Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఐరోపాను కమ్యూనిజం వెన్నాడుతున్నది!! పాత ఐరోపాలోని అధికార కేంద్రాలైన పోప్, జార్, మెట్టర్నిచ్ (నాటి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి), గుయిజోట్(ఫ్రెంచి 17వ ప్రధాని), ఫ్రెంచి తీవ్రవాదులు, జర్మన్ పోలీసు గూఢచారులు ఆ దయ్యాన్ని వదిలించుకొనేందుకు ఒక పవిత్ర కూటమిగా తయారయ్యారు.' 1848లో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టోను కారల్‌మార్క్స్-ఎంగెల్స్లుపై మాటలతో ప్రారంభించారు. ఈనెల ఐదవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి చేసిన రెండో ప్రసంగాన్ని చూస్తే సోషలిజం చేసిన ట్రంప్‌ను అంటే అమెరికా పాలకవర్గాన్ని వెన్నాడుతోందని స్పష్టమైంది. అనేకమంది అమెరికా అధ్యక్షులు, సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా నానా చెత్త మాట్లాడారు. కొంతమంది విశ్లేషణ ప్రకారం తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు పార్లమెంట్లో సోషలిజం గురించి ప్రకటన చేయటం ఇదే ప్రథమం. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఒక మీడియా సంస్థ 'సోషలిజం విజేత' అని ఉపశీర్షిక పెట్టింది. ట్రంప్ అనూహ్యంగా చేసిన ప్రస్తావనతో అనేకమంది మీడియా పండితులు దానికి భాష్యాలు చెప్పటం ప్రారంభించారు. ఇంతకీ ట్రంప్ మహాశయుడు చెప్పిందేమిటి?
'ఇక్కడ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మన దేశం సోషలిజాన్ని స్వీకరించాలన్న కొత్త పిలుపులు మనలను జాగరూకులను చేశాయి. అమెరికా స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో స్థాపించబడింది తప్ప ప్రభుత్వ బలవంతం, ఆధిపత్యం, అదుపులతో కాదు. మనం స్వేచ్ఛతో జన్మించాం, స్వేచ్ఛగానే ఉంటాం. అమెరికా ఎన్నడూ సోషలిస్టు రాజ్యంగా ఉండేదిలేదనే సంకల్పాన్ని ఈ రాత్రి పునరుద్ఘాటిస్తున్నా' అని చెప్పుకొచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా ఎలా గింజుకున్నా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనూహ్యరీతిలో సోషలిజాన్ని అజెండాగా చేశాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలోకి వచ్చిన సెనెటర్ బెర్నీశాండర్స్ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకొని మరీ గోదాలోకి దిగాడు. గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికలలో డెమొక్రటిక్ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులిరువురు సోషలిస్టులమని చెప్పుకొని మరీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులుగా అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.
చరిత్ర పునరావృతం అవుతుంది అంటే అర్థం కొత్త రూపంలో అని తప్ప గతంలో జరిగిన మాదిరే అని కాదు. గతంలో ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రంగా ఐరోపా ఉంది గనుక అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కేంద్రం అమెరికాకు మారినందున అక్కడ నాంది పలికిందని చెప్పవచ్చు. నాడు ఐరోపాలో కమ్యూనిస్టు భావజాలం ప్రాచుర్యం పొందిన సమయంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి దానిని వ్యతిరేకిస్తున్న వారే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తున్న వారే అది వైఫల్యం చెందిందని, పని చేయటం లేదని బాహాటంగా చెప్పటం విశేషం. అమెరికాలో మీరు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తు న్నారా, సోషలిజాన్ని సమర్ధిస్తున్నారా అంటూ ఇప్పుడు జరుగుతున్న సర్వేలవంటివి కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన సమయంలో లేవు. గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు కట్టుబడి వున్న సంస్థల సర్వేలు చెబుతున్నదేమిటి? అమెరికాలో పెట్టుబడిదారీ విధానం విఫలమవుతున్నదని, సోషలిజం కావాలని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అందువలన అటు డెమోక్రటిక్ పార్టీ ఇటు రిపబ్లికన్ పార్టీలో కూడా కింది నుంచి వస్తున్న వత్తిడితో ట్రంప్ సోషలిజం గురించి భయపడటంలో ఆశ్చర్యం లేదు. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదని ప్రకటించిన సమయంలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన మితవాది అయిన పార్లమెంట్ దిగువసభ స్పీకర్ నాన్సీ పెలోసీ సహజంగానే చప్పట్లతో తబ్బిబ్బు అయ్యారు. పురోగామి సెనెటర్‌గా ముద్ర పడిన ఎలిజబెత్ వారెన్ తన స్థానం నుంచి లేచి మరీ సోషలిజం మీద ట్రంప్ ప్రకటించిన యుద్ధానికి చప్పట్లు చరిచారు.
