Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు దారులు తెరుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరించడం, కొత్త విధానాలను అనుసరించడం ద్వారా ప్రయివేటీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర పాలకులు అనుసరిస్తున్న ధోరణి దేశ ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతుం దనడం లో సందేహం లేదు. రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎప్పటికీ విడదీయలేనివి. ఏ దేశమైనా స్వభావం, స్వభావాన్ని నిర్ణయించే బహిర్గతం చేసేది రాజకీయ, ఆర్థిక వ్యవస్థ. మన దేశాన్ని లౌకిక రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్వచించింది రాజ్యాంగం. ప్రణాళికా సంఘాన్ని మార్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని విచ్చిన్నం చేస్తూ సంక్షేమ రాజ్యాన్ని నిర్వీర్యం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. బ్యాంకుల ప్రయివేటీకరణ ప్రణాళిక అమలు కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)తో కలిసి పనిచేస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటు చేతులకు అప్పగించాలనేది స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే ఇది దేశాన్ని అసమానత, పేదరికం, సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను కొంతమందికి అప్పజెప్పడమే. 2014 నుండి ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించడం, దాని మూలాలు దారుణంగా బలహీనపడటం చూశాం. స్వావలంబన భారతదేశ ఆవిర్భావానికి దోహద పడిన వ్యూహాత్మక, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం తగదనే విషయాన్ని గుర్తుపెట్టు కోవాలి.
ప్రభుత్వ రంగాన్ని ఫణంగా పెట్టి ప్రయివేటు, కార్పొరేట్ రంగాలను బలోపేతం చేసేందుకు ఇటువంటి చర్యలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండవు. ఆర్థిక వ్యవస్థ, సమాజంపై ఈ విధానాల ప్రతికూల పరిణామాలు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి. రైల్వేలు, బ్యాంకులు, నవరత్న కంపెనీలతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభావితం చేస్తున్న మోడీ పాలన దూకుడు రాజ్యాంగం కల్పించిన సామాజిక, ఆర్థిక న్యాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఇది మనదేశంలో కులం, మతం, ప్రాంతం లింగం వంటి వాటితో ఇప్పటికే చీలిపోయిన సమాజానికి ఆర్థిక అసమానతలు మరింత జోడించబడుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.అమెరికాలో 2008 ఆర్థిక సంక్షోభం ఉద్భవించిన సందర్భంలో, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరణ కారణంగా భారతదేశం దానిని తట్టుకోగలదని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. మన దేశం ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి రక్షింపబడటానికి కారణం ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులే అనేది దీన్నిబట్టి స్పష్టం. వీటిని ప్రయివేటీకరించడం ద్వారా, మోడీ పాలన భారతదేశాన్ని, జాతీయ ప్రపంచ పరిమా ణాల బహుళ సంక్షోభాలకు మరింత హాని చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ, సమాజం రాజకీ యాల విస్తృత స్థాయిలలో సంక్షోభాలను తీవ్రతరం చేస్తుంది. ప్రపంచ శక్తుల నియంత్రణకు సులభమైన లక్ష్యంగా దోహదపడుతుంది. ఆర్థిక పరపతిని కోల్పోతుంది. విస్తారమైన ప్రజలు మరింత పేదరికం, తీవ్రమైన కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్, భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించే నియంత్రణ యంత్రాంగాలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను ముంచెత్తిన అనేక సంక్షోభాల నుండి దేశాన్ని స్వేచ్ఛగా ఉంచడంలో ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉన్నాయని చెప్పారు. మోడీ పాలన ఉద్దేశ పూర్వకంగా ఇటువంటి వివేకవంతమైన పరిశీలనలను విస్మరించి, విధానపరమైన చర్యలతో ముందుకు సాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను కుంగదీసి సమాజానికి కీడు చేసే పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడానికి బదులు, దానిని నిర్వీర్యం చేసే ఘోరమైన తప్పిదానికి మోడీ పాలన పాల్పడుతోంది. గ్రామీణ పట్టణ ప్రాంత శ్రామిక ప్రజలు దీనికి వ్యతిరేకంగా బలమైన ప్రతిఘటనను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక, సామాజిక న్యాయాన్ని భరోసా ఇచ్చే సంక్షేమ రాష్ట్రంగా కొనసాగడానికి భారత దేశాన్ని రక్షించాలి. రాజ్యాం గాన్ని, దేశాన్ని కాపాడేందుకు సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. దేశాన్ని పెట్టుబడిదారుల నుండి కాపాడుకోవాలి. దీనికి స్వచ్ఛంద సంస్థలు సామాజికవేత్తలు, ఆర్థిక రంగ నిపుణులు కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉన్నది.
- డి.రాంచందర్రావు, 9849592958