Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల వివక్ష కార్మికవర్గంలో కూడా ఉంటుందా? మహిళలు అన్ని రంగాలలో తన ప్రతిభను రుజువు చేసుకుంటున్న ఈ ఆధునిక సమాజంలో కూడా లింగ వివక్ష ఉంటుందా? వివక్షలు, వేధింపుల గురించి సిఐటియు సర్వే నిర్వహించాలని నిర్ణయించినపుడు కొంత మంది నుంచి సహజంగానే ఈ ప్రశ్నలు ఎదురైనాయి. అంతేకాదు.. గ్రామాలలో ఉంటే ఆశ్చర్యం లేదు. పట్టణాలలో కూడా ఉన్నదా! అసంఘటిత రంగంలోనేనా, ఆధునిక పరిశ్రమలలో కూడా ఉన్నదా? పనిలోకి దిగిన తర్వాత అనుమానాలన్నీ పటాపంచలైనాయి. ప్రశ్నలన్నీ తేలిపోయాయి. ఆధునిక పరిశ్రమలలో కూడా వివక్ష రూపాలు ఆధునిక రూపాల్లో ప్రత్యక్షమయ్యాయి. సాక్షాత్తూ కేంద్రపాలకులు కులవ్యవస్థనూ, మను వాదాన్నీ, ఛాందస విధానాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న సమయమిది. ఆధునిక ప్రపంచంలో ఎంతోకొంత వెనుకపట్టు పడతాయనుకున్న వివక్షలు పెట్టుబడిదారుల ఆశీస్సులతో కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీలు అనుసరిస్తున్న విధానాలవల్ల మరింత ఊపందుకుంటున్నాయి. అందువల్ల ఈ సమస్యకు ప్రాధాన్యత పెరిగింది. టెక్స్టైల్ వంటి పరిశ్రమలలో మహిళలకు రాత్రి షిఫ్టు పడకుండా చూసే ఆనవాయితీ ఉన్నచోట కూడా తోటి కార్మికుల నుంచే ''రెగ్యులర్‌గా పురుషులే నైట్‌షిఫ్ట్ చేయాలా?'' అన్న ప్రశ్న ఎదురవుతున్నది. మహిళలను రెండవతరగతి పౌరులుగా గుర్తించే మనువాద సంస్కృతిని మోడీ ప్రభుత్వం ప్రోత్సహించటం వల్ల, ఇప్పటికే కార్మికులలో ఉన్న సామాజిక స్పృహ, సంఘీభావ స్ఫూర్తి కూడా ప్రభావితమవుతున్నది. ఆమేరకు కార్మికవర్గ ఐక్యతకు హాని కలిగిస్తున్నది. అందుకే కార్మికవర్గం 'సామాజిక వివక్ష'ను విస్మరించజాలదు.
మహిళల పట్ల వివక్ష అనేక రూపాలలో వ్యక్తమవుతున్నది. కరీంనగర్ జిల్లాలో భవననిర్మాణ రంగంలో మహిళలు సూటిగా ప్రశ్నించారు. ఇంకా 'ఆడకూలి, మగకూలి' విధానం ఎందుకుండాలని అడిగారు. నిర్మాణ రంగంలో 'మహిళలకు తక్కువ కూలి' జాడ్యం బలంగా ఉన్నది. ఇది యజమానులలోనే కాదు... నిర్మాణరంగంలోని పురుష కార్మికులలో కూడా 'ఇది సహజమే కదా!' అన్న భావన ఉన్నది. హైద్రాబాద్ మహానగరంతో సహా అంతటా ఇదే పరిస్థితి. షాప్ ఎంప్లాయీస్లో కూడా ఇదే పరిస్థితి వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో, పెద్ద షాపింగ్ మాల్లో కూడా, అన్ని అర్హతలున్నప్పటికీ మహిళలనూ, దళితులనూ నైపుణ్యంతో కూడిన పనులలో నియమించటం లేదు. బట్టల దుకాణాలలో అమ్మకాన్ని బట్టి కమీషన్ ఉన్నది. కానీ ఇక్కడ కులాన్నీ, లింగభేదాన్నీ కూడా చూస్తున్నారు. ఎస్సీలకూ, మహిళలకూ తక్కువ కమీషన్ ఇస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఆధునిక పరిశ్రమలలో కూడా మహిళలకు తక్కువ వేతనం ఇస్తున్నారు. పెట్టుబడిదారీ వర్గం లాభం పెంచుకోడానికి సామాజిక వివక్షలను కూడా వినియోగించుకుంటున్నది. తమ ప్రయోజనం కోసం ఈ వివక్షలను ప్రోత్సహిస్తున్నది. మహిళల పట్ల లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. నిర్మాణం, పారిశుధ్య రంగాలు మొదలు, అత్యంత ఆధునిక పరిశ్రమల వరకు ఇది సర్వసాధారణమైంది. శ్రామిక మహిళలు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. రోజూ ఎదురవుతున్న సమస్యలు ఏమని చెప్పుకోగలమంటున్నారు. చెప్పుకుంటే ఒకవైపు ఉపాధి పోతుందనీ, మరోవైపు కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయనీ చెప్పారు. మున్సిపల్ రంగంలో మహిళలను జవాన్లు వేధిస్తున్నారని చెప్పారు. ''తాము చెప్పినట్టు వినకపోతే'' అటెండెన్స్ వేయకుండా వేధిస్తున్నారు. పని అప్పగించకుండా పక్కన పెడుతున్నారు. చెప్పినట్టు వినకపోవటం అంటే ఏమిటో తెలిసిందే! జవాన్లు ఎక్కువమంది బీసీలున్నారు. పారిశుధ్య కార్మికులలో దళిత మహిళలున్నారు. కొద్దిమంది దళిత జవాన్లు ఉన్నప్పటికీ.. వారుకూడా ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అనేకచోట్ల మహిళలకు మూత్రశాలలు లేవు. దీనివల్ల మూత్రం ఆపుకోవటం లేదా మంచినీళ్ళు తగినన్ని తాగకపోవటం వల్ల మూత్రకోశ వ్యాధులు వస్తున్నాయి. మధ్యతరగతి ఉద్యోగులున్న కాలనీలలో కూడా పారిశుధ్య కార్మికులకు మంచినీరు ఇచ్చేటపుడు అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పైనుంచి దోసిట్లో పోయటం లేదా లోటాలతో ఇస్తున్నారు.
పట్టణాలలో దళితులు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవులకు ఇండ్లు కిరాయికి దొరకటం సమస్యగా ఉన్నది. ముందే కులం అడుగుతున్నారు. పొరపాటున ఇచ్చినప్పటికీ, కులం తెలియగానే ఖాళీ చేయిస్తున్నారు. అనేకచోట్ల ఇంటిముందు 'శాఖాహారులకు మాత్రమే' అనే బోర్డులు కూడా పెడుతున్నారు. నల్లగొండలో రాష్ట్ర ప్రభుత్వో ద్యోగులకు కూడా ఇదే దుస్థితి. ఒక ఉద్యోగికి, ఇంకా ఇంట్లోకి మారకముందే, తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారని చెప్పి బాధపడ్డాడు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉన్నది. సిద్దిపేటలో షాప్ వర్కర్లు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మెదక్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇదే అనుభవాన్ని చెప్పారు. చివరకు కలెక్టర్ కార్యాలయం ఉద్యోగికి కూడా ఈ వివక్ష తప్పలేదు. ఉద్యోగి దళితుడని తెలిసిన వెంటనే రెడ్డి సామాజిక తరగతికి చెందిన ఇంటి యజమాని కిరాయికి ఇవ్వడానికి నిరాకరించాడు. స్థానిక శాసనసభ్యుడి జోక్యం కూడా ఫలించలేదు. నిర్మాణ రంగంలో కార్మికులు భోజన సమయంలో దళితులకు దూరంగా ఇతర కులాలవారు కూర్చుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులుగా దళిత మహిళలను నిరాకరిస్తున్నారు. దళితులు చేసిన వంటను తమ పిల్లలకు పెట్టవద్దని అడ్డుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఇవి ఘర్షణలకు దారితీశాయి. పోలీసుల జోక్యందాకా పోయిన సందర్భాలున్నాయి. అనేక గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలకు పోటీగా శివాజీ విగ్రహం పేరుతో బీసీలను ఎగదోస్తున్నారు. చాలాచోట్ల వీరి వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలుంటున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆటోడ్రైవర్ కూడా వివక్ష సమస్య ఎదుర్కొన్నానని చెప్పాడు. ఒక బీసీ వ్యక్తి ఆటోలో కూర్చుండగా, అదే గ్రామానికి చెందిన ఎస్సీ వ్యక్తి ఆటోలో కూర్చోడానికి అంగీకరించలేదు. ఈ వాదోపవాదాలలో ఆటోడ్రైవర్ కూడా దళితుడని తెలియడంతో బీసీ వ్యక్తి ఆటో దిగి వెళ్ళిపోయాడు. మెదక్ జిల్లాలో వివక్షకు సంబంధించిన ఘటనలు కలెక్టర్ దృష్టికి తెచ్చిన తర్వాత గ్రామసభలు ప్రారంభించారు. తహసీల్దార్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ హాజరై వివక్షలు ప్రదర్శించవద్దని చెపుతున్నారు. ఈ ప్రయత్నం ఎంతకాలం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. ఆమేరకు మంచి ప్రయత్నమే.
