Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ్వండి.. నవ్వించండి... నవ్వులపాలు కాకండి... ''నవ్వడం ఒక యోగం... నవ్వకపోవడం రోగం...'' అన్నాడో కవి. ప్రతీ ఏడాదీ మే నెల మొదటి ఆదివారం రోజున ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపు కుంటారు. ముంబాయికి చెందిన డాక్టర్ మదన్ కఠారియా నవ్వుల దినోత్సవానికి సృష్టికర్త. ఓ రోజు ఆయన ఉదయాన్నే వాకింగ్‌కు బయలుదేరి దారిలో జనాన్ని పోగేసి జోకులు చెబుతూ ఓ అరగంట నవ్వించారట. అలా 1995 మార్చి 13న ఏర్పడింది లాఫర్స్ క్లబ్. తర్వాత అది శాఖోపశాఖలుగా విస్తరించి లాఫర్స్క్లబ్ ఇంటర్నేషనల్‌గా ఎదిగి 'లాఫింగ్ యోగా'గా ప్రపంచమంతా పరిచయమైంది. ఆ తర్వాత అంతా కలిసి ప్రతి ఏడాది మే నెల మొదటి ఆదివారంరోజు నవ్వుల దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అలా ప్రపంచానికి నవ్వుల్ని పంచిన క్రెడిట్ భారతదేశానికే దక్కడం గర్వకారణం. మనిషిని ఆనందం, ఆశ్చర్యం చుట్టుముట్టినప్పుడు ఎక్కువగా నవ్వుతాము. నవ్వు మన ఆయుష్షును పెంచుతుందని వైద్యులు చెబుతారు. నవ్వు ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని పెంచే ఎండార్ఫిన్స్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంపొందిస్తుంది. హుద్రోగాల (గుండె) నివారణకు నవ్వు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దెబ్బతిన్న కణాలను బాగుచేసే శక్తి కూడా నవ్వుకు ఉంది. నవ్వితే కోపం, భయం, అసూయ, ఆందోళన, ద్వేషం, ఒత్తిడి అన్ని మాయమవుతాయి. పొట్ట అంతా కడుపుబ్బ నవ్వితే చాలు ఇరవై నిమిషాల వ్యాయామంతో సమానం. సుమారు మూడున్నర క్యాలరీలు ఖర్చు అవుతుంది. నవ్వు ఎరోబిక్ వ్యాయామంలా పనిచేస్తుంది. సమస్యలో పడిపోయి మనం నవ్వును వదులుకోకూడను. నవ్వుకు పెట్టుబడి అక్కరలేదు. శ్రమించాల్సిన పనిలేదు. చిన్న చిరునవ్వు నవ్వితే మనసు శరీరము తేలికపడతాయి. మనుషుల మధ్య అడ్డగోడలు తొలగిపోతాయి. ఇది ఆనందానికి సూచిక. నవ్వు ప్రపంచ భాష. నవ్వు ద్వారా విశ్వశాంతిని పెంపొందించవచ్చునని నవ్వుల దినోత్సవం తెలియజేస్తుంది.
1998 జూలైలో విల్సన్ 'వరల్డ్ లాఫ్టర్ టూర్' నిర్వహించారు. దీనితో నవ్వుల దినోత్సవానికి అంతర్జాతీయంగా ప్రచారం లభించింది. మొట్టమొదటి నవ్వుల దినోత్సవం 1998 జనవరి 11వ తేదీన ముంబాయిలో నిర్వహించారు. దీనికి 15వేల మంది హాజరయ్యారు. భారతదేశం వెలుపల ఈ దినోత్సవం మొదటిసారిగా డెన్మార్కు రాజధాని కోపెన్ హగన్‌లో 2000 జనవరి 9వ తేదీన నిర్వహించారు. సుమారు 25వేల మంది హాజరయ్యారు. ఈ ఉత్సవ విశేషాలు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైనాయి. 2004 మే 2వ తేదీన 'స్విట్జర్లాండ్'' రాజధాని నగరంలో ఈ ఉత్సవం నిర్వహించబడింది. ఆ దేశ పార్లమెంటు చుట్టూ నవ్వుతూ ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని విశేషం. ప్రజలలో ఆరోగ్యకరమైన హాస్యం పట్ల అభిరుచి పెరిగితేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుందని ఉత్సవ నిర్వాహకు లంటున్నారు. హాస్య ప్రవృత్తి, నవ్వులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.చిరుమందహాసం ముఖవర్చస్సుని పెంచుతుంది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నవ్వేలా ప్రయత్నం చేద్ధాం. తోటివారికి చిరునవ్వుతోనో స్వాగతం పలుకుదాం. వీలైనంత వరకు సర్వదా చిరునవ్వులు చిందిస్తూనే ఉందాం. అది చౌకయిన, శక్తివంతమైన ఔషధం.
-కె.సతీష్‌రెడ్డి
సెల్: 9848445134