Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుద్ధిగా చదువుకుని పద్ధతిగా ఎదుగుదామన్నా భద్రంగా బతుకనిచ్చే సామాజిక పరిస్థితులే కరువైపోవడం వారికి శాపంగా మారింది. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అనుమానాలు, హద్దూ అదుపూ లేని ఆగడాలు. చెప్పుకోలేనివి కొన్నైతే, చెప్పుకున్నా తీరనివి మరికొన్ని. సామాజికంగా అంతులేని వివక్ష అంతకు మించిన నిర్లక్ష్యం వెంటాడుతుంటే పంటిబిగువునా ఆ బాధ భరిస్తూ బతుకీడుస్తున్న ఆడపిల్లలు కొందరైతే, తట్టుకోలేక తనువు చాలిస్తున్న చిట్టితల్లులు మరికొందరు. వద్దన్నా వచ్చిపడే ప్రేమలూ పగలూ చివరికి వారి జీవితాలనే బలి తీసుకుంటున్నాయి. టీనేజ్ అమ్మాయిల జీవితాల్లోకి మనసుపెట్టి చూస్తే కనిపించే కన్నీటి కథలెన్నో...!
స్వాతీ అభం శుభం తెలియని ఆడపిల్ల. ముక్కుపచ్చలారని ముద్దబంతి. జీవితం కోటి ఆశలతో కొత్త రెక్కలు తొడుక్కుని యుక్త వయస్సులోకి ప్రవేశిస్తున్న వేళ...హృదయం ఎంత గాయపడిందో ఏమో... మొగ్గగానే నేల రాలింది. పదమూడేండ్లకే ఓ ఆడపిల్ల జీవితం ఆత్మహత్యతో ఆగిపోయింది. 8వ తరగతి చదువుతున్న స్వాతి 10వ తరగతి చదువుతున్న ఓ అబ్బాయి వేధింపులకు మనస్తాపానికి గురై ఉరేసుకుని చనిపోయింది. ఎందుకు? నేరం ఎవరిది? సోమవారం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో జరిగిన ఈ ఘటన గుండెను పిండేస్తున్నది. ఏం నేర్పుతున్నాం మనం పిల్లలకు. ఎలా తయారుచేస్తున్నాం వారిని? పత్రికల్లో ఈ వార్త చూసినప్పటి నుంచీ ఆ చిట్టితల్లి రూపం కళ్లల్లో చెమ్మగిల్లుతూనే ఉంది.
అదే రోజు ప్రముఖంగా మరో వార్త. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగిన ఈ ఘటనలో అమ్మాయి పేరు శుశ్రిత. ఆకర్షణలే ప్రేమనుకుని భ్రమసిన మరో అభాగ్యురాలు. ప్రేమకూ ఆకర్షణకూ తేడా తెలియని వయసులో పెద్దలనెదిరించి కులాంతర వివాహం చేసుకుంది. నాలుగేండ్లు గడిచేసరికి అదే కులం ఆమె కాపురానికి ఆటంకంగా మారడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడి చేతుల్లోనే కన్నబిడ్డతో సహా కడతేరిపోయింది. నిన్నగాక మొన్న మధురికపై ప్రేమోన్మాది దాడి మరువకముందే ఈ రెండు వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అవనిది మరో సమస్య. ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఆ అమ్మాయి తప్పేమిటో తెలుసా? తనతోనే చదువుతున్న క్లాస్మేటొకడు వెంటపడి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ప్రిన్సిపల్‌కు కంప్లయింటు ఇవ్వడమే! అంతే క్లాస్మేట్ వేధింపులకు తోడు నలభై పైబడిన ఆ ప్రిన్సిపల్ వేధింపులు మొదలయ్యాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంత కుమిలిపోయిందో తెలియదుగానీ, పరీక్షలు రాయాల్సిన సమయంలో తన జీవితానికి ముగింపు రాసుకుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా...మనకు తెలిసినవే లెక్కకుమించిన వ్యథలు! వెలుగులోకి రాకుండా చీకటిలోనే కలిసిపోతున్న కథలెన్నో..! కారణాలేమైనా కావొచ్చు. గడియకో ఘటన జరిగిపోతోందన్నది మన నేర గణాంక వ్యవస్థ చెపుతున్న కలవరపట్టే సత్యం! ఈ సమస్య కేవలం కాలేజీకో క్లాస్రూమ్కో మాత్రమే పరిమితమైనది కాదు. గడప దాటింది మొదలు తిరిగి గడపలో కాలు మోపే వరకూ ఎక్కడికెళితే అక్కడకు వారిని వెంటాడి వేధిస్తున్నది. ఫలితంగా ఎవరో ఇష్టాయిష్టాలకు, ఇంకెవరివో ఉద్రేకాలకు తన ప్రమేయం లేకుండానే బలైపోతున్న ఆడపిల్లల జీవితాలకు ఎవరిది బాధ్యత? విలువలకు వలువలొదిలేసిన ఈ సమాజానిది కాదా? ఎంత పెద్ద సమాజానికైనా కుటుంబమే పునాది. అక్కడే విలువలు మొగ్గ తొడగాలి. వికసించాలి. పరిమళించాలి..
- శోభ