉపశమనం పొందే ఉచితాలుకు లొంగరాదు. కుల, మత, వర్గ ప్రాంతీయ భాషా, లింగ వంటి సంకుచిత భావాలకు లొంగకుండా, తమకు, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీలకు అండగా ఉండుట ద్వారానే భారత్ భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. - రావుశ్రీ