గ్రామాలూ, పట్టణాలన్న తేడా లేదు. చదువుతో కూడా పెద్దగా సంబంధం లేదు. తరతమ స్థాయిల్లో అన్ని చోట్లా ఈ వివక్ష ఉన్నది. అందుకే ఏప్రిల్ 6 నుంచి 14 వరకు కార్మికవర్గం 'సామాజిక న్యాయ వారోత్సవాలు' నిర్వహించింది. ఈ తేదీలకు ప్రాధాన్యత ఉన్నది. ఏప్రిల్ 6 తొలితరం కార్మికవర్గ నేత బిటి రణదివే వర్ధంతి. కార్మికవర్గ ఐక్యతకు కులం ఆటంకంగా ఉన్నదని ఆనాటికే ఆయన గుర్తించారు. 'కులం, వర్గం, కార్మికవర్గ ఐక్యత' పేరుతో ఒక కరపత్రం విడుదల చేశారు. ఇప్పటికీ ఆ కరపత్రం మార్గదర్శిగా ఉపయోగపడుతున్నది. ఏప్రిల్ 11న మరో సామాజిక ఉద్యమ నేత జ్యోతీరావు ఫూలే జయంతి. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. అందుకే ఈ వారం రోజులు సామాజిక న్యాయ వారోత్సవాలుగా నిర్వహించారు. సరిగా ఇదే సమయంలో ఏప్రిల్ 10న విమలా రణదివే జయంతి కూడా. ఆమె తొలితరం శ్రామిక మహిళా నేత. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుంటూ అన్ని జిల్లాలలో నివాళులు అర్పించారు. వివక్ష గురించి వివిధ రంగాల కార్మికులలో చేసిన సర్వేలో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారోత్సవాలను పురస్కరించుకుని కులవివక్షకు, లింగవివక్షకు వ్యతిరేకంగా విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహించింది. అనేక జిల్లాలలో పది కిలోమీటర్ల 'న్యాయం కోసం నడక' (10కె వాక్ ఫర్ జస్టిస్) నిర్వహించారు. ఇవన్నీ కార్మికవర్గంలో ఐక్యతా స్ఫూర్తి నింపేందుకు తోడ్పడతాయి.
ఒక కార్మిక సంఘం సామాజిక న్యాయ వారోత్సవాలు నిర్వహించటం, ఈ సందర్భంగా కార్మికవర్గాన్ని సమీకరించి చైతన్యపరచటం చర్చకు దారితీసింది. ఇవి కూడా కార్మికసంఘం చేస్తే ''ఇక మేమేం చేయాలి?'' అని కొన్ని కుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సామాజిక న్యాయం గురించి కులసంఘాలే మాట్లాడాలని పెట్టుబడిదారీ వర్గంగానీ, బూర్జువా పార్టీలుగానీ కోరుకుం టున్నాయి. కార్మిక సంఘాలు సామాజిక న్యాయం గురించి మాట్లాడటాన్ని వీరు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు కులసంఘాలు మాట్లాడటం కూడా ఇష్టం లేదు. కులవ్యవస్థ, లింగవివక్ష కొనసాగాలని బాహాటంగానే చెపుతున్నారు. అందుకే మనువాదాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్ని స్తున్నారు. సామాజిక న్యాయం కోసం సిఐటియు నిర్వహించిన వారోత్సవాలకు ప్రాధాన్యత సంతరించు కున్నది. కులసంఘాలు నిర్వహించినపుడు ఆయా కులాల ప్రయోజనాలు ముందుకొస్తున్నాయి. కుల చైతన్యమే బలపడుతున్నది. కులాలు మరింత బలపడడానికే దోహదపడుతున్నాయి. ఇందుకు భిన్నంగా కార్మిక వర్గమే ఈ ఉత్సవాలు నిర్వహించటం వల్ల వర్గ చైతన్యం పెరుగుతున్నది. కార్మికవర్గ ఐక్యత ఆవశ్యకత ముందు కొస్తున్నది. కులం, పురుషాధిక్యత కార్మికవర్గ ఐక్యతకు ఆటంకంగా ఉన్నాయి. అందుకే కులవివక్ష, లింగవివక్షలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా పోరాడవల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం జరుగుతున్న పోరాటాలకు కార్మికవర్గం అండగా నిలువటం కూడా అవసరం. ఈ వారోత్సవాల సందర్భంగా కార్మికవర్గానికి ఇచ్చిన సందేశం ఇదే!
- ఎస్. వీరయ్య