Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పచ్చని అడుగులు చుట్టూ ఎత్తయిన కొండలు ఆ కొండలపై నుండి జాలువారే అందమైన జలపాతాలు, గలగల పారే జీవనదులు, వాగులు వంకలు, పక్షుల కిలకిల రాగాలతో ప్రశాంతమైన వాతావరణం. అత్యంత రమణీయమైన ప్రకృతి ఒడిలో ప్రకృతితో కలిసి జీవించే ఆదిమ తెగలే ఆదివాసీ ప్రజలు. కల్లాకపటం ఎరుగని, కల్మషం లేని కష్టజీవులు. కళ్ళముందే విలువైన ప్రకృతి సంపద ఎంత ఉన్నా ఆకలి తీర్చుకోవటానికి తప్ప వ్యాపారానికి ఉపయోగించటం నేరంగా భావి స్తారు. అడవిని, అటవీ సంపదను వన్యప్రాణులను సంరక్షిస్తూ, క్రూర మృగాలతో కలిసి జీవిస్తూ పర్యావరణాన్ని రక్షించుకుంటూ భారతదేశ ఆదిమ సంస్కృతికి పునాదిగా జీవిస్తున్న వారు. అలాంటి ఆదివాసుల సాంస్కృతిక, ఆర్థిక జీవనం నేడు ప్రమాదంలో పడింది. పచ్చని అడవిపైన అడవిలోని విలువైన గనులు, ఖనిజాలు, నీరు, అటవీ సంపదపై అంబానీ, ఆదానీ వంటి స్వదేశీ, విదేశీ కంపెనీల కన్నుబడింది. సమిష్టి తత్వానికి ప్రతికగా స్త్రీ, పురుష వత్యాసాలు లేకుండా కష్టసుఖాలను కలిసి పంచుకునే ఆదిమ సంస్కృతి, ఆదివాసీ ప్రజల భాష, పండుగలు పాటలు, సాహిత్యం, ఆర్థిక సాంస్కృతిక జీవనంపై హిందూ మతోన్మాదుల దాడి, ప్రపంచీకరణ విష సంస్కృతి ఆధిపత్య భావజాలం ఏకకాలం జరుగుతున్నది. స్వచ్ఛమైన ఆదివాసి జీవనంపైన హిందుత్వశ్తులు కత్తి కట్టాయి. డోలు దరువులపై, అందెల సవ్వడి మధ్య సాగే నా రేలా పాటలపై భక్తి పాటలు, భావ దారిద్య్రం, డిజె సౌండ్ మధ్య స్వచ్ఛమైన ప్రకృతి భావాలు నలిగి పోతున్నాయి. ఆదిమ కాలపు వారసత్వానికి ఆనవాళ్లుగా ఉన్న ఆదివాసీలపై అభివృద్ధి పేరిట పాలకవర్గాలు సాగిస్తున్న దాడిపై ఆర్థిక సాంస్కృతిక రంగంలో ప్రతిఘటన ఉద్యమం పెల్లుబికవలసిన తరుణం ఆసన్నమైంది.
ఆదివాసీలది హిందూ సంస్కృతి కాదు
ఆదిలాబాద్ నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్లోని ఆదివాసీ ప్రాంతా లకు తెలంగాణ ఆదివాసి భూభాగం ఉన్నది తెలంగాణలో 33 ఆదివాసి తెగలకు సంబంధించిన ఆదివాసి ప్రజలు రాష్ట్రంలో జీవనం సాగిస్తున్నారు. ఆదివాసులకు మతం లేదు, కులం లేదు. వారిదంతా తెగల సంస్కృతి. ఒక సమూహం, సమిష్టి జీవన విధానం. ఆదిమ సమాజపు కొనసాగింపు సంస్కృతికి ప్రతీకలు, పునాదులు ఆదివాసీ ప్రజలు. సమిష్టితత్వం దీనికి పునాది. అసమానతలు ఆధిపత్య భావజాలం లేని గొప్ప ప్రజాస్వామిక సమాజం ఆదివాసి సమాజం. కానీ హిందూ మతం, హిందూ మత సంస్కృతిలో ఉన్న అంతరాలు నిచ్చెన మెట్ల వ్యవస్థ, కులతత్వం భూస్వామ్య వ్యవస్థ తాలూకు ఆధిపత్య భావజాలం, స్త్రీలను తక్కువగా చూడటం, ఆస్తి సంబంధాల్లో సమాన హక్కులు లేకపోవడం చాలా స్పష్టంగా కనబడుతుంది. అటువంటి హిందూ మత సంస్కృతి భావజాలం నేడు ఆదివాసి సాంస్కృతిక జీవనంలో చొచ్చుకుని పోతుంది. కుటుంబ వ్యవహారాలు, ఆచారాలు సాంప్రదాయాల్లో హిందూ మత సనాతన ధర్మాలను చెప్పించడం ద్వారా ఆదివాసులు హిందూ మతంలో భాగమే అనే ఒక కొత్త వాదనను బీజేపీ రాజకీయ సైదాంతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలైన వనవాసి కళ్యాణ్ పరిషత్ గిరిజన మోర్చా వంటి సంస్థలు ఆదిమ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం ద్వారా హిందూ మత సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఆదివాసీలపై రుద్దుతున్నారు. ఆదివాసి పండుగలకు, హిందూ పండుగలకు, క్రైస్తవ పండుగలకు ఏమాత్రం సంబంధం లేదు. కానీ ప్రస్తుతం ఆదివాసి పండుగలను కనుమరుగు చేసే స్థాయికి హిందూ ఉన్మాద సంస్థలు ఆయుధాలను ఎక్కుపెట్టాయి. ఆదివాసులు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిని ఆరాధిస్తారు, పూజిస్తారు. దాంతోనే కలిసి జీవిస్తారు. భూమి, అడవి ఆదివాసీలకు ప్రధానమైన ఉత్పత్తి వనరులు. ప్రకృతిలో కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ఆదివాసీల పండుగలు జరుగుతాయి. భూమి పండగ చేయకుండా పంటలు వేయరు. పంటలు చేతికొచ్చే సమయాన నవంబర్ నుండి జనవరి మాసాల్లో కొత్తల పండుగ నిర్వహిస్తారు. కానీ ప్రపంచీకరణ, హిందూ మతోన్మాద శక్తుల ప్రమేయం వెరసి అసలైన ఆదివాసీల పండగ స్థానాల్లో వినాయక మండపాలు, దేవీ నవరాత్రులు, అయ్యప్ప పీఠాలు శ్రీరాముని మాలలు వచ్చి చేరుతున్నాయి. రేలా పాటలను డీజే పాటలు తొక్కేస్తున్నాయి. ఆదివాసుల పండుగలను హిందూ దేవతమూర్తుల పండుగలు మింగేస్తున్నాయి. ప్రకృతితో పెన వేసుకున్న ఆదివాసుల సాంస్కృతిక జీవనంపై మతం పేరిట ఉన్మాద శక్తులు సాగిస్తున్న దాడికి ఇదొక సజీవ సాక్ష్యం.