మరుసటి రోజు ఉదయం అమెరికా విత్తమంత్రి స్టీవ్ నుచిన్ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రీకృత ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థ మీద రిపబ్లికన్లకు నమ్మకం లేదని సోషలిజానికి మరలేది లేదని చెప్పాడు. నిజానికి ట్రంప్ సోషలిజం గురించి మాట్లాడటం వెనుక అమెరికన్లను తప్పుదారి పట్టించే ఎత్తుగడ ఉంది. వెనెజులాలో సైనిక జోక్యానికి పక్కనే వున్న కొలంబియాలో ఐదువేల మంది సైనికులను మోహరించిన ట్రంప్ ఒక సాకుకోసం చూస్తున్నాడు. సోషలిజం కారణంగానే వెనెజులాలో పరిస్థితులు దిగజారాయని అరోపించిన వెంటనే అమెరికా సోషలిజం గురించి ట్రంప్ ప్రస్తావించాడు. నిజానికి అక్కడ ఆర్థిక పరిస్థితి దిగజారటానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆంక్షలు, దిగ్బంధనమే ముఖ్యకారణం. ముందే చెప్పుకున్నట్టు రోజు రోజుకూ పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాల గురించి జనం ప్రస్తావిస్తున్నారు. నిజానికి 80శాతం మంది అమెరికన్లు పని చేస్తే తప్ప గడవని స్థితిలో ఉన్నారు. నిజవేతనాలు నాలుగు దశాబ్దాల నాటి కంటే తక్కువగా ఉన్నాయి. మెడికల్ బిల్లులు అనేక మందిని దివాలా తీయిస్తున్నాయి. విద్యార్థుల అప్పుల సంగతి సరేసరి. కోట్లాదిమంది ఉద్యోగ విరమణ తరువాత తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. వెనెజులాను సాకుగా చూపి సోషలిజం మీద సైద్ధాంతిక దాడి చేస్తే అమెరికాలో పెరుగుతున్న ప్రాచుర్యాన్ని అరికట్టవచ్చని ట్రంప్ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అప్పుడు మరింతగా అమెరికాలో సోషలిజం గురించి చర్చ జరగటం అనివార్యం. మీడియాలో వెలువడుతున్న విశ్లేషణలే అందుకు నిదర్శనం. 'అమెరికాలో సోషలిజం ఒకనాడు సమాజ ప్రధాన స్రవంతికి దూరమైన సిద్ధాంతం. ట్రంప్ ప్రసంగానికి ముందే అది స్పష్టంగా మారుతోంది. అమెరికా సోషలిస్టు యువత ప్రమాదం గురించి భయపడుతున్న తరగతులతో ఫాక్స్ న్యూస్ నడుస్తోంది. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన దాడి తరువాత సోషలిజం సమయం వచ్చినట్టు అనుకోవచ్చు. అదిప్పుడు ప్రధాన స్రవంతి భావజాలం. అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావలసినదే. ఒక శత్రువు కలకు అంతగా తోడ్పడేందుకు ఎవరు సాహసిస్తారు?' అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.
సోషలిజంపై పార్లమెంట్లో ట్రంప్ దాడికి వారం రోజుల ముందు వెలువడిన ఒక సర్వే వివరాలు ట్రంప్‌ను భయపెట్టి ఉంటాయి. సహస్రాబ్ది తరంతో(1981-1996 మధ్య పుట్టిన వారు) పాటు అనంతర జడ్ లేదా యూట్యూబ్ తరం(1996 తరువాత పుట్టినవారు) కూడా సోషలిజంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారని దానిలో తేలాయి. పదింట ముగ్గురే ట్రంప్ సరిగా పని చేస్తున్నారని భావిస్తున్నట్టు కూడా వెల్లడైంది. 2010లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నించాలని సహస్రాబ్దితరంలో 53శాతం పేర్కొనగా ఇప్పుడు రెండుతరాల్లో అలా అభిప్రాయపడుతున్నవారు 64,70శాతం మంది ఉన్నారు. 35ఏండ్ల లోపు యువతలో ఎక్కువ మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. సర్వేల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతోందని కూడా చెప్పవచ్చు. తాజా సర్వే ప్రకారం 18-24 మధ్య వయస్సు వారిలో 76శాతం, 25-44 వయస్సు వారిలో 60శాతం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ న్యాయంగా లేదని, ధనికులకే అనుకూలంగా ఉందని అభిప్రాయపడుతున్నారని తేలింది.
