Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు కొప్పేసుకుండు. మొకానికి పోడర్ బూస్కుండు. తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్మన్నడు. చిర్తలు దీస్కుండు. గవ్విటిని కొట్టి జూస్కుండు. యాడికో ఎందుకు ఎప్పటి తీర్గ యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకుండు. అనుకోని నారాయన, నారాయన అన్కుంటచిర్తలు గొట్టుకుంట మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడిరాత్రి, అందరు బండుకున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కొందరు కలల బజార్ల దిర్గుతున్నరు. యాడ సప్పుడు లేదు. నర్సిమ్మ సామి గుడికి తాలంబెట్టి ఉన్నది. నారదుడు యాద్గిరి గుట్ట మీద దిగిండు. మాయమై గుల్లెకు బోయిండు.
''నారాయన, నారాయన'' అన్నడు.
నర్సిమసామి కండ్లు దెర్సి-
''నువ్వా నారదా యాల గాని యాల గిట్లొచ్చిన వేంది?'' అని అడిగిండు.
'' మీతోని ముచ్చటబెట్టె తందుకు''
''నాతోని ముచ్చట బెడ్తె ఏమొస్తది'
''గీ దేసంల ఏమైతున్నదో ఎర్కైతది''
''శ్రీహరి కోటల ఉన్న ఇస్రోకెల్లి చెందమామ మీద్కి రాకిట్ బంపిస్తున్నరు. గీ దాని చెంద్రయాన్-2 లని అంటరు''
''ఇంతకు ముందు గుడ్క బంపించిండ్రా''
''2008ల బంపిచ్చిండ్రు. గీ దాన్ని చెంద్రయాన్-1 అని అంటరు''
''చెంద్రుని మీద్కి మనిసులు బోలేదా?
''బోయిండ్రు 1969ల అమెరిక అపోలో అనేటి రాకిట్ల ముగ్గుర్ని చెంద్రుని మీద్కి బంపిచ్చింది. గా ముగ్గుర్ల నీల్ ఆమ్‌స్ట్రాంగ్ అనే టాయిన ముందుగాల చెంద్రుని మీద దిగిండు''
''గట్లయితె మెల్లగ చెంద్రుని మీద్కి మనిసులు బోవుడు షురువైతదేమో''
''అయితది. చెంద్రుని మీద్కి బోయెతందుకు టికిట్ గుడ్క అమ్ముతరు''
''సిన్మ టికిట్ల తీర్గ బిలాక్ల గూడ అమ్ముతరా?''
''చెంద్రుని తాన్కి బోయేటి మనిసులు ఎక్వయితే టికిట్లను బిలాక్ల గుడ్క అమ్ముతరు నారదా''
''ఆబాది బెర్గితె బూమి మీద మనిసులు ఉండెతంద్కు జాగ దొర్కదు. దాంతోని చందమామ మీద్కి బోతరు ఆడ ఇండ్లు గట్టుకోని ఉంటరు''
''ఒగాల్ల గాడ టిఆర్ఎస్ సర్కార్ ఉంటె బీదోల్లకు కెసిఆర్ డబల్ బెడ్రూం ఇండ్లు గట్టిపిస్తడా''
''గీడ అన్న తీర్గనే గాడ గూడ డబల్ బెడ్ రూం ఇండ్లు గట్టిపిచ్చే తందుకు జాగ దొరుక్తలేదని అంటడు. గని సన్నాసులకు రొండు మూడు ఎక్రాల బూమి ఫిరీగ ఇస్తడు''
''చెంద్రున్ల నీల్లు ఉన్నయా సామీ''
''ఇంతకు ముందు బంపిన రాకిట్ తోని గాడ నీల్లు ఉన్నయని ఎర్కైంది.