ఆదివాసులను అడవినుంచి వెళ్లగొట్టే కుట్ర
ఆదివాసులను, అడవిని విడదీయలేం. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదాని, అంబానీ వంటి స్వదేశీ విదేశీ కంపెనీలకు అటవీ సంపదను ప్రకృతి వనరులను దోచిపెట్టడం కోసం ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొడుతున్నది. స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న చట్టాలను భారత పాలకవర్గాలు మార్పులు చేసుకుంటూ వచ్చాయి. చివరికి ఆదివాసీలకు ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను సైతం రద్దు చేసే కుట్రలు చేస్తున్నారు. 1865 నుండి మొదలు 2006 వరకు వచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం దాకా ప్రతి చట్టం రావడం వెనుక విరోచితమైన ఆదివాసి పోరాటాలు, త్యాగాలు ఉన్నాయి. చారిత్రాత్మక పోరాటాల ఆధారంగా సాధించుకున్న హక్కులను నేడు బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుంది. 2019 నూతన అటవీ చట్టం పేరుతో అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుంది. అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న విలువైన యురేనియం నిలువలను ప్రయివేటు కంపెనీలకు కట్టబెట్టడం కోసం అక్కడి చెంచు ఆదివాసీలను అడవుల నుంచి గెంటేయాలని చూస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పేరుతో, ఆసిఫాబాద్ జిల్లాలో పులుల సంరక్షణ పేరిట, భద్రాద్రి జిల్లాలో సింగరేణి గనుల విస్తీరణ, పోలవరం ప్రాజెక్టు పేరిట ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించి అక్కడున్న సకల సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్రం తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నది. అభివృద్ధి పేరిట ఆదివాసీ హక్కుల పైన ఆదివాసీ సాంస్కృతిక జీవనం పైన కేంద్ర ప్రభుత్వము, హిందూ మతోన్మాద సంస్థలు కార్పొరేట్ కంపెనీలు బహుముఖ రూపాల్లో దాడి సాగిస్తున్నాయి. ఆదివాసీల చరిత్ర మొత్తం పోరాటాల మయం. భారతదేశంలో వర్లి ఆదివాసీల తిరుగుబాటు. బీర్సా ముండా పోరాటం, తెలంగాణ గడ్డమీద కొమరంభీమ్ సాగించిన ఉద్యమం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం ఆదివాసి హక్కులపై, పాలకవర్గాల దాడికి వ్యతిరేకంగా సాగాయి. అటువంటి పోరాట స్ఫూర్తిని, తెగువను ప్రదర్శించాల్సిన తరుణం ఆదివాసీకి సమాజానికి ఆసన్నమైంది. సంస్కృతి పరిరక్షణ అడవి, భూమి మీద హక్కు, విద్య, ఉపాధి అవకాశాల కోసం పాలకవర్గాన్ని ఎదిరించి పోరాడకపోతే ఇంతకాలం పోరాడి సాధించుకున్న హక్కులు అంతరించిపోతాయి. మానవ సమాజానికి పునాదిగా నిలిచిన ఆదిమ తెగలు కనుమరు గయ్య పోయే పరిస్థితి నేటి బీజేపీ పాలనలో స్పష్టంగా కనబడుతుంది. అందుకని ఆదివాసీ ప్రజలతోపాటు వారి అభివృద్ధిని కోరుకునే సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం తప్పనిసరి. పోరాటాల ద్వారానే మాత్రమే హక్కులు రక్షిం చబడతాయనేది చారిత్రక వాస్తవం. ఆదివాసి ప్రజలు ఆ పోరాటాల ద్వారానే ఉన్న హక్కుల్ని కాపాడుకోవాలి. కొత్త హక్కుల్ని సాధించుకోవడం లక్ష్యంగా ఉద్యమించాలి.
(మే 5,6 తేదీల్లో భద్రాచలంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు)
- కె. బ్రహ్మాచారి