అమెరికాలో సోషలిజం ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఏమిటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆ సంక్షోభం ఆర్థిక బాధను కలిగించటమే కాదు సామాజిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది. 2016లో బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ పేర్కొన్నదాని ప్రకారం 70లక్షల మంది అంటే 12శాతం మంది పురుషులు పని చేయటం లేదని పేర్కొన్నది. 1970దశకంలో స్వేచ్ఛా వాణిజ్యం ఒక విధానంగా అమెరికాలో, ప్రపంచంలో ముందుకు వచ్చింది. 2000లో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించిన తరువాత అమెరికాలో 34లక్షల ఉద్యోగాలు నష్టపోయినట్టు ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ అంచనా. తరువాత నాలుగేండ్లకు ఉత్తర అమెరికా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వలన మరొక పదిలక్షల ఉద్యోగాలు పోయినట్టు పేర్కొన్నది. వీటికి తోడు ఈ కాలంలో మరింత యాంత్రీకరణ జరగటంతో ఒకప్పుడు పాఠశాల విద్య చదువుకున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు దొరికిన అమెరికాలో ఇప్పుడు నైపుణ్యం లేని, తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాలన్నింటినీ రోబోట్లు, ఇతర కృత్రిమ మేధ యంత్రాలు భర్తీ చేశాయి. దాంతో మరిన్ని లక్షల ఉద్యోగాలు హరీమన్నాయి. మధ్యతరగతి అంతరించే దిశగా పరిణామాలున్నాయి. పర్మనెంటు స్థానంలో తాత్కాలిక లేదా కాంట్రాక్టు ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయి. మానవ శ్రమ స్థానంలో యంత్రాలను ఎంత ఎక్కువగా ప్రవేశపెడితే పెట్టుబడి పోగుపడటంతో పాటు లాభాలు పెరుగుతాయి. మరోవైపున కాంట్రాక్టు లేదా తాత్కాలిక కార్మికుల వేతనాలు పడిపోతాయి. ఇది ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, కార్మిక భద్రత వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారీ విధాన వైఫల్యంగానూ, అది పనిచేయకపోవటంగానూ నూతన తరం చూస్తున్నది.
అమెరికా అంతా సజావుగా ఉందని ఒకవైపు చెబుతూనే అసంతృప్తి చల్లార్చేందుకు గత రెండేండ్లలో ట్రంప్ చేయని యత్నం లేదు. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకొనే విధంగా చైనాపై వత్తిడి తెస్తూ వాణిజ్య యుద్ధానికి దిగాడు. విదేశాల నుంచి వలసొచ్చేవారితో స్వదేశీ కార్మికులకు ఉపాధి సమస్యతో పాటు వేతనాలు పడిపోతున్నాయంటూ వలసను ఆపేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ప్రచారం చేస్తున్నాడు. నాఫ్టా ఒప్పందం బదులు మరొక కొత్త ఒప్పందంతో అమెరికాలో ఉపాధి అవకాశాలను పెంచుతానని నమ్మబలుకు తున్నాడు. 2008 నుంచి అంతకు ముందున్న పాలకులు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసినా విఫలమయ్యారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం పని చేయటానికి ప్రపంచంలో ఎక్కడాలేని అవకాశాలున్నాయి. అయితే ఆ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదని అసంతృప్తి చెందుతున్న యువతరమే కాదు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే చెప్పటం గతంలో ఎన్నడూ వినలేదు. అమెరికాలో బ్రిడ్జివాటర్ అనే పెట్టుబడుల కంపెనీ అధిపతి రే డాలియో 'పెట్టుబడిదారీ వ్యవస్థ మెజారిటీ పౌరులకోసం పని చేయటం లేదు. అది ఒక వాస్తవం' అని గతేడాది నవంబరులో లాస్ ఏంజల్స్ నగరంలో జరిగిన సభకు పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. 'నేడు జనాభాలోని ఒకశాతం ఎగువ వారిలో ఉన్న సంపద విలువ జనాభాలో 90శాతంగా ఉన్నవారితో సమంగా ఉంది. 1930దశకంలో జరిగిన మాదిరే పరిస్థితి ఉంది. అత్యవసరం అయితే 40శాతం మంది పెద్దల చేతుల్లో నాలుగు వందల డాలర్లు ఉండటం లేదు. ఈ పరిస్థితి మీకు ధ్రవణత గురించి ఒక అవగాహన కలిగిస్తుంది, అదే నిజమైన ప్రపంచం, అదొక సమస్య కూడా' అన్నారు. అయితే వాస్తవ సమస్య పెట్టుబడిదారీ విధానంతో కాదని సహజసిద్ధమైన ముక్తాయింపు ఇచ్చారనుకోండి.జనంలో పెరుగుతున్న అసంతృప్తిని జోకొట్టేందుకు ధనవంతులు చేసే ఎదురుదాడి ఇది.
- సత్య
సెల్: 8331013288