చందమామల హీలియం-3 ఉన్నది. గా దాంతోని కరెంటు బుట్టియ్యొస్తది. కరెంటు ఉంటె కార్కానలు గూడ వొస్తయి. మీరు గిన చెంద్రుని మీద్కి బోతె ఏం గొంచబోతరు అని ఇస్రో జెనంను అడిగితె శాన మంది మూడు రంగుల జెండను గొంచబోమన్నరు. గని కెసిఆర్ గులాబి జెండను గొంచబోత అని అంటె చెంద్రబాబు పచ్చజెండ గొంచబోత అన్నడు.బిజెపి తెలంగాన ప్రెసిడెంట్ లచ్మన్ కాషాయ రంగు జెండ గొంచ బోతనని జెప్పిండు''
''అపోలో రాకిట్ల బోయిన నీల్ ఆమ్ స్ట్రాంగ్ చెంద్రుని మీద అమెరిక జెండను బెడ్తె రాకిట్ మల్ల బూమి మీద్కి వొస్తునప్పుడు పుట్టిన కాకకు మండిపోయిందట గదా''
''అవ్''
''ఇంతకు ఇస్రో కెల్లి రాకిట్ను బంపిచ్చిండ్రా''
''ఆరేడు దినాల కిందట రాకిట్ను చెంద్రుని మీద్కి బంపేతందుకు అంత రడీ జేసిండ్రు. ఇస్రో చైర్మన్ శివన్ సూల్లూర పేటల ఉన్న చెంగాలమ్మ గుడికి బోయిండ్రు. రాకిట్ సక్కగ చెంద్రని మీద్కి బోయెటట్లు సూడుమని మొక్కిండు''. అని నర్సిమ్మసామి ఇంకేమొ జెప్పబోతుంటే నారదుడు అడ్డం దల్గి-
''సైంటిస్టులకు గూడ దేవుని మీద నమ్మకం ఉంటదా'' ఔ
''దేవుని మీదనే గాదు బాబాల మీద గూడ నమ్మకముంటది. సూరి బగవంతం అసువంటి సైంటిస్టే పుట్టపర్తి బోయి సాయిబాబా కాల్లు మొక్కిండు. ఇస్రోల రాకిట్కు పూజ జేసిండ్రు. మంగల్తారి ఇచ్చిండ్రు. గని రాకిట్ను బంపేటి 56 గంటల ముందే గాదాంట్ల ఉన్న ఒక గ్యాస్ సిలిండర్ కరాబైనట్లు ఎర్కైయింది. ఇగ దాంతోని చెంద్రుని మీద్కి గా దినం రాకిట్ బంపకుంట ఊకున్నరు''
''రాకిట్ ఇడ్సుడు ఆగినందున కెసిఆర్ ఏమన్నడు''
''ఇస్రో వాస్తు బాగలేక బోయె బట్కె రాకిట్ల ఉన్న గ్యాస్ సిలిండర్ కరాబైంది. ఇకముందు గిట్ల గాకుంట ఉండాలంటె ఇస్రోను కూలగొట్టి వాస్తు ప్రకారం గట్టిపియ్యుమని ఆంద్రప్రదేస్ ముక్యమంత్రి జగన్‌కు జెప్పిన. గంతే గాకుంట రాకిట్ ఇడ్సే ముంగట స్వరూపానంద సామిని బిల్సి రాజశ్యామ యాగం జేస్తె మంచిగుంటదని జెప్పిన అని కెసిఆర్ అన్నడు''
''చెంద్రాబాబు ఏమన్నడు''
''చెంద్రున్కి గానం బట్టిన తీర్గనే నాకు గుడ్క గానం బట్టింది. మల్ల నేను ముక్యమంత్రిని అయినంకనే ఇస్రో కెల్లి రాకిట్లు బంపితె బాగుంటదని చెంద్రబాబు అన్నడు.
''ప్రతాని మోడీ ఏమన్నడు''
''ఎన్కట మనోల్లు చెంద్రుని తాన్కే గాదు సూర్యుని తాన్కి గూడ బోయిండ్రు. హన్మంతుడు చిన్న గున్నప్పుడే సూర్యుని తాన్కి బోయిండు. ఇస్రోకెల్లి రాకిట్ ఇడ్సేముంగట హన్మాన్ చాలీస సద్వి జై శ్రీరామ్ అంటె గిట్ల గాక బోతుండె అని మోడీ అన్నడు'' ఇంతల తెల్లారింది.
''వొస్త దేవా'' అన్కుంట నారదుడు మొగులు మీద్కి బోయిండు.
తోక : - మాపటీల చౌరస్తకు బోయిన. గాడున్న హోటల్ల ఛారు దాగెతందుకు బోతె గా హోటల్ల మా దోస్తు యాద్గిరి గల్సిండు. ఇద్దరం వన్ బై టూ ఛారు దాక్కుంట ముచ్చట బెట్ట బట్టినం
''హెరిటేజ్ ఒక జోక్ అని కెసిఆర్ ఎందుకన్నడు'' అని యాద్గిరిని అడిగిన.
''హెరిటేజ్ అనంగనే కెసిఆర్‌కు చెంద్రబాబు యాదికొచ్చినట్టున్నడు'' అని యాద్గిరి అన్నడు.
తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491